Friday 9 February 2018

ఫార్మాలిటీ బాబోయ్!

నిన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటన కు వెళ్లారు. దేనికి అంటే ఏదో ఇండస్ట్రియల్ సెమినార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికట. అలాగే అప్పుడెప్పుడో అమరావతి శంఖుస్థాపనకి పిలవడానికి ప్రధానమంత్రి మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు విమానంలో వెళ్లారు. అలాగే పుష్కర ప్రారంభోత్సవాలు గట్రా ఇలా బోలెడన్ని ఆహ్వానాలకి అయ్యే ప్రయాణ ఖర్చులు లక్షలు.... కోట్లు.... ఇదంతా మన డబ్బే...కేవలం ఫార్మాలిటీ కోసం ఇన్ని కోట్లు అంటే ఎలా? అసలు ఓ ఫోన్ చేసి ఆహ్వానిస్తే పోలా అంటే అబ్బే పద్దతి ప్రకారం దగ్గర కొచ్చి ఆహ్వానించాలి అంటారు. కానీ ఈ ఫార్మాలిటీ కోసం ఎన్ని కోట్లు ఖర్చయిపోతున్నాయో చూడండి. 
ఆ మధ్య ఓ శంఖుస్థాపనకి ఆహ్వానించడానికి ప్రభుత్వం తరపున ఓ కానిస్టేబుల్ కార్డు పట్టుకొని మన ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళితే ఠాట్..అఫ్తారాల్ ఓ కానిస్టేబుల్ తో కార్డు పంపిస్తారా అని అలిగి ఆయన తిరుపతి చెక్కేసాడు ఫ్యామిలీ తో సహా (ఎవరూ పిలవకపోయినా).
కొన్నాళ్ళ క్రితం నా సహోద్యోగి తన పెళ్లి గురించి చెపుతూ "నా పెళ్లి పనులన్నీ మా మావయ్యే దగ్గరుండి చూసుకున్నారు అందరినీ పిలవడంతో సహా. తీరా పెళ్లిరోజున ఆయన మాకెవ్వరికీ కనబడలేదు. ఏమైందోనని కంగారుగా ఆయనింటికెళితే ఇంట్లోనే భేషుగ్గా ఉన్నాడు. పెళ్లికి రాకుండా ఇక్కడున్నారేంటి అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం విని మాకు దిమ్మ తిరిగిపోయింది". ఇంతకీ ఆయనన్నదేంటంటే " పెళ్లి కార్డులు పట్టుకుని ప్రతీ ఇంటికి వెళ్ళాము కానీ ఆ కార్డు నాకు ఇచ్చారా? పిలవని పెళ్లికి నేనెందుకొస్తా? అందుకే రాలేదు పెళ్లికి"

Wednesday 7 February 2018

నమ్మకమే జీవితం

నేనెవరినీ నమ్మను....మనుషులంటే అస్సలు నమ్మకం లేదు" ఇలాంటి మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. కావొచ్చు కానీ జీవితంలో ప్రతీ నిమిషం ఎవరో ఒకరిని నమ్మి తీరాల్సిందే. నమ్ముతూనే ఉండాల్సిందే. ఒక బస్సో రైలో ఎక్కామంటే డ్రైవర్ని నమ్ముతాము సక్రమంగా నడుపుతాడని. ఒక హోటల్ కి వెళితే వాళ్ళు పెట్టిన పదార్థాలు తాజావనే నమ్మి తీరాలి. ఒకవేళ అనుమానం వచ్చినా చేసేది కూడా ఏమీ లేదనుకోండి. ఒక దర్శకుడు సినిమా తీస్తే జనం చూస్తారని నమ్మకం.... ఒక సినిమా కి వెళ్లే ప్రేక్షకుడు బానే ఉంటుందని నమ్మకం.... ఇలా అన్ని చోట్లా అన్ని రకాలుగా తోటి మనిషిని నమ్మకపోతే జీవితమే లేదు
 నమ్మకమే జీవితం.

Wednesday 31 January 2018

ఇంగ్లీష్ మోజు

ఎందుకో గానీ తమిళ సినీ దర్శకులకి ఇంగ్లీష్ టైటిల్స్ అంటే మహా మోజు. కానీ తమిళనాడు లో ఇంగ్లీషు టైటిల్స్ మీద ఉన్న నిషేధం(పెట్టుకోవచ్చు కానీ తమిళ టైటిల్స్ పెట్టుకుంటే రాయితీలు ఇస్తారు) కారణంగా అక్కడ ఆ టైటిల్స్ పెట్టరు. కానీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి మాత్రం ఎంచక్కా ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేస్తారు. ఉదాహరణకు

తమిళ పేరు.                 తెలుగు పేరు
యందిరన్.                    రోబో
థానా సెర్న్ ద కూట్టం      గ్యాంగ్
7ఆమ్ అరివు                సెవెంత్ సెన్స్
ఎంగేయుమ్ ఎప్పోదుం   జర్నీ
చెన్నెయిల్ ఒరుణాల్       ట్రాఫిక్
ఒరు కాల్ ఒరు కన్నాడి    ఓకే ఓకే
ఐ   (అందం)                  ఐ (ఇంగ్లీష్)
                                     

Friday 8 September 2017

కొత్త సీసాలో పాత సారా

కోదండ రామిరెడ్డి
ముత్యాల సుబ్బయ్య
రేలంగి నరసిం హారావు
కోడి రామకృష్ణ
మోహన్ గాంధీ
పీ.ఎస్. రామచంద్రా రావు
వీళ్ళంతా గుర్తున్నారా? ఒకప్పుడు తెలుగు సినిమాను ఏలినవాళ్ళు. తమ దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమా గతిని మరో వైపు తిప్పిన వాళ్ళు అంటే అతిశయోక్తి కాదేమో?!. మరి వీళ్ళందరూ యిప్పుడెక్కడ? ఏమి చేస్తున్నారు? ఎందుకు వీళ్ళెవరూ ప్రస్తుతము సినిమాలకి దర్శకత్వం వహించడం లేదు? జవాబు అవకాశాలు లేకనే. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా యిది నిజం.
కోదండ రామిరెడ్డిని తీసుకోండి. ఈ రోజు తెలుగులో స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళంతా ఆయన సినిమాల వల్ల పేరు తెచ్చుకున్న వాళ్ళే. అప్పట్లో ప్రతీ హీరో, హీరోయిన్నూ ఆయన సినిమాలో నటించడానికి ఎంత తహతహలాడిపోయేవాళ్ళో!సంవత్సరానికి 4 సినిమాలు తీస్తే నాలుగూ హిట్టే. అలాంటి దర్శకుడికి అవకాశాలు లేకపోవడం శోచనీయం. అవకాశమిచ్చాక ఫెయిల్ అయితే వేరే సంగతి. అసలు అవకాశమే ఇవ్వకపోతే ఎలా? పోనీ ఇప్పుడున్న కొత్త దర్శకులు ఏమైనా విరగదీస్తున్నారా అంటే అదీ లేదు ( కొంత మంది విభిన్న చిత్రాలు తీస్తున్నారు. మిగిలిన వారు అందరూ మూస కొట్టుడే) కనీసం ఈ పాత దర్శకుల సేవల్ని ఏదో విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుందేమో. కధా చర్చలు, మాటలు, స్క్రీన్ ప్లే లాంటి విషయాల్లో వీరిని ఉపయోగించుకుంటే కాస్త క్వాలిటీ సినిమాలు చూసే భాగ్యం దక్కుతుందేమో. 

Saturday 2 September 2017

ఒక స్వప్నమేదో

ఒక స్వప్నమేదో అనిపిస్తోంది
నువు నా చెంతనే ఉన్నావని

ఒక స్వప్నమేదో కనిపిస్తోంది
నువు నన్ను ముద్దాడావని

ఒక స్వప్నమేదో తొలిచేస్తోంది
నువు నా ఊపిరి అని

ఒక స్వప్నమేదో కలవరపెడుతోంది
నువు నాతోనే ఉన్నావని

ఒక స్వప్నమేదో ప్రశ్నిస్తోంది
నువు నను తాకే క్షణమెపుడని

Wednesday 16 August 2017

యిచ్చట దెయ్యాలు సమర్పించును

పద్మశ్రీ అల్లు రామలింగయ్య సమర్పించు
గుల్షన్ కుమార్ ప్రెజెంట్స్
నిర్మాత : మాగంటి రవీంద్రనాధ్ చౌదరి
నిర్మాత : శ్రీమతి అనిత
ఏంటి వీళ్ళందరి గురించి రాసాననుకుంటున్నారా? వీళ్ళందరికీ ఓ సంబంధముంది. ఏంటంటారా? వీళ్ళెవరూ యిప్పుడు ఈలోకంలో లేరు. అంటే బ్రతికి లేరు. కానీ వీరందరూ ఎడాపెడా సినిమాలు తీసిపారేస్తున్నారు. అవును. నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా యిది నిజం. వీరందరూ చనిపోయినా వీళ్లల్లో కొంతమంది సినిమాలు సమర్పిస్తున్నారు, కొంతమంది సినిమాలు తీస్తున్నారు.
మరి చనిపోయిన వాళ్ళు ఎలా తీస్తారు అంటే తీస్తారు అంతే. మనం నమ్మాలి....నమ్మి తీరాలి. గమ్మత్తేమిటంటే వీళ్ళ పేరు ముందు "కీర్తిశేషులు" అనో లేదా "స్వర్గీయ" అని కూడా ఉండదు. మరి ఎలా సమర్పిస్తున్నారు? అంటే వీళ్ళ ఆత్మలు సమర్పిస్తున్నాయా? ఎలా సాధ్యం? పోనీ అదే నిజమనుకున్నా పద్మశ్రీ అల్లు రామలింగయ్య ఆత్మ సమర్పించు అని ఉండాలి కదా?
అప్పుడు ఇంకో అనుమానమొస్తుంది. ఆత్మలు లెక్కలు గట్రా ఎలా చూస్తాయి? చూడలేవు కదా? మరి లెక్కలు చూడలేనప్పుడు వీళ్ళ పేర్లు ఎందుకు వేస్తున్నారు? వీళ్ళ మీద గౌరవం తో వేస్తున్నారు అని అనుకున్నా వాళ్ళ ఆత్మలు సమర్పించలేవు కదా? అది అసాధ్యం కదా? సినిమాలు తీయలేవు కదా?
గౌరవముంటే వారి ఫోటో వేయడమో లేదా స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి దివ్య ఆశీస్సులతో అనో వేస్తే కొంత బాగుంటుందేమో. అలా కాకుండా ఏకంగా సినిమాలు సమర్పించేయడమంటే కొంత....కాదు .....చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.

Tuesday 15 August 2017

ఓ ధరహాసమా నీ మూలమెక్కడ

ఓ ధరహాసమా నీ మూలమెక్కడా అంటే
అందమైన ఆమె పెదవుల వెనుక దాగి ఉన్నానందట

ఓ సొగసా నువ్వెక్కడుంటావంటే
ఆమె నడుము ఒంపుల్లో  వెతకమందట

ఓ వయ్యారమా నీ చిరునామా ఏదంటే
ఆమె నడకలో కనబడతానందంట

ఓ జాణతనమా నీవెందులో ఉంటావంటే
ఆమె నడతలో ఇమిడి ఉంటానందట

ఓ నాజూకుతనమా నీవెలా ఉంటావంటే
ఆమెని స్పృశించి చూడు తెలుస్తుందంట

ఓ వెచ్చదనమా నీవెక్కడ దాగున్నావంటే
ఆమె కౌగిలిలో కనిపెట్టమందంట

ఓ తియ్యనిదనమా నిన్నెలా పొందాలి అంటే
ఆమె వెచ్చని ముద్దుల్లో ప్రయత్నించమందంట

ఓ నీటిబిందువా నీకు ఏది ఇష్టం అంటే
ఆమె నుదుటి నుండి పాదం వరకు జారడం అందంట

ఓ శృంగారమా నీ జన్మస్థానమేదంటే
ఆమె అణువణువునా తనువంతా కొలువై తీరానందట

Monday 14 August 2017

అమృతానికి చిరునామా

సంద్రాన్ని చిలికితే వచ్చేది అమృతమైతే
ఆ అమృతాన్ని చిరునామా అడిగితే
నీ పేరు చెప్పిందంట
చూస్తే చాలు
చిరంజీవిగా మారిపోతావందంట

Saturday 12 August 2017

నీవు

గతించిన గతానికి మధురజ్ఞాపకం నీవు
నడుస్తున్న కాలానికి వారధి అయ్యావు
అందమైన భవిష్యత్తుకు చిరుదివ్వెవి అవుతావు
మధురకావ్యానికి మనసైన రాగం నీవు
ముచ్చటగొలిపే రూపానికి
ముద్దొచ్చే ప్రతిబింబానివి నీవు

Thursday 6 July 2017

కూచిభట్ల శుభశ్రీకి పెళ్ళిచూపులంట

సరసస్వర సుర  చరీగమనమౌ
సామ వేద సారమిదీ
నే పాడిన జీవన గీతం ఈ గీతం
సిరివెన్నెల సినిమాలో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వస్తోంది రేడియో లో..
కాలేజీకి రెడీ అవుతోంది శుభశ్రీ తెగ హడావిడి పోతూ. 
"అమ్మా  బొట్టు బిల్లలెక్కడ పెట్టావే కనబడటం లేదు... "
వరండాలో తులసి మొక్కకి పూజ చేస్తున్న వాళ్ళమ్మ రాధాకుమారి అది విని "ఆ డ్రాయర్ సొరుగులో ఉంటాయి చూడు ..... అలాగే కళ్ళకి కాస్త కాటుక పెట్టుకోవే.... ఆ చిన్ని కళ్ళు అప్పుడన్నాకాస్త కనబడతాయి"
"అమ్మా... ఇంక్కొక్కసారి నా కళ్ళని కామెంట్ చేస్తే ఊరుకోను..... నాకు కాటుక ఇష్టం లేదని చిన్నప్పటినించి చెప్తున్నా... మళ్ళీ కాటుక పెట్టుకోమంటావేంటి?.... పైగా చిన్ని కళ్ళు అని పదే పదే అనకు... రుసరుస లాడింది తల్లి మీద. 
"అదేంటే కాటుక పెట్టుకుంటే తప్పేంటి... కళ్ళకి అందం...  చలవ...
తల్లి మాట పూర్తి కాకుండానే "నాకు సింపుల్ గా ఉండటమే ఇష్టమే.... పైగా కళ్ళకి కాటుక పెట్టుకోవడం ఏనాటి పధ్ధతి 
"అబ్బో మరి ముక్కుపుడక పెట్టుకోవడం ఏనాటి పద్దతినిమ్మ ముల్లుతో పొడుచుకున్నావుగాలాజిక్ మాట్లాడింది  ఆవిడ.
"సర్లె మాట్లాడితే నా ముక్కుపుడక దగ్గరికి వెల్లిపోతావు"....అందంగా విసుక్కుంది తల్ల్లి మీద.
"సర్లె...కాస్త నెమ్మది.....నడుము అసలే నిలబడదు నీకు..... కూతుర్ని మురిపంగా చూసుకుంటూ.
"సర్లే వస్తా... నాన్నగారూ... అంటూ ఆయన రూం కి వెళ్ళింది. ఒక క్లైంట్ తో మాట్లాడుతున్నాడాయన.    
"వెల్లొస్తానండి" 
అలాగే నమ్మా...డ్రాప్ చేయమంటావా
వద్దు నేను వెళతాను....
శుభశ్రీని చూసిన ఆ క్లయింట్ ఆశ్చర్యపోయి  
ఎవరండి మీ బంధువులమ్మాయా? అని అడిగాడు.