సమయం ఉదయం పదకొండు గంటలు కావస్తోంది. అది అంబాజీపేట బస్ స్టేషన్. జనాలంతా 'రాజమండ్రి ' వెళ్ళే బస్ కోసం ఎదురు చూస్తున్నారు. పల్లెటూరే అయినా అటు అమలాపురం నుండి యిటు నరసాపురం నుండి వచ్చే బస్సులన్నీ ఆ వూరు మీదుగా వెళతాయి కాబట్టి దాదాపు అన్ని బస్సులు ఆగుతాయి అక్కడ. స్కూళ్ళకి, కాలేజీలకి శెలవులిచ్చేయటం తో బస్సులన్నీ జనాలతో నిండిపోతున్నాయి. రాజమండ్రి వెళ్ళే బస్ రానే వచ్చింది. అది రావటమే పాపం పరుగు పందెంలో విజిల్ ఊదిన వెంటనే పరుగు ప్రారంభించే పరుగు వీరుల్లా జనాలు పొలోమని ఎక్కేసారు. రెండు నిమిషాల్లో బస్ కిక్కిరిసిపోయింది. బస్సు కదలటానికి రెడీగా ఉంది. 'శ్రావణీ' అన్న పిలుపుకి బస్సులోని వారంతా క్రిందకి చూసారు.
అక్కడ ఒకాయన నిలబడి బస్ లో ఎవరినో పిలుస్తున్నాడు. వయసు ఓ యాభై ఉండొచ్చు. బస్ చాలా రద్దీగా ఉండటం వలన ఆయన పిలిచే ఆ 'శ్రావణీ' ఎక్కడుందో ఎవరికీ అర్ధం కాలేదు. పిలిచింది అమ్మాయిని కాబట్టి బస్ లోని కొందరు ఉత్సాహవంతులు 'ఏవండి శ్రావణీ అంటే ఎవరండి ? బయట ఆవిడ తాలూకా మనిషి ఎవరో కేకేత్తున్నారు ' అని అరిచారు. వారికి లోలోపల ఆ పడుచు పిల్ల ఎవరో చూద్దామని ఆశక్తిగా ఉంది.క్రింద ఉన్నది పెద్దాయన కాబట్టి అయితే భార్య అయినా అయ్యుండాలి లేదా కూతురైనా అయి ఉండాలి. కానీ కూతురే అయ్యుండచ్చని మనసా వాచా నమ్మిన వారున్నారందులో. లోపలనించి ఎవరి దగ్గర్నించీ సమాధానం రాలేదు. దాంతో ఆ పెద్దాయన మళ్ళీ గట్టిగా అరిచాడు 'శ్రావణీ...శ్రావణీ అంటూ. బస్ లోపలివారు కూడా తెగ హడావిడి చేసారు ఏమండీ శ్రావణీ గారు ఏమండోయ్ అని పిలుస్తూ. ఓ రెండు సెకండ్ల తర్వాత జనాల్ని ప్రక్కకి నెట్టుకుంటూ ఓ మొహం అలా కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకి చూసి బయట నుంచున్న వ్యక్తితో "ఏమిటి నాన్నగారు ' అంది. జనాలు ఆ మొహాన్ని చూసి ఒక్కసారిగా నోరావలించారు. ఎందుకంటే ఆ మొహం అమ్మాయిది కాదు ఓ అబ్బాయిది. వయసు సుమారు ఓ పదహారుండొచ్చు. యిందాకట్నించీ ఆయన పిలుస్తోంది అబ్బాయిని అన్న విషయం తెలియగానే ఆశ్చర్యం నుంచి నవ్వు పుట్టుకొచ్చింది వారికి.
'జాగ్రత్తా వెళ్ళు. వెళ్ళిన వెంటనే ఫోన్ చేయ్ ' కొడుకుతో చెప్తున్నాడు ఆయన.
'అలాగేనండి అన్నాడు 'శ్రావణి ' అనబడే 'శ్రావణీ కుమార్ '. బస్ లోని వాళ్ళంతా తననే వింతగా చూడటం గమనించాడు శ్రావణి. యింట్లో తనని అందరూ అలాగే పిలుస్తారు చిన్నప్పట్నుండి. సిగ్గేసింది అతనికి. యింట్లో పిలిస్తే ఫర్వాలేదు గానీ యిలా బయటకొచ్చినప్పుడు అలా పిలవొద్దని మొత్తుకుంటాడు కానీ ఎవరైనా అతని మాటని పట్టించుకుంటేగా. యింట్లో వాళ్ళతో పాటు చుట్టుప్రక్కల వాళ్ళ చేత అలాగే పిలిపించుకోవటం అలవాటైపోయింది అతనికి.
అసలు శ్రావణి ని అలా అందరూ అని పిలవటానికి ఓ కధా కమామీషు ఉంది. అది చెప్పాలంటే వెంకటేశ్వర రావు దగ్గర్నిచి మొదలెట్టాలి. ఆయన ఈ శ్రావణీ కి తాత. అంటే అతని తండ్రికి తండ్రన్న మాట. ఆయనకి పెళ్ళయ్యాక మొదటి సంతానము మగబిడ్డ. ఆ బిడ్డకి ఆయన ఓ పేరు పెట్టాడు. అదే 'మహాలక్ష్మి'. అవును మీరు చదివింది నిజమే. అది ఆయన చనిపోయిన వాళ్ళ అమ్మ మహాలక్ష్మి గారి పేరు. ఆవిడ జ్ఞాపకార్ధంగా కొడుక్కి ఆ పేరు పెట్టుకున్నాడు. అప్పటికీ అతని భార్య శ్రావణి, బంధువులూ, చివరికి చుట్టుప్రక్కల వాళ్ళతో సహా అందరూ 'యిదేం విడ్డూరమండీ మగాడికి మహలక్ష్మి అనే పేరేంటీ చోద్యం కాకపోతే! అని అన్నారు. కానీ ఆయన వినిపించుకోలేదు. అమ్మాయి పుడితే ఆ పేరు పెట్టుకుందామనుకున్నాను. అమ్మాయి పుట్టలేదు మరి నేనేం చేయను? అని ఎదురు ప్రశ్నించాడు వాళ్ళని. అయినా సరే అబ్బాయికి యిలా అమ్మాయి పేరు పెట్టటం బాగోదని నచ్చ చెప్పబోయారు గానీ ఆయన వినిపించుకోలేదు.కనీసం మహాలక్ష్మి కి ఏదైనా తోక తగిలించమన్నారు. దానికీ ఒప్పుకోలేదు. 'మహాలక్ష్మి' కి ఏం తగిలిస్తాం? 'మహాలక్ష్మీ రావు' అనో 'మహాలక్ష్మీ కుమార్' అనో తగిలిస్తే ఏం బాగుంటుంది? చస్తే తగిలించను గాక తగిలించను అని భీష్మించుకు కూర్చున్నాడు. చేసేదేమీ లేక మిన్నకుండిపోయారంతా వీడి చాదస్తం తగలెయ్య అనుకుంటూ. ఆ విధంగా ఆయన కొడుక్కి 'మహాలక్ష్మి' అనే పేరు నామకరణం జరిగిపోయింది. అందరూ ఆ అబ్బాయిని 'మహాలక్ష్మీ'... 'మహాలక్ష్మీ' అని పిలుస్తుంటే ఆ అబ్బాయికి తల కొట్టేసినట్టుండేది. పెద్దయాక పేరు మార్చేసుకుందామనుకున్నాడు కానీ తండ్రికి భయపడి ఆ పని చేయలేదు. మహాలక్ష్మి పెరిగి పెద్దవాడై ఆ ఊళ్ళోనే గవర్నమెంటు స్కూల్ టీచరు అయ్యాడు. ఓ పెళ్ళి సంబంధం వచ్చింది. అమ్మాయి పేరు 'మధుమతి'. అమ్మాయి బాగా నచ్చింది. శుబ్రంగా పెళ్ళి కూడా చేసేసుకున్నాడు వెంటనే. కానీ ఆ తర్వాత అతని కష్టాలు యింకా ఎక్కువయ్యాయి భార్య పేరు కారణంగా. భార్య పేరు 'మధుమతి' కావటం వలన అతని భార్య తాలూకు వాళ్ళంతా ఆమెని 'మధూ' అని పిలిచేవారు. దాంతో యితని తరపువాళ్ళూ, ఆ చుట్టు ప్రక్కల వాళ్ళూ ఆమెని 'మధూ' అని పిలవటం మొదలెట్టారు. ఆ ఊరు ఊరంతా ఆయనను 'మహాలక్ష్మి మాస్టారు', ఆమెని 'మధు గారు' అని పిలవటం పరిపాటైపోయింది. దాంతో అతనికి తల కొట్టేసినట్టుండేది. ఆ ఊరికి కొత్తగా వచ్చిన వారు 'మహాలక్ష్మి' అంటే ఆవిడ పేరని, 'మధు' అంటే యీయన పేరు అని అనుకొనే వారు. ఆ విషయాన్ని విడమరిచి చెప్పాడానికి తెగ నామోషీగా ఉండేది మహాలక్ష్మికి.
కొన్నాళ్ళకి అతనికీ ఓ అబ్బాయి పుట్టాడు. షరా మామూలుగానే అతని తండ్రి వెంకటేశ్వర రావు - చనిపోయిన తన భార్య అంటే మహాలక్ష్మి తల్లి పేరు పెట్టాలని తీర్మానించేసాడు. దానికి ససేమిరా అన్నాడు 'మహాలక్ష్మి'. తను పడిన కష్టాలు చాలు తన యిబ్బందులు కొడుకు పడకూడదని ఆలోచించి 'శ్రావణి ' అన్న పేరు పెట్టటానికి ఒప్పుకోలేదు. కానీ పెద్దాయన ఊరుకోలేదు. చివరికి అతికష్టం మీద 'మహాలక్ష్మి' తన కొడుక్కి 'శ్రావణీ కుమార్' అన్న పేరు పెట్టటానికి ఒప్పించాడు తన తండ్రిని. కానీ ఆయన ఓ షరతు పెట్టాడు కొడుక్కి. మనవడికి 'శ్రావణీ కుమార్ ' అని పేరు పెట్టినా యింట్లో మాత్రం అందరూ 'శ్రావణీ' అనే పిలవాలని. అందరూ పిలవగలరు గానీ అమ్మ పేరు పెట్టి నేనెలా పిలవాలి అని మొత్తుకున్నా ఒప్పుకోలేదు. అందరి నోటెమ్మట ఆ పేరు రోజూ రావల్సిందే. చివరికి నువ్వు కూడా అని ఖరాఖండిగా చెప్పేసాడు. దాంతో 'మహా లక్ష్మి'కీ పిలవక తప్పలేదు. యిక ఆ రోజు నించి 'మహాలక్ష్మి' పడిన కష్టాలు 'శ్రావణి' కి బదిలీ అయ్యాయి. ఇంటి బయట స్కూల్లో ఎక్కడ పడితే అక్కడ అతన్ని 'శ్రావణీ'..'శ్రావణీ' అంటూ ఏడిపించేవారు. ఏడిపిస్తూనే ఉన్నారు. అదీ 'శ్రావణి' పేరు వెనకాల ఉన్న క(వ్య)ధ.
బస్ కదిలింది. పదో తరగరి పరీక్షలు వ్రాసాక సెలవులకి మావయ్య యింటికి వెళతానని అడిగాడు 'శ్రావణి'. ముందు ఒప్పుకోలేదు కానీ వాళ్ళావిడ కూడా చెప్పేసరికి ఒప్పుకున్నాడు. రాజమండ్రికి చేరుకునేసరికి నాలుగయ్యింది. దానవాయిపేట లో ఉంటున్నారు అతని మావయ్య వాళ్ళు. యింకో పావు గంటలో చేరుకున్నాడు శ్రావణి. అసలు కధంతా అక్కడే మొదలయ్యింది.
* * *
మామయ్యకి యిద్దరు పిల్లలు. తన కన్నా చిన్న వాళ్ళు. ఒక బాబు ఒక పాప. బాబు ఫస్టు క్లాసు రెండోది ఎల్ కేజీ చదువుతున్నారు. శ్రావణి వెళ్ళగానే పిల్లలిద్దరూ 'శ్రావణీ బావొచ్చాడూ' అంటూ అరిచారు. మామయ్య అత్తయ్య యిద్దరూ శ్రావణీ ని పలకరించారు 'ఏరా శ్రావణీ! ఎలా ఉన్నావు? అమ్మా నాన్నా ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు వేసారు. ఆ కార్యక్రమము పూర్తయ్యాక సాయంత్రం పిల్లలతో కలిసి ఆటలాడాడు.
రాత్రి పిల్లలిద్దరూ శ్రావణీ దగ్గరే పడుకుంటామని మారాం చేశారు. దాంతో పిల్లల్నిద్దరినీ శ్రావణీ దగ్గరే పడుకోబెట్టారు. యిద్దరినీ చెరో వైపు పడుకోబెట్టుకొన్నాడు శ్రావణీ. యింక పడుకోండి అన్నాడు యిద్దరితో. కానీ వాళ్ళు వినలేదు.కధ చెప్పమని గొడవ చేసారు. నాకు కధలు రావు అని చెప్పినా ఊరుకోలేదు. చెప్పాల్సిందే... చెప్పాల్సిందే అంటూ పట్టు పట్టారు. బాగా ఆలోచించాడు శ్రావణి. నిజంగానే అతనికి ఏ కధా గుర్తు రాలేదు. ఆలోచించగా ఆలోచించగా చిన్నప్పుడెప్పుడో విన్న రాజూ, ఏడు చేపల కధ గుర్తొచ్చింది. అంతే ఉత్సాహమొచ్చేసింది శ్రావణీకి. చెప్పటం మొదలెట్టాడు
'ఒకూళ్ళో ఒక రాజు ఏడు చేపల్ని పట్టాడు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా చేపా......"చెప్పుకుంటూ పోతున్నాడు. మధ్యలో అడ్డు తగిలారు యిద్దరూ. 'బావా! ఈ కధ మాకు తెలుసు. వేరే కధ చెప్పు ' అన్నారు. దాంతో వేరే కధలేమున్నాయి అంటూ ఆలోచనలో పడ్డాడు శ్రావణి. ఆవూ పులి కధ గుర్తొచ్చింది. దాంతో మళ్ళీ ఉత్సాహంగా చెప్పసాగాడు 'ఒక ఊరిలో ఒక ఆవు మేత మేయటానికి అడివికి వెళితే.......'
'అడవి లో ఒక పులి ఆవుని చంపటానికి వచ్చింది. అప్పుడు ఆ ఆవు తన దూడకి పాలిచ్చి వస్తానని చెప్పి పులిని ఒప్పించి తన యింటికి వెళ్ళి తన దూడకి పాలిచ్చి మళ్ళీ పాలిచ్చి పులి దగ్గరికి వచ్చింది ఆవు....." మిగతా కధని పూర్తి చెసారిద్దరూ.
గతుక్కుమన్నాడు శ్రావణి. యిదేం ఖర్మ రా బాబూ! మనకొచ్చిన కధలే ఒకటో రెండో అంటే వీళ్ళేమో అవి కూడా మాకు తెలుసంటునారు ఎలా వేగేదీ అనుకున్నాడు.
'బావా ఏంటీ ఆలోచిస్తున్నావు? కధ చెప్పూ అని మళ్ళీ మొదలెట్టారు.
''నాకు యింతకన్నా వేరే కధలు రావు ' అన్నాడు శ్రావణి.
పిల్లలు ఊరుకోలేదు. కధ చెప్పు కధ చెప్పు అంటూ మళ్ళీ అదే గోల. శ్రావణి కి ఏడుపొకటే తక్కువ. యీ గండం నించి తప్పించుకొనేదెలారా బాబు! అని తల పట్టుకున్నాడు. పిల్లలు వింటేగా. కధ చెప్పు కధ చెప్పు అంటూ శ్రావణిని పీక్కు తినటం మొదలెట్టారు. మెదడుకి పని చెప్పాడు శ్రావణి. ఏదో విధంగా దీన్నించి బయట పడాలంటే వీళ్ళకి ఏదో ఒక కధ చెప్పాలి, కానీ పాత కధలన్నీ వీళ్ళకి తెలుసు. యిప్పుడేం చేయాలి అనుకుంటుండగా అతనికి మెరుపులా ఓ ఆలోచన వచ్చింది. తనే ఓ కధ అల్లేసి చెప్పేస్తే? బానే ఉంది, కానీ ఎలా? ఇప్పటికిప్పుడు కధ అల్లటం మామూలు విషయం కాదు కదా? చివరికి ఓ నిర్ణయానికొచ్చాడు. అదేంటంటే ఆ అల్లబోయే కధ తాలూకు పాత్రల్ని పిల్లల్నే అడిగాలని.
పిల్లల్ని అడిగాడు 'సరే కొత్త కధ చెప్తాను కానీ ఎవరి కధ కావాలో మీరే చెప్పండి' అన్నాడు.
'అంటే?' అడిగారు యిద్దరూ.
'అంటే మీకు ఎవరి కధ కావాలో చెప్పండి. పులి కధా లేక సిం హం కధా లేక ఆవు కధా లేక ఏనుగు కధా ఏం కావాలో చెప్పండి' అన్నాడు
పిల్లలు ఆలోచనలో పడ్డారు. ఓ పది సెకండ్ల తర్వాత 'సరే అయితే పులి కధ చెప్పు' అన్నారు ఉత్సాహంగా.
'పులి కధా? సరే అయితే పులి కోతీ కధ చెపుతాను సరేనా?' అడిగాడు.
'ఓ సరే. చెప్పు చెప్పు ' అన్నారు యిద్దరూ.
ఎలా మొదలెట్టాలి అని అలోచించాడు శ్రావణి. చటుక్కున అతనికి ఒక ఆలోచనొచ్చింది. వెంటనే మొదలెట్టాడు.
'అనగనగా ఒక ఊరిలో ఓ పులి ఉండేది. అది ఓ రోజు పొద్దున్నే లేచింది. లేచిన వెంటనే ఒక బాటిల్ తో నీళ్ళు గట గటా తాగేసింది. ఆ తర్వాత ఓ బ్రష్షు తీసుకొని దాని మీద పేస్టు పెట్టి పళ్ళు తోముకోవటం మొదలెట్టింది..... తన దైనందిక కార్యక్రమాన్ని పులికి ఆపాదించి చెప్పుకుంటూ పోతున్నాడు శ్రావణి.
పిల్లలు మంచి ఉత్సాహంగా వింటున్నారు. యిదేదో కొత్తగా ఉందే అనుకుంటూ.
'పులి బ్రష్షుతో పళ్ళు యిలా తోముకుంటోంది "షుక్ షుక్ షుక్ షుక్ షుయ్ షుయ్...... ఉష్ ఉష్ ఉష్ షుయ్ ......యిలా బ్రష్షు తోముకుంటున్న శబ్దాలతో చెప్పుకుంటూ పోతున్నాడు. ఆ విధంగా దాదాపు ఓ రెండు నిమిషాల పాటు చెప్పినా పిల్లలికి అస్సలు బోరు కొట్టలేదు పైగా అంతు లేని ఉత్సాహం తో వింటున్నారు నోరావలించి. వారికి యిలాంటి కధ వినటం కొత్తగా ఉంది.
'పుషుక్ పుషు.....షుక్ షుక్ ....షుయ్ షుయ్... షిక్ షిక్ షిక్..... కుషుం కుషుం..... పిల్లలు ఆశక్తిని గమనించి రెట్టించిన ఉత్సాహం తో చెప్పేస్తున్నాడు శ్రావణి.
'పళ్ళు తోముకోవటం అయిపోయింది. యిప్పుడు టంగ్ క్లీనర్ తో......'
'టంగ్ క్లీనరా? అంటే? అడిగారిద్దరూ.
'అదేనమ్మ నాలిక గీసుకుంటామే దానితో అదీ చెప్పాడు.
'ఒహో అదా? దాన్ని 'టంక్లీట్' అంటారు. అమ్మ చెప్పిందీ అన్నారు.
'ఒహో టంక్లీటా? సరే ఆ టంక్లీట్ తో నాలిక గీసుకొంది యిలా. గుషీక్ గుషీక్ ...... గుషీక్ గుషీక్ నోట్లో నీళ్ళు పోసుకొని కుష్కుష్ కుష్కుష్ ....... అని పుక్కిలించి థూ .. అని ఊసిందీ అన్నాడు.
పిల్లలకి తెగ నచ్చేసింది యీ కధ. ఆనందం పట్టలేక యిద్దరూ లేచి కూర్చున్నారు.
చెప్పసాగాడు. 'యింతలో అక్కడికి ఓ కోతి వచ్చింది. పళ్ళు తోముకుంటున్న పులిని చూసి పులిని అడిగింది
'ఏయ్ ఏం చేత్తునావు? అని.
దాంతో పులి 'కనబట్టం లేదా? పళ్ళు తోముకుంటున్నాను ' అని సమాధానమిచ్చింది పులి.
అప్పుడా కోతి 'పళ్ళు తోముకుంటున్నావా? అంటే? అని ప్రశ్నించింది.
అప్పుడా పులి నవ్వి 'హే నీకు తెలీదా? బ్రష్షు తో పళ్ళు తోముకుంటున్నా అని చెప్పింది పులి.
అప్పుడా కోతి 'మరి నేనూ? అంది.
'నువ్వూ తోముకో' అని సమాధానమిచ్చింది పులి.
'మరి...మరి...నా దగ్గర బ్రష్షు లేదుగా! అంది కోతి.
దానికి ఆ పులి 'అయితే వెళ్ళి మీ మమ్మీని అడుగు బ్రష్షు కొనమని ' అంది పులి.
సరేనని ఆ కోతి వాళ్ళ మమ్మీ దగ్గరకెళ్ళి 'మమ్మీ మమ్మీ నాకు డబ్బులివ్వవా?' అనడిగింది కోతి.
అప్పుడా కోతి వాళ్ళ మమ్మీ 'ఎందుకూ?' అనడిగింది.
'బ్రష్షు కొనుక్కోవటానికి ' అని సమాధానమిచ్చింది కోతి.
'బ్రష్షెందుకూ?' అనడిగింది కోతి వాళ్ళ మమ్మీ.
'పళ్ళు తోముకోవటానికి మమ్మీ' అని చెప్పింది కోతీ
'అదేంటి కోతి వాళ్ళ మమ్మీ పళ్ళు తోముకోదా?' సందేహం వెలిబుచ్చారు పిల్లలు.
గతుక్కుమన్నాడు శ్రావణి. నిజమే కదా యిలా చెప్పానేంటి అనుకొని దాన్ని కప్పిపుచ్చటానికి
'అబ్బే తోముకుంటుంది. కానీ కోతి పిల్లకి యింకా పళ్ళు పూర్తిగా రాలేదు కదా అందుకే అలా అందన్నమాట' చెప్పాడు శ్రావణి.
'మరి పళ్ళు పూర్తిగా రానప్పుడు పళ్ళెలా తోముకుంటుంది?' మళ్ళీ సందేహం వెల్లబుచ్చారిద్దరూ.
చచ్చాం రా బాబు. ఒక్క అబద్దం చెపితే దాన్ని కప్పిపుచ్చటానికి ఎన్ని అబద్దాలు చెప్పాలో!' అనుకొని
'అంటే ఆ కోతి పిల్లకి పళ్ళు వచ్చేసాయన్న మాట. కానీ దాని మమ్మీకి ఆ విషయం యింకా తెలీదు. అందుకని అలా అందన్నమాట' అన్నాడు.
పిల్లలకి పూర్తి సంతృప్తి కలగకపోయినా 'సర్లే చెప్పు ' అన్నారు.
హమ్మయ్య అనుకొని మళ్ళీ మొదలెట్టాడు 'కోతి వాళ్ళ అమ్మ సరేనని టెన్ రూపీస్ ఇచ్చింది బ్రష్షు కొనుక్కోవటానికీ. అప్పుడా కోతి ఆ డబ్బులు తీసుకొని షాప్ కి వెళ్ళి 'హే బాబూ నాకు ఓ బ్రష్షూ, ఓ టంగ్ క్లీనర్....అదే 'టంక్లీట్' యివ్వు అందీ.
ఆ షాపు వాడు ఆ డబ్బులు తీసుకొని ఓ బ్రష్షూ ఓ టంక్లీటు ఇచ్చాడు. వాటిని తీసుకొని పులి దగ్గరకెళ్ళింది కోతి. పులితో 'నాకు పళ్ళు తోముకోవటమెలాగో చెప్పవా? అంది కోతి.
పులి 'సరే' అని కోతికి పళ్ళు ఎలా తోముకోవాలో చూపించింది.
'ఎలా చూపించింది? అని అడిగారు పిల్లలిద్దరూ ఒకేసారి.
యిందాక శ్రావణి వినిపించిన ఆ సౌండ్స్ యిద్దరికీ తెగ నచ్చేశాయి మరి. పిల్లల ఉత్సాహాన్ని గమనించిన శ్రావణి నవ్వుకొని మళ్ళీ మొదలెట్టాడు 'షుక్ షుక్....'
అలా కోతి పులి దగ్గర పళ్ళు ఎలా తోముకోవాలో నేర్చుకొని తను కూడా పళ్ళు తోమేసుకుంది యిలా 'షిక్ షిక్....షుయ్ షుయ్..........'.
అలా తోమేసుకున్నాక కోతీ, పులీ యిద్దరూ కలిసి పాట పాడుకున్నాయి ' అన్నాడు.
'హయ్...పాటా? ఏ పాట? చెప్పవా? అడిగారు.
పాడసాగాడు 'నీకు బ్రష్షు ఉంది... నాకు బ్రష్షు ఉంది.....నీకు టంక్లీట్ ఉంది....నాకు టంక్లీట్ ఉంది..... నువ్వు పళ్ళు తోముకున్నావు.......నేను పళ్ళు తోముకున్నాను......నువ్వు టంక్లీట్ చెసుకున్నావ్........ నేను టంక్లీట్ చేసుకున్నాను...... హేయ్ హేయ్ హేయ్.....హేయ్ హేయ్ హేయ్....ఆ జుంబలకా ఝుం......ఆ జమకు జమా ఝుం..... తద్దినకా ఠం.......తద్దినకా ఠం....' మాంచి లయబద్దంగా పాడసాగాడు శ్రావణి.
పిల్లలు ఆనందంతో చప్పట్లు కొట్టసాగారు. వాళ్ళ ఉత్సాహం చూసేసరికి యింకా రెచ్చిపోయాడు శ్రావణి. మొత్తానికి కధని ఆ విధంగా పూర్తి చేసాడు. పిల్లలు ఓ ట్రాన్స్ లో ఉన్నట్టయిపోయారు ఆ కధ విని.
'కధ బాగుందా? అడిగాడు శ్రావణి.
'ఓ చాలా బాగుంది ' అన్నారు.
'సరే యిక పడుకోండి ' అన్నాడు.
సరేనని పడుకున్నారిద్దరూ ఆనందంగా.
* * *
తెల్లారాక మావయ్య, అత్త యిద్దరూ అడిగారు 'ఏరా శ్రావణీ. రాత్రి నిద్ర బాగా పట్టిందా? వీళ్ళు ఏమీ యిబ్బంది పెట్టలేదు కదా? అన్నారు.
'అబ్బే. అదేం లేదు మావయ్యా. యిబ్బందేమీ పెట్టలేదు. రాత్రి ఓ కధ చెప్పాను అది విని పడుకుండిపోయారు ' అన్నాడు.
'కధా? ఏం కధ? అడిగాడు మామయ్య.
గతుక్కుమన్నాడు శ్రావణి. కొంప తీసి ఆ కధ యిప్పుడు మళ్ళీ చెప్పాలా ఏంటీ అనుకొని
'అబ్బే మామూలు కధే మావయ్యా పులీ కోతి కధ' అన్నాడు.
'సర్లే' అన్నాడు మావయ్య.
ఆ సాయంత్రం ఆ కాలనీ లోని పిల్లలందరూ ఒక చోట చేరారు. మావయ్య పిల్లలూ వాళ్ళతో కలిసి ఆడుకున్నారు. కాసేపటి తర్వాత మామయ్య పిల్లలు మిగతా పిల్లల్నందరినీ తీసుకొని వచ్చారు శ్రావణి దగ్గరికి.
'మావయ్యా మావయ్యా రాత్రి చెప్పావే బ్రష్షు కధ. ఆ కధ మళ్ళీ చెప్పవా? మా ఫ్రెండ్స్ వింటారంట ' అన్నారు. తక్కిన పిల్లలంతా చాలా ఆశక్తిగా చూస్తున్నారు అతను చెప్పే కధ కోసం.
శ్రావణికి గర్వంగా అనిపించింది. తను ఏదో సరదాగా అల్లిన కధ పాపులర్ అయినందుకు. ఒక్కసారిగా ఉత్సాహమొచ్చేసింది అతనికి. అటూ యిటూ చూసుకొని మళ్ళీ మొదలెట్టాడు.
'ఒక ఊరిలో ఒక పులి ఉందంట.............
పళ్ళు తోముకొనే భాగము వచ్చేసరికి పిల్లలు కేరింతలు కొట్టారు. అతనితోపాటు వాళ్ళు కూడా సౌండ్ చేయసాగారు 'షుక్ షుక్...షుక్ షుక్.....షుయ్...షుయ్.....' అనుకుంటూ.
అతను చెప్పిన కధ వాళ్ళందరికీ తెగ నచ్చేసింది అందరికీ. అది విని వెళ్ళిపోయారు ఆనందంగా.
* * *
ఆ రోజు గడిచింది. తర్వాత రోజు పక్కింటావిడెవరో వచ్చింది వచ్చింది మావయ్య వాళ్ళింటికి. ఆవిడ శ్రావణి వాళ్ళ అత్త తో అంటోంది 'మీ యింటికి ఎవరో అబ్బాయొచ్చాడుగా అతనెవరండీ? అడిగిందావిడ.
'మా వారి అక్కయ్య గారబ్బాయండి పేరు శ్రావణీ అంది అత్తయ్య.
'శ్రావణీయా? భలే ఉందే! అందావిడ
పక్క రూం లో వింటున్న శ్రావణికి వళ్ళు మండింది. అయినా వింటున్నాడు వాళ్ళ మాటల్ని.
'ఒక సారి పిలుస్తారా? అందావిడ
'శ్రావణీ. ఒకసారి యిలా రామ్మా. ఆంటీ గారు పిలుస్తున్నారు' అంది అత్తయ్య.
శ్రావణి వెళ్ళావిడ దగ్గరికి.
'బాబూ నువ్వేనా శ్రావణి అంటే?'
'అవునండి నేనే. చెప్పండి ' అన్నాడు శ్రావణి.
'ఏమీ లేదు బాబూ! నువ్వు ఏదో బ్రష్షు కధ చెప్పావటగా. ఆ కధ చెప్పమని మా వాడు బుర్ర తినేస్తున్నాడు. ఆ కధేంటో ఒక సారి చెప్పవా? మళ్ళీ నువ్వెళ్ళిపోయావంటే ఆ కధ చెప్పటానికి ఎవరూ ఉండరు.' అంది.
శ్రావణికి మతి పోయింది తన కధ యింత సూపర్ హిట్టయినందుకు. కానీ ఆ కధ యీవిడకి ఎలా చెప్పాలి? ఆ సౌండ్స్ అవీ యీవిడ దగ్గర ఎలా చేయాలి అని. అబ్బే కుదరదులే అనుకొని
'అబ్బే! అదేమీ కధేమీ కాదండీ. ఏదో సరదాగా అల్లానంతే.' అన్నాడు.
'ఫర్వాలేదు. ఆ అల్లిన కధే చెప్పు బాబూ. మా వాడికి ఆ కధ చెప్పేంతవరకూ ఊరుకొనేలా లేడు.' అంది.
కాసేపు తప్పించుకోవటానికి చూసాడు గానీ ఆవిడ చెప్పేంత వరకూ ఊరుకోలేదు. యిక తప్పలేదు శ్రావణికి. ఆ పులీ కోతీ కధ చెప్పాడు కాకపోతే బ్రష్షు తోముకొనే సౌండులు లేకుండా చెప్పాడు.
ఆవిడ కధంతా విని 'ఓస్ యింతేనా? యిందులో కధేముంది? పులీ కోతి పళ్ళు తోముకోవటమేగా!' అని నవ్వింది.
శ్రావని కూడా నవ్వి ఊరుకున్నాడు. ఆవిడెళ్ళిపోయింది. యింకో యిరవై నిమిషాల తర్వాత యింకో ఆవిడొచ్చింది. ఆవిడది కూడా అదే గోల. ఆవిడకి కూడా కధ చెప్పక తప్పలేదు. ఆవిడకి కూడా ఆ సౌండులు లేకుండానే చెప్పాడు. అలా ఆ రోజంతా ఎనిమిది మంది వచ్చారు ఆ కధ వినటానికి. శ్రావణికి పిచ్చెక్కిపోయింది. అతనికే కాదు అతని అత్తయ్యకి కూడా. మొత్తానికి అతని కధ పిల్లలకే కాదు వాళ్ళ తల్లులకి కూడా చెప్పాల్సొచ్చింది శ్రావణికి. ఆ రోజు రాత్రి పిల్లలు మళ్ళీ మొదలెట్టారు కధ చెప్పమని. శ్రావణి కి భయమేసింది. ఒక్క కధ చెప్పినందుకే యింత దారుణంగా ఉంటే మళ్ళీ యింకో కధా? చస్తే చెప్పను గాక చెప్పను అనుకొని 'కధలూ లేవు గిధలూ లేవు పడుకోండి ' అని కసురుకున్నాడు. వాళ్ళూరుకోలేదు 'యింకో కధ వద్దు మావయ్యా.... బ్రష్షు కదే చెప్పు ' అన్నారు.
హతవిధీ అనుకొని ' అది ఆల్రెడీ చెప్పాను కదా మళ్ళీ ఎందుకు?' అన్నాడు.
వాళ్ళూరుకోలేదు. ఆ కధ చెప్పాల్సిందే అని పట్టుపట్టారు. యిక తప్పదనుకొని కధ మొదలెట్టబోతోండా తలుపు కొట్టిన శబ్దం వినిపించింది.
మామయ్య వెళ్ళి తలుపు తీసాడు. బయట ఆ కాలనీలోని ఆంటీలు అందరూ వచ్చారక్కడికి. 'ఏమండీ మీ మేనల్లుడిని పిలవండొకసారి ' అన్నారు అందరూ.
'ఎందుకండీ? అడిగాడు మామయ్య.
'ఏమీ లేదు ఒక్క సారి పిలవండి ' అన్నారు.
మామయ్య కొంచెం కంగారు పడ్డాడు. లోపలికి శ్రావణి దగ్గరకొచ్చి 'ఒరేయ్ శ్రావణీ! ఒకసారి బయటకి రా! కాలనీ వాళ్ళంతా అడుగుతున్నారు నిన్ను. ఏమయింది?' అన్నాడు.
శ్రావణి కి అర్ధమైపోయింది మళ్ళీ ఆ కధ కోసమేనని. చిరాకొచ్చింది అతనికి. యిదేం గోలరా బాబు అనుకుంటూ
'ఏమీ లేదు మామయ్యా. ఒక సారి వెళ్ళొస్తా' అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్ళంతా తన దగ్గరకొచ్చి కధ చెప్పించుకున్న ఆంటీలే. మళ్ళీ వచ్చారేంటబ్బా అనుకుంటుండగా ఒక ఆంటీ అంది అతనితో
'చూడు శ్రావణీ! నువ్వు చెప్పిన కధ ని నువ్వు చెప్పినట్టే చెప్పాము. కానీ వాళ్ళు వినటం లేదు. అందులో ఏవో బ్రష్షు తోముకొనే సౌండ్లు చేసావంట కదా! అవేంటో ఒక సారి చేసి చూపించు. మా వాడు ప్రాణం తీసేస్తున్నాడు ఆ సౌండ్లతోనే కధ చెప్పమని. ఒక సారి ఆ సౌండ్లు ఎలా చేయాలో చెప్పు.ఆ! అన్నట్టు కధ చివరలో ఏదో పాట కూడా ఉంటుందంటగా. అది కూడా ఎలా పాడాలో చెప్పు' అన్నారు.
శ్రావణీకి ఏమీ వినబడటం లేదు.
నా పేరు హేమ కుమార్ ......నన్ను అందరూ హేమా అని పిలుస్తారు .......క్రోతవాళ్ళు ఎవరో అమ్మయిని పిలిచారే అని చాల సార్లు పొరబడ్డారు
ReplyDelete:-)
ReplyDelete