Sunday, 25 February 2018

అనిల్ రావిపూడికి హింటిస్తున్నావా బాబూ

మీరొకటి గమనించారా? పటాస్ సినిమాలో నటించిన హీరోయిన్ శ్రుథి సోధిని ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి తన రెండో సినిమా సుప్రీం సినిమాలో హీరోయిన్ గా తీసుకోలేదు గానీ ఆ సినిమాలో ఓ పాటకి ఆడిపాడే అవకాశమిచ్చాడు. అలాగే సుప్రీం సినిమా హీరోయిన్ రాశీఖన్నాని తన మూడో సినిమా రాజా దీ గ్రేట్ సినిమాలో ఓ పాటలో నటింపచేసాడు. నాకెందుకో రాజా దీ గ్రేట్ లో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ ని తన తరువాతి సినిమాలో ఓ పాటలో నటింపచేస్తాడు అనిపిస్తోంది. మీకూ అనిపిస్తోంది కదూ! 

Friday, 9 February 2018

ఫార్మాలిటీ బాబోయ్!

నిన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటన కు వెళ్లారు. దేనికి అంటే ఏదో ఇండస్ట్రియల్ సెమినార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికట. అలాగే అప్పుడెప్పుడో అమరావతి శంఖుస్థాపనకి పిలవడానికి ప్రధానమంత్రి మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు విమానంలో వెళ్లారు. అలాగే పుష్కర ప్రారంభోత్సవాలు గట్రా ఇలా బోలెడన్ని ఆహ్వానాలకి అయ్యే ప్రయాణ ఖర్చులు లక్షలు.... కోట్లు.... ఇదంతా మన డబ్బే...కేవలం ఫార్మాలిటీ కోసం ఇన్ని కోట్లు అంటే ఎలా? అసలు ఓ ఫోన్ చేసి ఆహ్వానిస్తే పోలా అంటే అబ్బే పద్దతి ప్రకారం దగ్గర కొచ్చి ఆహ్వానించాలి అంటారు. కానీ ఈ ఫార్మాలిటీ కోసం ఎన్ని కోట్లు ఖర్చయిపోతున్నాయో చూడండి. 
ఆ మధ్య ఓ శంఖుస్థాపనకి ఆహ్వానించడానికి ప్రభుత్వం తరపున ఓ కానిస్టేబుల్ కార్డు పట్టుకొని మన ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళితే ఠాట్..అఫ్తారాల్ ఓ కానిస్టేబుల్ తో కార్డు పంపిస్తారా అని అలిగి ఆయన తిరుపతి చెక్కేసాడు ఫ్యామిలీ తో సహా (ఎవరూ పిలవకపోయినా).
కొన్నాళ్ళ క్రితం నా సహోద్యోగి తన పెళ్లి గురించి చెపుతూ "నా పెళ్లి పనులన్నీ మా మావయ్యే దగ్గరుండి చూసుకున్నారు అందరినీ పిలవడంతో సహా. తీరా పెళ్లిరోజున ఆయన మాకెవ్వరికీ కనబడలేదు. ఏమైందోనని కంగారుగా ఆయనింటికెళితే ఇంట్లోనే భేషుగ్గా ఉన్నాడు. పెళ్లికి రాకుండా ఇక్కడున్నారేంటి అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం విని మాకు దిమ్మ తిరిగిపోయింది". ఇంతకీ ఆయనన్నదేంటంటే " పెళ్లి కార్డులు పట్టుకుని ప్రతీ ఇంటికి వెళ్ళాము కానీ ఆ కార్డు నాకు ఇచ్చారా? పిలవని పెళ్లికి నేనెందుకొస్తా? అందుకే రాలేదు పెళ్లికి"

Wednesday, 7 February 2018

నమ్మకమే జీవితం

నేనెవరినీ నమ్మను....మనుషులంటే అస్సలు నమ్మకం లేదు" ఇలాంటి మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. కావొచ్చు కానీ జీవితంలో ప్రతీ నిమిషం ఎవరో ఒకరిని నమ్మి తీరాల్సిందే. నమ్ముతూనే ఉండాల్సిందే. ఒక బస్సో రైలో ఎక్కామంటే డ్రైవర్ని నమ్ముతాము సక్రమంగా నడుపుతాడని. ఒక హోటల్ కి వెళితే వాళ్ళు పెట్టిన పదార్థాలు తాజావనే నమ్మి తీరాలి. ఒకవేళ అనుమానం వచ్చినా చేసేది కూడా ఏమీ లేదనుకోండి. ఒక దర్శకుడు సినిమా తీస్తే జనం చూస్తారని నమ్మకం.... ఒక సినిమా కి వెళ్లే ప్రేక్షకుడు బానే ఉంటుందని నమ్మకం.... ఇలా అన్ని చోట్లా అన్ని రకాలుగా తోటి మనిషిని నమ్మకపోతే జీవితమే లేదు
 నమ్మకమే జీవితం.

Wednesday, 31 January 2018

ఇంగ్లీష్ మోజు

ఎందుకో గానీ తమిళ సినీ దర్శకులకి ఇంగ్లీష్ టైటిల్స్ అంటే మహా మోజు. కానీ తమిళనాడు లో ఇంగ్లీషు టైటిల్స్ మీద ఉన్న నిషేధం(పెట్టుకోవచ్చు కానీ తమిళ టైటిల్స్ పెట్టుకుంటే రాయితీలు ఇస్తారు) కారణంగా అక్కడ ఆ టైటిల్స్ పెట్టరు. కానీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి మాత్రం ఎంచక్కా ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేస్తారు. ఉదాహరణకు

తమిళ పేరు.                 తెలుగు పేరు
యందిరన్.                    రోబో
థానా సెర్న్ ద కూట్టం      గ్యాంగ్
7ఆమ్ అరివు                సెవెంత్ సెన్స్
ఎంగేయుమ్ ఎప్పోదుం   జర్నీ
చెన్నెయిల్ ఒరుణాల్       ట్రాఫిక్
ఒరు కాల్ ఒరు కన్నాడి    ఓకే ఓకే
ఐ   (అందం)                  ఐ (ఇంగ్లీష్)
                                     

Friday, 8 September 2017

కొత్త సీసాలో పాత సారా

కోదండ రామిరెడ్డి
ముత్యాల సుబ్బయ్య
రేలంగి నరసిం హారావు
కోడి రామకృష్ణ
మోహన్ గాంధీ
పీ.ఎస్. రామచంద్రా రావు
వీళ్ళంతా గుర్తున్నారా? ఒకప్పుడు తెలుగు సినిమాను ఏలినవాళ్ళు. తమ దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమా గతిని మరో వైపు తిప్పిన వాళ్ళు అంటే అతిశయోక్తి కాదేమో?!. మరి వీళ్ళందరూ యిప్పుడెక్కడ? ఏమి చేస్తున్నారు? ఎందుకు వీళ్ళెవరూ ప్రస్తుతము సినిమాలకి దర్శకత్వం వహించడం లేదు? జవాబు అవకాశాలు లేకనే. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా యిది నిజం.
కోదండ రామిరెడ్డిని తీసుకోండి. ఈ రోజు తెలుగులో స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళంతా ఆయన సినిమాల వల్ల పేరు తెచ్చుకున్న వాళ్ళే. అప్పట్లో ప్రతీ హీరో, హీరోయిన్నూ ఆయన సినిమాలో నటించడానికి ఎంత తహతహలాడిపోయేవాళ్ళో!సంవత్సరానికి 4 సినిమాలు తీస్తే నాలుగూ హిట్టే. అలాంటి దర్శకుడికి అవకాశాలు లేకపోవడం శోచనీయం. అవకాశమిచ్చాక ఫెయిల్ అయితే వేరే సంగతి. అసలు అవకాశమే ఇవ్వకపోతే ఎలా? పోనీ ఇప్పుడున్న కొత్త దర్శకులు ఏమైనా విరగదీస్తున్నారా అంటే అదీ లేదు ( కొంత మంది విభిన్న చిత్రాలు తీస్తున్నారు. మిగిలిన వారు అందరూ మూస కొట్టుడే) కనీసం ఈ పాత దర్శకుల సేవల్ని ఏదో విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుందేమో. కధా చర్చలు, మాటలు, స్క్రీన్ ప్లే లాంటి విషయాల్లో వీరిని ఉపయోగించుకుంటే కాస్త క్వాలిటీ సినిమాలు చూసే భాగ్యం దక్కుతుందేమో. 

Thursday, 7 September 2017

చెప్పాలనుకున్నా

రాయాలనుకున్నా పదాలు దొరకడం లేదు
నీ అందాన్ని వర్ణించడానికి

చూడాలనుకున్నా కళ్ళు చాలడంలేదు
నీ సోయగాన్ని వీక్షించడానికి

చెప్పాలనుకున్నా మాటలు సరిపోవడం లేదు
నీవొక అద్భుతమని చెప్పడానికి

Wednesday, 6 September 2017

అర్ధం

పరమ ఆకలి మీదున్నోడు కాసేపు తన ఆకలి మర్చిపోతే  

క్యార్ మంటూ ఏడుస్తున్న పిల్లవాడు క్షణకాలం ఏడుపు ఆపేసి చిరునవ్వులు చిందిస్తుంటే

గుంటూరు వెళ్ళాల్సినోడు టంగుటూరు బస్సెక్కేిస్తే

ఏ కారణం లేకుండా ఒట్టి పుణ్యానికి ఆక్సిడెంట్ చేసేస్తే

నిటారుగా ఉండేవాడు మెలికలు తిరిగిపోతుంటే

అపర గాయకుడు శృతి తప్పుతుంటే...

తనకు నచ్చని సమయంలోనూ నెమలి పురి విప్పి నాట్యమాడుతుంటే..

మండుటెండల్లో మేఘావృతమై వర్షిస్తుంటే...
అక్కడ ఆమె ఉందని అర్ధం

కాకపోతివి

మధువైనా కాకపోతివి
అమాంతం తాగేద్దును

పండువైనా కాకపోతివి
కొరుక్కు తినేద్దును

మల్లెపూవైనా కాకపోతివి
తనివితీరా పరిమళాన్ని ఆస్వాదిద్దును

హంసవైనా కాకపోతివి
ప్రేమగా దరికి తీసుకుందును

మట్టిబొమ్మవైనా కాకపోతివి
గాఢంగా చుంబిద్దును

ఎందుకు

వరాలిచ్చే నీవుండగా
వేరే దేవతలెందులకు

ఆహ్లాదాన్ని పంచే నీ చల్లని చూపులుండగా
వేరే కళ్ళెందుకు

మధువులొలికే నీ అధరాలుండగా
వేరే మధుపానీయాలెందుకు

అందమైన నీవుండగా
వేరే మగువెందుకు

Tuesday, 5 September 2017

ఎదురుచూపులు

నేలమ్మ ఎదురు చూస్తోంది
ఓ వర్షపు చుక్క కోసం
దాహాన్ని తీర్చుకుందామని
తన వంటి సెగను విరజిల్లుదామని

మెరుపుతీగ వెతుకుతోంది
ఓ చక్కని చుక్క కోసం
ప్రేమగా అల్లుకుందామని
మురిపెంగా ముద్దిద్దామని