Friday 31 October 2014

మేం వయసుకి వచ్చాం !

నటుడు జేడీ చక్రవర్తి, బ్రహ్మాజీ, భానుచందర్, దర్శకుడు ఏస్ వీ కృష్ణా రెడ్డి, నటి సితార, కమెడియన్ అలీ, మళయాళ నటుడు రఘు (రెహ్మాన్ రాజు).... వీళ్ళందరినీ ఒక సారి గమనించండి. వీళ్ళంతా ఓ యిరవై యిరవై ఐదు ఏళ్ళుగా సినిమా రంగంలో ఉన్నారు. వచ్చిన క్రొత్తలో ఎలా ఉన్నారో యిప్పుడూ అలాగే ఉన్నారు. వయసు పెరిగిన ప్రభావం వీరి మీద అస్సలు పడలేదు యిప్పటికీ. ఏ గుళికలు మింగుతున్నారో మరి?!!    

Wednesday 29 October 2014

FAMILY కి తెలుగులో యింకో అర్ధముంది తెలుసా?

ఫ్యామిలీకి తెలుగులో యింకో అర్ధముంది తెలుసా?
అవును. కొన్ని ఇంగ్లీషు పదాలకు తెలుగులో అర్ధాలు మరోలా ఉంటాయి. కాదు. అలా అన్వయించేస్తుంటారు మన తెలుగోళ్ళు. ఇంగ్లీషులో ఫ్యామిలీ అంటే నాకు తెలిసీ కుటుంబమని అర్ధం. కానీ చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఫ్యామిలీకి యింకో అర్ధం చెపుతారు. వాళ్ళ దృష్టిలో ఫ్యామిలీ అంటే "భార్య" అని అర్ధం. అవును. వినడానికి విడ్డూరంగా ఉన్నా యిది నిజం. "నిన్న రాత్రి నేనూ మా ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాము", మా ఫ్యామిలీ ఆఫీసుకెళ్ళింది", "మ ఫ్యామిలీ చాలా స్ట్రిక్టు గురూ". యిలాంటి మాటల్లో "ఫ్యామిలీ" అంటే కుటుంబమనుకుంటున్నారా? కానే కాదు. వాళ్ళ దృష్టిలో ఫ్యామిలీ అంటే భార్య అని. ఇదే దారుణమనుకుంటే కొంత మంది తమ భార్యలను ముద్దుగా "లేడీస్" అని చెపుతుంటారు. "మా లేడీసు వచ్చారు", "మొన్న మా లేడీస్ తో ఊరెళ్ళాను" అంటుంటారు.  మొత్తానికి "భార్య" ని "భార్య"  అని చెప్పుకోవడానికి వచ్చిన తంటాలు యివి.
ఏమిటో.......????!!!!  

Saturday 18 October 2014

కామెడీయే కాదు డాన్సులు కూడా విరగదీస్తాం

హీరోలు డాన్సులు చేయడం మామూలే. అందులో కూడా బాగా చేసేవాళ్ళు కొంత మంది ఉంటే చేయని వాళ్ళు కొంత మంది ఉంటారు. అది మనకి తెలిసిన విషయమే. ఈ హీరోల విషయం ప్రక్కన పెడితే అప్పుడప్పుడు కమెడియన్లూ, క్యారెక్టరు ఆర్టిస్టులూ, విలన్లు కూడా డాన్సులు చేస్తూ ఉంటారు.  వీళ్ళల్లో కమెడియన్లు చాలా మంది డాన్సులు చాలా బాగా చేస్తుంటారు. నిజం చెప్పాలంటే కొంత మంది హీరోల కన్నా బాగా చేస్తారు. ఆ తరం నటుల్లో రాజబాబు, నగేష్, చలం ....... యిలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కమెడియన్లు డాన్సులు బాగా చేసేవాళ్ళు. యిప్పటి కమెడియన్లను గమనించండి.... బాబూమోహన్, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్.. వీళ్ళంతా మంచి డాన్సర్లే. బాబూమోహన్ డాన్సులు ఎంత క్రేజ్ సంపాదించాయంటే ఆయన కోసమే సినిమాలో ఓ ప్రత్యేక గీతం పెట్టేవారంటే ఆలోచించండి డాన్సుల్లో ఆయన ఎంత పేరు సంపాదించుకున్నాడో!. ఒక పేరు చెప్పలేదనుకుంటున్నారు కదూ? అవును -  అతని పేరు 'సునీల్ '. సునీల్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాక యిప్పుడు హీరో కూడా అయ్యాడు. సునీల్ ఎంత మంచి డాన్సరో మనకి తెలిసిన విషయమే. ఏతా వాతా నేను చెప్పేదేంటంటే కమడియన్లు కామెడీయే కాదు డాన్సులు కూడా బాగా చేసారు-చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే కామెడీ చేసేవాళ్ళు అన్నీ చేయగలరని నా నమ్మకం. అంతా బాగుంది. కానీ యింకొక విషయం చెప్పుకోవాలి విలన్ వేషాలు వేసేవాళ్ళు మాత్రం మంచి డాన్సర్లు కాదు. రావుగోపాలరావు, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, చలపతిరావు వీళ్ళెవరికీ అస్సలు డాన్సులు రావు. పాపం. 
           

మన సినిమాటోగ్రాఫర్లు కూడా సినిమాల్లో నటించారండోయ్

మన సినిమాటోగ్రాఫర్లు కూడా అప్పుడపుడూ ఆటవిడుపుగా కొన్ని సినిమాల్లో నటించారండోయ్. చోటా K నాయుడు 'నిర్ణయం' సినిమాలో మురళీమోహన్ అనుచరుడిగా నటించాడు. ఆ పాత్ర విలన్ల చేతిలో చనిపోతుంది. అలాగే యింకో సినిమాటోగ్రాఫర్ S. గోపాల్ రెడ్డి కూడా "గోవిందా గోవింద" సినిమాలో CBI ఆఫీసరు పాత్రలో నటించాడు. గమ్మత్తేంటంటే ఆ సినిమాలో ఆ పాత్ర కూడా చనిపోతుంది విలన్ల చేతిలో.    

Wednesday 15 October 2014

మణిరత్నం మోసం చేసాడు

మణిరత్నం మోసం చేయడమేంటనుకుంటున్నారా? అవును. మోసం చేసింది మాత్రం మనల్నే. రోజా సినిమా చూసారా? కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమా అది. ఆ సినిమా షూటింగ్ అంతా ఎక్కడ తీసారో తెలుసా? కాశ్మీర్ అనుకుంటున్నారు కదూ. కానే కాదు. ఆ సినిమాని మొత్తం ఊటీ లో తీసేసాడు మణిరత్నం. మొన్నా మధ్య ఊటీ వెళ్ళినప్పుడు అర్ధమయ్యింది నాకు. ఊటీ ని ఏమాత్రం తెలియనియ్యకుండా కాశ్మీర్ అనే విధంగా  భ్రమింపచేసాడు మణిరత్నం. ఈ సినిమానే కాదు 'దిల్ సే' సినిమా కూడా అంతే.

Monday 13 October 2014

'నో బాల్' పడినా నాకు సంబంధం లేదు

యిది క్రికెట్టుకి సంబంధించింది. బౌలరు బాలింగు వేసేటప్పుడు అంపైరు అతడిని 'నో' బాలు వేస్తున్నాడో లేదో చూస్తాడు. ఆ తర్వాత అతను వేసిన బంతిని గమనిస్తాడు. యిదంతా మనకి తెలిసిన విషయమే. కాకపోతే బౌలరు 'నో' బాలు వేస్తున్నాడా లేదా అని చూసి రెప్పపాటులో మళ్ళీ అతను వేసే బంతిని చూడటం అంపైరుకి కొంచెం కష్టమే కదా? దాని బదులు 'నో' బాలు ఒక్క దానిని థర్డ్ అంపైరుకి వదిలేస్తే ఎలా ఉంటుంది? అంటే ఏమీ లేదు. మీరు టెన్నిసు చూస్తుంటారు కదా? టెన్నిస్ బంతి లైను మీద పడిందో లేదా లైను బయట పడిందో చూడటానికి టెలివిజను రీ-ప్లే పద్దతి ఒకటుంది కదా? దాన్నే 'లైను అంపైరు' అని అంటారనుకుంటా నాకు సరిగ్గా తెలీదు. అలాంటి పద్దతి క్రికెట్టులో కూడా ప్రవేశపెడితే బాగుంటుంది కదా?  బౌలరు లైను దాటి బంతి వేసిన వెంటనే 'రెడ్ లైట్' వెలిగితే సరి అతను 'నో' బాల్ వేసినట్టన్నమాట. చక్కగా అంపైరుకి ఏకకాలంలో రెండింటిని చూసే శ్రమ తప్పుతుంది, 'నో' బాలుని ఖచ్చితంగా నిర్ణయించే అవకాశమూ - రెండూ కలిసొస్తాయి. ఏమంటారు? 

Saturday 11 October 2014

ఆంధ్రప్రదేశ్ లో బ్లాకులో టికెట్లు అమ్మని థియేటరు పేరు తెలుసా?

నేను యింతవరకూ చూసిన ప్రతీ థియేటర్ల బయట బ్లాకులో టికెట్లు అమ్మడం చూశాను చూస్తున్నాను. ప్రతీ థియేటరు బయట యిది సర్వ సాధారణం. కానీ నా చిన్నప్పటినిండీ బ్లాకులో అమ్మని ఒక థియేటరుని చూశాను. ఆ థియేటరులో బ్లాకులో టికెట్లు అమ్మరు. అమ్మడానికి అవకాశమే లేదు. ఎందుకంటే టికెట్ల కోసం అందరూ క్యూలో నించున్నాక వాళ్ళకు ఒక టికెట్ మాత్రమే యిచ్చేవారు. ఆ టికెట్ తీసుకున్నాక సరాసరి లోపలికి - అంటే థియేటరులోకి వెళ్ళిపోవలసిందే. సినిమా మొదలయిన అరగంట వరకూ ఎవరినీ బయటకి వదిలేవారు కాదు. స్కూటర్లూ, బండ్లూ, సైకిల్లూ గట్రా ముందే స్టాండులో పెట్టేసుకోవాలి. ఒక వేళ టికెట్టు దొరకకపోతే మాత్రం వాళ్ళకి బండి తాలూకు డబ్బులు తిరిగిచ్చేసే వాళ్ళు. కానీ నేను చెపుతోన్న విషయము ఓ యిరవై యేళ్ళ క్రితం మాట. అప్పట్లో ఆ థియేటరులో కేవలం ఇంగ్లీషు సినిమాలు మాత్రమే ఆడేవి. యిప్పుడు తెలుగు సినిమాలు కూడా ఆడేస్తున్నాయనుకోండి. యింతకీ ఆ థియేటరు పేరు చెప్పకుండా ఊదరగొట్టేస్తున్నాననుకుంటున్నారు కదూ. వస్తున్నా. ఆ థియేటరు కాకినాడలో ఉంది. పేరు "సత్యగౌరి" 
    

Friday 10 October 2014

ఆ రోజుల్లో

కొంత మంది పెద్దవాళ్ళు అంటే ఓ యాభై అరవై యేళ్ళ వాళ్ళు ఓ మాట అంటూ ఉంటారు. అదేంటంటే "నేను ఆ రోజుల్లో ఐదో తరగతి చదివాను. ఆ రోజుల్లో అయిదో తరగతి అంటే యిప్పుడు డిగ్రీ తో సమానం. తెలుసా?". నాకు యిప్పటికీ అర్ధం కాని విషయమేమిటంటే ఆ రోజుల్లో చదివిన అయిదో తరగతి యిప్పటి డిగ్రీ తో ఎలా సమానమవుతుందీ అని ! రోజు రోజుకీ చదువు స్టాండార్డ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో అలాంటి మాటలు విని నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు.       

Thursday 9 October 2014

మీమీదొట్టు...మేము జరగమంతే !

కిక్కిరిసిపోయున్న బస్సుని ఓ సారి గమనించండి. జనాలు ఫుట్ బోర్డ్ మీద వేలాడుతూ ప్రయాణిస్తుంటారు. వాళ్ళందరూ అలా ప్రయాణం చేయడానికి కారణమేంటో తెలుసా? లోపల జనాలు నిండిపోవడం వలన అనుకుంటున్నారా? అది కొంతవరకు మాత్రమే నిజం. అంటే??? నిజానికి లోపల నుంచున్న జనాలు కొంచెం వెనక్కి జరిగి నించుంటే ఫుట్ బోర్డ్ మీద నిలబడ్డ జనాలు లోపలికి వచ్చే అవకాశముంటుంది. కానీ లోపల నించున్న జనాలు అస్సలు వెనక్కి జరగరు గాక జరగరు - కండక్టరు చెప్పినా యింకెవరు చెప్పినా సరే అలా మొద్దుల్లా నించొని చూస్తుంటారు. ఫుట్ బోర్డ్ మీద నిలబడ్డ జనాలు ఎంత యిబ్బంది పడుతున్నా సరే. కావాలంటే ఈ సారి చూడండి. 

Monday 6 October 2014

ప్రవేశం నిషిద్దం!

ఓ ప్రక్కన ఆఫీసుకి టైమైపోతుంటుంది. ట్రాఫిక్కుని దాటుకుంటూ ఓ సందులోకి ఎంటరవుతాము. ఎందుకంటే ఆ సందు గుండా వెళితేనే ఆఫీసు వస్తుంది మరి. ఆ సందెమ్మటే వెళుతుంటే దారికి అడ్డుగా ఓ టెంటు వేసి ఉంటుంది. అక్కడ ఏ అన్న దాన కార్యక్రమమో, పెళ్ళో, లేక రజస్వల వేడుక లాంటిదేదో జరుగుతుంటుంది. పోనీ ఓ ప్రక్కనించి వెళ్ళిపోదామా అంటే ఏ మాత్రం వీలు లేకుండా బల్లలు కుర్చీలు అడ్డుగా పెట్టేసుంటారు. అది దాటుకొని వెళ్ళాలంటే మీరు మళ్ళీ వెనక్కొచ్చి యింకో నాలుగు సందులు దాటి చుట్టూ తిరిగెళితే గానీ ముందుకి వెళ్ళ లేరు. యిలాంటివి నెలకి కనీసం రెండైనా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు రోడ్డుకి అడ్డంగా యిలా టెంటులు గట్రా వేసేయడం వలన ఆ రోడ్డులో వెళ్ళే వాళ్ళకి ఎంత యిబ్బందిగా ఉంటుందో ఏమాత్రం ఆలోచించరు సరికదా అడిగితే అడ్డంగా వాదనకు దిగుతారు. ఆ రోజంతా - అంటే ఆ ఫంక్షను జరుగుతున్నంత సేపూ జనాలు నరకం చూడాల్సిందే. తప్పదు.    

మిక్స్ డ్ క్రికెట్

క్రికెట్టంటే పిచ్చ ఉన్న దేశం పేరు చెప్పండి ? మరో మాట లేకుండా అందరూ చెప్పే సమాధానం "భారత దేశం". అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ యిందులో చిన్న సవరణ ఉంది. అదేంటంటే మనోళ్ళు క్రికెట్టంటే పడి చస్తారు గానీ కేవలం మగవాళ్ళు ఆడే క్రికెట్టంటే మాత్రమే పడి చస్తారు. ఆడవాళ్ళు అంటే మహిళా క్రికట్టంటే ఏమాత్రం చూడరు గాక చూడరు. వాళ్ళు ఆడిన ఏ క్రికెట్టు మ్యాచైనా జనాలు లేక వెలవెల పోతుంటాయి. వాళ్ళు ఎన్ని సెంచరీలు కొట్టినా, ఎన్ని కప్పులు గెలిచినా వాళ్ళకు మిగిలేది మాత్రం శూన్యం. మరి వీళ్ళని పమోట్ చేసేదెలా? ఒక్క రోజులో అది సాధ్యం కాదు గానీ నాకొక ఆలోచన ఉంది. అదేంటంటే "IPL మ్యాచుల్లో మహిళా క్రికెటర్లను కూడా భాగస్వామ్యుల్ని చేయాలి". ఎలా ఉంది? అంటే మనకున్న భారత మహిళా క్రికెట్ టీము మెంబర్లు అంటే సుమారు 15 లేక 16 మందిని తలా ఒక టీములో ఆడనిచ్చే అవకాశమివ్వాలి. అలా చేయడం వలన వాళ్ళ ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది. వాళ్ళకంటూ ఓ ఇమేజ్ వస్తుంది. తద్వారా వాళ్ళు మహిళా క్రికెట్ ఆడినపుడు ఆ ఇమేజ్ ఉపయోగపడి వాళ్ళు ఆడే మ్యాచుల్ని ఎక్కువమంది చూసే అవకాశముంటుందని నా అభిప్రాయము. ఏమంటారు? 

Friday 3 October 2014

'జెయింట్ వీల్' భయపడకుండా ఎక్కాలంటే?

'జెయింట్ వీల్' ఎక్కుతున్నారా? భయమేస్తోందా? ముఖ్యంగా 'జెయింట్ వీల్' పైకి వెళుతున్నప్పుడు కన్నా క్రిందకు దిగేటప్పుడు గుండె ఝల్లుమన్నట్టనిపిస్తుంది కదూ? ఆ ఫీలింగు కొంతవరకూ తగ్గాలంటే ఓ పని చేయండి 'జెయింట్ వీల్' క్రిందకి దిగుతున్నప్పుడు ముందు వైపుకి చూడకండి వెనుక వైపు చూడండి. అంత భయం వేయదు.  

యిచ్చట శ్రేష్ఠమైన బూతులు నేర్పబడును

మీ పిల్లలకి మంచి శ్రేష్టమైన బూతులు నేర్పించాలనుకుంటున్నారా? మీ పిల్లలే కాదు మీరు కూడా నేర్చుకోవటానికి మంచి అవకాశం. యిందు కోసం మీరు చేయవలసిందల్లా ఒక్కటే. ఓ మంచి తెలుగు సినిమాకి వెళ్ళిపోవడమే. మన అగ్ర హీరోలు అనిపించుకుంటున్న నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, రవితేజ..... వీళ్ళంతా చక్కటి బూతులతో తెలుగు సినిమాని మరింత అభివృద్ది పధంలోకి తీసుకెళ్ళడానికి తమ వంతు చేయూతనిస్తున్నారు. వీళ్ళు విలన్లని తిట్టడానికో లేక వెటకారం చేయడానికో ఓ మాటని చక్కగా వాడేస్తున్నారు "పిచ్చి పూ".......(వాళ్ళు అంటున్నారు అని చెప్పడం కోసమైనా ఈ పదం వాడవలసినందుకు క్షమించాలి). ఆ పదాన్ని సగం వాడి మిగతాది మింగేయడం. యింక కొంతమంది హీరోలు మరో విధంగా "పిచ్చి వూక.....పూహా".....యిలా బూతుల్ని చక్కగా తెలివిగా వాడేస్తున్నారు. మరో నటుడైతే ఒక అడుగు ముందుకేసి "మాకే లాల్" అంటాడు. ఈ పరిణామం దేనికి సంకేతం? పిల్లల నుండి ముసలివారిదాకా అందరూ ఎంతో అభిమానించే హీరోల నోటి నుండి యింత అసభ్యకరమైన బూతులు వస్తుంటే వారిని ఏ విధంగా అభిమానించాలి? అసలు సెన్సారు వాళ్ళు ఏ విధంగా అనుమతిస్తున్నారు? ఈ బూతులన్నీ ఆడవారి మర్మాంగాల మీదే ఉంటున్నా ఏ ఒక్క మహిళ నుండి కూడా ప్రతిఘటన ఎదురు కాకపోవడమే అత్యంత దారుణమైన విషయం!

Thursday 2 October 2014

మరీ సూటిగా చెప్తే దూరదర్శన్ అంటారేమో బెదరూ!

టీవీలో అంటే న్యూస్ చానల్లో ఏదైనా ఒక నటుడి గురించో లేదా నటి గురించో లేక ఓ దర్శకుడి గురించో చెప్తున్నారనుకోండి. గమనించండి - వాళ్ళ గురించి చెప్పే విషయం ఓ రెండు నిమిషాలే. మిగతా పావుగంట వాళ్ళు నటించిన సినిమాళ్ళోని పాటలు, డైలాగులు గట్రా చూపించేస్తూ మన సహనానికి పరీక్ష పెడుతున్నారు. వాళ్ళ గురించి విషయం సూటిగా చెప్పేయక మధ్యలో ఈ కచేరీ ఏంటి సిరాగ్గా????!!!!

ఈ టీవీలో 'క్యాష్' ప్రోగ్రాం చూస్తున్నారా?

ఈ టీవీలో 'క్యాష్' ప్రోగ్రాం చూస్తున్నారా? యిప్పుడు నేను చెప్పబోయే విషయం ఆ గేం షో ఎలా ఉంది అన్నదాని గురించి కాదు. ఆ షో లో చివరాఖరులో జరిగే వస్తు నాశనం గురించి.  అందులో పాల్గొనే సెలబ్రిటీలు సుమ అడిగే ప్రశ్నలకు జవాబు చెపితే సరి. లేకపోతే కొన్ని వస్తువులు నెమ్మదిగా జరుగుతూ క్రిందకి పడిపోతుంటాయి. ఎంతో విలువైన సామనులు మన కళ్ళ ముందే క్రింద పడిపోతుంటే అయ్యో అనిపిస్తుంది. వాటిని అలా క్రింద పారేసే బదులు ఓ ప్రక్కన పెట్టేస్తే సరిపోతుంది కదా?  

రైలు బస్సులు

జనం......జనం.....జనం...... ఎక్కడ చూసినా జనం. సినిమా హాళ్ళల్లో, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండుల్లో, ఎక్కడ చూసినా జనమే. మరి పెరుగుతున్న జనానికి తగ్గట్టుగా వారికి కావలసినవి ఉంటున్నాయా? అంటే ట్రైనులు, సినిమా హాళ్ళూ, బస్సులు వగైరా వగైరాలన్నమాట. లేవు కదూ? సినిమా హాళ్ళు రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. వాటి స్థానం లో మల్టీప్లెక్సులు పుట్టుకొస్తున్నాయి. ట్రైనుల సంఖ్య పెంచడం కష్టం అని ఓ ప్రక్కన కేంద్ర ప్రభుత్వమంటోంది. ఎందుకంటే ఇప్పుడున్న ట్రాఫిక్ పెరిగిపోయి ట్రైనులని నడపడం కష్టమట. సరే. మరి చివరాఖరుగా బస్సుల విషయానికొద్దాం. ఏ బస్సు చూసినా కిక్కిరిసిపోయుంటున్నాయి. బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. మరెలా? అవే బస్సులు. వాటికే యింకో రెండు లేదా మూడు భోగీలని తగిలిస్తే? భోగీలుండేది రైళ్ళలో అనే కదా మీ అనుమానం? నిజమే. బస్సులకి కూడా రైళ్ళ లాగ యింకో రెండు మూడు భోగీల్లాంటి వాటిని జోడిస్తే బాగుంటుందేమో కదా? అంటే బస్సులని ఆ విధంగా డిజైను మారిస్తే ఎలా ఉంటుంది? రద్దీ కాస్తైనా తగ్గుతుందేమో?! 

మీ పాలిట ప్రతినాయకులం మేము

సంపత్
ఆశిష్ విద్యార్ధి
ప్రదీప్ రావత్
ముఖేష్ రుషి
రాహుల్ దేవ్
షాయాజి షిండే
నాజర్ 
సాయి కుమార్ (తెలుగు సాయికుమార్ కాదు)
ఆదిత్య మీనన్
సోనూ సూద్...................
ఎవరు వీళ్ళంతా? వీరిలో కొంత మందినైనా గుర్తు పట్టారా? ఒకరిద్దరి పేర్లు విన్నట్టు, చూసినట్టు అనిపిస్తున్నాయి కదూ? అవునండి. వీళ్ళంతా మన తెలుగు సినిమా లో ప్రతినాయక పాత్రలు పోషిస్తోన్న నటులు. ఓ దశాబ్దం నుండి మన తెలుగు సినిమాని ఏలేస్తున్నారు మన ఖర్మ కొద్దీ. వీళ్ళలో ఏ ఒక్కరికీ తెలుగు రాదు. తెలుగు రాకపోతే పోయింది కనీసం డైలాగులన్నా తెలుగులో చెప్తారా అంటే అదీ లేదు. చక్కటి హిందీలో చెపుతారు. దాన్ని చక్కగా కవర్ చేయడానికి మన డబ్బింగు ఆర్టిస్టులు ఉండనే ఉన్నారుగా. యింకో దారుణమైన విషయమేమిటంటే సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమాలో నటించిన అందరూ ప్రమోషనుకి వస్తారు గానీ ఈ సదరు పర భాషా ప్రతినాయకులు మాత్రం అస్సలు రారు. పోనీ నటనలో విరగదీస్తారా అంటే అదీ లేదు. అందరిదీ ఒకటే మూస నటన. ఒక రావు గోపాలరావు, ఒక కైకాల సత్యనారాయణ, ఒక ప్రభాకర్ రెడ్డి, ఒక రాజనాల లాంటి వారిని చూసి, వారి నటన తో పులకరించిపోయిన మనం మన దరిద్రం కొద్దీ ఈ పర భాషా విలన్లను కూడా భరించేస్తున్నాం.