Wednesday, 2 October 2013

చిల్లర మనుషులు

సరిగ్గా తోలత్ స్కూల్ దగ్గరకొచ్చేసరికి పెట్రోల్ అయిపోయింది. నాకిది మామూలే. ఒక లీటరో, యాభై రూపాయలకో పెట్రోల్ కొట్టించటం సరిగ్గా పెట్రోల్ బంక్ కి కిలోమీటరు దూరం లో ఆగిపోవటం. మరీ బొటాబొటిగా కొట్టించుకోకపోతే కాస్త ఎక్కువ కొట్టించుకోవచ్చు కదా అంటుంది మా ఆవిడ. అప్పుడు తలకెక్కదు. యిదిగో యిలాంటి టైము లో అనిపిస్తుంది. చోక్ యిచ్చి కాస్త దూరం లాగించాను. అది కూడా మార్కెట్ యార్డ్ దగ్గరకొచ్చేసరికి యిక మొరాయించింది. చేసేదేముంది.
బండి దిగి నడిపించుకుంటూ వెళుతున్నాను. రామక్రిష్ణ మఠం దగ్గరుంది పెట్రోల్ బంక్. అసలే 150 సీసీ బండేమో చాల బరువుగా ఉంది. నడిపేటప్పుడు అర్ధం కాదు కానీ యిప్పుడు తెలుస్తోంది. దానికి తోడు నా బరువు. అయినా తప్పదుగా. అలాగే తోసుకుంటూ పెట్రోల్ బంక్ వరకూ వెళ్లేసరికి అక్కడ పెద్ద క్యూ కనిపించింది. అయినా ఆనందంగానే అనిపించింది ఎందుకంటే యిప్పటి దాన్ని మోసిన కష్టం కన్నా క్యూలో నుంచోవటం పెద్ద విషయం కాదు కాబట్టి. నా ఆనందాన్ని ఆవిరి చేస్తూ అక్కడ ఓ సంఘటన జరిగింది.    

ఎవరో ఒకతను పెట్రోల్ బంక్ అబ్బాయితో గొడవ పడుతున్నాడు.  ఆ గొడవ వలన క్యూలో నుంచున్న బండ్లు ముందుకి వెళ్ళటం లేదు. చాలా అసహనంగా అనిపించింది. బండి స్టాండ్ వేసి ఆ గొడవ జరుగుతున్న చోటికి వెళ్ళాను. ఒక పెద్దాయన అంటే సుమారు ఓ యాభై ఐదు అరవై మధ్య ఉండొచ్చు. అతను గొడవ పడుతున్నాడు.
"అవునయ్యా యాభై రూపాయలకి కొట్టమంటే నలభై తొమ్మిది రూపాయల యిరవై ఎనిమిది పైసలకి ఎలా కొడతావ్? మిగతా డబ్బై రెండు పైసల మాటేంటి?" అడుగుతున్నాడా పెద్దాయన.
"అవునండీ ఈ మిషను లో యాభై రూపాయలకి ఉండదు. అంతకే ఉంటుంది. అంత కన్నా ఒక్క పాయింటు ఎక్కువ కొట్టామంటే యాభై రూపాయల యిరవై పైసలకి వెళ్ళిపోతుంది. ఆ యిరవై పైసలు ఎవరిస్తారండి? యిలా కొట్టుకుంటూ పోతుంటే మేముద్యోగం చేయక్కర్లేదు" అనాడు బంకు వాడు. 
జరిగిన మోసం అర్ధమయ్యింది నాకు. పెట్రోల్ కొట్టించుకోవటానికి వెళ్ళినప్పుడు యాభైకి కొట్టమంటారా? లేక వందకి కొట్టమంటారా అని అడగటం, సరిగా నలభై తొమ్మిది రూపాయల యిరవై ఎనిమిది పైసలకో లేక తొంభై తొమ్మిది రూపాయల ముప్పై ఆరు పైసల దగ్గర ఆపేస్తుంటారు ఈ బంకు వాళ్ళు. మనము కూడా ఆ మొత్తం డబ్బులకి పెట్రోల్ కొట్టించినట్లు సర్దిచెప్పుకొని వెళ్ళిపోతాము. అంటే మనకి డబ్బై పైసలో ఎనభై పైసలో నష్టం కానీ బంకు వాడికి రోజంతా యిలాంటి పైసలు ఎన్ని మిగులుతాయో ఆలోచిస్తే మతి పోయింది. నా లెక్క ప్రకారం కనీసం ఓ అయిదారు  లీటర్ల పెట్రోల డబ్బులు మిగులుతాయి. అదీ విషయం. పెద్దాయన ఏదో అంటున్నాడు బంకు వాడితో. 
"అవునయ్యా అలాంటప్పుడు యాభైకి కొడతానని ఎందుకు చెప్పావ్? నలభై తొమ్మిది రూపాయల యిరవై ఎనిమిది పైసలకి కొడతానని చెప్పాలి కదా?" 
"ఒహో. మా భలే ఉందండోయ్ మీరు చెప్పేది. యాభై రూపాయల యిరవై పైసలకి  కొడితే యిరవై పైసలిసిస్తారేంటీ? యివ్వలేరు కదా? అందుకే నలభై రూపాయల యిరవై ఎనిమి దగ్గర ఆపేసి యాభై రూపాయలని చెప్తాం." లాజిక్ తీసి మాట్లాడాడు వాడు.  
"మేము యివ్వాల్సింది యిరవై పైసలే, కానీ నువ్వు యివ్వాల్సింది డబ్బై రెండు పైసలు కదా. అంటే మేము డబ్బై రెండు పైసలు లాసైపోయినా ఫర్వాలేదు గానీ నువ్వు యిరవై పైసలు లాసయితే నొప్పొచ్చేత్తుందా?"  మరింత లాజికల్ గా మాట్లాడాడు పెద్దాయన.
బంకు వాడికి తెగ కోపమొచ్చేసింది పెద్దాయన ఆర్గ్యుమెంట్ కి. గట్టిగా సమాధానం యివ్వకపోతే క్యూలో ఉన్న మిగతా కష్టమర్లు కూడా పెద్దాయనకి వంత పాడతారేమోనని భయమేసింది వాడికి. అంతే. స్వరం పెంచేసాడు.
"ఏటండి అలా అడ్డంగా మాట్టాడతారేటీ? అంత నిక్కచ్చిగా ఉండాలనుకున్నప్పుడు సరిపడా చిల్లర తెచ్చుకోవచ్చుకోవాలి. నీతులు చెప్పటం కాదు"
వీళ్ళ తగువు తీర్చటానికి యిద్దరు పెద్దరాయుళ్ళు వచ్చారు అక్కడికి.
"ఏంటయ్యా ఏటీ గొడవ?" అని అడిగారు వాళ్ళు. 
"చూడండే! యాభై రూపాయలకి పెట్రోల్ కొట్టించుకొని ఎదవ చిల్లర కోసం గొడవ పడుతున్నాడీయన" అని ఫిర్యాదు చేసాడు బంకు వాడు పెద్దాయన మీద.   
"ఏటీ? యాభై రూపాయలకి కొట్టావా? యాభై కాదు. నలభై తొమ్మిది రూపాయల యిరవై ఎనిమిది పైసలు. సరిగ్గా మాట్టాడు" అరిచాడు పెద్దాయన.
"పోనీలేండి గురువుగారు. డబ్బై పైసలే కదా. పోనిద్దురూ." సర్ది చెప్పాడో పెద రాయుడు
"అబ్బెబ్బె అదెలా కుదురుతుందండీ? యాభై అంటే యాభైయ్ కే కొట్టాలి. నలభై తొమ్మిదికి కొట్టేసి ఈ నాటకాలాడేత్తే కుదురుతుందేటండీ?" పెద్దాయనకి సపొర్టిచ్చాడు చినరాయుడు. 
"నలభై తొమ్మిది కాదండి బాబు. నలభై తొమ్మిదీ ముప్పై పైసలు" సరి చేసాడు బంకు వాడు. 
"యిరవై ఎనిమిది పైసలు. ముప్పై కాదు" మళ్ళీ అరిచాడు పెద్దాయన.
అసలే నన్నూ, బండిని చాలా దూరం మోసుకొచ్చానేమో చిరాగ్గా ఉంది నాకు. యీ యెదవ సంత ఏంట్రాబాబు అనుకొని 
"సార్ పోనివ్వండి. వాడు మాత్రం డబ్బై రెండు పైసలు ఎక్కడ్నించి తెస్తాడు చెప్పండి. వదిలేయండి" అన్నాను నేను కాం గా నుంచోవటం ఎందుకని.
క్యూలో ఉన్న జనాలకి అప్పటికే సహనం చచ్చింది వీళ్ళ పంచాయితీకి. దాంతో మూకుమ్మడిగా నాకు సపోర్ట్ గా నిలిచారు అందరూ.
"అబ్బే. ఒప్పుకోనండి. యిది డబ్బై పైసల లెక్క కాదండి. జరిగింది మోసం . దాన్నే అడుగుతున్నాను. ఈ రోజున నాకవచ్చు. రేపు మీకవచ్చు. అలా అంటారేటీ?" ప్రశ్నించాడు అందరినీ.   
"సరే యిప్పుదేమంటారు? యింకో పాయింటు కొట్టమని చెప్పమంటారా వాడికి?" అడిగారు ఎవరో. 
"అప్పుడు నేను లాసవ్వనేటండి?" టపీమని అడిగాడు బంకు వాడు.
"ఉండరా బాబు. మాట్లాడుతున్నము కదా?" కసురుకున్నారు జనాలు వాడి మీద. " చెప్పండి గురువు గారు ఏం చేద్దాం?" 
"సరే నా దగ్గర యాభై పైసలున్నాయి. యింకో పాయింటు కొట్టమనండి. యాభై రూపాయల యిరవై పైసలవుతుంది. నేను యాభై పైసలిస్తాను. నాకో ముప్పై పైసలు లాసు వస్తుంది. భరిస్తాను" అన్నాడు పెద్దాయన.  
జనాలు హమ్మయ్య అనుకొని "రేయ్ బాబు. ఆయనకి యింకో పాయింటు కొట్టు. యాభై పైసలిస్తారు" అన్నారు. మనసులో తిట్టుకుంటూ సరేనని ఒప్పుకున్నాడు బంకు వాడు. ఆ విధంగా ఆయన గొడవ అలా ముగిసింది. క్యూ కదిలింది. ఆ పెద్దాయన పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోయాడు. "చూడండి డబ్బై పైసల కోసమెంత రాద్దాంతము చేసాడో" అన్నారు కొంత మంది.
నా వంతొచ్చింది. షరా మామూలుగా అడిగాడు బంకు వాడు "ఎంతకి కొట్టమంటారు?"
యాభై రూపాయలనబోయి యిందాకటి విషయము గుర్తొచ్చి "లీటరు" అన్నాను.
"తొంభై కి వేసేయమంటారా?"
"వద్దు. లీటరంటే లీటరే."
"లీటరు ఎనభై రెండు. రెండు రూపాయలున్నయండీ?" అడిగాడు వాడు.
జేబులు తడుముకున్నాను నేను. ఎక్కడా తగల్లేదు రెండు రూపాయల బిళ్ళ.
"లేవు" అని చెప్పాను.
వాడు ముసి ముసిగా నవ్వుకొని "అయితే తొంబై కి వేసేయమంటారా?" అన్నాడు.
"వద్దులే. ఎనభై కి వెయ్యి" అన్నాను.
దొరికిపోయవురా అన్నట్టు ఫేసు పెట్టి "ఆయ్. అలాగేనండి" అని పెట్రోల్ గొట్టం నా బండిలో పెట్టి సరిగ్గా డబ్బై తొమ్మిది రూపాయల నలభై పైసల దగ్గర ఆపేశాడు మీటరుని.   
ఏడుపు మొఖం తో ఎనభై రూపాయలిచ్చాను వాడికి. ఆనందంగా లోపల పెట్టేసుకొని, పెట్రోల్ మూతని సరిచేసుకుంటున్న నాతో అన్నాడు   
"బండిని కొంచెం ముందుకు పెట్టుకోండి. వెనకాల వాళ్ళకి కొట్టాలి"       

No comments:

Post a Comment