Wednesday, 16 August 2017

యిచ్చట దెయ్యాలు సమర్పించును

పద్మశ్రీ అల్లు రామలింగయ్య సమర్పించు
గుల్షన్ కుమార్ ప్రెజెంట్స్
నిర్మాత : మాగంటి రవీంద్రనాధ్ చౌదరి
నిర్మాత : శ్రీమతి అనిత
ఏంటి వీళ్ళందరి గురించి రాసాననుకుంటున్నారా? వీళ్ళందరికీ ఓ సంబంధముంది. ఏంటంటారా? వీళ్ళెవరూ యిప్పుడు ఈలోకంలో లేరు. అంటే బ్రతికి లేరు. కానీ వీరందరూ ఎడాపెడా సినిమాలు తీసిపారేస్తున్నారు. అవును. నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా యిది నిజం. వీరందరూ చనిపోయినా వీళ్లల్లో కొంతమంది సినిమాలు సమర్పిస్తున్నారు, కొంతమంది సినిమాలు తీస్తున్నారు.
మరి చనిపోయిన వాళ్ళు ఎలా తీస్తారు అంటే తీస్తారు అంతే. మనం నమ్మాలి....నమ్మి తీరాలి. గమ్మత్తేమిటంటే వీళ్ళ పేరు ముందు "కీర్తిశేషులు" అనో లేదా "స్వర్గీయ" అని కూడా ఉండదు. మరి ఎలా సమర్పిస్తున్నారు? అంటే వీళ్ళ ఆత్మలు సమర్పిస్తున్నాయా? ఎలా సాధ్యం? పోనీ అదే నిజమనుకున్నా పద్మశ్రీ అల్లు రామలింగయ్య ఆత్మ సమర్పించు అని ఉండాలి కదా?
అప్పుడు ఇంకో అనుమానమొస్తుంది. ఆత్మలు లెక్కలు గట్రా ఎలా చూస్తాయి? చూడలేవు కదా? మరి లెక్కలు చూడలేనప్పుడు వీళ్ళ పేర్లు ఎందుకు వేస్తున్నారు? వీళ్ళ మీద గౌరవం తో వేస్తున్నారు అని అనుకున్నా వాళ్ళ ఆత్మలు సమర్పించలేవు కదా? అది అసాధ్యం కదా? సినిమాలు తీయలేవు కదా?
గౌరవముంటే వారి ఫోటో వేయడమో లేదా స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి దివ్య ఆశీస్సులతో అనో వేస్తే కొంత బాగుంటుందేమో. అలా కాకుండా ఏకంగా సినిమాలు సమర్పించేయడమంటే కొంత....కాదు .....చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.

ముద్దొచ్చే ముద్దామందారం

ముద్దొచ్చే ముద్దామందారానికి
ముద్దబంతి ఒసిగినట్టు

చిరునవ్వులు వెదజల్లే సిరివెన్నెలకి
సిగపువ్వు గుచ్చినట్టు

వెలుగులు పంచే చందమామకి
పండు వెన్నెల తోడైనట్టు

నిర్మలమైన ఆకాశానికి
ఇంద్రధనుస్సుని ఆభరణంగా పెట్టినట్టు

నీవొక అద్భుతం....నీ నవ్వొక అద్వితీయం

Tuesday, 15 August 2017

తగదు

ఉదయించిన సూరీడుని
ఎందుకని అడగడం తగదు

మలిసంధ్యకు వేళాయెనని
జాబిల్లికి చెప్పినా వినదు

నెలవంకకు నిండు పున్నమి
పరిచయం వలదు

పండు వెన్నెలకు చల్లదనం
ఆమెకి అందం కొత్త కాదు

ఓ ధరహాసమా నీ మూలమెక్కడ

ఓ ధరహాసమా నీ మూలమెక్కడా అంటే
అందమైన ఆమె పెదవుల వెనుక దాగి ఉన్నానందట

ఓ సొగసా నువ్వెక్కడుంటావంటే
ఆమె నడుము ఒంపుల్లో  వెతకమందట

ఓ వయ్యారమా నీ చిరునామా ఏదంటే
ఆమె నడకలో కనబడతానందంట

ఓ జాణతనమా నీవెందులో ఉంటావంటే
ఆమె నడతలో ఇమిడి ఉంటానందట

ఓ నాజూకుతనమా నీవెలా ఉంటావంటే
ఆమెని స్పృశించి చూడు తెలుస్తుందంట

ఓ వెచ్చదనమా నీవెక్కడ దాగున్నావంటే
ఆమె కౌగిలిలో కనిపెట్టమందంట

ఓ తియ్యనిదనమా నిన్నెలా పొందాలి అంటే
ఆమె వెచ్చని ముద్దుల్లో ప్రయత్నించమందంట

ఓ నీటిబిందువా నీకు ఏది ఇష్టం అంటే
ఆమె నుదుటి నుండి పాదం వరకు జారడం అందంట

ఓ శృంగారమా నీ జన్మస్థానమేదంటే
ఆమె అణువణువునా తనువంతా కొలువై తీరానందట

Monday, 14 August 2017

అమృతానికి చిరునామా

సంద్రాన్ని చిలికితే వచ్చేది అమృతమమైతే
ఆ అమృతాన్ని చిరునామా అడిగితే
నీ పేరు చెప్పిందంట
చూస్తే చాలు
చిరంజీవిగా మారిపోతావందంట

దాసోహం

చందమామకు దిష్టిచుక్కలాంటి బొట్టు పెట్టినట్టు

సన్నజాజికి పువ్వుకి లేత అందాన్ని చీరగా కట్టినట్టు

ముద్దొచ్చే పెదవులకు సింధూరం అద్దినట్టు

గుప్పెడంత నడుముకి మల్లెపూదండని
వడ్డాణంలా చుట్టినట్టు

పాలమీగడ లాంటి శరీరాన్ని అమృతం లో ముంచినట్టు

వయ్యారానికి వలపుతాడు కట్టినట్టు

శృంగారానికి నీవే ఒక చిరునామాలా అనిపించినట్టు

ఈ సృష్టి నీ అందానికి దాసోహం
చూసే కన్నులకి పుడుతుంది వ్యామోహం

Sunday, 13 August 2017

మారుస్తున్నావు

గతి తప్పని లయకారుడికి  
శృతి మించని సప్తపదిలా

వికసించిన పద్మంలో  
జాలువారని నీటిచుక్కలా

ఉదయాన్నే భానుడినుంచి
విడువడిన ఉషాకిరణాల్లా

అప్పుడే పడిన వర్షబిందువు నుంచి
బయట పడిన మట్టి వాసనలా

చిమ్మచీకట్లో మిలమిల మెరిసే
మిణుగురు వెలుగులా

అప్పుడే తల్లిపాలు తాగి
కేరింత కొట్టే పాపాయిలా

మత్తెక్కించే చిన్నికళ్ల తో
గమ్మత్తైన నీ నవ్వు తో

మతి పోగొడుతున్నావు
ఈ జగత్తు గతి మారుస్తున్నావు

Saturday, 12 August 2017

నీవు

గతించిన గతానికి మధురజ్ఞాపకం నీవు
నడుస్తున్న కాలానికి వారధి అయ్యావు
అందమైన భవిష్యత్తుకు చిరుదివ్వెవి అవుతావు
మధురకావ్యానికి మనసైన రాగం నీవు
ముచ్చటగొలిపే రూపానికి
ముద్దొచ్చే ప్రతిబింబానివి నీవు

Monday, 31 July 2017

పరవశం

మేఘానికి కబురొచ్చింది
వర్షించే సమయం ఆసన్నమయ్యిందని

పుడమికి పిలుపొచ్చింది
తడిసిన తన వంటి సువాసన
వెదజల్లే అవకాశమొచ్చిందని

పురి విప్పే నెమలికి తెలిసొచ్చింది
ఆనందంతో నాట్యమాడే తరుణమొచ్చిందని

చిగురుటాకుకి అర్ధమయ్యింది
తన యవ్వనానికి సొగసొచ్చిందని

మొత్తానికి అందమైన ప్రకృతి గుర్తించింది
తనకన్నా అందమైన ఆమె నవ్వుకి
తాను పరవశిస్తున్నానని

Wednesday, 12 July 2017

వినీత

సినీ నటి వినీత గుర్తుందా? లేదా? పోనీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా గుర్తుంది కదా! సౌందర్యతో పాటు నటించిన ఇంకో హీరోయిన్. గుర్తొచ్చింది కదూ! ఎంత బాగా నటించిందో కదూ! నిజానికి ఆ సినిమాలో సౌందర్య కన్నా తన నటనే బాగా నచ్చింది(సౌందర్యని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు). నేపాలీ అమ్మాయిగా తన నటన మర్చిపోలేం. నిజంగానే నేపాలీ అమ్మాయా అని భ్రమించేంతగా అధ్బుతంగా ఉంటుంది ఆ సినిమాలో. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత ఆ అమ్మాయి నట జీవితం ఎక్కడికో వెళ్లిపోతుందనుకున్నా. కానీ అలా జరగలేదు సరి కదా అవకాశాలు లేక బీ గ్రేడ్ సినిమాల్లో నటించే పరిస్థితి. కొన్నిరోజుల తరువాత పేపర్ లోను, టీవీ లోను ఒక సంచలన వార్త ఒకటి వచ్చింది. అదేంటంటే వ్యభిచార కేసులో నటి 'వినీత' అరెస్ట్. ఆ అరెస్ట్ దృశ్యాలను టీవీలో చూసా. సాధారణంగా ఇలాంటి కేసుల్లో అమ్మాయికి మొహాన ఓ చున్నీ లాంటి దాన్ని చూడతారు (వాళ్లే చుట్టుకుంటారు). కానీ వినీత అలాంటిదేమీ చుట్టుకోలేదు సరికదా మొహాన ఓ చిరునవ్వుతో జీప్ ఎక్కింది... అచ్చం ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమాలో హీరోయిన్ లా అమాయకంగా. జాలేసింది తనని అలా చూస్తే. సరే...ఆ కేసు  ఏమయ్యింది అన్న విషయం వదిలేస్తే, ఆ సంఘటన తర్వాత వినీత పూర్తిగా కనుమరుగైపోయింది. తను ఇప్పుడు ఏం చేస్తుందో!
నాకర్ధం కాని విషయమేమిటంటే వ్యభిచారం కేసులో అరెస్ట్ అవడానికీ తనకి చాన్సులు రాకపోవడానికీ ఏమిటి సంబంధం? కానీ జరుగుతోంది అదే కదా? కేవలం ఆ కేసులో అరెస్ట్ అయ్యింది కాబట్టి ఆమెని ఒక కులట లా చిత్రీకరించి సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం మానేసారు మన సినీ రంగ పెద్దలు- అక్కడికి వీరంతా మహా పతిత్తులయినట్టు. సరే వీళ్ళని కాసేపు అలానే అనుకుందాం....మరి వీళ్ళకి పోర్న్ సినిమాల్లో నటించే సున్నీ లియోన్ ఎలా కనిపిస్తోంది? మహా పతివ్రతలా కనిపిస్తోందా? ఆవిడకి అన్ని కోట్లు ఇచ్చి తమ సినిమాల్లో ఎందుకు నటింపచేస్తున్నారు? అసలు ఆవిడ చేసిన పుణ్యమేమిటి? వినీత చేసిన పాపమేంటి?

మొన్నటికి మొన్న నటి 'శ్వేతాబసు ప్రసాద్' పరిస్థితీ అంతే. ఆ కేసులో అరెస్ట్ అయ్యిందో లేదో అవకాశాలు రావడం మానేసాయి. పైగా ఆవిడని ఏదో ఉద్దరించేసినట్టు నా తదుపరి సినిమాలో అవకాశమిస్తానని ఓ హీరో గారి ఉదాత్త ప్రకటన ఒకటి. అసలు జనాలకు వీటితో పనేంటి? ఫలానా నటి వ్యభిచారం చేస్తే ఏంటి? ఇంకేదో చేస్తే ఏంటి? ఆవిడ నచ్చితే ఆదరిస్తారు లేకపోతే లేదు. అంతే గానీ ఆవిడ వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యిందా లేకపోతే దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యిందా అని చూడరు కదా? ఏమిటో ఈ ద్వంద్వ  నీతి!