Thursday, 6 July 2017

కూచిభట్ల శుభశ్రీకి పెళ్ళిచూపులంట

సరసస్వర సుర  చరీగమనమౌ
సామ వేద సారమిదీ
నే పాడిన జీవన గీతం ఈ గీతం
సిరివెన్నెల సినిమాలో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వస్తోంది రేడియో లో..
కాలేజీకి రెడీ అవుతోంది శుభశ్రీ తెగ హడావిడి పోతూ. 
"అమ్మా  బొట్టు బిల్లలెక్కడ పెట్టావే కనబడటం లేదు... "
వరండాలో తులసి మొక్కకి పూజ చేస్తున్న వాళ్ళమ్మ రాధాకుమారి అది విని "ఆ డ్రాయర్ సొరుగులో ఉంటాయి చూడు ..... అలాగే కళ్ళకి కాస్త కాటుక పెట్టుకోవే.... ఆ చిన్ని కళ్ళు అప్పుడన్నాకాస్త కనబడతాయి"
"అమ్మా... ఇంక్కొక్కసారి నా కళ్ళని కామెంట్ చేస్తే ఊరుకోను..... నాకు కాటుక ఇష్టం లేదని చిన్నప్పటినించి చెప్తున్నా... మళ్ళీ కాటుక పెట్టుకోమంటావేంటి?.... పైగా చిన్ని కళ్ళు అని పదే పదే అనకు... రుసరుస లాడింది తల్లి మీద. 
"అదేంటే కాటుక పెట్టుకుంటే తప్పేంటి... కళ్ళకి అందం...  చలవ...
తల్లి మాట పూర్తి కాకుండానే "నాకు సింపుల్ గా ఉండటమే ఇష్టమే.... పైగా కళ్ళకి కాటుక పెట్టుకోవడం ఏనాటి పధ్ధతి 
"అబ్బో మరి ముక్కుపుడక పెట్టుకోవడం ఏనాటి పద్దతినిమ్మ ముల్లుతో పొడుచుకున్నావుగాలాజిక్ మాట్లాడింది  ఆవిడ.
"సర్లె మాట్లాడితే నా ముక్కుపుడక దగ్గరికి వెల్లిపోతావు"....అందంగా విసుక్కుంది తల్ల్లి మీద.
"సర్లె...కాస్త నెమ్మది.....నడుము అసలే నిలబడదు నీకు..... కూతుర్ని మురిపంగా చూసుకుంటూ.
"సర్లే వస్తా... నాన్నగారూ... అంటూ ఆయన రూం కి వెళ్ళింది. ఒక క్లైంట్ తో మాట్లాడుతున్నాడాయన.    
"వెల్లొస్తానండి" 
అలాగే నమ్మా...డ్రాప్ చేయమంటావా
వద్దు నేను వెళతాను....
శుభశ్రీని చూసిన ఆ క్లయింట్ ఆశ్చర్యపోయి  
ఎవరండి మీ బంధువులమ్మాయా? అని అడిగాడు.



ఆశ్చర్యంగా చూసాడు ఆయన క్లయింట్ వంక. 
"అదేంటండి బంధువులమ్మాయేంటి?..... తను నా కూతురు.... ఏ అలా కనబడటం లేదాఅని గట్టిగా నవ్వాడాయన.
కనబడకే కదా అలా అన్నాను .... పైకి అనలేదు మళ్ళీ ఎమనుకుంటాడో అనే భయంతో…. అసలే కేసు వాదించబోతున్న లాయరు మరి. . 
శుభశ్రీ కూడా గట్టిగా నవ్వేసి వెళ్ళిపోయింది.

*                   *               * 
కధ సరిగ్గా అలా మొదలయ్యింది. ఆ క్లైంటు అలా అనుకోవడానికి - అంటే ఆ అమ్మాయి ఆయనలా కనబడటం లేదు అని అనుకోవడానికి  కారణం తెలుసుకోవడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి…..
  
అది గ్రామానికీ టౌనుకీ మధ్యస్తంగా ఉండే ఊరు. సదుపాయాలన్నీ ఉన్నట్టే ఉంటాయి కానీ పల్లెటూరి వాసనలు ఏమాత్రం పోలేదు. అలాంటి ఊరిలో ఒక పేరున్న లాయరు...పేరు సూర్యం. రాధాకుమారి ఆయన భార్య పేరు. ముగ్గురు అమ్మాయిలుఒక అబ్బాయి ఆయన సంతానం. నలుగు సంతానమున్నా ఆ ఊళ్ళో పేరున్న లాయరు కావడంతో కేసుల్ని గట్టిగా వాదించడం వలన గట్టిగానే సంపాదించాడాయన. దాంతో అందరినీ బాగానే పెంచి ముగ్గురికీ మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు చేసాడు ఆయన. యిక మిగిలింది మన కధానాయిక....పేరు శుభశ్రీ….. అందరికీ తన యింటిపేరుతో సహా కూచిభట్ల శుభశ్రీగానే పరిచయం..... డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది పద్దెనిమిది పూర్తయ్యి పంతొమ్మిదిలోకి అడుగు పెట్టింది ఈ మధ్యే. చివరి అమ్మాయి కావడంతో సహజంగానే గారంగా పెరిగింది.
తను కళ్ళు చెదిరే అందగత్తె. అచ్ఛం దేవలోకం లో ఉండే దేవకన్య పొరపాటున జారి ఈ లోకం లోకి వచ్చి పడిందా అన్నట్టు ఉంటుంది. మనుషుల్ని సృష్టించేది బ్రహ్మే అయితే శుభశ్రీని తయారు చేసేటప్పుడు మిగతా ప్రాణులని తయారు చేసే కార్యక్రమం ఆపేసి ప్రత్యేకంగా మన్మధుడిని పక్కన కూర్చోబెట్టుకొని కొన్ని రోజులపాటు తయారు చేసాడేమో మరి ...  వయసొచ్చిన కుర్రాడి నుంచి పండు ముసలి వాడి వరకు ఒక్కసారి ఆమె పేరు చెపితే క్షణకాలం పాటు హార్ట్ బీట్ పెరిగి తీరుతుంది. అందరికీ ఒకే అనుమానం. ఎందుకు అంత అందంగా ఉందని కాదు! ఆమె అందం ఎందులో ఉంది అని. వత్తైన కనురెప్పల్లోనాచిన్ని కళ్ళల్లోనాసన్నటి పెదవుల్లోనాలేక సెలయేరులా పారే ఆ నవ్వులోనాలేక కనబడీ కనబడనట్టుగా ఉండే ఆ ముక్కు పుడకలోనాఇంతవరకు ఎవరికీ అంతు పట్టలేదు. అదో అంతుపట్టని రహస్యం!  
ప్రత్యేకంగా ఆమె నవ్వినప్పుడు చిన్ని కళ్ళు మరింత చిన్నవైపోతుంటే....వర్ణించలేము...చూసి తీరాల్సిందే. చిన్నప్పటినుంచీ అందంగా నవ్వడం...అందంగా నడవడం....అందంగా నడుచుకోవడం.....అందంగా మాట్లాడటం......అందంగా జీవించడం అందంగా అలవాటైపోయింది ఆ అమ్మాయికి.

చాలా మందికి అనుమానం ఏమిటంటే సూర్యంగారికి ఇంత అందగత్తె ఎలా పుట్టిందీ అని. కొందరికైతే నిజంగా ఈ అమ్మాయి సూర్యం గారి అమ్మాయేనా లేక పెంచుకుంటున్నారా అని. ఆ క్లయింట్ అలా అడగటానికి కారణం అదే. 

అందం ఉన్న చోట నెమ్మది ఉంటుంది అన్నది సామెత కాగా మన కధానాయిక విషయంలో మాత్రం ఆమడంత దూరమండోయ్. ఎంత అందగత్తో అంత వాగుడు కూడా ఉంది. ఒకసారి తన వాగ్ధాటి మొదలెట్టిందంటే కొండలు పిండవ్వాల్సిందే...బ్రహ్మాండం బద్దలవ్వాల్సిందే. తనకి తప్పు అనిపిస్తే అస్సలు ఏ మాత్రం మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేయడంతను చేసింది తప్పు అని తనకి అనిపిస్తే అంతే హుందాగా  ఒప్పుకోవడం తన ఇంకో లక్షణం. కాకపోతే అందగత్తెలందరికీ కాస్త చాదస్తం ఉంటుందన్నది నిర్విదాంశం. తన అందాన్ని చూసి కళ్ళు తిప్పుకోని మగాళ్ళని చూస్తుంటే  ఆ విషయం తనకి అర్ధం కాక ఎందుకలా చూస్తున్నారని వాళ్ళని ఎడా పెడా కడిగేసిన సందర్భాలు బోలెడు. తన అల్లరి భరించడం మానవమాత్రులకి సాధ్యం కాని పని. అల్లరి ముందు పుట్టి తర్వాత శుభశ్రీ పుట్టింది అన్నది అందరూ చెప్పుకొనే మాట. 

చిటికెడు అమాయకత్వం......గరిటెడు గడుసుతనం.....గుప్పెడు హాస్యం....సోలడు అల్లరి....జగ్గుడు కఠినత్వం....బిందెడు హుందాతనం.....బకెట్టుడి జాలి....స్పూనుడు అహంకారం.....ఇవన్నీ కలగలిపిన అధ్బుతం శుభశ్రీ. 

కాలేజీలో ఆమెకున్న నిక్ నేములకి లెక్కే లేదు.
మహాజనానికి మరదలు పిల్ల...  
ఏంజెల్.... 
చిన్నికళ్ల బేబీ....
స్మాల్ ఐస్ బ్యూటీ...
తన చిన్ని కళ్ళ మీద అబ్బాయిలు చేసే కామెంట్లు కూడా ఆమెకి తెలిసినా తెలీనట్టు ఉండేది. 
దాంతో ఆమెని రెచ్చగొట్టడానికన్నట్టు మరింత రెచ్చిపోయి కామెంట్ చేసేవారు.
"రేయ్ శుభశ్రీ మనల్ని చిన్నచూపు చూస్తోందిరా"
"మనల్నే కాదేహే ప్రపంచాన్నే చిన్నచూపు చూస్తోంది"
 విని నవ్వుకునేదే గానీ ప్రతిస్పందించేది కాదు.
అంత వరకు బానే ఉంది కానీ ఒకసారి మాత్రం తనని ఉద్దేశ్యించి కాలేజీలో ఒకడు చేసిన కామెంటుకి మాత్రం శుభశ్రీ వెంటనే రియాక్ట్ అయ్యింది. కాలేజీలో నడుస్తుండగా వెనకనుంచి ఎవరో "హే సెక్సీ" అని అరిచాడు. శుభశ్రీకి వళ్ళు మండిపోయింది ఆ పిలుపుకి. ఊరుకుంటున్నాను కదాని ఎలా పడితే అలా అంటాడా అని వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఓ కుర్రాళ్ళ గ్రూప్ నించొని తన వంకే చూస్తున్నారు. అక్కడికి విసురుగా వెళ్ళి "ఎవడు  నన్ను అలా పిలిచింది?" అంది.

ఎప్పుడూ నవ్వుతుండే శుభశ్రీ ఆ రోజు అలా నిలదీసేసరికి వాళ్ళు కూడా ఒక్కసారిగా బిత్తరపోయారు.  ఎవరూ ఏమీ మాట్లాడలేదు. "చెప్తారా లేక ప్రిన్సిపాల్ గారికి కంప్లైంట్ ఇమ్మంటారా" గట్టిగా అరిచింది.
ప్రిన్సిపాల్ పేరెత్తేసరికి కొంచెం భయం వేసింది. అందులో ఒకడు నెమ్మదిగా "సారీ శుభశ్రీ.... వేరే ఉద్దేశ్యం తో అనలేదు. ఏమీ అనుకోవద్దు."
"వేరే ఉద్దేశ్యం లేకపోవడమేంటి?  నా నవ్వు మీద...నా కళ్ళ మీద కామెంట్లు చేస్తున్నారు చాలదాఊరుకుంటున్నానని ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తారా?" 
"లేదు శుభశ్రీ...ఇప్పుడు కూడా నేను కామెంట్ చేసింది నీ కళ్ళ మీదే"
వళ్ళు మండిపోయింది ఆ సమాధానానికి. 
"ఏంటీ... నా కళ్ళ మీద కామెంటుకీ ఇప్పుడు నువ్వన్న దానికి ఏమిటి సంబంధం?"గట్టిగా నిలదీసింది.
"లేదు శుభశ్రీ..నిజం చెప్తున్నా...నిన్ను స్మాల్ ఐస్ బ్యూటీ అంటారు కదా... దాన్నే ఇంగ్లీషులో చెప్పాము అంతే" అన్నాడు.
"కహానీలు చెప్పకు..."
"సరే ఉండు" అని ఓ పేపర్ మీద యిలా రాసాడు అతడు
"seksee"
"ఏముంది చదువు" అన్నాడు.
చదివింది. చదివాక ఇంకా కోపం వచ్చింది ఆమెకి తనని ఏడిపిస్తున్నారనే ఉక్రోషంతో.
"ఏంటి ఆటలాడుతున్నారాపదండి ప్రిన్సిపాల్ దగ్గరకి"
"ఒక్క నిమిషం....దాని అర్ధం చెప్పాక నీ యిష్టం.... అని దాని పూర్తి అర్ధం రాసాడు ఇలా.
S  - small
E   - eyes beuty 
K   - koochibhatla
See - Subhasree
ఇప్పుడు అర్ధమయ్యిందానేను అన్నదానికి మీనింగు."
ఒక్క క్షణం మతి పోయింది శుభశ్రీకి. తన నిక్ నేం ని అలా రాసినందుకు. ఫక్కున నవ్వు రాబోయి తమాయించుకుని....
"అయినా సరే...యిలా పిలిస్తే మాత్రం ఊరుకొనేది లేదు." అని వార్నింగ్ ఇచ్చి అక్కడ్నించి వెనుతిరిగింది.
వెనక నుంచి వాళ్ళల్లో ఒకడు అరిచాడు "కొపం లోనూ అందంగా ఉన్నావు... సూపర్"
వెనక్కి తిరక్కుండా నవ్వుకుంది... దొంగవెధవలు ఎంత తెలివిగా పెట్టారు తన నిక్ నేం ని.... 'సెక్సీఅంటే స్మాల్ ఐస్ బ్యూటీ కూచిభట్ల శుభశ్రీ అట... చీ...

*            *             *
కాలేజీలో గాయత్రిశోభ సుభద్ర తన బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళతో బాగా క్లోజ్ గా ఉండేది శుభశ్రీ. తన అందం ముందు ఏమాత్రం సరితూగే వారు కాదు వాళ్ళు. వాళ్ళతో వెళుతుంటే తన ప్రక్కన ఓ చెలికత్తెల్లా ఉండేవారు తప్ప తనకి స్నేహితురాళ్ళా కనబడేవారు కారు.
ఒకసారి సుభద్ర అంది తనతో
"నాకొక డౌటే"
"ఏమిటి?"
"ఎప్పుడూ అలా  నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావే బాబూ....మేము ఎంత ట్రై చేసినా అలా ఉండలేకపోతున్నాము... నిన్ను చూస్తే భలే ముచ్చటగా ఉంటుంది"
అది విని చిన్నగా నవ్వి ఊరుకుంది శుభశ్రీ.
"నాకో అనుమానం...నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు కదామరి నిద్రలో కూడా నవ్వుతుంటావా?" అడిగింది శోభ 
శుభశ్రీతో సహా అక్కడున్న అందరూ గట్టిగా నవ్వారు. 
"నిద్రలో నవ్వినా ఫర్వాలేదే...అప్పుడు మాత్రం నవ్వకు...ఇంకోలా అనుకుంటారు" అంది గాయత్రి.
"ఎప్పుడు?" అడిగింది శుభశ్రీఅర్ధం కాక.
గాయత్రి తన చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది.
"చీ...ఏంటే బాబుసిగ్గు లేకుండా!" అని పగలబడి నవ్వింది శుభశ్రీ.
"ఏంటే ఏమన్నాది?" అడిగింది సుభద్ర.
చెప్పబోయింది గాయత్రి.
వెంటనే గాయత్రి నోరు మూసేసింది శుభశ్రీ.

*                *                  *

 కధ మొదలయ్యింది.
 అన్నవరం.  ఉదయం 10.30 గంటలు. ఓ కళ్యాణ మండపం లో పెళ్లి జరుగుతోంది శాస్త్రోక్తంగా. పెళ్లికొడుకు తల్లీ  తండ్రీ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు పెళ్లి కొడుకు పక్కనుండి. 
" సుబ్బు గాడు కూడా ఉంటె ఎంత బాగుండేది" అంది భ్రమరాంభ. సుబ్బు అంటే ఆవిడ చిన్న కొడుకు సుభాష్. 
"ఏం చేస్తామే.... వాడికి మాత్రం రావాలని ఉండదా అన్నయ్య పెళ్ళికికానీ తప్పదు కదా" అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి శేషగిరి రావు. 
మంత్రాలు చదువుతున్న పురోహితుడు ఈ మాటలు విని వాళ్ళతో "అయ్యా.. తమరి రెండో కుమారుడు గురించి మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను. ఏమి చేస్తుంటాడు అబ్బాయి
" సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగమండి ఢిల్లీ లో"
"ఏ మాత్రం వస్తుంది ఏమిటి నెలకి?"
"బానే వస్తుందండి... ఏమి అలా అడిగారుకొంప తీసి వాడికి కూడా ఏదైనా సంబంధం ఉందా ఏమిటిఅంది భ్రమరాంభ. 
"అమ్మా... మీ కుటుంబ వివరాలు తెలిసిన వాడిని గనక మీకు తగ్గ సంబంధం ఒకటుంది... ఈ పెళ్లయ్యాక దాని గురించి మాట్లాడుకుందాము... నాయనా ఆ తాళి బొట్టు తీసుకొని గట్టిగా ఊపిరి తీసుకొని దేవుడి మీద భారం వేసి 'మమఅనుకొని వధువు మెళ్ళో కట్టు  ...ఇహ నీ పనయిపోయినట్టే  "

*                           *                              *                             
 అమ్మా మీ వాడి వయసెంతన్నారు?"
"24 నడుస్తోందండి"

 "ఓహో... సరిపోతుంది... నాకు తెలిసిన భేషుగ్గయిన సంబంధమొకటుంది... పిల్ల తండ్రి  వకీలు. ఆ ఊరిలో సగం మంది ఆయన క్లయింట్ లే. అన్నట్టు మీరు ఆర్టీసీ లో పని చేశారు కాబట్టి మీకర్ధమయ్యే భాషలో చెపుతాను వినండి. 
రాజమండ్రి లో ఎక్కి ప్రత్తిపాడు లో దిగాల్సిన ప్రయాణికుడిని కలకత్తా వరకు తీసుకెళ్లగలిగే కెపాసిటీ ఉన్నవాడాయన."
అతను ఏం చెప్పాడో అర్ధం కాక వెర్రి మొహాలేసారు భార్యాభర్తలిద్దరూ. 
"అర్ధం కాలేదారెండు నెలల్లో తీరిపోవాల్సిన కేసుని రెండేళ్లదాకా సాగదీసే ఘటికుడాయన అంటున్నా"
పంతులు చెప్పింది అర్ధమయ్యి సంతోషంగా మొహాలు చూసుకున్నారు భార్యాభర్తలు.

"కాబట్టి ఆయన స్థితిగతులు అర్ధమయ్యే ఉంటుంది...... ఇహ నలుగురు సంతానం లో ముగ్గురికి వివాహం చేశారు. ఆ సంబంధాలు కూడా చూసిపెట్టింది నేనే.  ఇక  మిగిలింది ఒక్క కూతురు. పేరు శుభశ్రీఇక పిల్ల ఎలా ఉంటుందంటే ఈ రెండు జిల్లాల్లోనే అంతటి అందగత్తె లేదంటే నమ్మండి!  వెధవది ఆ సినిమా నటీమణులు కూడా ఎందుకూ పనికి రారు . ఇక రంగంటారా.... ముట్టుకుంటే ఎర్రబడిపోతుందంటే నమ్మండి. చక్కటి అందం తో పాటు గుణవంతురాలు...    అన్నింటికీ మంచి గొప్ప వినయ విదేతలు ఉన్న పిల్ల….దానికి తోడు మితభాషి. నోట్లోంచి మాటే రాదంటే నమ్మండి " అని చెప్పి ఒక్క క్షణం ఆగాడు పంతులు.
ఆయనకి ఆ అమ్మాయి చేసే అల్లరి, అసామాన్యమైన వాగ్ధాటి పటిమ కళ్ళముందు సినిమాలా కనిపించాయి. అయినా తప్పదుగా అబద్దాలే చెప్పాలి. పెళ్లి మరి!
 "సరే యింత  చెపుతున్నాను కాబట్టి ఈ సంబంధం మీకు కుదురుతుందని హామీ అయితే  ఇవ్వలేను.  ఎందుకంటే ఇంతవరకు ఆ పిల్లకి ఇప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశ్యమున్నట్టు నాకైతే  అనిపించలేదు. కానీ మీ అబ్బాయి ఉద్యోగమూ హోదా ను బట్టి ఒప్పుకోవచ్చేమో అని  చెబుతున్నా. యింకొక విషయం... ఆ పిల్లకి పెళ్లి చేసే ఉద్దేశ్యం ఉన్నట్టు తెలిసిన మరుక్షణం అబ్బాయిల్ని వెంట పెట్టుకొని రెక్కలు కట్టుకొని వాలిపోవడాని వందల మంది సిధ్దము గా ఉన్నారు. కాబట్టి  ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం"

భ్రమరాంభకి మతి పోయింది పంతులు చెప్పిన వివరాలు వింటుంటే. 

"ఏమండీ ఆలస్యం చేయకుండా చూద్దాం పదండి" అంది. 
"అదేమిటీ పెద్దోడి పెళ్లి జరిగి నాలుగు క్షణాలు అవ్వలేదు అప్పుడే చిన్నోడి పెళ్లి గురించి మొదలెట్టేసావు. ఏమొచ్చింది అంట తొందరపైగా వాడు ఇంకో నాలుగేళ్ల దాకా పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడాయే. ఏమి చెప్పి ఒప్పిస్తావేమిటి?" పైకి అలా విసుక్కున్నా ఆయనకీ కూడా పంతులు చెప్పిన వివరాలు విన్నాక ఆశ పుట్టింది అలాంటి సంబంధం చేసుకుంటే బాగుంటుందని. 
"అబ్బా ఊరుకొందురూ. చిన్నోడి సంగతి నేను చూసుకుంటానుముందు వెళదాం పదండి. జరూర్ యే ముఝే అచ్చా లగ్ రహా హై "
ఆవిడ ఆ చివర్లో అన్న మాట అర్ధం కాక పంతులు తెల్లమొహం వేసాడు.
"అబ్బే చాలా కాలం నించి ఢిల్లీలో ఉంటున్నాము కదండీ...హిందీ అలా వచ్చేస్తుంటుంది ఆవిడకి" సర్ది చెప్పాడు శేషగిరి రావు.
'ఈ హిందీ సింగినాధమేంటో' గొణుక్కున్నాడు పంతులు.  
"సర్లే... ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తాములే గానీ మంచి రోజు చూసి కబురంపుదాములే పంతులు ద్వారా" అన్నాడాయన. 
"అదేమీ వద్దు గానీ ఏమండి పంతులు గారు. ఈ సత్యనారాయణ వ్రతం అయిపోగానే మనము సూర్యం గారి యింటికి  వెళ్తున్నాము. ఈయన మాటా నా మాటా ఇంతే. యే తో పక్కా " అని తెగేసి చెప్పింది భ్రమరాంభ. 
"శుభం,,,, ఈ తంతు కాగానే అలాగే చేద్దాం లెండికానీ ఎక్కువ ఆశలు మాత్రం పెట్టుకోకండి. మీ వాడికి అదృష్టం రాసి పెట్టుంటే తప్పకుండా జరుగుతుంది. తర్వాత భగవేతేచ్ఛ"

*                        *                             *                               *
"నమస్కారం పంతులు గారు. బాగున్నారాఈయనెవరూ ఏదైనా కేసు విషయమాఅన్నారు సూర్యం. 
"అయ్యా తమకు ఎంత సేపూ ఎవరిని చూసినా కేసులు తప్ప మరొక్కటి గుర్తుకు రాదనుకోండి. కానీ నేను ఇప్పుడు వచ్చింది ఓ సంబంధం విషయం మాట్లాడటానికి."
వారిని కూర్చోబెట్టి 
"సంబంధమాఎవరికండోయ్! 
"ఎవరికో కాదండీ... తమరి గారాల పుత్రిక శుభశ్రీ కోసమే"
గతుక్కుమన్నాడు సూర్యం. అదేంటి నేనేమీ చెప్పకుండానే సంబంధం తీసుకొచ్చావేంటి అని నోటిదాకా వచ్చింది ఆయనకు. అయినా సరే ఆ విషయం పంతులుతో తర్వాత మాట్లాడదాంలే అని వచ్చిన వాళ్ళకు మర్యాద చేసి ఒకరి కుటుంబం గురించి మరొకరు ముచ్చటించుకున్నారు. ఆ సమయం లో శుభశ్రీ ఇంట్లో లేదు. కాలేజీకెళ్ళింది. చెప్పకుండా సంబంధం తెచ్చినందుకు పంతులు మీద కోపం వచ్చినా వివరాలు తెలిసాక సూర్యంకి, ఆయన భార్యకి ఈ సంబంధం బాగా నచ్చేసింది. 
"అమ్మాయి ని చూడాలంటే సాయంత్రం అయిపోతుంది. కాలేజీకి వెళ్ళింది. మీరు రెస్ట్ తీసుకోండి" అన్నాడు సూర్యం.
"అబ్బే లేదండి.... ఇంకా పెళ్ళి పనులు మిగిలే ఉన్నాయి. చూసుకోవాలి. తర్వాత ఇంకో రోజు వస్తాం" అన్నాడాయన.
"అయ్యా...మరి అబ్బాయి ఫొటో ఏమైనా ఉందా?" అడిగాడు పంతులు.
బ్యాగ్ లోంచి ఫోటో తీసి సూర్యంకి ఇచ్చాడు ఆయన.
వెంటనే ముగ్గురూ అంటే సూర్యం, రాధాకుమారి, పంతులూ ఆ ఫోటో వంక చూసారు.
ఫోటో లో  తెల్లగా అందంగా ఉన్న సుభాష్ రూపం భార్యాభర్తలకి బాగా నచ్చింది. యిద్దరి మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది.
"అయ్యా ఏదే చేత్తో అమ్మాయి ఫోటో కూడా వారికి చూపిస్తే ఆ సంతోషం వాళ్ళకి కూడా పంచినట్టవుతుంది" అన్నాడు పంతులు నవ్వుతూ.
రాధాకుమారి నవ్వుతూ లోపలికి వెళ్ళి శుభశ్రీ ఫోటో తెచ్చి వాళ్ళకి ఇచ్చింది.
వాళ్ళిద్దరూ శుభశ్రీ ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఆవిడకైతే మరీను. పైకే అనేసింది ఆ మాట
"అబ్బ...ఎంత బాగుందండి. కిత్నీ సుందర్ హై కుడియా! "
ఆయన కూడా నవ్వుతూ అవునన్నట్టుగా తలూపాడు. వాళ్ళిద్దరికీ భవిష్యత్ ఫోటో కనిపించింది సుభాష్ ప్రక్కన ఈ అమ్మాయితో.
సూర్యం ఆవిడ హిందీ విని కొంచెం తల తిప్పి చూసాడు అదెంటీ అన్నట్టు
పంతులు నవ్వుతూ "ఢిల్లీ మహిమఅన్నాడు.
యిద్దరినీ గమనించిన పంతులు "అయ్యా మిమ్మల్ని చూస్తుంటే అమ్మాయి మీకు నచ్చిందా అని ప్రత్యేకంగా అడగక్కరలేదని అర్ధమవుతోంది. యిక మీకు ముందే చెప్పినట్టు అమ్మాయి చాలా నెమ్మదైన పిల్ల....మితభాషి" అని సూర్యం వంక చూసాడు
ఆయన పంతులు వంక మెచ్చుకోలుగా చూసాడు హమ్మయ్య అమ్మాయి వాగ్ధాటి గురించి ఏమీ చెప్పలేదు కదా అన్నట్టుగా
హన్నన్నా....అలాంటివి ఎలా చెప్తాను అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ యిచ్చాడు పంతులు.
కాసేపు ఆ మాటా ఈ మాటా మాటాడుకున్నాక మంచి రొజు చూసుకొని అబ్బాయిని తీసుకొని వస్తానని వెళ్ళిపొయారు  వాళ్ళు.


     *                      *                      *         
శుభశ్రీ...పిలిచింది రాధాకుమారి అప్పుడే ఇంటికి వచ్చి మొహం కడుక్కుంటున్న శుభశ్రీని.
"అబ్బా...అమ్మా ఎప్పుడు చూడు శుభశ్రీ శుభశ్రీ అంటూ పిలుస్తావేంటమ్మా...చక్కగా ఏదైనా ముద్దు పేరు పెట్టకుండా....అదే బయట నా అభిమానులు చూడు చక్కగా ఏంజెల్....స్మాల్ ఐ స్ బ్యూటీ అని ....."
సెక్సీ అనబోయి మింగేసింది.
"మేము ఇంక పిలవడానికి ఏమీ లేదు....ఏమి పిలవాలన్నా కట్టుకోయేవాడు పిలుస్తాడులే...." అని నవ్వింది రాధాకుమారి.
"ఆ.....ఏంటి....అంటే ఒ ఐదారేళ్ళ తర్వాత వాడెవడో పిలిచేంతవరకు వెయిట్ చేయాలన్నమాట"
"ఐదారేళ్ళెందుకే..... ఈ సంవత్సరమే పిలుస్తాడులే....."
"అంటే?"
" అంటే ఏముంది? మీ నాన్నగారు నీకో మంచి సంబంధం చూసారు....
 "ఆ...ఏంటీ...." గట్టిగా అరిచింది శుభశ్రీ.
"అవునే....అనుకోకుండా ఓ మంచి సంబంధం వచ్చింది....మాకు బాగా నచ్చింది. నీకూ నచ్చుతుంది...
"నాకు నచ్చుతుందా లేదా అన్నది కాదు. అప్పుడే పెళ్ళేంటి అని?"
ఏదో చెప్పబోయింది ఆవిడ. ఆమె మాట వినకుండా తండ్రి గదిలోకి వెళ్ళింది శుభశ్రీ.
కూతురిని చూడగానే ఏమి అడగబోతుందో ఊహించాడు ఆయన.
"ఏంటి నాన్నగారూ...అమ్మ చెప్పింది నిజమేనా?"
గట్టిగా నవ్వి "అమ్మలెప్పుడూ నిజమే చెప్తారు కదమ్మా..... ఒకవేళ చెప్పకపోయినా మనం అదే నిజమని నమ్మాలి...తప్పదు మరి! యింతకీ ఏమి చెప్పింది మీ అమ్మ?"
జోక్ ని ఎంజాయ్ చేసే మూడ్ లో లేదు శుభశ్రీ.
"నాకు అప్పుడే పెళ్ళి ఏంటి నాన్నా....ఏదో రంకంగా వదిలిచేసుకుందామనుకుంటున్నారా నన్ను?"
"అరె....నిజమే…. అందులో అనుమానమేముంది... సరిగ్గా నేను అనుకుంటున్నది నీ నోట్లోంచి వచ్చింది"
"నాన్నా ప్లీజ్.... సీరియస్ గా చెప్పండి...ఎందుకింత హడావిడిగా నా పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారు? నేనింకా చదువుకోవాలి....అయినా నా వయసెంత పద్దెనిమిదేళ్ళేగా? యింకో నాలుగేళ్ళు అయ్యాక చేసుకుంటాను"
"చూడమ్మా..... యిప్పుడు నీకు సరిగ్గా పెళ్ళి వయసు వచ్చింది.... నువ్వు చెప్పినట్టు యింకో నాలుగేళ్ళు ఆగినా మంచి సంబంధం వస్తుందో లేదో చెప్పలేము...మంచిది వచ్చినప్పుడు అది యిప్పుడు అయితే ఏంటి నాలుగేళ్ళ తర్వాత అయితే ఏంటి? అయినా నీ మంచి కోరుకునేవాడిని నాకు తెలీదా? నీకు ఎప్పుడు పెళ్ళి చేయాలో? అయినా నీ కన్నా ముందు ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసాను...వారు హాయిగా కాపురం చేసుకోవడం లేదూ?"
శుభశ్రీకి అర్ధమయ్యింది తండ్రి ఓ నిర్ణయానికి వచ్చేసాడని. యింక తను వాదించినా ప్రయోజనం లేదు. విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. మనసు చివుక్కుమంది ఆయనకి. నలుగురు పిల్లల్లోకి ఎంతో గారంగా పెంచాడు. అలాంటిది కూతురికి నచ్చకుండా పెళ్ళి చేయడం కొంచెం కష్టమైన పనే. అయినా వచ్చిన సంబంధాన్ని వదులుకోవాలనిపించలేదు ఆయనకి. కూతురికే సర్ది చెప్తే సరిపోతుంది అనే ఆలోచించాడు ఎంత లాయరయినా సగటు తండ్రిలా.
ఆ రాత్రి చాలాసేపు శుభశ్రీ, రాధాకుమారి, సూర్యం ల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. వాళ్ళిద్దరూ ఎంత చెప్పినా శుభశ్రీ ఒప్పుకోలేదు సరికదా ఇంకా మొండికేసింది.
రాధాకుమారి చివరి అస్త్రం తీసింది.
"పోనీ నువ్వు అబ్బాయిని చూసి నచ్చితేనే చేసుకుందువుగానిలేవే..."
ఆ మాటకి కొంచెం మెత్తబడింది శుభశ్రీ.
"సరే. నాకు నచ్చితేనే పెళ్ళి. లేకపోతే ఓ నాలుగేళ్ళవరకు పెళ్ళి మాట ఎత్తగూడదు."
కూతురు ఆ మాత్రం మెత్తబడేసరికి ఆమెకి ఉత్సాహమొచ్చేసింది. అబ్బాయిని చూసాక ఒప్పుకుంటుందని ఆశ కలిగింది.
"సరే మరి ఫోటో చూడు" అని లోపలకెళ్ళి ఫోటో తేబోయింది.
"వద్దు. డైరెక్ట్ గానే చూస్తాను" అంది శుభశ్రీ.
"సరే నీ యిష్టం. ఏమండీ. వాళ్ళని మంచి రోజు చూసుకొని రమ్మనండి" అంది భర్తతో.
ఆయన ఏదో చెప్పబోతుండగా
"కానీ ఓ కండిషన్ కి ఒప్పుకుంటేనే" అంది శుభశ్రీ.
ఇద్దరూ కూతురి వంక ఆశ్చర్యంగా చూసారు.
"ఏంటి?"
"అవును. వాళ్ళు ఇక్కడికి రావడం కాదు. మనమే వాళ్ళింటికి వెళ్ళి చూద్దాం. అక్కడ నాకు నచ్చితే చెప్తాను. నచ్చకపోయినా చెప్తాను."
రాధాకుమారికి వళ్ళు మండిపోయింది తన మాటలకి.సూర్యంకి కూడా అలాగే ఉంది.
"ఏమిటే నీకేమన్న మతి పోయిందా ఏమిటి? మనమెళ్ళి చూడటమేమిటి? ఎక్కడైనా ఉందా? వింటున్నాము కదాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు. అయినా తప్పు మీదే. చిన్న కూతురు అని గారం చేసి ఇలా తయారు చేసారు" తప్పుని అత్యంత సహజంగా భర్త మీదకి నెట్టేసింది ఆవిడ.
సూర్యం కల్పించుకొని కూతురితో "చూడమ్మా..ఇదేమైనా బాగుందా? మీ యింటికి అబ్బాయిని చూట్టానికొస్తున్నామని ఎలా చెప్తాము? బాగోదు కదా....."
"నాన్నా ప్లీజ్. మీరు చెప్పినట్టు పెళ్ళికి ఒప్పుకుంటున్నాను నాకు ఇష్టం లేకపోయినా. కాదు ఇక్కడికే వాళ్ళని తీసుకొస్తానంటే మాత్రం ఒప్పుకోను. కాదూ కూడదూ అని అంటే మాత్రం వాళ్ళ మొహం మీదే చెప్పేస్తాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. తర్వాత మీ ఇష్టం." ధృఢంగా చెప్పింది శుభశ్రీ.
భార్యాభర్తలకిద్దరికీ తెలుసు తను మహా మొండిది. ఎంత చెప్పినా వినదు అని. కానీ వాళ్ళిద్దరికీ ఒకే ఆశ. అబ్బాయి ని చూసాక ఒప్పుకుంటుందిలే అని.
ఓ గంట తర్జన బర్జనల తర్వాత ఇద్దరూ కూతురి నిర్ణయానికి తలవంచారు. అందరూ ఢిల్లీకి వెళ్ళి
అబ్బాయిని చూడటానికే నిర్ణయించి వాళ్ళకి కబురు పెట్టారు మేమే అక్కడికి వస్తున్నామని. ఎందుకలా
అని వాళ్ళూ అడగలేదు పిల్ల బాగా నచ్చడం వల్ల. మొత్తానికి ఢిల్లీ ప్రయాణం మొదలయ్యింది.

*                *                     *         

ఢిల్లీ ఘట్టం

సూర్యం కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించారు అబ్బాయి తల్లిదండ్రులు. వారిద్దరికీ శుభశ్రీని చూడగానే కళ్ళు మెరిసాయి ఒక్కసారిగా. "కిత్నీ సుందర్ హై లడ్కీ" మురిసిపోయింది ఆవిడ. ఆయన కూడా తన కొడుకుకి మంచి జొడీ దొరకబోతున్న ఆనందం కనిపించింది. చుట్టుపక్కల వాళ్ళు శుభశ్రీని ఆశ్చర్యంగా చూసి ఉండబట్టలేక విషయం తెలుసుకొన్నారు. సినిమా హీరోయిన్ ని తలదన్నే అందమున్న అమ్మాయి ఆ యింటికి కోడలు అవుతోందన్న విషయం వారినీ ఉక్కిరిబిక్కిరి చేసింది, ఇంకా అవ్వక ముందే.

వారిని లోపల కూర్చోబెట్టి మర్యాదలు చేసి ముచ్చట్లాడారు అబ్బాయి తలిదండ్రులు. శుభశ్రీకి ఇబ్బందిగా ఉంది ఈ తతంగమంతా. ఎదో ఒకటి చెప్పి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇక్కడ్నించి వెళ్ళిపోవాలని ఆమె కోరిక. పెళ్ళికొడుకు ఏడి అన్నట్టు చూసింది లోపలికి. ముస్తాబు గానీ చేస్తున్నారా..నవ్వొచ్చింది.
"అబ్బాయి ఒక అర్జెంట్ మీటింగ్ ఉంటే వెళ్ళాడు సాయంత్రానికి వచ్చేస్తాడు. మీరు రెస్ట్ తీసుకోండి. యిల్లు చూపించవే" అన్నాడు శేషగిరి రావు తన భార్యతో.
ఆయన అందరినీ ఉద్దెశ్యించి చెప్పినా వాళ్ళందరినీ వదిలేసి శుభశ్రీని "రామ్మా...చూద్దువు గాని" అని చేయి పట్టుకొని తీసుకెళ్ళింది ఆవిడ. నవ్వుకున్నారు సూర్యం దంపతులు.

*                   *                      * 

రాత్రి 7 కావస్తోంది. యింకా సుభాష్ రాలేదు. ఈ లోపు శుభశ్రీని ముస్తాబు కార్యక్రం మొదలెట్టింది రాధాకుమారి శుభశ్రీవద్దు వద్దు అంటున్నా వినక. పచ్చటి పట్టుచీరలో మరింత పచ్చగా మెరిసిపోయింది శుభశ్రీ.
శుభశ్రీఎప్పుడూ పెట్టుకొనే బొట్టు కన్నా కాస్త పెద్ద బొట్టు పెట్టింది శుభశ్రీకి. కాటుక పెడదామని ప్రయత్నిస్తుంటే వద్దని వారించింది శుభశ్రీ తన తల్లిని. 
"నా మాట వినవే ఈ ఒక్కసారి" అంది రాధాకుమారి.
"సరే ఈ ఒక్కసారి వింటానులే, పెట్టు" అంది శుభశ్రీ.
ఎక్కడ మళ్ళీ దీని మూడ్ మారిపోతుందో అని వెంటనే కాటుక పెట్టింది.
"ఎంత బాగున్నావే...నా దిష్టే తగిలేలా ఉంది, ఉండు దిష్టి పెడతాను" అంది రాధాకుమారి.
"అబ్బా...నువ్వు మరీ చాదస్తమనుకో. ఏదో కాసేపు తతంగానికి ఏంటమ్మా" అని తల్లిని తీసుకొని బయటకొచ్చింది.
  శుభశ్రీని చూసి మురిసి మొగ్గలయ్యింది అబ్బాయి తల్లి.
"వాహ్ కిత్నీ సుందర్ హై." అప్పటికి ఆ మాట ఓ యాభైసార్లు జపం చేసుంటుంది ఆవిడ.
రాత్రి 8 కావొస్తోంది. అందరూ సుభాష్ కోసం ఎదురు చూస్తున్నారు. సరిగ్గా 8.10 కి వచ్చాడు సుభాష్.  
వచ్చీ రావడం తోనే అమాంతం అతన్ని రెండో బెడ్రూం లోకి లాక్కెళ్ళిపోయారు శుభశ్రీ వాళ్ళకు కనబడనీయకుండా. శుభశ్రీకి నవ్వొచ్చింది. ఓ పది నిమిషాల తర్వాత ముస్తాబై వచ్చాడు సుభాష్ శుభశ్రీ ఉన్న హాళ్ళోకి.

*                     *                    *
అతని కోసం ఎదురు చూస్తున్న శుభశ్రీ అతని రాకతో ఒక్కసారి అటుకేసి చూసింది. తెల్లని కుర్తా పైజామా తో తలస్నాం చేసి ఆమె ఎదురు సీట్ లో కూర్చుని శుభశ్రీ తల్లిదండ్రులని విష్ చేసాడు. 
నెమ్మదిగా అతన్ని చూసింది శుభశ్రీ. మచ్చ లేని చంద్రుడిలా.... సముద్రపు అలలలోని తెల్లటి నురగలా స్వచ్చంగా  ....పాలతో స్నానం చేసినట్టు తెల్లని రూపం తో అజానుబాహుడిలా పేరుకు తగ్గట్టు మెరిసిపోతున్నాడు సుభాష్. ఒక్కసారిగా మతిపోయింది శుభశ్రీకి అతన్ని చూసి. 'ఎంత బాగున్నాడు ' చూసిన వెంటనే కలిగిన ఫీలింగ్ ఆమెకి. యింత అందగత్తెనైన తననే మరిపించే అతని రూపం చూసి అలా చూస్తూ ఉండిపోయింది. అమ్మాయిలు అందగా ఉంటారు....అబ్బాయిలు హాండ్సం గా ఉంటారు. ఇతనేంటి అందంగా...హాండ్సం రెండూ కలిగిన రూపం తో ఉన్నాడు.... ఒక్కసారి పరిసరాలు మర్చిపోయి మరీ తమకంతో ట్రాన్స్ లో ఉన్నట్టు అతన్ని చూస్తూ ఉండిపోయింది. 
సూర్యం సంతృప్తిగా చూసాడు శుభశ్రీని. ఆయనకర్ధమైపోయింది తనకి సుభాష్ బాగా నచ్చాడని. భార్య వంక చూసాడు కించిత్ గర్వంతో. ఆమె కూడా అవునన్నట్టు తలూపింది కూతుర్ని చూస్తూ.
కాసేపు అవీ ఇవీ మట్లాడారు వాళ్ళు సుభాష్ తో.
ఓ ప్రక్క శుభశ్రీని చూస్తున్న భ్రమరాంభ  పరిస్తితి ఎలా ఉందంటే అప్పుడే వచ్చిన ఆర్టీసీ బుస్సులో సీట్ కోసం కిటికీలోంచి కర్చీఫ్ వేసే పాసింజర్ లా తయారయ్యింది. కొడుకు ఎప్పుడు యస్ అంటాడా ఎప్పుడు శుభశ్రీని తెచ్చేసుకుందామా అని తెగ ఆతృతగా ఉంది. సుభాష్ ని చూస్తోంది శుభశ్రీగురించి ఏం చెప్తాడా అని. సుభాష్ ఆవిడని పెద్ద పట్టించుకోలేదు.
శేషగిరి రావు సడెన్ గా శుభశ్రీతో "ఏమ్మా....ఎలా ఉన్నాడు మావాడు? నచ్చాడా?" అన్నాడు.
అందరూ ఉలిక్కిపడ్డారు ఆ ప్రశ్నకు భ్రమరాంభతో సహా. ఆయనంత డైరెక్ట్గా అడిగేస్తాడని అనుకోలేదు ఎవ్వరూ. పెళ్ళిచూపుల్లో అమ్మాయిని అలా అడిగేయడమేంటి అనిపించింది రాధాకుమారికి. అందరూ శుభశ్రీ వంక చూస్తున్నారు ఏమి చెపుతుందా అని. ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఆవహించింది ఆ గదిలో.
ఆ నిశ్శభ్దాన్ని చేదిస్తూ అంది శుభశ్రీ"ఈయన నాకు బాగా నచ్చారు. చాలా బాగున్నారు" అంది నవ్వుతూ.
అందరికీ ఒక్కసారిగా ఊపొచ్చేసింది ఆ మాటకి. మొహాల్లో సంతోషం జివ్వున ఫౌంటైన్ లా పొంగింది. భ్రమరాంభ ఆనందాన్నైతే ఎవరూ ఆనకట్ట వేయలేరేమొ. ఊగిపోతోంది. సూర్యం కూతురి వంక గర్వంగా చూసాడు ఆమె ధైర్యానికి. భార్య వంక చూసి 'చూసావా నా కూతురు ' అన్నట్టు నవ్వాడు. భ్రమరాంభ  అతనితో "ఒరేయ్ వెళ్ళి ఒక గులాబి పువ్వు అమ్మాయి కివ్వరా" అంది.
శుభశ్రీ అతన్నే చూస్తోంది..... అతని అంగీకారం ఏవిధంగా వెలిబుచ్చుతాడా అని.
'నాదేముంది....నువ్వింకా అందంగా ఉన్నావు' అంటాడా...లేక 'నీలాంటి అందగత్తె నన్ను వరించడానికి ఇంత దూరం రావాలా? ఒక్క సైగ చేస్తే నీ వళ్ళో వాలిపోయేవాడిని కదా' అంటాడా? అతని సమాధానం కోసం చూస్తోంది. సరిగ్గా అందరికీ షాకిస్తూ సుభాష్ అన్నాడు శుభశ్రీతో
"నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు."
*                *                    *        
ఒక్కసారిగా భూకంపం వచ్చినంత పనైంది అందరికీ. ఈ హఠాత్ పరిణామానికి అందరూ ఆశ్చర్యపోయారు. సుభాష్ అలా అంటాదని అతని తల్లిదండ్రులు అస్సలు ఊహించలేదు.
శుభశ్రీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏంటి తాను విన్నది నిజమేనా? వద్దన్నాడా తనని.....కాదు కాదు....తనని కాదు పెళ్ళి వద్దన్నాడు...అతని మాటల్ని మరోసారి రెవైండ్ చేసుకొంది. వెంటనే తేరుకొని
"ఎందుకు?" అంది.
"నాకు ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదు"
"అది ఇందాకే చెప్పారు...ఎందుకు అని?"
"యింకా చదువుకోవాలి అనుకుంటున్నా"
"చదువుకోండి....ఎవరొద్దన్నారు...పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు కదా?" అనడం అనేసింది కానీ ఆ మాటన్నాక చిన్నతనం ఫీల్ అయ్యింది శుభశ్రీ. ఏంటి అతని కారణం అతనికుండొచ్చు...కాదు అని అతన్ని ఒప్పించాల్సిన అవసరమేంటి అని..... కానీ ఆమె మనసు ఆ తిరస్కారాన్ని అంగీకరించలేకపోతోంది..... పైగా ఇష్టం లేదు అని ఈ పెళ్ళినించి తప్పించేసుకుందామని వచ్చిన తనకి ఆ తిరస్కరణ బాధిస్తోంది....
"లేదు.... పెళ్ళి తర్వాత కాదు... ముందే చదవాలని అనుకుంటున్నాను"
శుభశ్రీకి ఒక్కసారిగా చెంప మీద కొట్టినట్టైంది ఆ మాటకి. ఉన్న ఒక్క ఆశని అతను తుంపేసాడు. కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్ళు తిరిగాయి...బాధతో కాదు ఒకలాంటి ఉక్రోషం తో...
ఏంటి ఇతను? నిజంగా చదువు కోసం వద్దంటున్నాడా లేక తను నచ్చలేదా? ఒక్కసారి తనను తాను చూసుకుంది. వందలు...వేలు కాదు లక్షల మందికి ఆరధ్యరూపమైన తన రూపం ఇతనికి నచ్చకపోవడమా? ఒక్కసారి పరిగెత్తుకొని అద్దం ముందుకు వెళ్ళాలనిపించింది ఆమెకి.
యిక సూర్యం, రాధాకుమారి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది.  అన్నీ సవ్యంగా జరుగుతోందన్న సమయంలో అతను అలా అనేసరికి వాళ్ళకి ఏమిచేయాలో పాలుపోవడం లేదు. ఎన్నో కేసులు అవలీలగా వాదించిన ఆయనకు ఈ కేసుని ఎలా డీల్ చేయాలో అవగతం కాలేదు.
భ్రమరాంభ  పరిస్థితి గుక్కెడు నీళ్ళు తాగినా దిగని ముద్దలా ఉంది. 'యిదేంటి వీడు...యిలా అనేసాడేంటి? అబ్ మై క్యా కరూ' అని మనసులో కూడా హిందీలో ఘోషించింది.  
యింక ఏమీ అడగలేదు శుభశ్రీ అతడిని. నెమ్మదిగా లేచింది. ఆమెతో పాటు సూర్యం, రాధాకుమారి కూడా.
*                *                 *        
శేషగిరి రావు సూర్యం దగ్గరకి వచ్చి అన్నాడు "నన్ను క్షమించండి సూర్యం గారు. వాడు అలా అంటాడని మేము అనుకోలేదు. ఎందుకు అన్నాడో కూడా అర్ధం కావడం లేదు....." యింకా ఏదో చెప్పబోతున్న ఆయనతో
"అయ్యో భలేవారే... ఫర్లేదు..యివి కేవలం పెళ్ళిచూపులేగా....పెళ్ళిచూపుల్లో చూసినవ సంబంధాలన్నీ పెళ్ళి వరకు రావాలని లేదు కదా.... మనమెన్ని అనుకున్నా పై వాడి కటాక్షం కూడా ఉండాలిగా" అన్నడు సూర్యం విషయాన్ని పైవాడి మీదకి తోసేస్తూ.
"సరేనండి. మేము రేపు సాయంత్రం బండికి వెళ్ళిపోతాం. యిక్కడే బంధువులున్నారు వాళ్ళని కలిసి" అన్నాడు బంధువులెవరూ లేకపోయినా అక్కడ ఉండబుధ్ధి కాక.
"లేదండి...మీరు రేపు సాయంత్రం వరకు యిక్కడే ఉండండి. దయచేసి నా మాట కాదనకండి. ఈ పెళ్ళిచూపులు పట్టించుకోకండి. ఒక స్నేహితుడి యింటికి వచ్చాననుకోండి.కాదనకండి" ప్రాధేయపడ్డాడు ఆయన.
భార్య వంక చూసాడు సూర్యం. సరే అన్నట్టుగా చూసింది ఆవిడ.
ఆ విధంగా మరుసటిరోజు వరకు అక్కడే ఉండేటట్టు ఏర్పాటు జరిగిపోయింది వాళ్ళకి.

*              *                     *          
అత్యంత కీలకఘట్టం
ఢిల్లీ నగరం అప్పుడే మేలుకుంటోంది. సమయం 5.30 కావస్తోంది. మామూలుగా ఎప్పుడూ రణగొణ ధ్వనులతో కిక్కిరిసిపోయే జనాలతో ఎప్పుడూ భీబత్సంగా ఉండే ఆ మహా నగరం కూడా ఎంతో అందంగా కనిపించే సమయమది. రోడ్డు మీద జనసంచారం లేకుండా నిశ్శబ్దంగా పక్షుల కిలకిలరవాన్ని కూడా స్పష్టంగా విని ఆనందించగలిగే ప్రాథకాల సమయం. ఎక్కడ్నించో దూరంగా కిషోర్ కుమార్ పాట లీలగా వస్తోంది.
అప్పుడే నిద్ర లేచాడు సుభాష్ బద్దకంగా. డిఫెన్స్ లో పనిచేయడం వలన పొద్దున్నే లేచి జాగింగ్ కి వెళ్ళడం అలవాటయిపోయింది. నెమ్మదిగా బాల్కనీలోకి వచ్చి చల్లగాలిని ఆస్వాదిద్దామని వచ్చాడు. ఎండాకాలమవ్వడంతో సూర్యుడు కూడా ముందే మేలుకొని నెమ్మదిగా తన పని మొదలుపెట్టాడు వెచ్చని తన భానుకిరణాలని భూమి మీదకి వదలడం ద్వారా. బాల్కనీ వద్ద నిలబడ్డ సుభాష్ కి ఏదో అలికిడి వినిపించింది. వెనక్కి తిరిగి చూసాడు ఏంటా అని. లోపల బాత్రూం నుంచి తల తుడుచుకుంటూ బాల్కనీ లోకి వస్తోంది శుభశ్రీ. అది చూసి కంగారు పడ్డాడు సుభాష్. వెంటనే ఓ ప్రక్కకి వెళ్ళి తలుపు చాటుకి నక్కాడు. 
శుభశ్రీ సరాసరి బాల్కనీ లోకి వచ్చేసింది. బాల్కనీ చివరకు వెళ్ళి నెమ్మదిగా తల తుడుచుకుంటోంది. తల ఇంకా పూర్తిగా ఆరలేదు. ఆమె కురుల లోంచి జాలువారే నీరు ఆమెని వీడడం ఇష్టం లేనట్టు నెమ్మదిగా చినుకుల్లా జాలువారుతున్నాయి. తెల్లటి చీరలో ఓ పాలరాతి శిల్పం లా మెరిసిపోతోంది ఆమె.
సుభాష్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు.....రాత్రి ఈమెనేనా చూసింది. ఆహా ఏమి అందము.....
ఆ తల తుడుచుకునే భంగిమ చూస్తే అజంతా...యెల్లోరా శిల్పాలు కూడా ఎందుకూ పనికి రావనిపించింది.....నిజానికి వాటికే గనక ప్రాణమొస్తే వాటిని చెక్కిన శిల్పుల దగ్గరకెళ్ళి గొడవ చేస్తాయేమో- మమ్మల్ని శుభశ్రీ అంత అందంగా ఎందుకు చెక్కలేదని.
నెమ్మదిగా ఏదో పాటని హం చేస్తూ సూర్యోదయాన్ని ఆకలింపు చేసుకుంటోంది శుభశ్రీ.
సుభాష్ ఇంకా అయోమయమైన స్థితిలోనే ఉన్నాడు.
"ఏమిటీ అమ్మాయి.....ఎక్కడనించి వచ్చింది....యింత అధ్బుతం దాగుందా ఈమెలో....
ఎవరు ఈమె?
సూచిపార జలపాతపు జలధారలో తడిసి పరవసిస్తున్న రాజహంసలా..
యాచుంగ్ మంచుకొండల్లో సేద తీరడానికొచ్చిన దేవకన్యలా..
కవులకందని కావ్యంలా....
రుషులకందని మోక్షంలా.....
రమించినా దక్కని రసానుభూతిలా...
తపస్సు చేయకుండానే ప్రత్యక్షమైన అప్సరసలా....
ఈ అందాన్నా నేను కాదన్నది....ఈ వయ్యారాన్నా నేను వద్దన్నది....ఈ సొగసునా నేను తృణించినది.....
కోట్లాది అమృత చుక్కలు కలయికే ఈమె జన్మకు మూలమా ....

మనసుని మత్తులో.. గమ్మత్తులో ముంచెత్తే ముఖారవిందం.....
సమ్మోహనపరిచే ఓ అధ్బుత శృంగార కావ్యం.....
ఒహ్....వీక్షించే కనులకు అదృష్టం......పరవశం.....

ఒక అలోకిక అనిస్చిత స్థితిలో ఉన్నాడు సుభాష్.
"ఒరేయ్ సుబ్బూ ....లేచావా? కాఫీ ఇమ్మంటావా?" తల్లి అరుపు వినిపించి ఈ లోకం లోకి వచ్చాడు సుభాష్.
ఒక్కసారి తనెక్కడున్నాడో గుర్తొచ్చి వెంటనే నెమ్మదిగా లోపల తన రూం లోకి పరిగెట్టాడు.

         **             *                  *****

 వంటగదిలో కాఫీ పెట్టడానికి వెళ్ళింది భ్రమరాంభ . అప్పటికే స్టౌ వెలిగించి కాఫీ పెడుతోంది శుభశ్రీ. తనకోసం కాఫీ పెట్టుకుంటుందేమో అనుకొని అదే అడిగింది తనని
"ఏమ్మా పొద్దున్నే కాఫీ తాగే అలవాటు నీకూ ఉందా? మా సుబ్బూ కి కూడా అంతే...."
"నాకు కాఫీ అలవాటు లేదండి. మీరు ఇందాక తన కోసం కాఫీ అన్నారని విని పెట్టాను"
ఆ మాటకి మురిసి మొగ్గయ్యింది ఆవిడ. యిలాంటి పిల్లనా వీడు వద్దంటోంది. పీకలదాక కోపం వచ్చింది కొడుకు మీద. అయినా చేసేదేముంది వద్దన్నాక.
అయ్యో నీకెందుకమ్మా ఈ పనులు? ఉండమ్మా నేను పెడతాను
" ఫర్లేదండి...యిదిగో కాఫీ రెడీ"
"యిలా ఇవ్వమ్మా. తీసుకెళతాను"
"అయ్యో ఫర్లేదు. నేను ఇస్తాను లెండి" అని కాఫీ తీ సుకొని సుభాష్ రూం వైపు వెళ్ళింది శుభశ్రీ.
అప్పటికే తన గదిలోంచి ఈ తతంగాన్ని గమనిస్తున్న సుభాష్ కి చెమటలు పట్టేసాయి. ఈ అమ్మాయి సరాసరి తన గదికే వచ్చేస్తోందేంటి?
శుభశ్రీ వచ్చేసింది. అతనికి యిందాకటి ఎఫెక్ట్ వల్ల అనుకుంటా తనని ఎదురుగా చూసే ధైర్యం సరిపోలేదు. ఠక్కున ఓ ఆలోచన వచ్చింది. వెంటనే మంచం మీదకి ఉరికి పడుకున్నట్టుగా నటించడం మొదలెట్టాడు.
*               *                 *      
దగ్గరకు వేసున్న తలుపుని నెమ్మదిగా తోసి లోపలికి వెళ్ళింది శుభశ్రీ. లోపల బెడ్ మీద పడుకొని ఉన్నాడు సుభాష్. అతన్ని చూసి దగ్గరకు వెళ్ళింది శుభశ్రీ. ఏమ్ని పిలవాలి అతన్ని. సుభాష్ అందామా... ఊహూ....మరి ఏమండీ అందామా ... చీ ఏదో మొగుడిని పిలిచినట్టు పిలవడమేంటి? తనకే నచ్చలేదు..... పోనీ వాళ్ళమ్మ పిలిచినట్టు సుబ్బూ అందామా...మరీ చనువు తీసుకున్నట్టుంటుందేమో.... ఓ రెండు సెకన్లు ఆలోచించి...
"ఓయ్.." అంది.
అతను లేవలేదు.
"ఓయ్ కాఫీ తెచ్చాను"
అతనిలో కదలిక లేదు. ఏంటి పొద్దున్నే లేస్తాడని చెప్పింది ఆవిడ ఇంకా లేవడేంటి? పోనీ కాఫీ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదామా? అదే బెటరేమో అనుకొని
"ఓయ్ కాఫీ ఈ టేబుల్ మీద పెడుతున్నా...లేచి తాగు" అని అక్కడ పెట్టబోతుండగా గా ఒకసారి అతని మొహం లోకి చూసి ఆశ్చరానికి లోనయ్యింది.
అతని జుట్టులోంచి చెమట బిందువు నుదురు మీదుగా కారుతోంది.
ఏమిటీ ఇంత పొద్దున్నే చెమట ఎలా పడుతోంది? రూం చల్లగా ఉంది, పైగా ఫ్యాన్ ఉండగా ఎలా పట్టింది? అనుకుంటుండగా ఓ అనుమానం వచ్చింది 'కొంపతీసి మెలకువగానే ఉన్నాడా? అంటే నేనొస్తున్నానని ముందే తెలుసా? అమ్మ దొంగా...ఎంత నటిస్తున్నావు?'
"ఓయ్....లే...నటించింది చాలు...కాఫీ తాగు..."
నిద్ర నటిస్తున్న సుభాష్ ఉలిక్కిపడ్డాడు. ఏంటి ఎలా తెలిసిపోయింది ఈ అమ్మాయికి? అప్పటికీ జాగ్రత్తగానే మేనేజ్ చేసానే....
అయినా నెమ్మదిగా అప్పుడే నిద్ర లేచినట్టు లేచాడు సుభాష్. నోరు ఆవులించుకొని ఒక్కసారి ఆమె వంక చూసి ఆవులించిన నోరు మూయడం మర్చిపోయి అలానే ఉంచేసాడు సుభాష్.

       * * * ****

తెల్ల చీరలో ఒక చేత్తో కాఫీ గ్లాసు పట్టుకొని తన ఎదురుగా ఉన్న శుభశ్రీఎలా ఉందంటే శోభనం గదిలో పాల గ్లాసుతో వచ్చిన పెళ్ళికూతురిలా ఉంది.  సుభాష్ ఆమెని అలా చూస్తూ నోరావలించి ఉండిపోయాడు.కళ్ళు మూయడం కూడా మర్చిపోయాడు. కాలం స్థంభించిపోయింది అనే మాట ఎక్కడో చదివింది గుర్తొచ్చి నిజంగా ఇదేనేమో అనిపించింది. ఒకసారి పైనుంచి చూడసాగాడు. చిన్నిబొట్టు...వత్తైన కనురెప్పలు...చిన్ని కళ్ళు.... సన్నటి ముక్కు...దానిమీద కనబడీ కనబడనట్టు ఉండే ఓ ముక్కుపుడక... సన్నటి పెదవులు...ఏముంది ఈ అమ్మాయిలో? ఒకందమైన అమ్మాయికుండే పెద్దకళ్ళు ఈ అమ్మాయికి లేవు....అయినా ఇంత అందంగా ఎలా ఉన్నాది? ఆ చూపు నెమ్మదిగా కిందకి దిగింది... శుభశ్రీ అది గమనించి పైట సర్దుకుంది. వెంటనే ఈ లోకంలోకి వచ్చాడు సుభాష్.
"ఏ.. ఏ... ఏంటి?" అన్నాడు.
"కా...కా...కాఫీ..." అని గట్టిగా నవ్వింది శుభశ్రీ.
ఆ వెటకారాన్ని పట్టించుకునే స్థితిలో లేడు. యింకా తను శోభనపు పెళ్ళికూతురు అనే భ్రమ లోనే ఉన్నాడు.
"నువ్వు తాగి నాకివ్వు" అని గొణిగినట్టుగా అన్నాడు.
అతనేమన్నాడో అర్ధం కాక
"ఏంటి?" అంది
అతను ఏమీ మాట్లాడలేదు. యింకా తననే చూస్తున్నాడు ట్రాన్స్ లో ఉన్నట్టు.
"ఓయ్ నిన్నే....కాఫీ తాగుతావా తాగవా?"కొంచెం గట్టిగా అంది.
ఉలిక్కిపడి ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పుని చూసాడు.
"ఓ...కాఫీయా....నువ్వెందుకు తెచ్చావు? అమ్మ లేదా?" అంటూనే కనబడీ కనబడనట్టుగా ఉన్న తన నడుముని చూసి గుటకలు మింగాడు. అది గమనించిన శుభశ్రీ
"ఓయ్... కాఫీ ఇక్కడుంది...ఇదిగో ఇక్కడ..."అంది
సర్దుకున్న అతను ఆమె చేతిలోని కాఫీ ని అందుకోవడానికి చేయి చాపాడు.
అతని చేతికి కాఫీ కప్పు ఇస్తున్నప్పుడు ఆమె చేతి వేళ్ళు సుతారంగా తగిలాయి అతని వేళ్ళకి.
జివ్వున షాక్ కొట్టినట్టయ్యింది అతనికి కాఫీ కప్పు కింద పడిపోద్దేమో అనిపించింది అతనికి. తమాయించుకొని తల దించేసాడు యింకా తనని చూస్తే ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయో అన్నట్టుగా.
అతని చేతికి కాఫీ కప్ ఇచ్చి వెనుతిరిగించి శుభశ్రీ.
"ఓయ్...నీ కళ్ళు ఒక సారి అద్దం లో చూసుకో" అంది
కాఫీ తాగబోతున్న ఆమె మాట విని ఏంటి అన్నట్టు చూసాడు
ఆమె సమాధానం చెప్పకుండా ఒక చిరునవ్వు విసిరి వెళ్ళిపోయింది.
తను వెళ్ళిన వైపు అలా చూస్తూ ఉండిపోయి వెళ్ళాక తను చెప్పింది గుర్తొచ్చి అద్దం దగ్గరికి వెళ్ళి కళ్ళు చూసుకున్నాడు ఎందుకలా చెప్పిందబ్బా అనుకుంటూ.
అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతనికి అర్ధం కాలేదు. ఎందుకలా ఉన్నాయో.
బహుశా ఆమె అందాన్ని చూసిన ఆనందంతోనా...లేక రతీదేవిని మరపించే సొగసుని చూసా...లేక ఒక చిత్రకారుడు అందంగా తన కుంచె మీద చిత్రించిన అధ్బుత చిత్రం లాంటి ఆమె ముఖారవిందాన్ని చూసా?..లేక పచ్చటి ఆమె నడుము చూసా?....అవును పచ్చటి నడుము అని చదివినప్పుడల్లా నడుము పచ్చటిదంటారేంటి అనుకునేవాడిని...
ఇప్పుడర్ధమయ్యింది.....పచ్చటి నడుముని చూసి తన కళ్ళు ఎర్రబడ్డాయి.....
నవ్వొచ్చింది అతనికి. ఏంటి ఈ అమ్మాయి? ఒక్కరోజులో యింత కుదిపేస్తోంది తనని.
ఏముంది ఈ అమ్మాయిలో? తనని వరించడానికి దివి నుంచి భువి కి దిగివచ్చిన అప్సరసా ?
లేక స్వయంవరం లో తనని వరించడానికి వచ్చిన రాజకుమారియా?
"ఓయ్" అన్న పిలుపుని చూసి అటు చూసాడు. కిటికీలోంచి అల్లరిగా నవ్వుతున శుభశ్రీ.
"ఆడపిల్లల్ని అలా దొంగ చూపులు చూస్తే ఏమవుతుందో తెలుసా?"
"ఏ...ఏమవుతుంది?"
"భవిష్యత్తులో బట్టతల వస్తుంది" అని నాలికని చుట్టి వెక్కిరిస్తున్నట్టుగా చూపించి పారిపోయింది.
ఉలిక్కిపడ్డాడు అతను. ఏంటి తను చెప్పింది నిజమేనా? అలా చూస్తే బట్టతల వస్తుందా? ఒకసారి అద్దంలోకి చూసుకున్నాడు. వత్తుగా అందంగా ఉన్న తన జుత్తుని చూసి సర్ధిచెప్పుకున్నాడు...అలా ఏమీ జరగదని.
*             *                   *             
సూర్యంని శెషగిరిరావు ఊరు చూపిద్దామన్నట్టుగా బయటకి తీసుకెళ్ళాడు. రాధాకుమారి, భ్రమరాంభ ఇద్దరూ వరండాలో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. హాలులో సుభాష్ టీవీ చూస్తున్నాడు న్యూస్ చానెల్ పెట్టుకొని.
"ఓయ్ ఆ రిమోట్ యిలా ఇవ్వు" అన్న పిలుపుని విని వెనక్కి తిరిగి చూసాడు. వెనక శుభశ్రీ నిలబడి అతని చేతిలో ఉన్న రిమోట్ కోసం చూస్తూ.
అతనికి నవ్వొచ్చింది. ఏంటి నిన్న పెళ్ళిచూపులకొచ్చిన అమ్మాయి ఏమాత్రం భయపడకుండా తనని అలా అంటుంది?
ఓయ్...ఆ పిలుపు భలే గమ్మత్తుగా అనిపించింది.
"ఏంటి?" ఏమీ తెలీనట్టు అన్నాడు.
"రిమోట్ అడిగాను."
"ఎందుకివ్వాలి? నేను చూస్తున్నానుగా?"
"ఓహొ..అయ్యగారు యివి కూడా చూస్తారన్నమాట. బాగుందయ్యా సుబ్బారావు... అమ్మాయిల్ని దొంగ చూపులు చూడటమొకటే అనుకున్నా....ఇది కూడా ఉందన్నమాట...భేష్" అని గట్టిగా నవ్వింది శుభశ్రీ.
తను నవ్వినప్పుడు గమనించాడు అసలే చిన్నికళ్ళు నవ్వుతుంటే మరింత చిన్నవైపొయాయి.... పాలవరస లాంటి పళ్ళు ఒక్కసారిగా మెరిసాయి.
అయినా వెంటనే దాన్నించి బయటపడి
"ఏయ్...ఏంటి సుబ్బారావు సుందర్రావు అంటున్నావు? నా పేరు సుభాష్...తెలుసా?"
నవ్వాపిన శుభశ్రీ
"సర్లేవోయ్... సుబ్బారావు అయితే నాకేంటి సుందర్రావయితే నాకేంటి? ముందు అ రిమోట్ ఇలా ఇవ్వమ్మా?'
"అదిగో మళ్ళీ అమ్మా ఏంటి?" కోప్పడ్డాననుకున్నాడు గానీ తనని చూస్తే కోపం రావడం లేదు. ఆ మాటలకి ఇంకా నచ్చేస్తోంది. అలా పిలిపించుకోవాలని యింకా అనిపిస్తోంది. అందుకే బెట్టుగా
"నేను న్యూస్ చూస్తున్నా. కావాలంటే అది అయ్యాక ఇస్తా. వెయిట్"
"ఇస్తావా..ఇవ్వవా?"
"ఇవ్వను"
"ఒహో అలా ఉందా నీ పని. సరే ఉండు....అత్తయ్యగారూ...యిక్కడ రిమోట్ కనిపించడం లేదు, ఎక్కడుందో చెపుతారా?" అని అతన్ని చూసి కన్ను కొట్టింది.
అమ్మో...ఎంత తెలివి అనుకొన్నాడు సుభాష్. బయటనుంచి భ్రమరాంభ
"ఒరేయ్ సుభాష్....పాపకి రిమోట్ అంట చూసివ్వరా" అని అరిచింది.
"రాక్షసి...అని గొణుక్కొని రిమోట్ తన చేతికిచ్చాడు సుభాష్.
"హ హ హా" అని నాటకీయంగా నవ్వి రిమోట్ తీసుకొని
"పక్కకి జరుగమ్మా...శుభశ్రీకూర్చోవాలి" అంది
"ఎవరు?"
"ఇంకెవరమ్మా...ద గ్రేట్ శుభశ్రీ...జరుగు" అంది.
తన మాటలకి నవ్వొస్తున్నా కంట్రోల్ చెసుకొని పక్కకి జరిగి తనకి చోటిచ్చాడు. రిమోట్ తీసుకున్న శుభశ్రీఏవో చానెల్స్ నొక్కి చూడసాగింది. అన్నీ హిందీ చానల్సే ఉండేసరికి
"ఓయ్...ఏంటి ఇక్కడ హిందీ తప్ప ఇంకేమీ రావా? తెలుగు చానెల్స్ ఉండవా?"
"ఢిల్లీలో తెలుగు ఎందుకుంటాయి?"
"ఓహొ అప్పిడియా?" అని హిందీ పాటలు వస్తున్న ఓ చానెల్ పెట్టి చూడసాగింది. సుభాష్ కి ఆమె పక్కనే కూర్చున్న విషయం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎదురుగా టీవీ చూస్తున్నా ఆమెని చూడాలని మనసు ఒకటే గోల చేస్తోంది. ఎంత కంట్లోల్ చేసుకున్నా అవడం లేదు. నెమ్మదిగా తనని క్రీగంట చూసాడు సుభాష్. హిందీ పాటలు చూస్తూ హం చేస్తోంది నెమ్మదిగా.... అలా ఆమెని చూస్తుంటే భలే ముచ్చటేసింది సుభాష్ కి. దొంగచాటుగా అయినా అలా చూస్తూ ఉండిపోయాడు తెలీకుండానే.
"ఓయ్"
ఉలిక్కిపడ్డాడు ఆ పిలుపుకి.
"నీకు బట్టతల తప్పదు....పాపం జుత్తు లేకుండా ఎలా ఉంటావో" పగలబడి నవ్వుతోంది.
అతనికి కోపం రావడం లేదు. ఆ నవ్వు చూస్తూ పరవశం చెందుతున్నాడు....ఓ అలౌకిక స్థితిలోకి జారుకుంటున్నాడు......ఓ మత్తు ఆవహిస్తోంది ఆ నవ్వు చూసి గమ్మత్తుగా...
సుభాష్ కి అర్ధమయ్యింది ఈ అమ్మాయి లేనిదే జీవితం లేదు. తనే లేడు. తను ఓ వందేళ్ళు తపస్సు చేసినా దక్కని అదృష్టం తనని వెతుక్కుంటూ వచ్చింది. తనెంత మూర్ఖంగా వద్దన్నాడు! తన మీద తనకే కోపం వచ్చింది. చెప్పేయాలి....ఈ అమ్మాయిని తప్ప ఇంకెవరూ వద్దని చెప్పేయాలి. ఓ నిశ్చితమైన అభిప్రాయానికొచ్చాడు సుభాష్.
*                *                  *
సూర్యం దంపతులు శుభశ్రీతొ సహా బయల్దేరడానికి రెడీ అవుతున్నారు. ఒక్కరోజులోనే శేషగిరిరావు దంపతులకి బాగా దగ్గరయ్యారు వాళ్ళు. పెళ్ళిచూపులకొచ్చామన్న విషయమే మర్చిపోయారు అందరూ. భ్రమరాంభ అయితే శుభశ్రీని అస్సలు వదలడం లేదు. ఎంతో అపురూపంగా చూస్తోంది తనని ఓ చంటిపాపలా. ఓ ప్రక్కన తన ఇంటికి కోడలుగా రావడం లేదు అనే బాధ తొలిపేస్తున్నా తనకి దగ్గరుండి సర్దిపెడుతోంది. వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది. అందరి హృదయాలు భారమెక్కాయి.
"యిక బయలుదేరతాం బావగారు" సంబంధం కుదరకపోయినా ఆ పిలుపు అలవాటయ్యింది ఆయనకూ, శేషగిరిరావుకీ...ఎంతో బాగుంది అలా పిలుచుకుంటుంటే వారికి.
"అత్తయ్యా...వెళ్ళొస్తాం మరి" అంది శుభశ్రీభ్రమరాంభతో.
ఒక్కసారిగా కన్నీళ్ళు ఆగలేదు భ్రమరాంభకి. ఒక్కసారి తనని గట్టిగా పట్టుకొని హత్తుకొని తన బుగ్గ మీద ముద్దు పెట్టింది అపురూపంగా. సూర్యం, శేషగిరిరావు అది చూసి ముచ్చటేసి నవ్వారు.
"యింతకీ సుభాష్ గాడేది" అంది భ్రమరాంభ.
"తన గదిలో ఉన్నట్టున్నాడు చూడు" అన్నాడు శేషగిరి రావు
"ఉండండి మావయ్యగారూ. నేను చూస్తాను." అని అతనున్న గదివైపు వెళ్ళింది శుభశ్రీ.
*           *                  *     

తలుపు దగ్గరికేసుంది. నెమ్మదిగా తలుపు తీసింది శుభశ్రీ. లోపల అటువైపు తిరిగి నుంచొని ఉన్నాడు సుభాష్.
అతన్ని చూసి నెమ్మదిగా లోపలికి వెళ్ళింది శుభశ్రీ.
"ఓయ్"
......
"ఓయ్..నిన్నే....మేము బయలుదేరుతున్నాము"
.......
అతన్నించి సమాధానం రాలేదు. అటువైపే నుంచొని ఉన్నాడు.
"హెల్లో...మాస్టారూ...వినబడుతుందా...మేము బయలుదేరుతున్నాము"
నెమ్మదిగా శుభశ్రీ ఉన్నవైపు తిరిగాడు సుభాష్.
అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అది చూసి శుభశ్రీవెంటనే అతని దగ్గరకొచ్చి కొద్దిగా ఆందోళనగా
"హెయ్...ఎమయ్యింది...కళ్ళేంటి అలా ఉన్నాయి? ఏమయ్యింది? వంట్లో బాలేదా?"
సుభాష్ ఏమీ మాట్లాడలేదు.
శుభశ్రీ అతని దగ్గరకొచ్చి అతని నుదురు మీద చెయ్యి పెట్టి చూసింది.
"ఏంటి.. చల్లగానే ఉందిగా...మరి ఆ కళ్ళేంటి అలా ఉన్నాయి?...హే...మళ్ళీ దొంగ చూపులు చూసావు కదా?...నిజమేనా?" అల్లరిగా అతని జుత్తుని ఒకసారి విదిలించి నవ్వుతూ.
సుభాష్ ఏమీ మాట్లాడలేదు.
"సరే...మేము బయ్లేరుతున్నాము మరి. బై" అని వెనుతిరిగింది.
"శుభశ్రీ" సుభాష్ పిలిచాడు ఆమెని.
వెనక్కి తిరిగి అతన్ని చూసింది ఏమిటి అన్నట్టుగా.
"నీ...నీ....నీతో మాట్లాడాలి కొంచెం"
"ఏ...ఏ...ఏంటి" అంది పగలబడి నవ్వుతూ..
" నన్ను పెళ్ళి చేసుకుంటావా?"
ఆశ్చర్యంగా చూసింది అతన్ని. వెంటనే నవ్వుతూ
"అదేంటి చదువుకోవాలన్నావు....అప్పుడే పెళ్ళి వద్దన్నావు....ఇదేంటమ్మా సడెన్ గా? ఏమయ్యింది?"
"ఏమో తెలీదు శుభశ్రీ.
నాకు తెలీదు. నీకు ఎలా చెప్పాలో తెలీదు.
ఏమి చెప్పాలో తెలీదు.
అసలు ఒకమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు.
కానీ నా కళ్ళని అడుగు నిన్ను చూసిన ప్రతీసారి ఎలా ఎర్రబడుతుందో....
నా హృదయాన్ని అడుగు..నువ్వు నా దగ్గరున్నంత సేపు ఎంత స్పీడ్ గా కొట్టుకుంటుందో....
నా మనసుని అడుగు నువ్వు నవ్విన ప్రతీసారి ఎంత అలజడికి గురవుతుందో...
నా దేహాన్ని అడుగు...నువ్వు దగ్గరుంటే ఎంత పులకరిస్తుందో......
నా చేతులనడుగు నీ నులువెచ్చని స్పర్శ కోసం ఎంత తపిస్తుందో....
నా పెదవులనడుగు నీ చుబుకాన్ని ముద్దివ్వాలని ఎంత కోరుకుంటుందో....
నా జీవితాన్ని అడుగు...నువ్వు లేనిదే సార్ధకం లేదని చెపుతుందో....
ఓ ప్రియతమా .....నన్ను వదలి వెళ్ళకు....
ఓ నెచ్చెలీ...నను వీడి వేదన మిగల్చకు....

అలా చూస్తూ ఉండిపోయింది శుభశ్రీఅతని వైపు అచేతంగా....ఒక అలౌకికమైన స్థితిలో.
సుభాష్ దేవుడి పటం దగ్గరున్న రోజా పువ్వుని తీసి ఆమె ఎదురుగా నుంచొని అడిగాడు
"ప్లీజ్ నన్ను పెళ్ళి చేసుకో"
శుభశ్రీ కంట్లోంచి ఒక్కసారిగా నీళ్ళొచ్చాయి. వెంటనే అమాంతం అతన్ని కౌగిలించుకొని అతని బుగ్గ మీద గాఢంగా తన పెదవులతో ముద్రించింది...
"ఓయ్...నువ్వెప్పుడో వచ్చేసావు నా మదిలోకి...కొత్తగా వచ్చింది నీకే"
"ఆ ఏంటి?"అన్నాడు సుభాష్ అర్ధం కాక.
"ఓహో తమరిది హిందీ భాష కదా? సరే అయితే విను
"తుం కబ్ తో ఆగయీరే మేరీ దిల్ మే"
నాటకీయంగా అని బుగ్గ మీద కొరికింది గట్టిగా.
"ఆ" అన్నాడు సుభాష్ నొప్పిగా
పగలబడి నవ్వింది శుభశ్రీ అది చూసి......స్వచ్చమైన వెన్నెల లా...కల్లాకపటం లేని పసిపాపలా...అప్పుడే విచ్చుకున్న ముద్దబంతిలా....
     
 




     
  




8 comments:

  1. అబ్బో.... వెరైటీ గా ఉన్నాయి గా పెళ్లిచూపులు... చాలా బావుంది శుభశ్రీ కారెక్టర్

    ReplyDelete
  2. nenu metho angeekaristhuna kiran dasari garu okka matalo cheppalante adbutham anthakante yekkuva yem cheppagalamu.
    english english english tho nindi poi unna maku oka manchi telugu vinodathmaka katha.

    Recent ga nenu oka youtube channel lo chusa andulo kotha manaki teliyani devotinal news kotha kotha vishayalu peduthunarandi veelithe meeru kuda velli chudandi.

    idigo link:https://www.youtube.com/c/NewsCabin

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు తులసి గారు

      Delete
  3. సినీరచయితగా మీకు మంచి భవిష్యత్తు ఉండచ్చు వరప్రసాదు గారు 🙂. ప్రయత్నించి చూడండి 👍

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నరసింహారావు గారూ....మీ కామెంట్ సంతోషం కలిగించింది..... ఎప్పటిలానే.....

      Delete
  4. Very good Narration.. Chaala baagundi 😊

    ReplyDelete