Wednesday, 23 July 2014

పైత్యం బయట పడేది అప్పుడేగా!

చాలా మంది ఇంట్లోనో లేక వంటరిగా ఉన్నప్పుడు సాధారణంగా చేసే పని యిష్టమైన పాటలు పెట్టుకొని  వినడం. అదీ చాలా ప్రశాంతంగా. చివరికి అది ఎంత హుషారైన పాటైనా సరే. కానీ విచిత్రమేమిటంటే అదే పాటని స్నేహితులు లేదా కొంచెం క్లోజ్ గా ఉండేవాళ్ళు ఉన్నప్పుడు అంతకు ముందు ఎప్పుడూ విననట్టు, గట్టిగా పాడేస్తూ, పిచ్చి పిచ్చిగా డాన్సు మూమెంట్లు యిస్తూ ఉంటారు. వంటరిగా ఉన్నప్పుడు కుదురుగా వినే వాళ్ళు   జనాలున్నప్పుడు అలా ఎందుకు ప్రవర్తిస్తారో మరి?         

Tuesday, 22 July 2014

ఒక్క మెతుకు చూస్తే చాలదా మరి?

ఒకే ఒక్క రోజులో, ఒకే ఒక్క సంఘటనతో అవతలి వ్యక్తిని మంచివాడు అని భావించేస్తాం దురదృష్టవశాత్తూ. కానీ ఆ ఒక్క రోజు -  వేరే దారి లేక అతను మంచితనం నటించిన రోజు అయి ఉండవచ్చు.      

Sunday, 20 July 2014

విక్టరీ వెంకటేష్ ఏ సినిమాలోనూ చేయనిది ఏంటి?

యిది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు గానీ, కానీ నిజం. విషయమేమిటంటే, నాకు గుర్తుండీ, వెంకటేష్ యింతవరకూ ఏ సినిమాలోనూ పరిగెత్తలేదు (రన్ చేయలేదు). అటువంటి సీను ఏ సినిమాలోనూ లేదు. నిజమే కదూ?


(ఈ పోస్టు పెట్టిన తర్వాత నాకు తెలియవచ్చిన విషయమేమిటంటే వెంకటేష్ కొన్ని సినిమాల్లో పరిగెత్తాడు (కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా, జయం మనదేరా వగైరా వగైరా..... ఈ విషయాన్ని 'చందు తులసీ గారు తన కామెంటు ద్వారా తెలియచేసారు. జరిగిన పొరపాటుకి చింతిస్తున్నాను. యిక మీద పెట్టే పోస్టులకు జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇస్తున్నాను)  

Wednesday, 16 July 2014

ఓ పజిల్

యిప్పుడు నేను చెప్పబోయేది ఓ పజిల్. ఈ పజిల్ని నేను ఇంటర్మీడియట్ లో ఉండగా నా స్నేహితుడు అడిగాడు. కానీ ఎంత కొట్టుకున్నా సమాధానమివ్వలేకపొయను. చివరికి సమాధానము అతనే చెప్పేసాడనుకోండి. కానీ సమాధానము తెలిసి అవాక్కైపోయాను. అప్పట్నించీ ఈ పజిల్ని చాలా మంది మీద ప్రయోగించాను. కానీ ఎవ్వరూ సరైన సమాధానమివ్వలేకపోయారు. మీరేమైనా చెప్పగలరేమో ప్రయత్నించి చూడండి. యింతకీ పజిల్ ఏంటంటే.....

"ఒక డాక్టరు, ఒక వ్యాపారవేత్త, ఒక ఇంజనీరు కలిసి ఓ హోటల్ లో రూము తీసుకున్నారు. ఆ రాత్రి వారి మధ్య ఏమి జరిగిందో గానీ తెల్లారేసరికి ఇంజనీరు కత్తి గాయాలతో కొన ఊపిరితో ఉన్నాడు. రూములో వారు ముగ్గురే ఉన్నారు.  పోలీసులొచ్చారు. ఎస్సై చావు బ్రతుకుల్లో ఉన్న ఇంజనీరు దగ్గరకొచ్చి 'ఎవరు పొడిచారు మిమ్మల్ని ?'
ఇంజనీరు అతి కష్టం మీద కూడబలుక్కొని 'వాడే పొడిచాడు ' అని చెప్పి ప్రాణం వదిలేసాడు. ఇంజనీరు యిద్దరి వంకా ఎవరినీ చేత్తో చూపించలేదు. ఇంజనీరు కాకుండా రూములో ఉన్నది యిద్దరే. డాక్టరూ, వ్యాపారవేత్త.  అయినా పోలీసులు  వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యాపారవేత్తని అరెస్ట్ చేసేసారు. 
పోలీసులు అంత ఖచ్చితంగా వ్యాపారవేత్తనే ఎందుకు అరెస్ట్ చేసారు? డాక్టరుని ఎందుకు అరెస్ట్ చేయలేదు?"
    

Tuesday, 15 July 2014

అసలే నా యింటి అడ్రసు దొరక్క చస్తుంటే నీ గోలేంటెహె

 మీరు ఓ అడ్రసు కోసం తెలియని ప్రదేశానికెళ్ళరనుకోండి. అక్కడ ఎవరినైనా మీరు చెప్పిన అడ్రసు గురించి వాకబు చేయండి. అందులో కొంత మంది అడ్రసు గురించి అడగ్గానే వెంటనే "ఈ అడ్రసా? ఏ ఏరియా అని చెప్పారు? ఏ సందని చెప్పారు? యిలాంటి ప్రశ్నలు వేసి మిమ్మల్ని ఇంటరాగేట్ చేస్తారు. వారు అలాంటి ప్రశ్నలు వేస్తున్నారంటే దానర్ధం వారికి ఆ అడ్రసు గురించి ఏ మాత్రం తెలియదని. కానీ వారు ఆ విషయం అస్సలు ఒప్పుకోరు. 'తెలియదు ' అని ఎంత మాత్రం చెప్పరు సరి కదా 'ఇలా తిన్నగా వెళ్ళి ఆ లెఫ్ట్ కి వెళ్ళండి.'... అని చెపుతారు. వారు చెప్పింది నమ్మి ఆ రూటులో వెళ్ళారంటే అంతే సంగతులు. మీ టైమంతా వృధా చేసుకున్నట్లే.  "తెలియదు" అనే చిన్న మాట చెప్పటానికి వచ్చిన తంటాలు యివి.

అందులోనే ఆనందముందేమో మరి !

మనల్ని మోసగించేవాడిని లేదా మోసగించాలనుకున్నవాడినైనా నమ్ముతాము గానీ మనల్ని "మోసగాడు" అని భావించేవాడిని మాత్రం జీవితం లో నమ్మము - దగ్గరికి చేరనివ్వము. అదేంటో మరి

Sunday, 13 July 2014

అరిస్తే పోతుందా భయం ?

హర్రర్ సినిమాకి వెళ్ళారు కదా? గమనించండి సినిమా చూస్తున్న జనల్లో చాలా మంది హర్రర్ సీను మొదలవడానికి ముందు గట్టి గట్టిగా అరుస్తుంటారు. అవి విని మిగతా వాళ్ళు గట్టిగా నవ్వుతుంటారు. అదంతా కామెడీ చేయడానికి అనుకుంటున్నారా? కానే కాదు. వారు లోలోపల చాలా భయపడుతుంటారు. తమ భయాన్ని పోగొట్టుకోవడానికి ఆ విధంగా అరుస్తుంటారన్న మాట. ఈ సారి వెళ్ళినప్పుడు గమనించండి.