Friday, 9 February 2018

ఫార్మాలిటీ బాబోయ్!

నిన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటన కు వెళ్లారు. దేనికి అంటే ఏదో ఇండస్ట్రియల్ సెమినార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికట. అలాగే అప్పుడెప్పుడో అమరావతి శంఖుస్థాపనకి పిలవడానికి ప్రధానమంత్రి మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు విమానంలో వెళ్లారు. అలాగే పుష్కర ప్రారంభోత్సవాలు గట్రా ఇలా బోలెడన్ని ఆహ్వానాలకి అయ్యే ప్రయాణ ఖర్చులు లక్షలు.... కోట్లు.... ఇదంతా మన డబ్బే...కేవలం ఫార్మాలిటీ కోసం ఇన్ని కోట్లు అంటే ఎలా? అసలు ఓ ఫోన్ చేసి ఆహ్వానిస్తే పోలా అంటే అబ్బే పద్దతి ప్రకారం దగ్గర కొచ్చి ఆహ్వానించాలి అంటారు. కానీ ఈ ఫార్మాలిటీ కోసం ఎన్ని కోట్లు ఖర్చయిపోతున్నాయో చూడండి. 
ఆ మధ్య ఓ శంఖుస్థాపనకి ఆహ్వానించడానికి ప్రభుత్వం తరపున ఓ కానిస్టేబుల్ కార్డు పట్టుకొని మన ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళితే ఠాట్..అఫ్తారాల్ ఓ కానిస్టేబుల్ తో కార్డు పంపిస్తారా అని అలిగి ఆయన తిరుపతి చెక్కేసాడు ఫ్యామిలీ తో సహా (ఎవరూ పిలవకపోయినా).
కొన్నాళ్ళ క్రితం నా సహోద్యోగి తన పెళ్లి గురించి చెపుతూ "నా పెళ్లి పనులన్నీ మా మావయ్యే దగ్గరుండి చూసుకున్నారు అందరినీ పిలవడంతో సహా. తీరా పెళ్లిరోజున ఆయన మాకెవ్వరికీ కనబడలేదు. ఏమైందోనని కంగారుగా ఆయనింటికెళితే ఇంట్లోనే భేషుగ్గా ఉన్నాడు. పెళ్లికి రాకుండా ఇక్కడున్నారేంటి అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం విని మాకు దిమ్మ తిరిగిపోయింది". ఇంతకీ ఆయనన్నదేంటంటే " పెళ్లి కార్డులు పట్టుకుని ప్రతీ ఇంటికి వెళ్ళాము కానీ ఆ కార్డు నాకు ఇచ్చారా? పిలవని పెళ్లికి నేనెందుకొస్తా? అందుకే రాలేదు పెళ్లికి"

Wednesday, 7 February 2018

నమ్మకమే జీవితం

నేనెవరినీ నమ్మను....మనుషులంటే అస్సలు నమ్మకం లేదు" ఇలాంటి మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. కావొచ్చు కానీ జీవితంలో ప్రతీ నిమిషం ఎవరో ఒకరిని నమ్మి తీరాల్సిందే. నమ్ముతూనే ఉండాల్సిందే. ఒక బస్సో రైలో ఎక్కామంటే డ్రైవర్ని నమ్ముతాము సక్రమంగా నడుపుతాడని. ఒక హోటల్ కి వెళితే వాళ్ళు పెట్టిన పదార్థాలు తాజావనే నమ్మి తీరాలి. ఒకవేళ అనుమానం వచ్చినా చేసేది కూడా ఏమీ లేదనుకోండి. ఒక దర్శకుడు సినిమా తీస్తే జనం చూస్తారని నమ్మకం.... ఒక సినిమా కి వెళ్లే ప్రేక్షకుడు బానే ఉంటుందని నమ్మకం.... ఇలా అన్ని చోట్లా అన్ని రకాలుగా తోటి మనిషిని నమ్మకపోతే జీవితమే లేదు
 నమ్మకమే జీవితం.

Wednesday, 31 January 2018

ఇంగ్లీష్ మోజు

ఎందుకో గానీ తమిళ సినీ దర్శకులకి ఇంగ్లీష్ టైటిల్స్ అంటే మహా మోజు. కానీ తమిళనాడు లో ఇంగ్లీషు టైటిల్స్ మీద ఉన్న నిషేధం(పెట్టుకోవచ్చు కానీ తమిళ టైటిల్స్ పెట్టుకుంటే రాయితీలు ఇస్తారు) కారణంగా అక్కడ ఆ టైటిల్స్ పెట్టరు. కానీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి మాత్రం ఎంచక్కా ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేస్తారు. ఉదాహరణకు

తమిళ పేరు.                 తెలుగు పేరు
యందిరన్.                    రోబో
థానా సెర్న్ ద కూట్టం      గ్యాంగ్
7ఆమ్ అరివు                సెవెంత్ సెన్స్
ఎంగేయుమ్ ఎప్పోదుం   జర్నీ
చెన్నెయిల్ ఒరుణాల్       ట్రాఫిక్
ఒరు కాల్ ఒరు కన్నాడి    ఓకే ఓకే
ఐ   (అందం)                  ఐ (ఇంగ్లీష్)