Tuesday 1 December 2015

'కళా సేవకి భాషా భేదాలు ఉండవు బాబు' అంటారేమో

చాలా కాలం క్రింద ఓ యాడ్ వచ్చేది. చిరంజీవి, నాగార్జున, రాజేంద్రప్రసాద్ ఇలాంటి నటులు పొలోమంటు టీవీల్లో ఒక మాట చెపుతుండేవారు "తెలుగు వారంతా తెలుగులోనే మాట్లాడదాం " అని. ఆహా వీళ్ళకి  తెలుగు మీద ఎంత భక్తి ! అని పొరపాటున ఎవరన్నా అనుకున్నారేమో గానీ నాకు మాత్రం ఒకటే అనిపించేది ఆ యాడ్ చూసాక
"తెలుగు సినిమాల్లో తెలుగు నటులనే పెట్టుకుందాం. పరాయి భాష నటుల్ని ప్రక్కన పెడదాం" అని -
యిదే విషయాన్ని వాళ్ళకి చెపుదాం అని. 

Thursday 19 November 2015

హలో బ్రదర్

అష్టా చమ్మ సినిమా చూసాక హీరో 'నాని' ని చూసాక ఆ సినిమా దర్శకుడు 'ఇంద్రకంటి మోహన కృష్ణ' కి దగ్గర పోలికలు కనిపించి అతని తమ్ముడేమో అనుకున్నాను. మొన్న మొన్నటి వరకు కూడా వాళ్ళిద్దరూ అన్నదమ్ములేమోనని అనుకునేవాడిని. తర్వాత తెలిసిందనుకోండి! 

Sunday 8 November 2015

రాంచరణ్ విషయం లో జరిగింది అఖిల్ విషయం లో జరగనిది?

క సారి చిరుత సినిమా గుర్తు తెచ్చుకోండి. యిప్పుడు చెప్పబోయేది చిరుత సినిమా గురిచి కాదు, ఆ సినిమాలో నటించిన రాంచరణ్ గురించి. అతని లాంచింగ్ గురించి. ఎంత గ్రాండ్ గా లాంచ్ చేసారో గుర్తుందిగా?! ఆ సినిమా విడుదలయ్యేంతవరకూ అతని నోటినుండి ఒక్క మాట కూడా వినలేదు మనం. కాదు వినే అవకాశమివ్వలేదు చిరంజీవి కుటుంబం. కేవలం అతని నటన గురించో లేక షూటింగ్ విశేషాలు మాత్రమే చూసే భాగ్యం కలిగేది మనకి. ఆ సినిమా విడుదల అయ్యేంతవరకూ అతని నటన ఎలా ఉంటుందా, అతని డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందా అని కళ్ళు కాయలు కాచేలా చూసాము. అతను పొడుగు తక్కువా లేక అందంగా లేడా అన్న విషయాల్ని కూడా మనం పట్టించుకోనతగా అతన్ని ప్రమోట్ చేసారు చిరంజీవి కుటుంబం. ఒక రకంగా చెప్పాలంటే మొన్న బాహుబలికి ఎంత హైప్ క్రియేట్ అయ్యిందో 'చిరుత' సినిమాకి అంతే హైప్ క్రియేట్ అయ్యింది. ఇదే టెక్నిక్కుని చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి కూడా కొనసాగించారు. రేపు ఆ పార్టీని స్థాపిస్తారనగా ఈ రోజు వరకు ఆ పార్టీ పేరుని ప్రకటించకుండా ఆ పార్టీకి పెట్టబోయే పేరు మీద మనకి ఎంతో ఆశక్తిని రేకెత్తించేలా చేసారు. సరే ఆ విషయాన్ని ప్రక్కన పెడితే ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే రాంచరణ్ ని చిరంజీవి కుటుంబం గొప్పగా లాంచింగ్ చేసారని. కొంచెం వెనక్కి వెళితే మహేశ్ ని కూడా ఇదే విధంగా లాంచ్ చేసారు.

యిప్పుడు కాసేపు వర్తమానం లోకి వద్దాం. ఒక్క సారి నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య విషయానికొస్తే అతని లాంచింగ్ ఎంత నీరసంగా, ఎంత చప్పగా జరిగిందో గుర్తు తెచ్చుకోండి. పైగా అతని మొదటి సినిమాకి ఎంచుకున్న కధ, పాత్రధారుల ఎంపిక విషయంలో ఎన్నో తప్పులు జరిగిపోయాయి. మళ్ళీ అదే తప్పు చిన్న కొడుకు అఖిల్ విషయంలోనూ చేస్తున్నాడు నాగార్జున. అఖిల్ సినిమా ఎలా ఉంటుందో అన్నది సినిమా విడుదలయ్యాక చెప్పొచ్చు. నేను చెప్పేది అతని లాంచింగ్ గురించి. ఆ సినిమా విడుదలకి ముందే అతని యింటర్వ్యూలు తెగొచ్చేసాయి, వస్తున్నాయి. చిన్న చిన్న టీవీ ప్రోగ్రాముల్లోకి కూడా వచ్చేస్తున్నాడు అఖిల్. యిక సినిమా విడుదలయ్యే సరికి తన మీద జనాలకి ఉండే కాస్తో కూస్తో ఉన్న ఆశక్తి కూడా పోయేలా చేసుకుంటున్నాడు అఖిల్. తన కొడుకుల్ని ప్రమోట్ చేసే విషయం లో నాగార్జున పూర్తిగా ఫెయిల్ అయినట్లే.   

Saturday 31 October 2015

పరిగెడితే కండ పీకేస్తాం

ఈ మధ్య ఎక్కడ చూసినా చైన్ స్నాచింగుల వార్తలే. ఆడవాళ్ళు వంటి మీద నగలేసుకొని బయటకెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. ఆడవాళ్ళు కాబట్టే యిలాంటి పరిస్థితి అదే మగవారికైతే ఏమీ బాధలు ఉండవు అని అనుకుంటున్నారా? ఎందుకుండవండి బాబు! భేషుగ్గా ఉంటాయి. కాకపొతే చైన్ స్నాచర్ల వల్ల కాదు. మరో రకంగా. ఎలా అంటారా? భైరవరావుల వల్ల. అదేనండి బాబు మనచేత ముద్దుగా శునకాలు అని పిలవబడే 'కుక్కలు'. ఈ శునకాలున్నాయి చూసారూ. అక్కడుంటాయి యిక్కడ లేవు అన్న ప్రశ్నే లేదు. ఎక్కడ పడితే అక్కడ  ప్రతీ వీధిలో ప్రతీ సందులో గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మరి వీటి బారిన పడకుండా అంటే మన పిక్కలు వాటికి ఆహారం కాకుండా తప్పించుకోవడం ఎలా? కొంచెం కష్టమే. నా అనుభవాన్ని కాస్తంత జోడించి కొన్ని జాగ్రత్తలు చెప్పటానికి ప్రయత్నిస్తా. యివి ఖచ్చితంగా నిజం అని మీకు అనిపిస్తేనే పాటించండి. తర్వాత మీ యిష్టం, ఆపై మీ అదృష్టం.
విషయానికొస్తే కుక్కలకి పరిగెత్తే మనుష్యుల్ని చూసినా, కార్ల క్రింద- బండ్ల క్రింద టైర్లన్నాతెగ మంటెక్కిపోతాయి.  అమాంతం మీద పడి మన కండ పీకేయ బుద్దవుతుంది వాటికి. అంచేత కుక్కల ముందు పరిగెత్తే ప్రయత్నం చేయకండి. వాటిని గౌరవించండి. అవి కూడా మిమ్మల్ని గౌరవిస్తాయి- కరవకుండా.  అంతే కాదండోయ్ వాటికి టైర్లంటే మహా కోపం. ఎందుకంటే వాటి క్రింద పడి చనిపోయిన తోటి కుక్కలే గుర్తొస్తాయి వాటికి. అందుకే ఆ టైర్ల అంతు చూద్దామని కార్ల వెంటా బండ్ల వెనకాల పడుతూ ఉంటాయి. మీరు కార్లో ఉంటే గ్లాసులు వేసేసుకొని ప్రయాణించండి. అదే బండి మీద వెళితే మాత్రం మీ కాళ్ళు పైకి పెట్టుకొని డ్రైవ్ చేయటానికి ప్రయత్నించండి. లేదా ఏదో ఒక చోట ఆగిపోండి. అంతేగానీ వాటిని చూసి స్పీడు పెంచారో అవి మరింత వెర్రెక్కి పోయి మీ వెంటపడటం మీ పిక్కలు పీకేయటం ఖాయం. యిన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన కండలు పీకే కుక్కలు కూడా ఉంటాయి. వాటి సంగతేమిటంటారా?అవేం మామూలు కుక్కలు కాదండోయ్. మరేంటంటారా? మనుష్యులలో పిచ్చి మనుష్యులు ఉన్నట్టే కుక్కల్లో కూడా పిచ్చి కుక్కలుంటాయి. వాటిని మనం గుర్తించాలి. లేకపోతే అంతే సంగతి!  

Thursday 29 October 2015

పాడిందే పాడరా...

వాళ్ళందరూ సినిమా గాయకులే. జనాలకి కూడా వాళ్ళలో చాలా మంది తెలుసు. గుర్తు పడతారు కూడా.  వాళ్ళలో గొప్ప గాయకులెవరంటే ఎలా చెపుతారు? ఎలా నిర్ణయిస్తారు? పోనీ సినిమా పాటలు కాకుండా క్రొత్త పాటలు పాడతారా అంటే అదీ లేదు. ఎప్పుడూ సినిమా పాటలే. యింకా దారుణమయిన విషయమేమిటంటే గతం లో వాళ్ళు పాడేసిన పాటలనే మళ్ళీ పాడటం. ఎవరైనా క్రొత్త గాయకులు పాడుతున్నారా అంటే కాస్తో కూస్తో ఒప్పుకోవచ్చు గానీ ఆల్రెడీ సినిమాల్లో పాడుతోన్నవాళ్ళు మళ్ళీ పాడటమేంటి? స్వరాభిషేకం, లిటిల్ చాంప్స్, సూపర్ సింగర్, ........ పేర్లు ఎన్నైనా పెట్టుకోనివ్వండి సారాంశం మాత్రం పాటల పొటీయే. అదీనూ సినిమా పాటలు. ఇవేకాదు ఏ చానల్ చూసినా సినిమా పాటలు.  చిన్న పిల్లల నించి పెద్దవాళ్ళ దాకా అందరూ తెగ పాడేస్తున్నారు. బానే ఉంది కానీ వాళ్ళ ప్రతిభని కొలవడానికి సినిమా పాటలే గత్యంతరం అయితే ఎలా? ఎప్పుడూ సినిమా పాటలే కాకుండా కొన్నైనా స్వంతంగా ట్యూన్లు కట్టి పాడొచ్చు కదా? అలా చేస్తే క్రొత్త సంగీత దర్శకులు, గేయ రచయితలు కూడా సినీ రంగానికి పరిచయం అవుతారు కదా? ఎందుకంటున్నానంటే ఆ సినిమా పాటలు పాడుతున్నప్పుడు పాడే వాళ్ళకీ,  వినే మనకీ ఆ పాట తాలూకు మాతృక మనకి కనిపిస్తూ (వినిపిస్తూ) ఉంటుంది. పాటని ఆస్వాదించడం కన్నా మాతృక తో పోల్చి చూడటమే సరిపోతోంది. 

Wednesday 23 September 2015

అతి జాగ్రత్త

మొన్నామధ్య ఓ ఫంక్షన్ లో జరిగిన విషయమిది. యింటి మేడ మీద జరిగిందది. ఫ్రీ గా వచ్చిన భోజనాలు కాబట్టి పీకల దాక మేక్కేసి అది అరగటానికి అందరం కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాము. ఆ ఫంక్షన్ కి వచ్చిన పిల్లలు మేడ మీద తెగ అల్లరి చేససేస్తున్నారు. అందులో ఓ పిల్లాడు మేడ చివర అంటే అంచులో నుంచొని ఆడుతున్నాడు. అంతే! వాళ్ళ నాన్న ఓ పెద్ద పొలికేక వేసి అమాంతం వాడి మీదకి దూకి ఒక్కసారిగా వాడిని యివతలకి లాగేసాడు. వాళ్ళమ్మ సంగతి సరే సరి. నెత్తీ నోరు కొట్టేసుకుంది. యిదంతా మేమో ప్రక్కన గమనిస్తున్నాము. మాలో ఒకాయన యిలా అన్నాడు
 "యిది చూసాక మీకేమీ అనిపించలేదా" అని.
"అనిపించడానికేముంది, పిల్లల్ని ఆ మాత్రం జాగ్రత్తగా చూసుకోవడం మంచిదేగా?" అన్నాడొకాయన.
"ఒక సారి మన చిన్ననాటి రోజుల్ని గుర్తు తెచ్చుకోండి. యిదే వయసులో చెట్లెక్కి జామకాయలు కోసేవాళ్ళం, పిల్ల కాలవల్లాంటివి అమాంతం దూకేసే వాళ్ళం. మనకప్పుడు అడ్డు చెప్పేవాళ్ళు లేరు. పొద్దున్న యింట్లోంచి వెళితే సాయంత్రం మళ్ళీ యింటికోచ్చేవాళ్ళం. మనమెక్కడ దూకుతున్నామో ఎక్కడ పాకుతున్నామో అడగటానికి మన పేరెంట్స్ మన కూడా వచ్చేవాళ్ళు కాదు. చదవక పొతే బాదేసేవారేమో గానీ యింత అతి జాగ్రత్తని చూపించేవాళ్ళు కాదు. అలాంటి వాతావరణంలో పెరిగిన మనం మన పిల్లల్ని మాత్రం అతి జాగ్రత్త పేరుతో వాళ్ళని మరీ విసిగించేస్తున్నామేమో అనిపిస్తుంది."
"పిల్లలన్నాక ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి కదా? ఉంటే తప్పేంటి?" వాదనకి దిగాడొకాయన.
"నా ఉద్దేశ్యం అది కాదు. జాగ్రత్త ఉండాల్సిందే. కానీ అతి జాగ్రత్త ఉండకూడదనే నేను చెపుతోంది. మన పేరెంట్స్ మన విషయం లో తీసుకున్న జాగ్రత్తని మన పిల్లల విషయంలో అతి చేస్తున్నామేమో అనే అంటున్నా. అయినా మీకొక విషయం చెప్పాలి. ప్రతీ పిల్లాడికి ఓ సెన్సు పని చేస్తూ ఉంటుందని నా అభిప్రాయము. అది వాడిని ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. అది పని చేయబట్టే మనమంతా ఆ స్టేజి నుండి యిక్కడిదాక వచ్చాము. అందుకే అన్ని ఆటలు ఆడినా చెప్పుకోతగ్గ దెబ్బలు తగలకుండా బయట పడ్డాము. ఏమంటారు?"
అందరం ఆలోచనలో పడ్డాం.

Tuesday 15 September 2015

ఖలేజా సినిమాకి ఈ పేరు పెట్టుంటే బాగుండేది

ఖలేజా సినిమా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. అందులో కొత్త విషయమేమీ లేదు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం మాత్రం 'మహేష్' ని దేవుడిగా చూపించడమే. సినిమా  చూస్తున్న ప్రేక్షకుడికి ఈ హఠాత్ పరిణామం మింగుడు పడలేదు. అలా కాకుండా మహేష్ దేవుడి క్యారెక్టరు వేస్తున్నాడని ప్రేక్షకుడు ముందుగా ప్రిపేర్ అయ్యుంటే ఆ సినిమా అంత ఫ్లాప్ అయ్యుండేది కాదేమో. అంటే ఆ సినిమాకి 'ఖలేజా' అని కాకుండా 'దేవుడు'  పెట్టుంటే బాగుండేదేమో.  

Sunday 16 August 2015

నందమూరి కళ్యాణ్ రాం - నారా రోహిత్...ఓ విషయం లో యిద్దరిదీ ఒకటే దారి

నందమూరి కళ్యాణ్ రాం,నారా రోహిత్ వీళ్ళిద్దరికీ ఓ విషయం లో పోలికుంది. రూపంలో కాదు. నటనలో అంత కన్నా కాదు. మరేంటి? దర్శకుల ఎంపికలో, కధ ఎంపికలో, హీరోయిన్ ఎంపికలో వీళ్ళిద్దరూ తమదైన మార్కు చూపిస్తుంటారు. మిగతా వాళ్ళలాగ ఒక సినిమా హిట్టవ్వగానే ఆ సినిమా దర్శకుడి వెంట పడడం, లేకపోతే ఆ సినిమాలోని హీరోయిన్ ని వెంటనే బుక్ చేసేయడం చేయరు. నందమూరి బాలకృష్ణ, జూ యన్ టీఆర్ లు తరచుగా చేసే తప్పులు యివే. ఒకసారి బాలకృష్ణ సినిమాలు గుర్తు తెచ్చుకోండి. అప్పట్లో చిరంజీవి నటించిన 'ఇంద్ర' హిట్టవ్వగానే అందులో నటించిన ఆర్తీ అగర్వాల్, సోనాలీ బెంద్రె లను యధాతదంగా తన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో పెట్టేసుకున్నాడు. దర్శకుడు కూడా సేం టూ సేం. బీ గోపాల్. సినిమా అట్టర్ ఫ్లాప్. అలాగే 'ఆది' సినిమా హిట్టవ్వగానే వినాయక్ వెంటబడి చెన్నకేశవ రెడ్డి సినిమా తీస్తే అది ఘోర పరాజయం.
జూ యన్ టీఆర్ కూడా అంతే. గబ్బర్ సింగ్ హిట్టవ్వగానే హరీష్ శంకర్ తో రామయ్యా వస్తావయ్యా, 'అత్తారింటికి దారేదీ' హిట్టవ్వగానే అందులో నటించిన ప్రణీత, సమంత లతో 'రభస ', కిక్ హిట్టవ్వగానే వెంటనే సురేందర్ రెడ్డితో ఊసరవెల్లి, కొన్ని సినిమాలు హిట్టవ్వగానే శ్రీను వైట్లతో 'బాద్షా' యిలా చెప్పుకుంటూ పోతే యిద్దరికీ యిలా కాంబినేషన్లు, హిట్టు దర్శకుల వెంటపడి చేతులు కాల్చ్ణుకున్న సందర్భాలు ఎన్నో.
యిలా చేయడం తప్పా ఒప్పా అన్నది కాదు ప్రశ్న. ఒక సినిమా హిట్టవడమన్నది కేవలం కాంబినేషను వలనో లేక దర్శకుడి పేరు వలనో సాధ్యం కాదు. సినిమాలో విషయముండాలి. దాని తర్వాతే ఏదైనా.
యిక కళ్యాణ్ రాం, నారా రోహిత్ ల గురించి చెప్పుకుంటే వీళ్ళిద్దరూ యిప్పటి వరకూ తాము నటించిన సినిమాలను ఒక సారి పరిశీలించండి. వీరిద్దరూ హిట్టు దర్శకుల వెంట పడకుండా కాంబినేషన్ల జోలికి పోకుండా ఎప్పుడూ కొత్తదనానికి స్వాగతిస్తుంటారు హిట్టూ ఫ్లాపు లతో సంబంధం లేకుండా.  ఏమంటారు?!

Friday 14 August 2015

వాళ్ళే మర్చిపోయారు మనకెందుకంట !

మా పేర్లు ఇవి కాదు మహాప్రభో అని ఎన్ని సార్లు మొత్తుకున్నా మన తెలుగు మీడియా, సినిమా పత్రికలు వీళ్ళ పేర్లని ఇలాగే వ్రాస్తుంటాయి.

సిమ్రన్  (అసలు పేరు)       -     సిమ్రాన్ (సినిమా పత్రికలు వ్రాసే పేరు)
అలీ     (అసలు పేరు)         -     ఆలీ  (సినిమా పత్రికలు వ్రాసే పేరు)
శ్రియ   (అసలు పేరు)         -     శ్రేయ లేక శ్రీయ  (సినిమా పత్రికలు వ్రాసే పేరు)
అసిన్  (అసలు పేరు)         -     ఆసిన్  (సినిమా పత్రికలు వ్రాసే పేరు)

Tuesday 11 August 2015

యిచ్చట నీతులు బోధించబడును

నగరానికేమయింది? ఒక వైపు నుసి మరో వైపు మసి (కరెక్టేనా?) .....
పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం......
మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం....
యిలాంటి ప్రకటనలూ నీతి బోధలూ గత సంవత్సరం నించి అనుకుంటా ప్రతీ సినిమా లోనూ చూసే భాగ్యం కలుగుతోంది. అసలేమిటి ఈ నీతి బోధల సారాంశం? ఈ ప్రభుత్వాలకి అకస్మాత్తుగా ప్రజల ఆరోగ్యం మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది?
అదేంటి... పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అయినపుడు  అలా నీతులు బోధించడం మంచిదే కదా అనేగా మీ సందేహం?! వస్తున్నా.....
సిగరెట్ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్నవి  ని.....జ్ఝం....  గా నిజమే. కానీ ఈ రెండు మాత్రమే ఆరోగ్యానికి హానికరం కాదు కదా? ఈ లోకం లో హానికరమైనవి యింకా బోలెడన్ని ఉన్నాయి కదా? వాటన్నిటినీ వదిలేసి కేవలం ఈ రెండింటినే పట్టుకోవటంలో అర్ధమేంటి? పోనీ ఈ ప్రచారం వలన వాటి అమ్మకాల్లో ఏమైనా మార్పులొచ్చాయా? పోనీ ప్రభుత్వాలు ఏమైనా ఆ దిశగా కృషి చేస్తున్నాయా అంటే అదీ లేదు. పోటీ పడీ మరీ అమ్మిస్తున్నాయి. ఈ మధ్యే చూస్తున్నాము. గవర్నమెంటే స్వయంగా మద్యం దుకాణాలు తెరిచీ మరీ అమ్ముతోంది మద్యాన్ని. సరే అమ్ముకోనివ్వండి. మరి మధ్యలో ఈ నీతి సూత్రాలెందుకు? ఎవరిని మోసం చేయడానికి? 
యింకొక విషయమేమిటంటే మనం సినిమాలో లీనమయ్యి చూస్తున్నప్పుడు హీరో, లేక విలన్,  లేక ఎవరైనా సిగరెట్ త్రాగుతున్న సీన్ గానీ మద్యం సేవించే సీనో వస్తే వెంటనే "పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం" అనో లేక "మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం" అనో ఓ మూల ప్రకటన వచ్చేస్తోంది ఆటోమేటిగ్గా. ఆ మాటకొస్తే సినిమాల్లో రేపులు, హత్యలు, కిడ్నాపులూ, ర్యాగింగు, అమ్మాయిల్ని టీజింగ్ సన్నివేశాలూ, మోసాలూ, యింకా చెప్పుకుంటూ పోతే ఈ పేజీకి సరిపడనన్ని ఉంటాయి. మరి ఆయా సన్నివేశాలొచ్చినప్పుడు సిగరెట్, మద్యం సన్నివేశాలకు ఎలాగైతే నీతి బోధలు చేస్తున్నారో అలాగే వాటికి కూడా చేయాలి కదా? 
ఉదాహరణకి....
ఎవరైనా బజ్జీలు తినే సన్నివేశమొచ్చిందనుకోండి, వెంటనే ఓ మూలన యిలాంటి ప్రకటన రావాలి
"బజ్జీలు తినడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే అందులో బోలెడంత నూనె ఉంటుంది"
ర్యాగింగు సీను వచ్చిందనుకోండి, యిలా రావాలి
"ర్యాగింగు చట్టరీత్యా నేరం. ర్యాగింగు చేసిన వాళ్ళకు కఠినమైన శిక్షలు పడతాయి"
రేప్ సన్నివేశమొస్తే యిలా రావాలి
"మానభంగం మన యింటా వంటా లేదు. ఏదైనా అడిగి సాధించుకోండి. బలవంతం వద్దు. చట్ట రీత్యా నేరం కూడానూ"
ఫైటుంగు సన్నివేశాలొచ్చినప్పుడు
"మనది శాంతి కాముక దేశం. యుద్ధాలొద్దు. చర్చించుకొని పరిష్కరించుకోండి. ఉభయులకూ లాభం"
 వ్యభిచార సన్నివేశమొస్తే
"శుభ్రంగా పెళ్ళి చేసుకోండి. యిలాంటివి వద్దు. తప్పదనుకుంటే కండోం వాడండి"
ఈవ్ టీజింగు సన్నివేశమొస్తే
"మీకూ అక్కో చెల్లో ఉన్నారన్న విషయం గుర్తు పెట్టుకోండి"
యిలా ప్రతీ సన్నివేశానికి వేయాలన్న మాట.
వీటన్నిటినీ వదిలేసి కేవలం సిగరెట్, మద్యం మీద పడి ఏం లాభం? అయినా ఒక సినిమాని చూట్టానికి ఎందుకెళతాము? నీతులు నేర్చుకోవటానికి అయితే కాదు కదా?

ఈ ప్రభుత్వాలకి ఏమయ్యింది? ఒక వైపు సిగరెట్లు మద్యం అమ్మకాల ప్రోత్సాహం, మరొక వైపు జనాలకి నీతి బోధలు" 


Sunday 26 July 2015

ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాగున్నావే.....

ఆ మధ్య ఓ క్రీము కొందామని ఓ సూపరు మార్కెటుకెళ్ళాను. నాకు కావలసిన క్రీము దొరికింది. దాని రేటు ఎంతో చూద్దామని దాని క్రింద భాగంలో చూసాను. కనబడలే!. పైనా క్రిందా వెనుకా ముందూ ఊహూ.... ఎక్కడా కనబడలే. చివరికి వెతగ్గా వెతగ్గా నా శ్రమ ఫలించి దాని రేటు అతి కష్టం మీద పట్టుకోగలిగాను. ఓ మారుమూల చిన్న అక్షరాలతో యిలా వ్రాసి ఉంది "see bottom for the rate and expiry date". అంటే నా అన్వేషణ యింకా పూర్తికాలేదన్నమాట. ఆ క్రీము క్రింది భాగములో ఓ చిన్న మడత పెట్టిన భాగములో ముద్రించిన అక్షరాలతో కాకుండా అక్షరాలను చెక్కినట్టుగా కనిపించింది దాని రేటూ, ఎక్స్ పైరీ డేటూ.      
నాకర్ధం కాని విషయమేమిటంటే అన్నీ అంటే ఆ ప్రొడక్టు తాలూకా వివరాలు గట్రా పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించి ఈ రేటు, expiry date లను ఏదో మారుమూల ఎవరికీ కనబడకుండా అంత చిన్న చిన్న అక్షరాలలో వుంచవలసిన అవసరమేమిటి? అంటే దాని ధర చెప్పటానికి (చూపించడానికి) అంత సిగ్గు పడుతున్నారా? లేక వినియోగదారుడికి "మా రేటు కనుక్కో చూద్దాం" అని పరీక్ష లాంటిది ఏదైనా పెడుతున్నారా? యిప్పుడొస్తున్న అన్ని ప్రొడక్టులకీ యిదే తంతు. ఏమిటో???