Wednesday, 23 April 2014

నా సీటు నాకే సొంతం

మీరు క్రొత్తగా రిలీజైన సినిమాకి వెళితే టిక్కెట్లు అయిపొయాయా? హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేసారా? మీరు గానీ అదే సినిమా చూడాలంటే యింకో షోకి టికెట్లయినా సంపాదించాలి లేదా అదే షో కి బ్లాకులో కొనుక్కునయినా చూడాలి. అంతే గానీ ఉన్న టిక్కెట్ల కన్నా ఒక్క టిక్కెట్టు కూడా ఎక్కువ అమ్మరు గాక అమ్మరు. మీరు నించొని చూస్తానన్నా లేదా ఓ ప్రక్కన నుంచొని చూస్తానన్నా అస్సలు అప్పుకోరు గాక ఒప్పుకోరు.

అంటే దానర్ధమేంటి? మీరు టికెట్టుకు సరిపడిన డబ్బు చెల్లించినా అదనపు సీట్లు ఆ హాలులో లేవు కాబట్టి మిమ్మల్ని లోపలికి అనుమతించడం లేదు. మీరు నించొని చూస్తానన్నా అంగీకరించడం లేదు. అంటే మీరు చెల్లించిన డబ్బుకి పూర్తి న్యాయం జరుగుతోందన్నట్టే కదా?



కానీ యిదే రకమైన న్యాయము రైలు ప్రయాణ విషయములో ఎందుకు జరగడం లేదు?
అర్ధం కాలేదా?
జనరల్ తరగతి టికెట్టు కొన్న ప్రయాణికుడికి అతను చెల్లించిన టికెట్టు ధరకు తగ్గట్టుగా అతనికి రైలులో సీటు ఎందుకు కేటాయించడం లేదు? అతను తీసుకున్న టికెట్టులో అతను కూర్చునే సీటు సౌకర్యము, ఫ్యాను సౌకర్యము, నీటి సదుపాయము, బాత్ రూము సదుపాయము, స్టేషను బయట త్రాగు నీటి సదుపాయము అన్నీ కలిసి ఉన్నాయి కదా? మరి మిగతా సౌకర్యాలను కలిపించి అసలైన 'సీటు' సౌకర్యాన్ని ఎందుకు కలిపించడం లేదు? అసలు సినిమా విషయములో టికెట్లు  అమ్మినట్టు రైలు లో సీట్లకు సరిపడా టికెట్లు మాత్రమే అమ్మాలి కదా? అతనికి సీటుని కేటాయించకపోతే అతని ప్రాధమిక హక్కుకి భంగం కలిగినట్టే కదా? సినిమా హాలుకొక న్యాయమూ రైలు ప్రయాణికొక న్యాయమా? అంటే సినిమా చూసే వాళ్ళే మనుషులు గానీ రైళ్ళో ప్రయాణించేవాళ్ళు మనుషులు కారా? మరి యిదే సూత్రాన్ని స్లీపరు క్లాసుల్లోనూ, ఏసీ తరగతుల్లోనూ ఎందుకు అమలు చేయడం లేదు? రిజర్వేషను సౌకర్యము దొరకకపోతే నిర్దాక్షిణ్యంగా దింపేస్తున్నారు కదా? అంటే జనరల్ భోగీలో ఎంతమందైనా ప్రయాణించొచ్చా? దానికి లెక్కంటూ ఏమీ లేదా?

యిక్కడ మీకో సందేహం రావొచ్చు. నేను చెప్పినట్టు సీట్లకు సరిపడా టికెట్లు అమ్మితే మిగతా ప్రయాణికులు ఎలా ప్రయాణం చేస్తారు అని? కానీ మీరొక విషయం ఆలోచించండి. మిగతా ప్రయాణికుల గురించి ఆలోచించాల్సింది టికెట్టు కొన్న ప్రయాణికుడు కాదు. ప్రభుత్వము మాత్రమే. జనరలు భోగీలను పెంచాలి లేదా రైళ్ళ సంఖ్యని పెంచాలి లేదా ఎక్కువ మంది ప్రయాణికులు కూర్చునేటట్టుగా జనరల్ భోగీల డిజైను మార్చాలి లేదా యితరత్రా మార్గాలు అన్వేషించాలి గానీ ఆ కష్టమంతా మీరే పడండి లేదా చావండి అన్నాట్టుగా యిష్టమొచ్చినట్ట్లు టికెట్ట్లు అమ్మేసి భోగీ అంతా జనాలతో కిక్కిరిసిపోయినా మన సొమ్ము మనకొచ్చిందని సంబరపడే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరము లేదంటారా? ఆలోచించండి. 

ఎంత దారుణమైన విషయమంటే లారీల్లో తీసుకెళ్ళే పశువులకీ, పందులకీ అయినా కాస్తంత నిలబడే అవకాశముంటుంది గానీ జనరల్ భోగీలో ప్రయాణీంచే ప్రయాణికుడికి ఆ మాత్రం చోటు కూడా ఉండటం లేదు. చివరికి మల మూత్రాలు విసర్జించే బాత్ రూముల్లో కూడా నలుగురైదుగురు కూర్చొని ప్రయాణిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. సదరు భోగీలో ఉన్నవాళ్ళకి 'ఆ' అవసరం తీర్చుకోవలసి వస్తే ఎలా తీర్చుకుంటారు?

కాబట్టి మిమ్మల్నందరినీ నేను కోరుకునేదొక్కటే. నా బ్లాగు ద్వారా యిది చదివిన ప్రతీ ఒక్కరూ ఈ విషయం గురించి ఆలోచించండి. ఏదో రూపం లో ప్రభుత్వాన్ని నిలదీయండి. లేదా ఆ పని చేసే వారికైనా ఈ విషయాన్ని చేరవేయండి. మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి తద్వారా ఈ బ్లాగు చదివే వారంతా మీ అభిప్రాయాన్ని చదువుతారు. కానీ ఏదో ఒకటి చేయండి. మరచిపోవద్దు.

గుర్తుంచుకోండి.

"జనరల్ భోగీలో ప్రయాణించే ప్రయాణికుడికి సీటు కేటాయించడం రైల్వే డిపార్ట్ మెంట్ బాధ్యత. టికెట్టు కొన్న ప్రతీ ప్రయాణికుడికీ సీటు మీద కూర్చొని ప్రయాణీంచడం అతని ప్రాధమిక హక్కు. అతని హక్కుకి భంగం కలిగిస్తున్న కారకులని నిలదీద్దాం"


1 comment:

  1. ఇది చాలామందిని వేధిస్తున్న సమస్య...రైల్వే వారికి రైల్వే మంత్రికీ ఈ ఆలోచన రాదా ?
    బస్సులోనైనా అంతే కదా ? సామాన్యులు ఎలాగయినా సర్దుకుపోయి బ్రతికేస్తారు.హక్కులకోసం పోరాడాలంటే బాధ్యతలు తెలియాలి కదా ?

    ReplyDelete