Sunday 16 August 2015

నందమూరి కళ్యాణ్ రాం - నారా రోహిత్...ఓ విషయం లో యిద్దరిదీ ఒకటే దారి

నందమూరి కళ్యాణ్ రాం,నారా రోహిత్ వీళ్ళిద్దరికీ ఓ విషయం లో పోలికుంది. రూపంలో కాదు. నటనలో అంత కన్నా కాదు. మరేంటి? దర్శకుల ఎంపికలో, కధ ఎంపికలో, హీరోయిన్ ఎంపికలో వీళ్ళిద్దరూ తమదైన మార్కు చూపిస్తుంటారు. మిగతా వాళ్ళలాగ ఒక సినిమా హిట్టవ్వగానే ఆ సినిమా దర్శకుడి వెంట పడడం, లేకపోతే ఆ సినిమాలోని హీరోయిన్ ని వెంటనే బుక్ చేసేయడం చేయరు. నందమూరి బాలకృష్ణ, జూ యన్ టీఆర్ లు తరచుగా చేసే తప్పులు యివే. ఒకసారి బాలకృష్ణ సినిమాలు గుర్తు తెచ్చుకోండి. అప్పట్లో చిరంజీవి నటించిన 'ఇంద్ర' హిట్టవ్వగానే అందులో నటించిన ఆర్తీ అగర్వాల్, సోనాలీ బెంద్రె లను యధాతదంగా తన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో పెట్టేసుకున్నాడు. దర్శకుడు కూడా సేం టూ సేం. బీ గోపాల్. సినిమా అట్టర్ ఫ్లాప్. అలాగే 'ఆది' సినిమా హిట్టవ్వగానే వినాయక్ వెంటబడి చెన్నకేశవ రెడ్డి సినిమా తీస్తే అది ఘోర పరాజయం.
జూ యన్ టీఆర్ కూడా అంతే. గబ్బర్ సింగ్ హిట్టవ్వగానే హరీష్ శంకర్ తో రామయ్యా వస్తావయ్యా, 'అత్తారింటికి దారేదీ' హిట్టవ్వగానే అందులో నటించిన ప్రణీత, సమంత లతో 'రభస ', కిక్ హిట్టవ్వగానే వెంటనే సురేందర్ రెడ్డితో ఊసరవెల్లి, కొన్ని సినిమాలు హిట్టవ్వగానే శ్రీను వైట్లతో 'బాద్షా' యిలా చెప్పుకుంటూ పోతే యిద్దరికీ యిలా కాంబినేషన్లు, హిట్టు దర్శకుల వెంటపడి చేతులు కాల్చ్ణుకున్న సందర్భాలు ఎన్నో.
యిలా చేయడం తప్పా ఒప్పా అన్నది కాదు ప్రశ్న. ఒక సినిమా హిట్టవడమన్నది కేవలం కాంబినేషను వలనో లేక దర్శకుడి పేరు వలనో సాధ్యం కాదు. సినిమాలో విషయముండాలి. దాని తర్వాతే ఏదైనా.
యిక కళ్యాణ్ రాం, నారా రోహిత్ ల గురించి చెప్పుకుంటే వీళ్ళిద్దరూ యిప్పటి వరకూ తాము నటించిన సినిమాలను ఒక సారి పరిశీలించండి. వీరిద్దరూ హిట్టు దర్శకుల వెంట పడకుండా కాంబినేషన్ల జోలికి పోకుండా ఎప్పుడూ కొత్తదనానికి స్వాగతిస్తుంటారు హిట్టూ ఫ్లాపు లతో సంబంధం లేకుండా.  ఏమంటారు?!

Friday 14 August 2015

వాళ్ళే మర్చిపోయారు మనకెందుకంట !

మా పేర్లు ఇవి కాదు మహాప్రభో అని ఎన్ని సార్లు మొత్తుకున్నా మన తెలుగు మీడియా, సినిమా పత్రికలు వీళ్ళ పేర్లని ఇలాగే వ్రాస్తుంటాయి.

సిమ్రన్  (అసలు పేరు)       -     సిమ్రాన్ (సినిమా పత్రికలు వ్రాసే పేరు)
అలీ     (అసలు పేరు)         -     ఆలీ  (సినిమా పత్రికలు వ్రాసే పేరు)
శ్రియ   (అసలు పేరు)         -     శ్రేయ లేక శ్రీయ  (సినిమా పత్రికలు వ్రాసే పేరు)
అసిన్  (అసలు పేరు)         -     ఆసిన్  (సినిమా పత్రికలు వ్రాసే పేరు)

Tuesday 11 August 2015

యిచ్చట నీతులు బోధించబడును

నగరానికేమయింది? ఒక వైపు నుసి మరో వైపు మసి (కరెక్టేనా?) .....
పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం......
మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం....
యిలాంటి ప్రకటనలూ నీతి బోధలూ గత సంవత్సరం నించి అనుకుంటా ప్రతీ సినిమా లోనూ చూసే భాగ్యం కలుగుతోంది. అసలేమిటి ఈ నీతి బోధల సారాంశం? ఈ ప్రభుత్వాలకి అకస్మాత్తుగా ప్రజల ఆరోగ్యం మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది?
అదేంటి... పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అయినపుడు  అలా నీతులు బోధించడం మంచిదే కదా అనేగా మీ సందేహం?! వస్తున్నా.....
సిగరెట్ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్నవి  ని.....జ్ఝం....  గా నిజమే. కానీ ఈ రెండు మాత్రమే ఆరోగ్యానికి హానికరం కాదు కదా? ఈ లోకం లో హానికరమైనవి యింకా బోలెడన్ని ఉన్నాయి కదా? వాటన్నిటినీ వదిలేసి కేవలం ఈ రెండింటినే పట్టుకోవటంలో అర్ధమేంటి? పోనీ ఈ ప్రచారం వలన వాటి అమ్మకాల్లో ఏమైనా మార్పులొచ్చాయా? పోనీ ప్రభుత్వాలు ఏమైనా ఆ దిశగా కృషి చేస్తున్నాయా అంటే అదీ లేదు. పోటీ పడీ మరీ అమ్మిస్తున్నాయి. ఈ మధ్యే చూస్తున్నాము. గవర్నమెంటే స్వయంగా మద్యం దుకాణాలు తెరిచీ మరీ అమ్ముతోంది మద్యాన్ని. సరే అమ్ముకోనివ్వండి. మరి మధ్యలో ఈ నీతి సూత్రాలెందుకు? ఎవరిని మోసం చేయడానికి? 
యింకొక విషయమేమిటంటే మనం సినిమాలో లీనమయ్యి చూస్తున్నప్పుడు హీరో, లేక విలన్,  లేక ఎవరైనా సిగరెట్ త్రాగుతున్న సీన్ గానీ మద్యం సేవించే సీనో వస్తే వెంటనే "పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం" అనో లేక "మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం" అనో ఓ మూల ప్రకటన వచ్చేస్తోంది ఆటోమేటిగ్గా. ఆ మాటకొస్తే సినిమాల్లో రేపులు, హత్యలు, కిడ్నాపులూ, ర్యాగింగు, అమ్మాయిల్ని టీజింగ్ సన్నివేశాలూ, మోసాలూ, యింకా చెప్పుకుంటూ పోతే ఈ పేజీకి సరిపడనన్ని ఉంటాయి. మరి ఆయా సన్నివేశాలొచ్చినప్పుడు సిగరెట్, మద్యం సన్నివేశాలకు ఎలాగైతే నీతి బోధలు చేస్తున్నారో అలాగే వాటికి కూడా చేయాలి కదా? 
ఉదాహరణకి....
ఎవరైనా బజ్జీలు తినే సన్నివేశమొచ్చిందనుకోండి, వెంటనే ఓ మూలన యిలాంటి ప్రకటన రావాలి
"బజ్జీలు తినడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే అందులో బోలెడంత నూనె ఉంటుంది"
ర్యాగింగు సీను వచ్చిందనుకోండి, యిలా రావాలి
"ర్యాగింగు చట్టరీత్యా నేరం. ర్యాగింగు చేసిన వాళ్ళకు కఠినమైన శిక్షలు పడతాయి"
రేప్ సన్నివేశమొస్తే యిలా రావాలి
"మానభంగం మన యింటా వంటా లేదు. ఏదైనా అడిగి సాధించుకోండి. బలవంతం వద్దు. చట్ట రీత్యా నేరం కూడానూ"
ఫైటుంగు సన్నివేశాలొచ్చినప్పుడు
"మనది శాంతి కాముక దేశం. యుద్ధాలొద్దు. చర్చించుకొని పరిష్కరించుకోండి. ఉభయులకూ లాభం"
 వ్యభిచార సన్నివేశమొస్తే
"శుభ్రంగా పెళ్ళి చేసుకోండి. యిలాంటివి వద్దు. తప్పదనుకుంటే కండోం వాడండి"
ఈవ్ టీజింగు సన్నివేశమొస్తే
"మీకూ అక్కో చెల్లో ఉన్నారన్న విషయం గుర్తు పెట్టుకోండి"
యిలా ప్రతీ సన్నివేశానికి వేయాలన్న మాట.
వీటన్నిటినీ వదిలేసి కేవలం సిగరెట్, మద్యం మీద పడి ఏం లాభం? అయినా ఒక సినిమాని చూట్టానికి ఎందుకెళతాము? నీతులు నేర్చుకోవటానికి అయితే కాదు కదా?

ఈ ప్రభుత్వాలకి ఏమయ్యింది? ఒక వైపు సిగరెట్లు మద్యం అమ్మకాల ప్రోత్సాహం, మరొక వైపు జనాలకి నీతి బోధలు"