Friday 28 November 2014

దువ్వెన ఎక్కువగా ఎవరిదగ్గరుంటుందో తెలుసా?

కారణమేమిటో తెలీదుగానీ జుట్టు ఉన్నవాళ్ళకంటే జుట్టులేనివాళ్ళే (బట్టతల వాళ్ళు) దువ్వెన ఎక్కువ పెట్టుకొని తిరుగుతారు జేబులో. నెత్తిమీద జుట్టు లేకపోయినా ఎక్కువగా అద్దంలో చూసుకొనేదీ, తల దువ్వుకొనేదీ కూడా వాళ్ళే  !!

Monday 24 November 2014

ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు...



 నాకు ఎందుకో....  వీళ్ళ మధ్య పోలికలు ఉన్నట్టు అనిపిస్తాయి. మరి మీకో ?
 

















Sunday 23 November 2014

యిచ్చట మీ స్థలాలు భద్రపరచబడును

ఒక స్థలం కొనే ముందు మనము వంద ఎంక్వయిరీలు చేసి వెయ్యి మందిని అడిగి మరో లక్ష సార్లు డాక్యుమెంట్లూ గట్రా చదువుకుని గానీ కొనము. యిదంతా ఎందుకంటే మోసపోయే అవకాశముంది కాబట్టి. కదా? యింతా చేసి స్థలం కొన్నాక మనము మరో చోటికి ట్రాన్స్ ఫరు అవ్వడము గానీ, లేదా దాన్ని పట్టించుకొనే తీరిక గానీ లేకపోవడం జరగొచ్చు. లేదా ఫారినుకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే అవకాశం రావొచ్చు. మరి మన స్థలానికి రక్షణ ఏది? ఈ లోపు ఎవరైనా కబ్జా చేస్తే? లేక మనకు తెలియకుండా నకిలీ దస్తావేజులు సృష్టించి అమ్మేస్తేనో? మరెలా?
వస్తున్నా. మనం రైల్వే స్టేషను లో క్లాక్ రూం చూసాము కదా. అది మన సామాను భద్ర పరిచే గది. మన సామానుని అక్కడ పెట్టుకున్నందుకు వాళ్ళు గంటకు యింత అని వసూలు చెస్తారు మన దగ్గర. అదే పద్దతిని మన స్థలాల్ని భద్ర పరిచే వ్యవస్థ ఒకటుంటే బాగుంటుంది కదూ? మన స్థలాల్ని ఎవరి కబ్జాకి గురి అవనీయకుండా, మన ప్రమేయం లేకుండా యింకొకరికి అమ్మేయకుండా భద్ర పరిచే ఏజెన్సీ గానీ లేదా అలాంటిదే మరొకటో ఉంటే బాగుంటుంది కదూ? దాని కోసం సంవత్సరానికి యింత అని వసూలు చేసినా మనం ఆనందంగా యిస్తాం. ఏమంటారు? యిలాంటి బిజినెస్ ఎవరైనా మొదలు పెడితే డబ్బులే డబ్బులు అని నా అభిప్రాయం. 

Sunday 16 November 2014

హిందీ చానల్ కే డబ్బింగు చెప్పేస్తే పోలా?

యిప్పుడు షేర్ల వ్యాపారం చేసేవాళ్ళకి ఓ తెలుగు న్యూస్ చానల్ ఉంటే బాగుండును కదా? అటువంటివి కేవలం హిందీ లో మాత్రమే ఉన్నాయి యిప్పుడు. తెలుగులో కూడా ప్రారంభిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. 

Saturday 8 November 2014

సునీల్ డైలాగు డెలివరీ మారిపోవడానికి కారకుడు ఎవరు?

ఈ మధ్య సునీల్ ని గమనించారా? కమెడియను గా ఉన్నప్పటి అతని నటననీ, హీరో అయ్యాక యిప్పటి నటనని పోల్చి చూడండి. చాలా తేడా కనిపిస్తోంది కదూ? కమెడియన్ గా ఉన్నప్పుడు అతని నటనలో చాలా 'ఈజ్' ఉండేది. కామెడీలో చెలరేగిపోయేవాడు. కానీ హీరో అయ్యాక పట్టి పట్టి నటిస్తున్నాడు రాముడు మంచి బాలుడు అనే తరహాలో. అతనిలోని ఈజ్ ఎగిరిపోయి నటనలో కృత్విమత్వము కనిపిస్తోంది. యిలా అతనిలోని మార్పుకి కారణమేమిటి? హీరో అయ్యాడు కాబట్టి ఫక్తు కమెడియనులా నటించడము కుదరదన్న మాట నిజమే. కానీ సునీల్ పరిస్థితి అది కాదు. మరీ బిగదీసుకుపోయి నటిస్తున్నాడు. ఆ తరహా నటన 'అందాల రాముడు' సినిమా లో లేదు. కానీ ఆ తర్వాత వచ్చిన 'మర్యాద రామన్న ' సినిమాలో అతని నటన పూర్తిగా మారిపోయింది. అతని మాట తీరు ఏదో తెచ్చి పెట్టుకున్నట్టుగా మారిపోయింది. దీనికి కారణం రాజమౌళి. అతని డైలాగ్ డెలివరీని పూర్తిగా మార్చిపాడేసాడు. ఆ సినిమా పెద్ద హిట్టయ్యింది. దాంతో అక్కడ్నించి సునీల్ ప్రతీ సినిమాలో అదే తరహా డైలాగు డెలివరీతో నటించేస్తున్నాడు. పాత సునీల్ ని ఎప్పుడు చూస్తామో??

Thursday 6 November 2014

మరి దివాన్ చెరువుని దివాన్ టాంక్ అనరెందుకో !

మీరు గమనించారో లేదో గానీ మన తెలుగు వాళ్ళంతా చాలాకాలం నుండి "దీపావళి" ని ఆ పేరుతో పిలవడం మానేసారు. "దీవాలి" అని పిలుస్తున్నారు. అలాగే "వినాయక చవితి"ని "గణే ష్ చతుర్ధి" అని పిలుస్తున్నారు. ఏ పేరుతో పిలిచినా అర్ధం ఒకటే. కానీ నోరారా తెలుగు పేర్లతో పిలవడం మానేసారనే నేను చెప్పదల్చుకుంది. అన్నట్టు మా రాజమండ్రి లో "కంబాల చెరువు" ని కూడా "కంబాల టాంక్" అని పిలిచేస్తున్నారండోయ్!  

Monday 3 November 2014

తప్పిపోయిన పిల్లల్ని వారి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడమెలా?

యిప్పుడు నేను వ్రాయబోయేది నిజంగా జరిగే అవకాశముందో లేదో నాకు తెలీదు. అయినా నాకు వచ్చిన ఆలోచనని మీతో పంచుకోవాలనుకుంటున్నా. మీరు బస్ స్టాండుల్లోనూ, రైల్వేయ్ స్టేషనుల్లోనూ 'కనబడుట లేదు. ఈ క్రింది ఫోటోలోని అబ్బాయి వయసు 6 సంవత్సరాలు. ఆ అబ్బాయి ఆచూకి తెలిపినవారికి బహుమతి"...... యిలాంటివి చూస్తూనే ఉంటాము. యిలా తప్పిపోయిన పిల్లలు తమ తల్లి దండ్రులకి తిరిగి చేరువవుతున్నారా? తప్పిపోయిన వాళ్ళే కాదు కిడ్నాపులకి గురి అయిన వాళ్ళు,  యితర కారణాల వలన చిన్నతనంలో తలిదండ్రులనుండి దూరమైన పిల్లలు తలిదండ్రుల ప్రేమకి దూరంగా ఎక్కడో అనాధలుగా పెరుగుతున్నారు. పెద్దయ్యాక తమ తలిదండ్రులకి దగ్గర్లో ఉన్నా వారు గుర్తు పట్టలేరు. మరి యిలాంటి వారిని కలపడమెలా?

యిప్పుడు ఆధార్ కార్డ్ దేశంలో ప్రతీ ఒక్కరూ తీసుకోవడం తప్పనిసరి. ఆ కార్డులో ఏముంటున్నాయి? మన కనుబొమ్మలు, వేలిముద్ర , ఫోటో యిలాంటివి ఉంటున్నాయి. కదూ? వీటితో పాటు మన DNA వివరాలు కూడా ఉంటే?
అవును ప్రతీ ఒక్కరి DNA వివరాలు కూడా ఆ కార్డులో పొందుపరిస్తే తప్పిపోయిన పిల్లల్ని తమ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడం సులువు అవుతుందేమో???!!! ఆలోచించండి.