Sunday, 7 May 2017

గరీబీ హఠావో

మీరెప్పుడైనా నేల టికెట్ కొనుక్కొని సినిమా చూసారా? అబ్బే ఛస్తే చూడను, బ్లాక్ లో కొనుక్కొనైనా బాల్కనీ టికెట్ మాత్రమే కొంటానంటారా? ఇకపై ఆ పప్పులు ఎంతమాత్రం ఉడకవు. మీరు బాల్కనీ టికెట్ కొన్నా సరే మిమ్మల్ని నేలలో కూర్చోబెట్టాలన్న బృహత్కరమైన ఆలోచన థియేటరు వాళ్ళకొచ్చిందో లేక గవర్నమెంటుకొచ్చిందో గాని పేదవాళ్ళను ధనికులను ఒక్క తాటికి తేవాలన్న ఆలోచన మాత్రం మా భలేగా ఉంది!  ఇంకా అర్ధం కాలేదా? మల్టీప్లెక్స్ థియేటర్లను చూడండి. నేల, బెంచీ, రిజర్వడ్ అన్న బేధం లేకుండా ఒక్కటే టికెట్ రేట్ పెట్టేసారు. దీని వలన పేద ధనిక అన్న తేడా లేకుండా అందరూ ఎంచక్కా నేల క్లాస్ లో కూర్చొని సినిమా చూసేస్తున్నారు.

ఆయినా కారులో హాలుకెళ్లి, ఒక్కొక్కరు రెండొందల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని అంతా నేల లో కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ పాప్ కార్న్ తింటూ సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా! 

Sunday, 30 April 2017

జ్ఞానము నందు సినీజ్ఞానము వేరయా!

 ఒక విషయం మాత్రం నాకు భలే ఫన్నీ  అనిపిస్తుంది. మీకు తెలిసినవారిని ఎవరినైనా ఫలానా సినిమా గురించో లేక ఫలానా నటుడి గురించో అడిగితే వెంటనే అతను మీకు చెప్పే జవాబు "అబ్బే ... నాకు  పెద్దగా సినిమా నాలెడ్జ్ లేదండి. నేను సినిమాలు  చూడను. సినిమాలు చూసి దగ్గర దగ్గర రెండేళ్లవుతోంది" అనడమే కాకుండా మనల్ని పిచ్చి వెధవని చూసినట్టుగా చూసి "ఏంటి సినిమాల గురించి అడుగుతున్నారు....మీరు సినిమాలు బాగా చూస్తారా ఏంటి?" అనడుగుతారు. 
దాంతో సినిమాలు చూస్తానని చెప్తే ఎక్కడ సినిమా పిచ్చోడనుకుంటారో అని "అబ్బే అదేం లేదండి.... నేను కూడా పెద్దగా సినిమాలు చూడను..... ఏదో క్యాజువల్ గా అడిగానంతే" అని ఓ వెర్రి మొహమేసుకొని చెప్తాం.  దాదాపుగా సినిమా టాపిక్ వచ్చినప్పుడల్లా ఇదే తంతు. 
అస్సలు సినిమా మొహమే ఎరగనట్టు, సినిమా గురించి మాట్లాడితే పాపమన్నట్టు ఎందుకు మాట్లాడతారు? వాస్తవం అలానే ఉందా అంటే కాదు. అలా ఉంటే ఇన్ని సినిమాలు ఎలా ఆడుతున్నాయి. ఇన్ని చానల్స్ లో సినిమా కార్యక్రమాలు ఎందుకొస్తున్నాయి? జనం చూడబట్టే కదా? గమ్మత్తేమిటంటే మీతో సినిమా గురించి వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తే ఏదో ఒక సినిమా హాల్లో బ్లాకులో టికెట్లు కొంటూ మనకి కనబడతాడు. ఒక ప్రక్క సినిమాలు చూస్తూ (థియేటరులోనో, టీవీలోనో), సినిమాని ఆస్వాదిస్తూ సినిమా గురించి మాట్లాడితే ఎందుకంత వ్యంగ్యంగా మాట్లాడతారో నాకైతే ఇప్పటికీ అర్ధం కాదు. సినిమా గురించి మాట్లాడితేనో లేక చూస్తేనో వాళ్ళ విలువ దిగజారిపోయినట్టేనా?  

Monday, 12 December 2016

దొందూ దొందే

తెలుగు సినిమా దర్శకులు ఆర్. నారాయణ మూర్తి, భీమినేని శ్రీనివాసరావులిద్దరికీ ఓ విషయం లో పోలికుంది తెలుసా?   అదేంటి వాళ్ళిద్దరికీ పోలికేమిటి అనుకుంటున్నారా? ఉంది.
ఆర్ నారాయణ మూర్తి తాను తీసిన సినిమాలన్నీ విప్లవ ఆధారిత సినిమాలు తీసాడు.... తీస్తున్నాడు. అవి విజయవంతమైనా కాకపోయినా ఆటను తన  పంధాని ఏ మాత్రం మార్చుకోకుండా డబ్బులొచ్చే సినిమాలు తీయకుండా తాను నమ్మిన సిధ్ధాంతాన్ని నమ్ముకొని సినిమాలు తీస్తున్నాడు.
బానే ఉంది కానీ భీమినేని సంగతేమిటంటారా?
ఆయనా అంతే. తాను నమ్మిన సిధ్ధాంతాన్ని నమ్ముకొనే సినిమాలు తీస్తుంటాడు. ఆయన సిధ్ధాంతమేమిటంటారా?!
రీమేక్ సినిమాలు మాత్రమే తీయడం. అవును. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ రీమేక్ సినిమాలే. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా స్ట్రైట్ సినిమా కూడా తీయలేదు. నాకు తెలిసి తీయడు కూడా!
ఇప్పుడు అర్ధమయ్యింది కదా? వాళ్లిద్దరూ తాము నమ్మిన సిధ్ధాంతం తప్ప వేరే వాటిని దరి చేరనీయరని.


Tuesday, 8 November 2016

ఆ చెపుతారు

ఇప్పుడు మళ్ళీ హెల్మెట్ రూల్ వచ్చేసింది. ప్రతీ ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే హెల్మెట్ లేకుండా బండి నడిపితే ప్రాణాపాయము కాబట్టి. వందకి వంద శాతం నిజం.

కాకపొతే హెల్మెట్ పెట్టుకోకపోవటం ఒక్కటే కాదు. ప్రాణాపాయాన్ని తెచ్చేవి చాలా ఉన్నాయి. అందులో కొన్ని..

సిగరెట్ స్మోకింగ్, మద్యపానం లాంటివి. వాటి మీద ఫైను ఎలాగూ లేదు సరి కదా ఎంచక్కా షాపుల్లో పెట్టి అమ్మేస్తున్నారు.

RTC బస్సుల్లో, రైళ్ళల్లో కిక్కిరిసిపోయి జనాలు ప్రయాణం చేసినా నో ఫైన్.

రోడ్లు ఎంత అధ్వాన స్థితి లో ఉన్నా ఆ డిపార్ట్ మెంట్ మీద నో ఫైన్.

యిలా చెప్పుకుంటూ పొతే బోలెడు డిపార్టుమెంటుల మీద బోలెడన్ని ఫైన్ లు వేసుకుంటూ పోవాలి.

మనిషి ప్రాణాలు కేవలం హెల్మెట్ తోనే ముడిపడినట్టు ఈ హడావిడి ఏమిటో !

అన్నట్టు... హెల్మెట్ పెట్టుకోకపోతే తెగ ఫైన్లు వేసేసి పోలీసులు మాత్రం వాటిని ఎందుకు పెట్టుకోరో నా మట్టి బుర్రకి అస్సలు అర్ధం కాదు. మీకైమైనా అర్ధమైతే చెపుదురూ ! 

Tuesday, 11 October 2016

సీజనల్ దేశభక్తి

చైనా వస్తువులని బహిష్కరించండి!
చైనా వస్తువులని కొనడం మానేయండి!!
దేశ భక్తిని నిరూపించుకోండి!!!
గత కొన్ని రోజులుగా ..... ఖచ్చితంగా చెప్పాలంటే పాకిస్తాన్ కి మనకి గత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం కాని యుద్ధం జరుగుతున్నప్పటినుండి మన వాట్సప్, ఫేస్ బుక్ వీరులు తెగ ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులయ్యాక ఈ సదరు చైనా వస్తువుల బహిష్కరణ గోల ఎక్కడా కనిపించదు గాక కనిపించదు. వాళ్ళు చెపుతున్న దాంట్లో నిజం లేదా అంటే ఖచ్చితంగా ఉంది... కానీ ఏదైనా అనర్ధం జరిగినప్పుడే ఎందుకు గుర్తొస్తుందన్నదే నా పాయింట్. యిదెలా ఉందంటే ఏదైనా రోగం వచ్చినప్పుడు యిక జీవితం లో సిగరెట్ తాగను, మందు ముట్టుకోను అని ప్రతిజ్ఞలు చేస్తుంటారు కొంతమంది.... కొన్ని రోజులయ్యాక మళ్ళీ మామూలే! ఆ మధ్య నాకు తెలిసిన సాఫ్ట్ వేర్ ఫ్రెండ్ ఒకరు నాకు ఓ మెసేజ్ పెట్టారు. దాని సారాంశమేమిటంటే అమెరికా వస్తువులని కొనడం మానేయాలని. ఎందుకట?? ఆ సమయం లో అమెరికాలో భారతీయుల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు తీసేసారు లెండి! అందుకని సదరు సాఫ్ట్ వేర్ జనమంతా ఓ రిజల్యూషన్ పాస్ చేసి పారేయడమే కాకుండా మనల్ని కూడా పాటించమంటునారన్న మాట. నాకు కూడా ఆ మెసేజ్ చదివి కొద్దిగా పూనకం వచ్చింది కానీ వెంటనే ఓ విషయం గుర్తొచ్చి ఆ ఫ్రెండుకి ఫోన్ చేసి "మీరు చెప్పింది బానే ఉంది కానీ మీరు ప్రతీ సంవత్సరం అమెరికన్ ఇండిపెండెన్స్ డే జరుపుతుంటారు కదా... మరి అప్పుడు ఈ దేశభక్తి ఏమయ్యింది" అని అడుగుదామనుకున్నా. మళ్ళీ నాకే అనిపించింది ఎందుకొచ్చిన సంత అని. సరే ఆ విషయం పక్కన పెడితే ఈ సదరు సీజనల్ దేశభక్తులకి ఓ మాట చెప్పాలనుకుంటున్నా
 "చైనా వస్తువులని కొనడం మానేయడం తో పాటు ఆ దేశానికి మీ పిల్లల్ని మెడిసిన్ కోర్సులకి గట్రా పంపించకండి.... మీ పిల్లల్ని ఇక్కడే చదివించండి....ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అసలు ఆ దేశానికే వెళ్లకండి...రేటు తక్కువ అని అడ్డమైన చైనా వస్తువులు కొనేయకండి....
మీ దేశభక్తిని మరింత యినుమడింపచేసుకోండి........


Friday, 12 February 2016

ఇంకా నయం బుర్రకధలు చెప్పమనలేదు !

ఈ మధ్య సినిమా నటులని గమనించారా? CCL అనీ, కబడ్డీ లీగ్ అని ఆటలమీద పడ్డారు. విరగ ఆడేస్తున్నారు. బానే ఉంది కానీ అవసరమంటారా? వాళ్ళు బాగా ఆడతారా లేదా అన్నది కాదు ముఖ్యం. అసలు వాళ్ళెందుకు ఆడాలి అని. ఇండియాలో ఆటగాళ్ళు తక్కువేమీ కాదుగా!  ఈ ఆటల వలన వాళ్ళు సాధించేదేమిటి? ఎంత గొప్పగా ఆడినా ఒక నటుడిని గొప్ప ఆటగాడిగా జనం గుర్తించరు గాక గుర్తించరు. పోనీ  అలా గుర్తించినా తమ నట జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే అదీ లేదు! అఖిల్ ని చూడండి. క్రికెట్ బాగా ఆడతాడు కానీ అది అతని మొదటి సినిమాకి ఏ మాత్రం పనికి రాలేదు పాపం. సరే ఆ విషయం ప్రక్కన పెడితే ఏతా వాతా చెప్పోచ్చేదేంటంటే  సినిమా నటులు తమకు తెలియని రంగం లోకి దూరి అభాసు పాలవడం కన్నా తమకు పరిచయమున్న నటనా రంగంలోనే ఏదైనా చేస్తే బాగుంటుంది కదా? వాళ్ళు ఆల్రెడీ సినిమా రంగంలోనే ఉన్నారు కదా? అనే కదా మీ అనుమానం?' వస్తున్నా. ఒకప్పుడు అంటే సినిమాల ప్రభంజనం యింత ఇదిగా లేని రోజుల్లోను, ఆ తర్వాత కూడా చాలా కాలం జనాలకు గొప్ప వినోదాన్నిచ్చిన రంగం 'నాటక రంగం'. ఒకప్పుడు టికెట్ కొని మరీ చూసేవాడు ప్రేక్షకుడు. ఇప్పుడు ఉచితంగా చూపిస్తానన్నా చూసే నాధుడు లేడు. అలా అని నాటకాలు వేసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు ఎటొచ్చీ చూసేవాళ్ళే లేరు. అలాంటి నాటక రంగాన్ని సదరు సినిమా నటులు ఎంచుకుంటే బాగుంటుంది కదా? నాటక రంగాన్ని ప్రొత్సహించినట్టుంటుంది, సినిమాల్లో వాళ్ళు చేయని (చేయలేని) పాత్రలు పోషించినట్టు ఉంటుంది. ఏమంటారు?                      

Saturday, 9 January 2016

పిల్లల్ని సక్ర మార్గంలో పెంచడమెలా?

పిల్లల్ని సక్ర మార్గంలో పెంచడమెలా? మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్ని గౌరవించడం ఎలా? ముఖ్యంగా తండ్రిని గౌరవించడమెలా? యిలాంటివి నేర్పడానికి మనకి బోలెడన్ని పుస్తకాలున్నాయి, కొన్ని సినిమాల్లో కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. కానీ వీటన్నిటినీ తలదన్నే యాడ్ ఒకటి మనం చూసే అధ్బుత అవకాశం కలుగుతోంది ఈ మధ్య. పిల్లలకి వాళ్ళ తండ్రిని ఎంత చక్కగా గౌరవించాలొ ఎంత నేర్పుగా వాళ్ళకి కావలసింది తమ తండ్రి నుంచి సాధించుకోవాలో సదరు యాడ్ చూసి నేర్చేసుకోవచ్చన్నమాట. యింతకీ ఆ యాడ్ సారాంశం ఏమిటంటే ......
ఒక కుర్రాడు తన తండ్రికి 'అతి' వినయం ప్రదర్శిస్తూ అతని తండ్రికి కావలసిన పని ఏదో చేస్తాడు. ఈ తతంగాన్ని అతని తల్లి ఓ కంట చూస్తూనే ఉంటుంది. ఆ కుర్రాడు తన తల్లితో "చూసావా నాన్నని ఎలా మస్కా కొట్టి నా పని చేసుకున్తున్నానో అన్నట్టుగా సైగ చేస్తాడు. అది చూసిన ఆ తల్లి ఆ కుర్రాడిని ఏమీ అనకపోగా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది.ఇదే విధంగా అమ్మాయితో కూడా ఇలాంటి యాడ్ ఉంది. ఆహా ... ఎంత గొప్ప యాడో కదా?
ఇదే కాదు 'పిల్లలు కాదు పిడుగులు' అనే గొప్ప కార్యక్రమం ఒకటోస్తోంది. మన యింట్లో పిల్లలు వాళ్ళ వయసును మించిన మాటలు మాట్లాడితే కొప్పడతాము.. కానీ ఈ కార్యక్రమం  చిన్న చిన్న పిల్లలు చక్కటి  ముదర కబుర్లు చెప్పే మహత్తర అవకాశం కలిపిస్తోంది. వాళ్ళు అలా చెపుతుంటే ఆ కార్యక్రమాన్ని యాంకరింగ్ చేస్తున్న 'ఉదయభాను' విరగబడి నవ్వుతోంది(ఏడవలేక). ఆ పిల్లల తల్లిదండ్రులైతే నిజంగానే ఎడ్చేస్తున్నారు ఆనందం తట్టుకోలేక. నవ్వాలో, ఏడవాలో అర్ధం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది 'మనం' మాత్రమే. ఈ సారి ఎవరైనా క్లారిటీ ఇస్తే బాగుండును.     . 

Tuesday, 1 December 2015

'కళా సేవకి భాషా భేదాలు ఉండవు బాబు' అంటారేమో

చాలా కాలం క్రింద ఓ యాడ్ వచ్చేది. చిరంజీవి, నాగార్జున, రాజేంద్రప్రసాద్ ఇలాంటి నటులు పొలోమంటు టీవీల్లో ఒక మాట చెపుతుండేవారు "తెలుగు వారంతా తెలుగులోనే మాట్లాడదాం " అని. ఆహా వీళ్ళకి  తెలుగు మీద ఎంత భక్తి ! అని పొరపాటున ఎవరన్నా అనుకున్నారేమో గానీ నాకు మాత్రం ఒకటే అనిపించేది ఆ యాడ్ చూసాక
"తెలుగు సినిమాల్లో తెలుగు నటులనే పెట్టుకుందాం. పరాయి భాష నటుల్ని ప్రక్కన పెడదాం" అని -
యిదే విషయాన్ని వాళ్ళకి చెపుదాం అని. 

Thursday, 19 November 2015

హలో బ్రదర్

అష్టా చమ్మ సినిమా చూసాక హీరో 'నాని' ని చూసాక ఆ సినిమా దర్శకుడు 'ఇంద్రకంటి మోహన కృష్ణ' కి దగ్గర పోలికలు కనిపించి అతని తమ్ముడేమో అనుకున్నాను. మొన్న మొన్నటి వరకు కూడా వాళ్ళిద్దరూ అన్నదమ్ములేమోనని అనుకునేవాడిని. తర్వాత తెలిసిందనుకోండి! 

Sunday, 8 November 2015

రాంచరణ్ విషయం లో జరిగింది అఖిల్ విషయం లో జరగనిది?

క సారి చిరుత సినిమా గుర్తు తెచ్చుకోండి. యిప్పుడు చెప్పబోయేది చిరుత సినిమా గురిచి కాదు, ఆ సినిమాలో నటించిన రాంచరణ్ గురించి. అతని లాంచింగ్ గురించి. ఎంత గ్రాండ్ గా లాంచ్ చేసారో గుర్తుందిగా?! ఆ సినిమా విడుదలయ్యేంతవరకూ అతని నోటినుండి ఒక్క మాట కూడా వినలేదు మనం. కాదు వినే అవకాశమివ్వలేదు చిరంజీవి కుటుంబం. కేవలం అతని నటన గురించో లేక షూటింగ్ విశేషాలు మాత్రమే చూసే భాగ్యం కలిగేది మనకి. ఆ సినిమా విడుదల అయ్యేంతవరకూ అతని నటన ఎలా ఉంటుందా, అతని డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందా అని కళ్ళు కాయలు కాచేలా చూసాము. అతను పొడుగు తక్కువా లేక అందంగా లేడా అన్న విషయాల్ని కూడా మనం పట్టించుకోనతగా అతన్ని ప్రమోట్ చేసారు చిరంజీవి కుటుంబం. ఒక రకంగా చెప్పాలంటే మొన్న బాహుబలికి ఎంత హైప్ క్రియేట్ అయ్యిందో 'చిరుత' సినిమాకి అంతే హైప్ క్రియేట్ అయ్యింది. ఇదే టెక్నిక్కుని చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి కూడా కొనసాగించారు. రేపు ఆ పార్టీని స్థాపిస్తారనగా ఈ రోజు వరకు ఆ పార్టీ పేరుని ప్రకటించకుండా ఆ పార్టీకి పెట్టబోయే పేరు మీద మనకి ఎంతో ఆశక్తిని రేకెత్తించేలా చేసారు. సరే ఆ విషయాన్ని ప్రక్కన పెడితే ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే రాంచరణ్ ని చిరంజీవి కుటుంబం గొప్పగా లాంచింగ్ చేసారని. కొంచెం వెనక్కి వెళితే మహేశ్ ని కూడా ఇదే విధంగా లాంచ్ చేసారు.

యిప్పుడు కాసేపు వర్తమానం లోకి వద్దాం. ఒక్క సారి నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య విషయానికొస్తే అతని లాంచింగ్ ఎంత నీరసంగా, ఎంత చప్పగా జరిగిందో గుర్తు తెచ్చుకోండి. పైగా అతని మొదటి సినిమాకి ఎంచుకున్న కధ, పాత్రధారుల ఎంపిక విషయంలో ఎన్నో తప్పులు జరిగిపోయాయి. మళ్ళీ అదే తప్పు చిన్న కొడుకు అఖిల్ విషయంలోనూ చేస్తున్నాడు నాగార్జున. అఖిల్ సినిమా ఎలా ఉంటుందో అన్నది సినిమా విడుదలయ్యాక చెప్పొచ్చు. నేను చెప్పేది అతని లాంచింగ్ గురించి. ఆ సినిమా విడుదలకి ముందే అతని యింటర్వ్యూలు తెగొచ్చేసాయి, వస్తున్నాయి. చిన్న చిన్న టీవీ ప్రోగ్రాముల్లోకి కూడా వచ్చేస్తున్నాడు అఖిల్. యిక సినిమా విడుదలయ్యే సరికి తన మీద జనాలకి ఉండే కాస్తో కూస్తో ఉన్న ఆశక్తి కూడా పోయేలా చేసుకుంటున్నాడు అఖిల్. తన కొడుకుల్ని ప్రమోట్ చేసే విషయం లో నాగార్జున పూర్తిగా ఫెయిల్ అయినట్లే.