Sunday, 24 November 2013

బాగా బోర్ కొడుతోందా?

బాగా బోర్ కొడుతోందా? జీవితం నిస్సారంగా అనిపిస్తోందా? చిరాగ్గా ఉందా? ఏమీ తోచడం లేదా? అయితే ఈ క్రింద చెప్పిన వాటిలో మీకు నచ్చింది చేయండి.

ఏదైనా పార్కుకెళ్ళండి. వాకుంగు చేయటానికొచ్చే 'తాతారావు'లుంటారు. పది నిమిషాలు వాకింగు చేసి, ఓ రెండు గంటలు కూర్చొని  రాజకీయాలనించి సినిమాల దాక అన్ని విషయాలు తమకే తెలుసన్నట్టు అనర్గళంగా ఉపన్యాసం దంచేస్తుంటారు. అవి వింటే కాస్త బోర్ తగ్గచ్చేమో.

బాలేదా? అయితే రైల్వే స్టేషనుకెళ్ళండి.  ఖాళీగా ఉన్న ఓ బెంచీ మీద కూర్చొని ట్రైను ఎక్కే దిగే జనాల్ని గమనించండి. వీలుంటే ఓ టీటీ దగ్గరకెళ్ళి బెర్త్ యిమ్మని అడగండి. షరా మామూలుగా లేదనే చెప్తాడు. అయినా వదలకండి, బ్రతిమలాడండి. ఫ్యామిలీ తో వచ్చానని దీనంగా చెప్పండి. డబ్బులిస్తానని చెప్పండి. సరేనన్నాడనుకోండి ఫ్యామిలీని తీసుకొస్తానని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోండి.
అక్కడే సెండాఫివ్వటానికొచ్చే వాళ్ళు, వాళ్ళకి దూరమవుతున్న వాళ్ళ ఫీలింగ్సూ గమనించండి.  ట్రైను బయల్దేరేటప్పుడు వాళ్ళతో పాటూ మీరు కూడా వాళ్ళకి టాటా చెప్పండి. స్టేషనులోపలికి వెళ్ళేటపుడు ప్లాట్ ఫాం టికెట్ తీసుకోవటం మాత్రం మర్చిపోకండేం!  

Saturday, 16 November 2013

నో ఓట్......నో రేషన్

టు వేయకపోతే ప్రభుత్వ సబ్సిడీలు, మరే యితర ప్రభుత్వ ఫలాలు అనుభవించడానికి అర్హత కోల్పోతారు అనే ఓ నిబంధన పెడితే బాగుంటుంది కదా. చచ్చినట్టు అందరూ ఓటు వేస్తారు.

 

Friday, 15 November 2013

ఆడవారిని లైంగిక దాడుల నించి కాపాడే మార్గమేదైనా ఉందా?

ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి, సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో  కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు. మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ. 

వరైనా ఒక చిన్న పరికరాన్ని కనిపెడితే బాగుండును. అది ఎలాంటిదై ఉండాలంటే....... ఒక చేతిలో పట్టేంత ఉండాలి. పాకెట్ లో పట్టేంత ఉంటే మరీ బాగుంటుంది. ఆ పరికిరం కి ఒక బటనుండాలి. ఆ బటను నొక్కితే ఓ మూడు (3) కిలోమీటర్ల వరకు వినబడేంత గట్టిగా సౌండు రావాలి. దాన్ని క్రింద కొట్టినా లేక పగలగొట్టినా పగలనంత గట్టిదై ఉండాలి. కానీ ఆ శభ్డాన్ని ఆపాలంటే పోలీసు వాళ్ళు వచ్చి లాక్ ఓపెన్ చేస్తే తప్ప ఇంకెవరూ ఆపలేని పరిస్థితి ఉండాలి. ప్రతీ అమ్మాయీ, ప్రతీ మహిళ ఆ పరికరాన్ని తమ వెంట ఎప్పుడూ ఉంచుకోవాలి. ఎవరైనా వారి మీద లైంగిక దాడి చేయటానికి ప్రయత్నించినపుడు వారు వెంటనే ఈ పరికరము లోని బటన్ ని నొక్కాలి. వెంటనే అది గట్టిగా ఓ మూడు కిలోమీటర్లు వినబడేంత శబ్దం చేయాలి. దాడి చేయటానికి వచ్చిన వాడు ఆ పరికరాన్ని పగలకొట్టటానికి ప్రయత్నించినా పగలదు. దాంతో వాడు పలాయనం చిత్తగించాలి. ఆ శబ్డం విని చుట్టు ప్రక్కల వాళ్ళు అక్కడికి చేరుకోవాలి. ఆ అమ్మాయిని కాపాడాలి. దాని లాక్ మాత్రం పోలీసుల దగ్గరే ఉండాలి.
ఎవరైనా యిలాంటి పరికరం కనిపెడితే బాగుంటుంది కదా? నా ఈ కల ఎప్పటికైనా నెరవేరుతుందంటారా?

((నవంబరు 15 న నేను పెట్టిన పోస్టు యిది)  

యిది ఈ రోజు అంటే 23.11.2013 ఈనాడు పేపర్ లో ప్రచురించిన వార్త. ఆదలో ఉన్న మహిళకు రక్షణ 'నిర్భయ '. ECIL తయారు చేసిన పరికరం (పేరు నిర్భయ) ఆడవారిని లైంగిక దాడికి గురైనపుడు బటన్ నొక్కితే తన బంధువులకు, సన్నిహితులకు, పోలీసులకు వెంటనే సమాచారం చేరుతుంది. సరిగ్గా యిలాంటి పరికరాన్నే నేను సూచించింది. కాకపోతే ECIL కి నా సూచన ఏమిటంటే ఆ పరికరానికి నేను సూచించిన విధంగా మీట నొక్కితే సౌండ్ గట్టిగా వచ్చే విధంగా ఉంటే బాగుంటుంది. తద్వారా దాడి చేసే వాడు భయపడే అవకాశముంటుంది. ఏది ఏమైనా చాలా సంతోషంగా ఉంది ఓ పరికరాన్ని కనిపెట్టినందుకు.    

పరీక్ష హాళ్ళో చండశాశనున్ని...... క్లాసు రూములో మాత్రం నిమిత్తమాత్రున్ని



మీరేం చదివారు? బీటెక్ లేదా ఎమ్మెస్సీ లేదా డిగ్రీ లేదా C.A లేదా ఎంబీబీఎస్ వీటిలో ఏదో ఒకటి చదివే ఉంటారు కదూమీరు ఇవి చదివారంటే పదో తరగతి నుంచి చాలా పరీక్షలు వ్రాసే ఉంటారు. మీరొకసారి పరీక్షలు జరిగే పద్దతి గుర్తు తెచ్చుకోండిఅక్కడ అంటే ఆ పరీక్ష జరిగే చోట వాటిని నిర్వహించే వారి తీరుతెన్నులు ఎలా ఉంటాయో గుర్తు తెచ్చుకోండి.
ఒక్క నిమిషంకే.......లం ఒక్క నిమిషం ఆలస్యంగా వస్తే మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు. మీరు ఎంత బ్రతిమలాడినా, ఎంత బామాడినా సరే. ఏమాత్రం కనికరం చూపరు. ఒక వేళ మీరు సమయానికొచ్చినా పరీక్ష జరిగే కాలేజీకో, యూనివర్సిటీ లోకి ప్రవేశిస్తున్నప్పుడు మిమ్మల్ని వళ్ళంతా తడిమి పరీక్షిస్తారు ఏమైనా స్లిప్పులో చీటీలో తెచ్చారేమోనని. తతంగం అయిపోయిన తర్వాత లోపలికెళ్ళాక అంటే పరీక్ష జరిగే చోటికెళ్ళాక యిన్విజిలేటరొకాయన మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తాడు 'ఏదైనా చీటీలు గానీ స్లిప్పులు గానీ ఉంటే బయట పారేయండి లేకపోతే పట్టుకుంటే డీబార్ చేసేస్తామని'.

Thursday, 14 November 2013

చివరికి వాళ్ళే మనోడి కొంప ముంచుతారు

పేకాట ఆడుతున్నప్పుడు ఎవరైనా డ్రాప్ గానీ మిడిల్ డ్రాప్ చేస్తే వాళ్ళు తన ప్రక్కనున్న ఆటగాడికి హెల్ప్ చేస్తుంటారు కార్డ్ డిస్కార్డ్ చేయటములోనూ, ఆట తిప్పడములోనూ అతను తన ప్రత్యర్ధి అని తెలిసినా సరే.

Sunday, 10 November 2013

లేకపోతే కధ వ్రాయమంటావా?

మీరు ఎవరికైనా ఒక పేపెరూ పెన్నూ యిచ్చి వ్రాస్తుందో లేదో పరీక్షించమని చెప్పండి. నూటికి తొంభై ఐదు మంది తమ సంతకాలు పెట్టడమో లేక తమ పేరు వ్రాయటమో చేస్తారు. కావాలంటే యీసారి పరీక్షించండి.    

Wednesday, 6 November 2013

ఇంటింటా దీపావళి

మనమంతా దీపావళి టపాసుల కోసం వేలకి వేలు ఖర్చు పెట్టేస్తున్నామనీ, డబ్బుని కాల్చి తగలేస్తున్నామనీ, ఆ డబ్బుతో చాలా మంచి పనులు చేయొచ్చనీ యింటా బయట అందరూ అంటుంటారు. ఆ డబ్బుతో అనాధలకి తిండి పెట్టొచ్చనీ, బాలబాలికలకు బట్టలు కొనివ్వచ్చనీ, ఎంతో మంది నిరుపేదలకి వైద్య సహాయం చేయొచ్చనీ, యింకా యిలాంటివి చాలా మంచి పనులు చేయొచ్చని అంటారు. నిజమే. సంవత్సరానికి ఒక్కసారొచ్చే దీపావళి గురించి బాగానే చెపుతున్నారు. సంతోషం. మరి సంవత్సరమంతా జరుపుకొనే దీపావళి మాటేంటి? అవును. నేను చెప్పే దీపావళి 'సిగరెట్ స్మోకింగ్' గురించి. దీపావళి రోజున మహా అయితే ఓ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టామనుకుంటే ఈ సిగరెట్ స్మోకింగ్ చేసే వారికి ఆ ఖర్చు కేవలం నెల రోజులకే సరిపోతుంది.యింకా ఎక్కువ కూడా అవ్వొచ్చు. అంటే సంవత్సరానికి ఎంతవుతుందో ఆలోచించండి. అలా అని దీపావళి రోజున పెట్టే ఖర్చుని నేనేమీ సమర్ధించటం లేదు. కేవలం దీపావళి గురించి మాత్రమే విమర్శించేవాళ్ళు సిగరెట్ స్మోకింగ్ ని కూడా విమర్శిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు? 

Tuesday, 5 November 2013

మరి సమోసాలకి బదులు ఏమి అమ్మాలి?

ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి, సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో  కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు. మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ. 

కూల్ డ్రింక్స్ ఎక్కువ సేల్ అయ్యేది ఎక్కడో మీకు తెలుసా? గుర్తొచ్చిందా? అవును. సినిమా థియేటర్లలో. ఇంటెర్వెల్ టైములో కూల్ డ్రింక్ కి మొఖం వాచిపోయినట్టు తెగ తాగేస్తారు జనం. ఎగబడి ఎగబడీ మరీ కొనుక్కుంటారు. మామూలుగా బయట పద్నాలుగు రూపాయలుండే కూల్ డ్రింక్ అక్కడ మాత్రం యిరవై రూపాయలకు అమ్మినా ఏ మాత్రం ఖాతరు చేయరు.  కానీ ఈ కూల్ డ్రింకుల వలన ఆరోగ్యం పాడవటం తప్ప ఏ విధమైన ప్రయోజనమూ లేదు. అందుకని నాకొచ్చిన ఐడియా చెపుతాను. కూల్ డ్రింక్ స్థానం లో కొబ్బరి బొండాలు అమ్మితే ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యానికి ఆరోగ్యమూ, అమ్మకాలకి అమ్మకాలూ.  ఎలా ఉంది?  

Sunday, 3 November 2013

అంతా బ్లాకు మయం...ఈ జగమంతా బ్లాకు మయం

మీకొక చిన్న పరీక్ష. మన రాష్ట్రంలో సినిమా హాల్లో గానీ, రైల్వే స్టేషన్ లో గానీ, బస్ స్టేషన్ లో గానీ, ఒక కూల్ డ్రింక్ గానీ వాటర్ బాటిల్ గానీ కొనండి. ఆ బాటిల్ మీద ఉన్న అసలు  రేటుకి గానీ మీరు కొనగలిగితే మీరు చాలా అదృష్టవంతుల క్రిందే లెక్క. కానీ నా అభిప్రాయము ప్రకారము మీరు ఎట్టి పరిస్తితుల్లోనూ అదృష్టవంతులయ్యే అవకాశమే లేదు. బాటిల్ రేట్ కన్నా రెండ్రూపాయలో మూడ్రూపాయలో ఎక్కువ పెట్టి కొనాల్సిందే.పట్టించుకొనే నాధుడే లేడు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తారనే భయం కూడా లేదు. మీరు ఒకవేళ దాన్ని ప్రశ్నించినా మిమ్మల్ని ఓ వెర్రి వెధవలా చూస్తారు. గట్టిగా అడిగితే అవి పాత రేట్లంటారు. యివే కాదు. గోలీకాయలంత సైజు ఉండే మూడు సమోసాలు పది రూపాయలట. రెండు గరిటల క్వాంటిటీ ఉండే పాప్ కార్న్ పేకెట్ పదిహేను రూపాయలు. బయట న్యూస్ పేపెరు రేటు ఐదు రూపాయలుంటే అక్కడ ఆరు రూపాయలు.  చాలా దారుణమైన విషయమేమిటంటే మామూలు షాపుల్లో కూడా యిదే విధానాన్ని అమలు చేస్తున్నారు.