Friday 12 February 2016

ఇంకా నయం బుర్రకధలు చెప్పమనలేదు !

ఈ మధ్య సినిమా నటులని గమనించారా? CCL అనీ, కబడ్డీ లీగ్ అని ఆటలమీద పడ్డారు. విరగ ఆడేస్తున్నారు. బానే ఉంది కానీ అవసరమంటారా? వాళ్ళు బాగా ఆడతారా లేదా అన్నది కాదు ముఖ్యం. అసలు వాళ్ళెందుకు ఆడాలి అని. ఇండియాలో ఆటగాళ్ళు తక్కువేమీ కాదుగా!  ఈ ఆటల వలన వాళ్ళు సాధించేదేమిటి? ఎంత గొప్పగా ఆడినా ఒక నటుడిని గొప్ప ఆటగాడిగా జనం గుర్తించరు గాక గుర్తించరు. పోనీ  అలా గుర్తించినా తమ నట జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే అదీ లేదు! అఖిల్ ని చూడండి. క్రికెట్ బాగా ఆడతాడు కానీ అది అతని మొదటి సినిమాకి ఏ మాత్రం పనికి రాలేదు పాపం. సరే ఆ విషయం ప్రక్కన పెడితే ఏతా వాతా చెప్పోచ్చేదేంటంటే  సినిమా నటులు తమకు తెలియని రంగం లోకి దూరి అభాసు పాలవడం కన్నా తమకు పరిచయమున్న నటనా రంగంలోనే ఏదైనా చేస్తే బాగుంటుంది కదా? వాళ్ళు ఆల్రెడీ సినిమా రంగంలోనే ఉన్నారు కదా? అనే కదా మీ అనుమానం?' వస్తున్నా. ఒకప్పుడు అంటే సినిమాల ప్రభంజనం యింత ఇదిగా లేని రోజుల్లోను, ఆ తర్వాత కూడా చాలా కాలం జనాలకు గొప్ప వినోదాన్నిచ్చిన రంగం 'నాటక రంగం'. ఒకప్పుడు టికెట్ కొని మరీ చూసేవాడు ప్రేక్షకుడు. ఇప్పుడు ఉచితంగా చూపిస్తానన్నా చూసే నాధుడు లేడు. అలా అని నాటకాలు వేసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు ఎటొచ్చీ చూసేవాళ్ళే లేరు. అలాంటి నాటక రంగాన్ని సదరు సినిమా నటులు ఎంచుకుంటే బాగుంటుంది కదా? నాటక రంగాన్ని ప్రొత్సహించినట్టుంటుంది, సినిమాల్లో వాళ్ళు చేయని (చేయలేని) పాత్రలు పోషించినట్టు ఉంటుంది. ఏమంటారు?