Saturday, 13 May 2017

మరి బలవంతుడి కోపం?

ఒక బలహీనుడి (పిరికివాడి)  కోపమంతా అతడికంటే బలహీనుడి మీదే.   

Friday, 12 May 2017

పాటల రూపకల్పన :వంశీ

అస్సలు బడ్జెట్ లేకుండా, సెట్టింగులు వేయకుండా కేవలం సృజనాత్మకతనే నమ్ముకొని పాటలు తీయగల దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు మన తెలుగు సినిమా పరిశ్రమలో. ఒకరు వంశీ. మరొకరు రవిబాబు. వీళ్ళిద్దరి సినిమాల్లో పాటలు చూడండి. ఎంత బాగుంటాయో. వంశీ గురించి చెప్పుకోవాలంటే గత కొంత కాలం నుంచి ఆయన తీస్తున్న సినిమాలు చాలామటుకు విజయవంతం అవడంలేదు. దానికి కారణాలు మరోసారి చెప్పుకుందాం కానీ ఆయన సినిమాల్లోని పాటలు మాత్రం సూపర్. ఇప్పుడొస్తున్న చిన్న సినిమాల పేరుతో వస్తున్న సినిమాల్లో పాటలు చూడండి. రొటీన్ పాటలు, రొటీన్ (తమిళ) డాన్సులతో మోత మోగించేస్తున్నారు తప్ప ఒక్కరూ పాటల్ని చక్కగా కన్నులవిందుగా తీసే వాడు ఒక్కడూ లేడు. కనీసం వంశీ లాంటి వారికి ఈ పాటలు వరకు అయినా తీసే అవకాశం ఇవ్వవచ్చు కదా! అదెలా కుదురుతుందంటారా? మొన్నా మధ్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూసారు కదా. దానికి సంగీతం మిక్కీ జే మేయర్. కానీ నేపద్య సంగీతం మాత్రం మణిశర్మది. అలాగే టెంపర్ సినిమాకు సంగీతం అనూప్ రూబెన్స్ అయితే నేపద్య సంగీతం మళ్ళీ మణిశర్మదే. దాని వలన సినిమా రేంజ్ పెరిగిందే తప్ప అసలు సంగీత దర్శకుల విలువ ఏమీ తగ్గలేదు కదా? అదే విధంగా సినిమా మొత్తం ఒక దర్శకుడు తీసినా పాటలు మాత్రం వంశీ లాంటి వారికి వదిలేస్తే అధ్బుతంగా ఉంటుంది కదా? అలాగే కామెడీని బాగా తీయగలిగిన "రేలంగి నరసిం హారావు , కుటుంబకధా చిత్రాలు తీయగలిగిన 'ముత్యాల సుబ్బయ్య, కమర్షియల్ సినిమాలు తీయగలిగిన కోదండరామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి, కోడి రామకృష్ణ ..... యిలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీ గా ఉన్న అలనాటి ప్రముఖుల సేవలను ఏదో విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుందేమో కదా.    

Thursday, 11 May 2017

సింహపురిలో సింగినాధం

కాశీనాధుని విశ్వనాధ్.....ఈ పేరు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం ద్వారా...... తెలుగులో అతికొద్దిమంది గొప్ప దర్శకుల్లో ఆయనొకరు. యిప్పటికీ ఆయన ఒప్పుకుంటే సినిమా తీయడానికి కొంత నిర్మాతలు (ముఖ్యంగా ఎన్నారై లు) ఉన్నారు. కాకపోతే తీయడానికి ఆయనే సిధ్ధంగా లేరనుకోండి. ఆరోగ్యం సహకరించకపోవడం కావొచ్చు లేదా మారిన పరిస్తితుల్లో తీయలేక కావొచ్చు. కారణాలు ఏమైనా ఒక మంచి దర్శకుడిని కోల్పోతున్నారు తెలుగు ప్రేక్షకులు.
సరే... విశ్వనాధ్ తీసిన ఒక సినిమా యిప్పటికీ రిలీజ్ అవలేదంటే నమ్ముతారా? అవును నిజం. 1990 లో షూటింగ్ పూర్తయిపోయినా ఆర్ధిక కారణాల వలనో మరే ఇతర కారణాల వలనో ఆ సినిమా యిప్పటికీ విడుదలకి నోచుకోలేదు. సినిమా పేరు "సిరిమువ్వల సింహనాదం". బాగుంది కదూ?! నాకేమనిపిస్తుందంటే ఆయనతో సినిమా తీయడానికి సిధ్ధపడిన నిర్మాతలు ఈ సినిమానే విడుదల చేయడానికి ప్రయత్నించ్చొచు కదా? సాధ్యం కాదంటారా? కనీసం యిప్పుడు వెబ్ సిరీస్ అంటూ ఒక ట్రెండు మొదలయ్యింది కదా...కనీసం ఆ పధ్ధతిలోనైనా ఈ సినిమాని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే ఆ సినిమా చూసే భాగ్యం మనకి కలుగుతుంది కదా!...

సరే ఆ సినిమా లో నటించిన నటీనటులు ఎవరనే కదా మీ అనుమానం?! చంద్రమోహన్, ఓంపురి....కేవలం వీళ్ళిద్దరే మనకి పరిచయమున్న నటులు.....మిగతా వాళ్ళంతా కొత్తవారే, పరిచయం లేని వారే.    

Wednesday, 10 May 2017

యిలా షాక్ కొట్టించకు బాబోయ్ నీకు దండం పెడతా

యిప్పుడు నేను చెప్పే విషయం చదివి కొంత మందికి కోపం రావచ్చు. అయినా చెపుతాను. ప్రభుత్వానికి ప్రజలనించి పన్నుల రూపం లో రావలసిన డబ్బులు సకాలం లో రావడం లేదు. అంటే ఆస్తి పన్ను, నీటి పన్ను, కుళాయి పన్ను (ఉందా??) లాంటివన్నమాట. యిలాంటి పన్ను వసూలు కార్యక్రం ప్రభుత్వం సరిగా చేయలేకపోవడానికి కారణం ప్రజలు సరిగ్గా పన్నులు చెల్లించకపోవడమే. మరి వీటిని వసూలు చేయాలంటే ఏం చేయాలి?

వస్తున్నా...జనం ఏది లేకపోయినా ఉండగలరు గానీ కరెంట్ లేకపోతే మాత్రం అస్సలుండలేరు. ఏదైనా ఆలస్యం చేస్తారేమో గానీ కరెంట్ బిల్ కట్టడం మాత్రం అస్సలు ఆలస్యం చేయరు గాక చేయరు. కాబట్టి సదరు పన్నులని కరెంటు బిల్లుల్లో కలిపేస్తే పోలా??!! ఒకేసారి కాకపోయినా ఇన్స్టాల్మెంట్ పధ్ధతిలోనైనా కలిపేస్తే చచ్చినట్టు కట్టేస్తారేమో! కదా?      

Tuesday, 9 May 2017

భ్రమ...పిచ్చి భ్రమ

మరీ చిత్రం కాకపొతే బయట పది రూపాయలకు దొరికే స్వీట్ కార్న్ పొత్తు సినిమా హాల్లో ముప్పై రూపాయలకి (అది కూడా పూర్తి పొత్తు కాదు) అమ్మడమేమిటి? మనం ఎగబడి కొనేయడమేమిటి?

బయట పదహారు రూపాయలకు దొరికే కూల్ డ్రింకు థియేటరులో యిరవై ఐదు రూపాయలకు అమ్మడమేమిటి (కొన్ని చోట్ల ముప్పై రూపాయలు) మనం ఆవురావురమంటూ కొనుక్కొని తాగేయడమేంటి?

ఓ హోటల్ కెళ్ళినా, బట్టల షాపుకెళ్ళినా, ఓ పార్కు కెళ్ళినా, ఓ ఆఫీసుకెళ్ళినా ఫ్రీ గా పార్కింగ్ సదుపాయమున్నప్పుడు ఒక్క థియేటరు బయట మాత్రమే పార్కింగుకి యిరవై నుంచి ముప్పై రూపాయల వరకు వసూలు చేయడమేమిటి? మనం నోరు మూసుకొని వాడికి డబ్బులిచ్చేసి షో స్టార్ట్ అయ్యి ఎంత సేపయ్యింది అని అడిగి హాల్లోకి పరిగెట్టేయడమేంటి?

మూడు సంవత్సరాలు నిండితే టికెట్ తీసేయాలని రూల్స్ చెప్పే వాళ్ళు మరి టికెట్ మీద రేట్ ప్రింట్ చేయకుండా టికెట్లు అమ్మేస్తున్నా సరే, అదొదిలేసి సెంటర్లో సీట్లు కావాలని వాడిని ప్రాఢేయపడటమేంటి?

టాయిలెట్ సదుపాయాలు సరిగ్గా లేకపోయినా, ఏసీ సరిగ్గా వేయకపోయినా ఆనందంగా సినిమా చూసేయడమేంటి?

ఈ పరిస్థితి మన జీవిత కాలం లో ఎప్పటికైనా మారుతుందంటారా?

ఏమిటో......భ్రమ.....పిచ్చి భ్రమ...

Monday, 8 May 2017

బస్సు అయ్యింది మిస్సు

ఒక సారి మీ ఊళ్ళో బస్ స్టేషన్ కెళ్ళండి. బస్సులతో, జనాలతో కిటకిటలాడుతుంటుంది కదూ? అది నిజమే...అంత కన్నా ఇంకొక నిజమేమిటంటే బస్ స్టాండ్ బయట ఆటోలు కూడా అంతే సంఖ్యలో....ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ సంఖ్యలోనే ఉంటాయి. మీరు ఎక్కాలనుకున్న బస్ కోసం మీరు ఎదురు చూసేలోపు (షేర్) ఆటో డ్రైవర్లు మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు 'ఫలానా ఊరికి వెళ్తోంది రండి' అని. మీరు ఎక్కాలనుకున్న బస్ ఎంత సేపట్లో వస్తుందో తెలియదు...అసలు వస్తుందో రాదో తెలియదు, కాబట్టి ఆటో ఎక్కేయడం బెటర్ అని మీరు డిసైడ్ అయిపోయి పొరపాటున ఆటో ఎక్కేసారో ...అప్పుడొస్తుంది బస్సు. గాఢంగా నిట్టూర్చడం తప్ప మీరేం చేయలేరు. యిలా ఎందుకు జరుగుతోంది అంటే బస్ స్టాండుల్లో అనౌన్స్ మెంట్  వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే.  మీరు గమనించారో లేదో గాని బస్ స్టాండుల్లో అనౌన్స్ చేసేవాళ్ళు ఎంతసేపూ స్టాండుల్లో ఆగి ఉన్న బస్ గురించో లేక అది ఎప్పుడు బయలుదేరుతుందో చెపుతారే తప్ప ఫలానా ఊరికి వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుందో ఈ సమయలో అది ఎక్కడుందో, రావడానికి ఎంత సమయం పట్టచ్చో చెప్పరు. అలా చెపితే బస్సు రాదనుకొని ఆటోలు ఎక్కేవాళ్ళు కాసేపు బస్ కోసం వేచి చూస్తారు. అదే రైల్వే స్టేషన్లో చూడండి. ఫలానా నంబర్ గల ట్రైను మరి కొద్ది నిమిషాల్లో ఫలానా ప్లాట్ ఫామ్  కి వస్తుందనో.....రావడానికి లేటవుతుందనో ఏదో ఒకటి చెపుతూనే ఉంటారు. దానికి తోడు ఆన్లైన్ వ్యవస్థ ఉండనే ఉంది. అసలే నష్టాలలో ఉన్న ఆర్టీసీ కి కనీసం ఇలాంటి వ్యవస్థల ద్వారా అయినా కొంచెం మేలు జరిగితే బాగుండును. ఎప్పుడు జరుగుతుందో మరి ?!!    

Sunday, 7 May 2017

గరీబీ హఠావో

మీరెప్పుడైనా నేల టికెట్ కొనుక్కొని సినిమా చూసారా? అబ్బే ఛస్తే చూడను, బ్లాక్ లో కొనుక్కొనైనా బాల్కనీ టికెట్ మాత్రమే కొంటానంటారా? ఇకపై ఆ పప్పులు ఎంతమాత్రం ఉడకవు. మీరు బాల్కనీ టికెట్ కొన్నా సరే మిమ్మల్ని నేలలో కూర్చోబెట్టాలన్న బృహత్కరమైన ఆలోచన థియేటరు వాళ్ళకొచ్చిందో లేక గవర్నమెంటుకొచ్చిందో గాని పేదవాళ్ళను ధనికులను ఒక్క తాటికి తేవాలన్న ఆలోచన మాత్రం మా భలేగా ఉంది!  ఇంకా అర్ధం కాలేదా? మల్టీప్లెక్స్ థియేటర్లను చూడండి. నేల, బెంచీ, రిజర్వడ్ అన్న బేధం లేకుండా ఒక్కటే టికెట్ రేట్ పెట్టేసారు. దీని వలన పేద ధనిక అన్న తేడా లేకుండా అందరూ ఎంచక్కా నేల క్లాస్ లో కూర్చొని సినిమా చూసేస్తున్నారు.

ఆయినా కారులో హాలుకెళ్లి, ఒక్కొక్కరు రెండొందల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని అంతా నేల లో కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ పాప్ కార్న్ తింటూ సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా! 

Sunday, 30 April 2017

జ్ఞానము నందు సినీజ్ఞానము వేరయా!

 ఒక విషయం మాత్రం నాకు భలే ఫన్నీ  అనిపిస్తుంది. మీకు తెలిసినవారిని ఎవరినైనా ఫలానా సినిమా గురించో లేక ఫలానా నటుడి గురించో అడిగితే వెంటనే అతను మీకు చెప్పే జవాబు "అబ్బే ... నాకు  పెద్దగా సినిమా నాలెడ్జ్ లేదండి. నేను సినిమాలు  చూడను. సినిమాలు చూసి దగ్గర దగ్గర రెండేళ్లవుతోంది" అనడమే కాకుండా మనల్ని పిచ్చి వెధవని చూసినట్టుగా చూసి "ఏంటి సినిమాల గురించి అడుగుతున్నారు....మీరు సినిమాలు బాగా చూస్తారా ఏంటి?" అనడుగుతారు. 
దాంతో సినిమాలు చూస్తానని చెప్తే ఎక్కడ సినిమా పిచ్చోడనుకుంటారో అని "అబ్బే అదేం లేదండి.... నేను కూడా పెద్దగా సినిమాలు చూడను..... ఏదో క్యాజువల్ గా అడిగానంతే" అని ఓ వెర్రి మొహమేసుకొని చెప్తాం.  దాదాపుగా సినిమా టాపిక్ వచ్చినప్పుడల్లా ఇదే తంతు. 
అస్సలు సినిమా మొహమే ఎరగనట్టు, సినిమా గురించి మాట్లాడితే పాపమన్నట్టు ఎందుకు మాట్లాడతారు? వాస్తవం అలానే ఉందా అంటే కాదు. అలా ఉంటే ఇన్ని సినిమాలు ఎలా ఆడుతున్నాయి. ఇన్ని చానల్స్ లో సినిమా కార్యక్రమాలు ఎందుకొస్తున్నాయి? జనం చూడబట్టే కదా? గమ్మత్తేమిటంటే మీతో సినిమా గురించి వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తే ఏదో ఒక సినిమా హాల్లో బ్లాకులో టికెట్లు కొంటూ మనకి కనబడతాడు. ఒక ప్రక్క సినిమాలు చూస్తూ (థియేటరులోనో, టీవీలోనో), సినిమాని ఆస్వాదిస్తూ సినిమా గురించి మాట్లాడితే ఎందుకంత వ్యంగ్యంగా మాట్లాడతారో నాకైతే ఇప్పటికీ అర్ధం కాదు. సినిమా గురించి మాట్లాడితేనో లేక చూస్తేనో వాళ్ళ విలువ దిగజారిపోయినట్టేనా?  

Monday, 12 December 2016

దొందూ దొందే

తెలుగు సినిమా దర్శకులు ఆర్. నారాయణ మూర్తి, భీమినేని శ్రీనివాసరావులిద్దరికీ ఓ విషయం లో పోలికుంది తెలుసా?   అదేంటి వాళ్ళిద్దరికీ పోలికేమిటి అనుకుంటున్నారా? ఉంది.
ఆర్ నారాయణ మూర్తి తాను తీసిన సినిమాలన్నీ విప్లవ ఆధారిత సినిమాలు తీసాడు.... తీస్తున్నాడు. అవి విజయవంతమైనా కాకపోయినా ఆటను తన  పంధాని ఏ మాత్రం మార్చుకోకుండా డబ్బులొచ్చే సినిమాలు తీయకుండా తాను నమ్మిన సిధ్ధాంతాన్ని నమ్ముకొని సినిమాలు తీస్తున్నాడు.
బానే ఉంది కానీ భీమినేని సంగతేమిటంటారా?
ఆయనా అంతే. తాను నమ్మిన సిధ్ధాంతాన్ని నమ్ముకొనే సినిమాలు తీస్తుంటాడు. ఆయన సిధ్ధాంతమేమిటంటారా?!
రీమేక్ సినిమాలు మాత్రమే తీయడం. అవును. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ రీమేక్ సినిమాలే. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా స్ట్రైట్ సినిమా కూడా తీయలేదు. నాకు తెలిసి తీయడు కూడా!
ఇప్పుడు అర్ధమయ్యింది కదా? వాళ్లిద్దరూ తాము నమ్మిన సిధ్ధాంతం తప్ప వేరే వాటిని దరి చేరనీయరని.


Tuesday, 8 November 2016

ఆ చెపుతారు

ఇప్పుడు మళ్ళీ హెల్మెట్ రూల్ వచ్చేసింది. ప్రతీ ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే హెల్మెట్ లేకుండా బండి నడిపితే ప్రాణాపాయము కాబట్టి. వందకి వంద శాతం నిజం.

కాకపొతే హెల్మెట్ పెట్టుకోకపోవటం ఒక్కటే కాదు. ప్రాణాపాయాన్ని తెచ్చేవి చాలా ఉన్నాయి. అందులో కొన్ని..

సిగరెట్ స్మోకింగ్, మద్యపానం లాంటివి. వాటి మీద ఫైను ఎలాగూ లేదు సరి కదా ఎంచక్కా షాపుల్లో పెట్టి అమ్మేస్తున్నారు.

RTC బస్సుల్లో, రైళ్ళల్లో కిక్కిరిసిపోయి జనాలు ప్రయాణం చేసినా నో ఫైన్.

రోడ్లు ఎంత అధ్వాన స్థితి లో ఉన్నా ఆ డిపార్ట్ మెంట్ మీద నో ఫైన్.

యిలా చెప్పుకుంటూ పొతే బోలెడు డిపార్టుమెంటుల మీద బోలెడన్ని ఫైన్ లు వేసుకుంటూ పోవాలి.

మనిషి ప్రాణాలు కేవలం హెల్మెట్ తోనే ముడిపడినట్టు ఈ హడావిడి ఏమిటో !

అన్నట్టు... హెల్మెట్ పెట్టుకోకపోతే తెగ ఫైన్లు వేసేసి పోలీసులు మాత్రం వాటిని ఎందుకు పెట్టుకోరో నా మట్టి బుర్రకి అస్సలు అర్ధం కాదు. మీకైమైనా అర్ధమైతే చెపుదురూ !