Wednesday 23 September 2015

అతి జాగ్రత్త

మొన్నామధ్య ఓ ఫంక్షన్ లో జరిగిన విషయమిది. యింటి మేడ మీద జరిగిందది. ఫ్రీ గా వచ్చిన భోజనాలు కాబట్టి పీకల దాక మేక్కేసి అది అరగటానికి అందరం కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాము. ఆ ఫంక్షన్ కి వచ్చిన పిల్లలు మేడ మీద తెగ అల్లరి చేససేస్తున్నారు. అందులో ఓ పిల్లాడు మేడ చివర అంటే అంచులో నుంచొని ఆడుతున్నాడు. అంతే! వాళ్ళ నాన్న ఓ పెద్ద పొలికేక వేసి అమాంతం వాడి మీదకి దూకి ఒక్కసారిగా వాడిని యివతలకి లాగేసాడు. వాళ్ళమ్మ సంగతి సరే సరి. నెత్తీ నోరు కొట్టేసుకుంది. యిదంతా మేమో ప్రక్కన గమనిస్తున్నాము. మాలో ఒకాయన యిలా అన్నాడు
 "యిది చూసాక మీకేమీ అనిపించలేదా" అని.
"అనిపించడానికేముంది, పిల్లల్ని ఆ మాత్రం జాగ్రత్తగా చూసుకోవడం మంచిదేగా?" అన్నాడొకాయన.
"ఒక సారి మన చిన్ననాటి రోజుల్ని గుర్తు తెచ్చుకోండి. యిదే వయసులో చెట్లెక్కి జామకాయలు కోసేవాళ్ళం, పిల్ల కాలవల్లాంటివి అమాంతం దూకేసే వాళ్ళం. మనకప్పుడు అడ్డు చెప్పేవాళ్ళు లేరు. పొద్దున్న యింట్లోంచి వెళితే సాయంత్రం మళ్ళీ యింటికోచ్చేవాళ్ళం. మనమెక్కడ దూకుతున్నామో ఎక్కడ పాకుతున్నామో అడగటానికి మన పేరెంట్స్ మన కూడా వచ్చేవాళ్ళు కాదు. చదవక పొతే బాదేసేవారేమో గానీ యింత అతి జాగ్రత్తని చూపించేవాళ్ళు కాదు. అలాంటి వాతావరణంలో పెరిగిన మనం మన పిల్లల్ని మాత్రం అతి జాగ్రత్త పేరుతో వాళ్ళని మరీ విసిగించేస్తున్నామేమో అనిపిస్తుంది."
"పిల్లలన్నాక ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి కదా? ఉంటే తప్పేంటి?" వాదనకి దిగాడొకాయన.
"నా ఉద్దేశ్యం అది కాదు. జాగ్రత్త ఉండాల్సిందే. కానీ అతి జాగ్రత్త ఉండకూడదనే నేను చెపుతోంది. మన పేరెంట్స్ మన విషయం లో తీసుకున్న జాగ్రత్తని మన పిల్లల విషయంలో అతి చేస్తున్నామేమో అనే అంటున్నా. అయినా మీకొక విషయం చెప్పాలి. ప్రతీ పిల్లాడికి ఓ సెన్సు పని చేస్తూ ఉంటుందని నా అభిప్రాయము. అది వాడిని ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. అది పని చేయబట్టే మనమంతా ఆ స్టేజి నుండి యిక్కడిదాక వచ్చాము. అందుకే అన్ని ఆటలు ఆడినా చెప్పుకోతగ్గ దెబ్బలు తగలకుండా బయట పడ్డాము. ఏమంటారు?"
అందరం ఆలోచనలో పడ్డాం.

Tuesday 15 September 2015

ఖలేజా సినిమాకి ఈ పేరు పెట్టుంటే బాగుండేది

ఖలేజా సినిమా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. అందులో కొత్త విషయమేమీ లేదు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం మాత్రం 'మహేష్' ని దేవుడిగా చూపించడమే. సినిమా  చూస్తున్న ప్రేక్షకుడికి ఈ హఠాత్ పరిణామం మింగుడు పడలేదు. అలా కాకుండా మహేష్ దేవుడి క్యారెక్టరు వేస్తున్నాడని ప్రేక్షకుడు ముందుగా ప్రిపేర్ అయ్యుంటే ఆ సినిమా అంత ఫ్లాప్ అయ్యుండేది కాదేమో. అంటే ఆ సినిమాకి 'ఖలేజా' అని కాకుండా 'దేవుడు'  పెట్టుంటే బాగుండేదేమో.