Friday, 8 September 2017

కొత్త సీసాలో పాత సారా

కోదండ రామిరెడ్డి
ముత్యాల సుబ్బయ్య
రేలంగి నరసిం హారావు
కోడి రామకృష్ణ
మోహన్ గాంధీ
పీ.ఎస్. రామచంద్రా రావు
వీళ్ళంతా గుర్తున్నారా? ఒకప్పుడు తెలుగు సినిమాను ఏలినవాళ్ళు. తమ దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమా గతిని మరో వైపు తిప్పిన వాళ్ళు అంటే అతిశయోక్తి కాదేమో?!. మరి వీళ్ళందరూ యిప్పుడెక్కడ? ఏమి చేస్తున్నారు? ఎందుకు వీళ్ళెవరూ ప్రస్తుతము సినిమాలకి దర్శకత్వం వహించడం లేదు? జవాబు అవకాశాలు లేకనే. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా యిది నిజం.
కోదండ రామిరెడ్డిని తీసుకోండి. ఈ రోజు తెలుగులో స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళంతా ఆయన సినిమాల వల్ల పేరు తెచ్చుకున్న వాళ్ళే. అప్పట్లో ప్రతీ హీరో, హీరోయిన్నూ ఆయన సినిమాలో నటించడానికి ఎంత తహతహలాడిపోయేవాళ్ళో!సంవత్సరానికి 4 సినిమాలు తీస్తే నాలుగూ హిట్టే. అలాంటి దర్శకుడికి అవకాశాలు లేకపోవడం శోచనీయం. అవకాశమిచ్చాక ఫెయిల్ అయితే వేరే సంగతి. అసలు అవకాశమే ఇవ్వకపోతే ఎలా? పోనీ ఇప్పుడున్న కొత్త దర్శకులు ఏమైనా విరగదీస్తున్నారా అంటే అదీ లేదు ( కొంత మంది విభిన్న చిత్రాలు తీస్తున్నారు. మిగిలిన వారు అందరూ మూస కొట్టుడే) కనీసం ఈ పాత దర్శకుల సేవల్ని ఏదో విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుందేమో. కధా చర్చలు, మాటలు, స్క్రీన్ ప్లే లాంటి విషయాల్లో వీరిని ఉపయోగించుకుంటే కాస్త క్వాలిటీ సినిమాలు చూసే భాగ్యం దక్కుతుందేమో. 

Saturday, 2 September 2017

ఒక స్వప్నమేదో

ఒక స్వప్నమేదో అనిపిస్తోంది
నువు నా చెంతనే ఉన్నావని

ఒక స్వప్నమేదో కనిపిస్తోంది
నువు నన్ను ముద్దాడావని

ఒక స్వప్నమేదో తొలిచేస్తోంది
నువు నా ఊపిరి అని

ఒక స్వప్నమేదో కలవరపెడుతోంది
నువు నాతోనే ఉన్నావని

ఒక స్వప్నమేదో ప్రశ్నిస్తోంది
నువు నను తాకే క్షణమెపుడని