Monday, 12 December 2016

దొందూ దొందే

తెలుగు సినిమా దర్శకులు ఆర్. నారాయణ మూర్తి, భీమినేని శ్రీనివాసరావులిద్దరికీ ఓ విషయం లో పోలికుంది తెలుసా?   అదేంటి వాళ్ళిద్దరికీ పోలికేమిటి అనుకుంటున్నారా? ఉంది.
ఆర్ నారాయణ మూర్తి తాను తీసిన సినిమాలన్నీ విప్లవ ఆధారిత సినిమాలు తీసాడు.... తీస్తున్నాడు. అవి విజయవంతమైనా కాకపోయినా ఆటను తన  పంధాని ఏ మాత్రం మార్చుకోకుండా డబ్బులొచ్చే సినిమాలు తీయకుండా తాను నమ్మిన సిధ్ధాంతాన్ని నమ్ముకొని సినిమాలు తీస్తున్నాడు.
బానే ఉంది కానీ భీమినేని సంగతేమిటంటారా?
ఆయనా అంతే. తాను నమ్మిన సిధ్ధాంతాన్ని నమ్ముకొనే సినిమాలు తీస్తుంటాడు. ఆయన సిధ్ధాంతమేమిటంటారా?!
రీమేక్ సినిమాలు మాత్రమే తీయడం. అవును. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ రీమేక్ సినిమాలే. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా స్ట్రైట్ సినిమా కూడా తీయలేదు. నాకు తెలిసి తీయడు కూడా!
ఇప్పుడు అర్ధమయ్యింది కదా? వాళ్లిద్దరూ తాము నమ్మిన సిధ్ధాంతం తప్ప వేరే వాటిని దరి చేరనీయరని.


Tuesday, 8 November 2016

ఆ చెపుతారు

ఇప్పుడు మళ్ళీ హెల్మెట్ రూల్ వచ్చేసింది. ప్రతీ ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే హెల్మెట్ లేకుండా బండి నడిపితే ప్రాణాపాయము కాబట్టి. వందకి వంద శాతం నిజం.

కాకపొతే హెల్మెట్ పెట్టుకోకపోవటం ఒక్కటే కాదు. ప్రాణాపాయాన్ని తెచ్చేవి చాలా ఉన్నాయి. అందులో కొన్ని..

సిగరెట్ స్మోకింగ్, మద్యపానం లాంటివి. వాటి మీద ఫైను ఎలాగూ లేదు సరి కదా ఎంచక్కా షాపుల్లో పెట్టి అమ్మేస్తున్నారు.

RTC బస్సుల్లో, రైళ్ళల్లో కిక్కిరిసిపోయి జనాలు ప్రయాణం చేసినా నో ఫైన్.

రోడ్లు ఎంత అధ్వాన స్థితి లో ఉన్నా ఆ డిపార్ట్ మెంట్ మీద నో ఫైన్.

యిలా చెప్పుకుంటూ పొతే బోలెడు డిపార్టుమెంటుల మీద బోలెడన్ని ఫైన్ లు వేసుకుంటూ పోవాలి.

మనిషి ప్రాణాలు కేవలం హెల్మెట్ తోనే ముడిపడినట్టు ఈ హడావిడి ఏమిటో !

అన్నట్టు... హెల్మెట్ పెట్టుకోకపోతే తెగ ఫైన్లు వేసేసి పోలీసులు మాత్రం వాటిని ఎందుకు పెట్టుకోరో నా మట్టి బుర్రకి అస్సలు అర్ధం కాదు. మీకైమైనా అర్ధమైతే చెపుదురూ ! 

Tuesday, 11 October 2016

సీజనల్ దేశభక్తి

చైనా వస్తువులని బహిష్కరించండి!
చైనా వస్తువులని కొనడం మానేయండి!!
దేశ భక్తిని నిరూపించుకోండి!!!
గత కొన్ని రోజులుగా ..... ఖచ్చితంగా చెప్పాలంటే పాకిస్తాన్ కి మనకి గత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం కాని యుద్ధం జరుగుతున్నప్పటినుండి మన వాట్సప్, ఫేస్ బుక్ వీరులు తెగ ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులయ్యాక ఈ సదరు చైనా వస్తువుల బహిష్కరణ గోల ఎక్కడా కనిపించదు గాక కనిపించదు. వాళ్ళు చెపుతున్న దాంట్లో నిజం లేదా అంటే ఖచ్చితంగా ఉంది... కానీ ఏదైనా అనర్ధం జరిగినప్పుడే ఎందుకు గుర్తొస్తుందన్నదే నా పాయింట్. యిదెలా ఉందంటే ఏదైనా రోగం వచ్చినప్పుడు యిక జీవితం లో సిగరెట్ తాగను, మందు ముట్టుకోను అని ప్రతిజ్ఞలు చేస్తుంటారు కొంతమంది.... కొన్ని రోజులయ్యాక మళ్ళీ మామూలే! ఆ మధ్య నాకు తెలిసిన సాఫ్ట్ వేర్ ఫ్రెండ్ ఒకరు నాకు ఓ మెసేజ్ పెట్టారు. దాని సారాంశమేమిటంటే అమెరికా వస్తువులని కొనడం మానేయాలని. ఎందుకట?? ఆ సమయం లో అమెరికాలో భారతీయుల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు తీసేసారు లెండి! అందుకని సదరు సాఫ్ట్ వేర్ జనమంతా ఓ రిజల్యూషన్ పాస్ చేసి పారేయడమే కాకుండా మనల్ని కూడా పాటించమంటునారన్న మాట. నాకు కూడా ఆ మెసేజ్ చదివి కొద్దిగా పూనకం వచ్చింది కానీ వెంటనే ఓ విషయం గుర్తొచ్చి ఆ ఫ్రెండుకి ఫోన్ చేసి "మీరు చెప్పింది బానే ఉంది కానీ మీరు ప్రతీ సంవత్సరం అమెరికన్ ఇండిపెండెన్స్ డే జరుపుతుంటారు కదా... మరి అప్పుడు ఈ దేశభక్తి ఏమయ్యింది" అని అడుగుదామనుకున్నా. మళ్ళీ నాకే అనిపించింది ఎందుకొచ్చిన సంత అని. సరే ఆ విషయం పక్కన పెడితే ఈ సదరు సీజనల్ దేశభక్తులకి ఓ మాట చెప్పాలనుకుంటున్నా
 "చైనా వస్తువులని కొనడం మానేయడం తో పాటు ఆ దేశానికి మీ పిల్లల్ని మెడిసిన్ కోర్సులకి గట్రా పంపించకండి.... మీ పిల్లల్ని ఇక్కడే చదివించండి....ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అసలు ఆ దేశానికే వెళ్లకండి...రేటు తక్కువ అని అడ్డమైన చైనా వస్తువులు కొనేయకండి....
మీ దేశభక్తిని మరింత యినుమడింపచేసుకోండి........


Friday, 12 February 2016

ఇంకా నయం బుర్రకధలు చెప్పమనలేదు !

ఈ మధ్య సినిమా నటులని గమనించారా? CCL అనీ, కబడ్డీ లీగ్ అని ఆటలమీద పడ్డారు. విరగ ఆడేస్తున్నారు. బానే ఉంది కానీ అవసరమంటారా? వాళ్ళు బాగా ఆడతారా లేదా అన్నది కాదు ముఖ్యం. అసలు వాళ్ళెందుకు ఆడాలి అని. ఇండియాలో ఆటగాళ్ళు తక్కువేమీ కాదుగా!  ఈ ఆటల వలన వాళ్ళు సాధించేదేమిటి? ఎంత గొప్పగా ఆడినా ఒక నటుడిని గొప్ప ఆటగాడిగా జనం గుర్తించరు గాక గుర్తించరు. పోనీ  అలా గుర్తించినా తమ నట జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే అదీ లేదు! అఖిల్ ని చూడండి. క్రికెట్ బాగా ఆడతాడు కానీ అది అతని మొదటి సినిమాకి ఏ మాత్రం పనికి రాలేదు పాపం. సరే ఆ విషయం ప్రక్కన పెడితే ఏతా వాతా చెప్పోచ్చేదేంటంటే  సినిమా నటులు తమకు తెలియని రంగం లోకి దూరి అభాసు పాలవడం కన్నా తమకు పరిచయమున్న నటనా రంగంలోనే ఏదైనా చేస్తే బాగుంటుంది కదా? వాళ్ళు ఆల్రెడీ సినిమా రంగంలోనే ఉన్నారు కదా? అనే కదా మీ అనుమానం?' వస్తున్నా. ఒకప్పుడు అంటే సినిమాల ప్రభంజనం యింత ఇదిగా లేని రోజుల్లోను, ఆ తర్వాత కూడా చాలా కాలం జనాలకు గొప్ప వినోదాన్నిచ్చిన రంగం 'నాటక రంగం'. ఒకప్పుడు టికెట్ కొని మరీ చూసేవాడు ప్రేక్షకుడు. ఇప్పుడు ఉచితంగా చూపిస్తానన్నా చూసే నాధుడు లేడు. అలా అని నాటకాలు వేసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు ఎటొచ్చీ చూసేవాళ్ళే లేరు. అలాంటి నాటక రంగాన్ని సదరు సినిమా నటులు ఎంచుకుంటే బాగుంటుంది కదా? నాటక రంగాన్ని ప్రొత్సహించినట్టుంటుంది, సినిమాల్లో వాళ్ళు చేయని (చేయలేని) పాత్రలు పోషించినట్టు ఉంటుంది. ఏమంటారు?                      

Saturday, 9 January 2016

పిల్లల్ని సక్ర మార్గంలో పెంచడమెలా?

పిల్లల్ని సక్ర మార్గంలో పెంచడమెలా? మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్ని గౌరవించడం ఎలా? ముఖ్యంగా తండ్రిని గౌరవించడమెలా? యిలాంటివి నేర్పడానికి మనకి బోలెడన్ని పుస్తకాలున్నాయి, కొన్ని సినిమాల్లో కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. కానీ వీటన్నిటినీ తలదన్నే యాడ్ ఒకటి మనం చూసే అధ్బుత అవకాశం కలుగుతోంది ఈ మధ్య. పిల్లలకి వాళ్ళ తండ్రిని ఎంత చక్కగా గౌరవించాలొ ఎంత నేర్పుగా వాళ్ళకి కావలసింది తమ తండ్రి నుంచి సాధించుకోవాలో సదరు యాడ్ చూసి నేర్చేసుకోవచ్చన్నమాట. యింతకీ ఆ యాడ్ సారాంశం ఏమిటంటే ......
ఒక కుర్రాడు తన తండ్రికి 'అతి' వినయం ప్రదర్శిస్తూ అతని తండ్రికి కావలసిన పని ఏదో చేస్తాడు. ఈ తతంగాన్ని అతని తల్లి ఓ కంట చూస్తూనే ఉంటుంది. ఆ కుర్రాడు తన తల్లితో "చూసావా నాన్నని ఎలా మస్కా కొట్టి నా పని చేసుకున్తున్నానో అన్నట్టుగా సైగ చేస్తాడు. అది చూసిన ఆ తల్లి ఆ కుర్రాడిని ఏమీ అనకపోగా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది.ఇదే విధంగా అమ్మాయితో కూడా ఇలాంటి యాడ్ ఉంది. ఆహా ... ఎంత గొప్ప యాడో కదా?
ఇదే కాదు 'పిల్లలు కాదు పిడుగులు' అనే గొప్ప కార్యక్రమం ఒకటోస్తోంది. మన యింట్లో పిల్లలు వాళ్ళ వయసును మించిన మాటలు మాట్లాడితే కొప్పడతాము.. కానీ ఈ కార్యక్రమం  చిన్న చిన్న పిల్లలు చక్కటి  ముదర కబుర్లు చెప్పే మహత్తర అవకాశం కలిపిస్తోంది. వాళ్ళు అలా చెపుతుంటే ఆ కార్యక్రమాన్ని యాంకరింగ్ చేస్తున్న 'ఉదయభాను' విరగబడి నవ్వుతోంది(ఏడవలేక). ఆ పిల్లల తల్లిదండ్రులైతే నిజంగానే ఎడ్చేస్తున్నారు ఆనందం తట్టుకోలేక. నవ్వాలో, ఏడవాలో అర్ధం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది 'మనం' మాత్రమే. ఈ సారి ఎవరైనా క్లారిటీ ఇస్తే బాగుండును.     .