Sunday 30 April 2017

జ్ఞానము నందు సినీజ్ఞానము వేరయా!

 ఒక విషయం మాత్రం నాకు భలే ఫన్నీ  అనిపిస్తుంది. మీకు తెలిసినవారిని ఎవరినైనా ఫలానా సినిమా గురించో లేక ఫలానా నటుడి గురించో అడిగితే వెంటనే అతను మీకు చెప్పే జవాబు "అబ్బే ... నాకు  పెద్దగా సినిమా నాలెడ్జ్ లేదండి. నేను సినిమాలు  చూడను. సినిమాలు చూసి దగ్గర దగ్గర రెండేళ్లవుతోంది" అనడమే కాకుండా మనల్ని పిచ్చి వెధవని చూసినట్టుగా చూసి "ఏంటి సినిమాల గురించి అడుగుతున్నారు....మీరు సినిమాలు బాగా చూస్తారా ఏంటి?" అనడుగుతారు. 
దాంతో సినిమాలు చూస్తానని చెప్తే ఎక్కడ సినిమా పిచ్చోడనుకుంటారో అని "అబ్బే అదేం లేదండి.... నేను కూడా పెద్దగా సినిమాలు చూడను..... ఏదో క్యాజువల్ గా అడిగానంతే" అని ఓ వెర్రి మొహమేసుకొని చెప్తాం.  దాదాపుగా సినిమా టాపిక్ వచ్చినప్పుడల్లా ఇదే తంతు. 
అస్సలు సినిమా మొహమే ఎరగనట్టు, సినిమా గురించి మాట్లాడితే పాపమన్నట్టు ఎందుకు మాట్లాడతారు? వాస్తవం అలానే ఉందా అంటే కాదు. అలా ఉంటే ఇన్ని సినిమాలు ఎలా ఆడుతున్నాయి. ఇన్ని చానల్స్ లో సినిమా కార్యక్రమాలు ఎందుకొస్తున్నాయి? జనం చూడబట్టే కదా? గమ్మత్తేమిటంటే మీతో సినిమా గురించి వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తే ఏదో ఒక సినిమా హాల్లో బ్లాకులో టికెట్లు కొంటూ మనకి కనబడతాడు. ఒక ప్రక్క సినిమాలు చూస్తూ (థియేటరులోనో, టీవీలోనో), సినిమాని ఆస్వాదిస్తూ సినిమా గురించి మాట్లాడితే ఎందుకంత వ్యంగ్యంగా మాట్లాడతారో నాకైతే ఇప్పటికీ అర్ధం కాదు. సినిమా గురించి మాట్లాడితేనో లేక చూస్తేనో వాళ్ళ విలువ దిగజారిపోయినట్టేనా?  

1 comment:

  1. తప్పుకోవడానికి సినిమాలు చూడము అనటం ఒక కారణం అనుకోవచ్చేమో!

    ReplyDelete