Wednesday, 16 August 2017

యిచ్చట దెయ్యాలు సమర్పించును

పద్మశ్రీ అల్లు రామలింగయ్య సమర్పించు
గుల్షన్ కుమార్ ప్రెజెంట్స్
నిర్మాత : మాగంటి రవీంద్రనాధ్ చౌదరి
నిర్మాత : శ్రీమతి అనిత
ఏంటి వీళ్ళందరి గురించి రాసాననుకుంటున్నారా? వీళ్ళందరికీ ఓ సంబంధముంది. ఏంటంటారా? వీళ్ళెవరూ యిప్పుడు ఈలోకంలో లేరు. అంటే బ్రతికి లేరు. కానీ వీరందరూ ఎడాపెడా సినిమాలు తీసిపారేస్తున్నారు. అవును. నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా యిది నిజం. వీరందరూ చనిపోయినా వీళ్లల్లో కొంతమంది సినిమాలు సమర్పిస్తున్నారు, కొంతమంది సినిమాలు తీస్తున్నారు.
మరి చనిపోయిన వాళ్ళు ఎలా తీస్తారు అంటే తీస్తారు అంతే. మనం నమ్మాలి....నమ్మి తీరాలి. గమ్మత్తేమిటంటే వీళ్ళ పేరు ముందు "కీర్తిశేషులు" అనో లేదా "స్వర్గీయ" అని కూడా ఉండదు. మరి ఎలా సమర్పిస్తున్నారు? అంటే వీళ్ళ ఆత్మలు సమర్పిస్తున్నాయా? ఎలా సాధ్యం? పోనీ అదే నిజమనుకున్నా పద్మశ్రీ అల్లు రామలింగయ్య ఆత్మ సమర్పించు అని ఉండాలి కదా?
అప్పుడు ఇంకో అనుమానమొస్తుంది. ఆత్మలు లెక్కలు గట్రా ఎలా చూస్తాయి? చూడలేవు కదా? మరి లెక్కలు చూడలేనప్పుడు వీళ్ళ పేర్లు ఎందుకు వేస్తున్నారు? వీళ్ళ మీద గౌరవం తో వేస్తున్నారు అని అనుకున్నా వాళ్ళ ఆత్మలు సమర్పించలేవు కదా? అది అసాధ్యం కదా? సినిమాలు తీయలేవు కదా?
గౌరవముంటే వారి ఫోటో వేయడమో లేదా స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి దివ్య ఆశీస్సులతో అనో వేస్తే కొంత బాగుంటుందేమో. అలా కాకుండా ఏకంగా సినిమాలు సమర్పించేయడమంటే కొంత....కాదు .....చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.

Tuesday, 15 August 2017

ఓ ధరహాసమా నీ మూలమెక్కడ

ఓ ధరహాసమా నీ మూలమెక్కడా అంటే
అందమైన ఆమె పెదవుల వెనుక దాగి ఉన్నానందట

ఓ సొగసా నువ్వెక్కడుంటావంటే
ఆమె నడుము ఒంపుల్లో  వెతకమందట

ఓ వయ్యారమా నీ చిరునామా ఏదంటే
ఆమె నడకలో కనబడతానందంట

ఓ జాణతనమా నీవెందులో ఉంటావంటే
ఆమె నడతలో ఇమిడి ఉంటానందట

ఓ నాజూకుతనమా నీవెలా ఉంటావంటే
ఆమెని స్పృశించి చూడు తెలుస్తుందంట

ఓ వెచ్చదనమా నీవెక్కడ దాగున్నావంటే
ఆమె కౌగిలిలో కనిపెట్టమందంట

ఓ తియ్యనిదనమా నిన్నెలా పొందాలి అంటే
ఆమె వెచ్చని ముద్దుల్లో ప్రయత్నించమందంట

ఓ నీటిబిందువా నీకు ఏది ఇష్టం అంటే
ఆమె నుదుటి నుండి పాదం వరకు జారడం అందంట

ఓ శృంగారమా నీ జన్మస్థానమేదంటే
ఆమె అణువణువునా తనువంతా కొలువై తీరానందట

Monday, 14 August 2017

అమృతానికి చిరునామా

సంద్రాన్ని చిలికితే వచ్చేది అమృతమైతే
ఆ అమృతాన్ని చిరునామా అడిగితే
నీ పేరు చెప్పిందంట
చూస్తే చాలు
చిరంజీవిగా మారిపోతావందంట

Saturday, 12 August 2017

నీవు

గతించిన గతానికి మధురజ్ఞాపకం నీవు
నడుస్తున్న కాలానికి వారధి అయ్యావు
అందమైన భవిష్యత్తుకు చిరుదివ్వెవి అవుతావు
మధురకావ్యానికి మనసైన రాగం నీవు
ముచ్చటగొలిపే రూపానికి
ముద్దొచ్చే ప్రతిబింబానివి నీవు