Wednesday, 23 April 2014

నా సీటు నాకే సొంతం

మీరు క్రొత్తగా రిలీజైన సినిమాకి వెళితే టిక్కెట్లు అయిపొయాయా? హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేసారా? మీరు గానీ అదే సినిమా చూడాలంటే యింకో షోకి టికెట్లయినా సంపాదించాలి లేదా అదే షో కి బ్లాకులో కొనుక్కునయినా చూడాలి. అంతే గానీ ఉన్న టిక్కెట్ల కన్నా ఒక్క టిక్కెట్టు కూడా ఎక్కువ అమ్మరు గాక అమ్మరు. మీరు నించొని చూస్తానన్నా లేదా ఓ ప్రక్కన నుంచొని చూస్తానన్నా అస్సలు అప్పుకోరు గాక ఒప్పుకోరు.

అంటే దానర్ధమేంటి? మీరు టికెట్టుకు సరిపడిన డబ్బు చెల్లించినా అదనపు సీట్లు ఆ హాలులో లేవు కాబట్టి మిమ్మల్ని లోపలికి అనుమతించడం లేదు. మీరు నించొని చూస్తానన్నా అంగీకరించడం లేదు. అంటే మీరు చెల్లించిన డబ్బుకి పూర్తి న్యాయం జరుగుతోందన్నట్టే కదా?

Thursday, 20 March 2014

చేతిలో చెయ్యేసి లగెత్తు రాధా !

హీరోయిన్ని విలన్ బారి నుండి రక్షించడానికొచ్చిన హీరో వెంటనే ఆమె చేయి పట్టుకొని పరిగెడతాడు - అక్కిడికేదో ఆమెకి పరిగెట్టడం రాదన్నట్టుగా. నిజ జీవితంలో అలా ఇంకొకరి చేయి పట్టుకొని పరిగెట్టడం ఎంత కష్టమో కదా.
ఏ సినిమా చూసినా అదే వరస.     

Monday, 10 March 2014

మీరు చేస్తే పైరసీ మేము చేస్తే పాలసీ

పైరసీ. మన సినిమా వాళ్ళు ఈ పదం వినగానే ఉలిక్కిపడతారు.
'పైరసీని నిరోధించండి.'
'పైరసీ బారినుండి పరిశ్రమని రక్షించండి.'
'పైరసీ సీడీలని చూడకండి.'
'థియేటరుకొచ్చి సినిమా చూడండి.'
తరచుగా సినిమా హీరోలు, నిర్మాతలు, దర్శకులు మనకు నీతులు చెపుతుంటారు. నిజమే. పైరసీని ప్రోత్సాహించకూడదు. దానిని ఎవరూ తప్పు పట్టరు. కానీ యిది కేవలం ప్రేక్షకులకే వర్తిస్తుందా? హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు వర్తించవా? వేరే భాష నుండి సినిమా కాపీ కొట్టి సినిమా తీయొచ్చా? అందులో మనకు నీతులు చెప్పే సదరు హీరోలు నటించొచ్చా? దాన్ని పైరసీ అనరా? సరే ఆ విషయం ప్రక్కన పెడితే పైరసీ గురించి అరిచి గగ్గోలు పెట్టే మన సినిమా వాళ్ళు సినిమా హాలు బయట జరిగే 'బ్లాకు మార్కెట్' గురించి మాట్లాడరేం? బ్లాకు లో టికెట్టు కొని సినిమా చూడొద్దని ఎవడూ చెప్పడేం? కనీసం అది నేరమనే విషయం కూడా చెప్పరేం? అంటే జనాల సొమ్ము లూటీ అయినా ఫర్లేదా? తమ సొమ్ము పోతోందని మనకు తెగ నీతులు చెప్పే వాళ్ళు మన సొమ్ము గురించి కూడా మాట్లాడాలిగా? మాట్లాడరు.  ఎందుకంటే వాళ్ళ జేబులు నిండితే చాలు.

హీరోతో కాక విలన్ తో చిందులేస్తుందా మరి?

హీరో హీరోయిన్ ని టీజ్ చేస్తూ ఓ పాట పాడతాడు. హీరోయిన్ హీరో మీద చిర్రుబుర్రులాడుతుంటుంది. కానీ హీరో ఎలా చేయిపిస్తే అలా స్టెప్పులేస్తూ అతనికి పూర్తి సహకారం అందిస్తుంటుంది డాన్సుల్లో- మన తెలుగు సినిమాలో.    

Friday, 7 March 2014

మరి ఏడుస్తున్నట్టు చూపించమంటావా?....

మన తెలుగు సినిమాలని గమనించండి. సినిమా మొదలైన కాసేపటికి హీరోయిన్ ఇంట్రడక్షను సీనులో హీరోయిన్ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఆ చుట్టు ప్రక్కల ఎవరూ లేకపోయినా కూడా. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే - కారులో వంటరిగా వెళుతున్నా, చివరికి ఎడారిలో నడిచొస్తున్నా సరే. 

ఫాదరంటే చర్చి ఫాదరు కాదండోయ్.....

ఎందుకో తెలీదు గానీ తెలుగు ప్రేక్షకులు 'యాంటీ ఫాదర్ సెంటిమెంటుతో కూడిన సినిమాలను ఆదరించరు. కావాలంటే గమనించండి తెలుగులో వచ్చిన 'ధర్మచక్రం (వెంకటేష్), యమధర్మరాజు M.A (మోహన్ బాబు), మున్నా (ప్రభాస్), బ్రదర్స్ (సూర్య), ఓం 3D ( కళ్యాణ్ రామ్ ) యివేవీ సరిగ్గా ఆడలేదు. అదే ఫాదర్ సెంటిమెంటు తో వచ్చిన సినిమాలు మాత్రం అన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

Monday, 17 February 2014

ఎటెల్లిపోనాడు ?

సందేలకి సంతకెళ్ళి వొంజరమట్టుకొత్తానని
ఎల్లిన సచ్చినోడేటైపోనాడు
సుక్కేసుకొని ఏ రంకులాడి కాడికైనా పోనాడా
లేకేతోవలోనైనా ఒగ్గేసినాడా
ఓలమ్మో ఏటీ సచ్చినోడి పైత్తకం

మాపటేల కట్టుకోమని తెల్ల సీర సూపి
మల్లెపూలెట్టుకోమని మురిపించి
అగరెత్తులంటీమని సెవిలో సెప్పి
ఏటైపోనాడీడు  మరెటెల్లిపోనాడీడు 





Thursday, 6 February 2014

అనుకోలేదు

అనుకోలేదు నువ్వు దూరమవుతావని
అయినా తగ్గలేదు యిసుమంతైనా నీమీద ప్రేమ

అనుకోలేదు నీ రూపం కనుమరుగవుతుందని
అయినా పోలేదు నీమీద నాకు ఉన్న యిష్టం

అనుకోలేదు యింత ఎడబాటు ఉంటుందని
అయినా చావలేదు నీమీద మమకారం

అనుకోలేదు నీ నవ్వులు ఇక కానరావని
అయినా తొలగిపోలేదు నీమీద నా ఆశలు

అనుకోలేదు నీ మాటలు మూగబోతాయని
అయినా వదల్లేదు నీమీద నాకున్న పిచ్చి

అనుకోలేదు నీవిక కనబడవని
అయినా రాలేదు నీమీద తిరస్కారభావం

అనుకోలేదు నువ్వు నన్ను మర్చిపోతావని
అయినా ఇనుమడించలేదు నీమీద గౌరవం

అనుకోలేదు యింత నిర్దయ చూపుతావని
అయినా చేరలేదు నీకోసం ఎదురు చూడటంలో అలసత్వం
  

Wednesday, 29 January 2014

నాన్నా వీడు చూడు నిన్నేమంటున్నాడో?!

యిది చదివిన తరువాత మీకు కొంచెం బాధగా ఉండొచ్చు కానీ నేను చెప్పబోయే విషయం మాత్రం కఠోర వాస్తవం. యింతకీ విషయమేమిటంటే మీరు ఎప్పుడైనా మీ పిల్లలలతో ఎవరైనా తెలిసిన వాళ్ళ యింటికి వెళ్ళడం గానీ లేదా వాళ్ళు మీ యింటికి గానీ రావడం జరిగితే అక్కడ మీకొక సీన్ ఎదురవుతుంది. ఆ సదరు తెలిసిన వాళ్ళు (స్నేహితుడు కావచ్చు బంధువు కావొచ్చు) మీ పిల్లలతో చాలా సరదాగా ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. మరీ చిన్న పిల్లలైతే 'ఓంటమ్మా నీ పేరేంటమ్మా? ఆం తిన్నావా? లాల తాగావా? ఆచ్చెల్లావా?" లాంటి ప్రశ్నలు వేసి  వాళ్ళతో చక్కగా గడుపుతారు. అదే కొంచెం పెద్ద పిల్లలతో అయితే " ఏమ్మా ఏం చదువుతున్నావు? మీ స్కూల్ పేరెంటి? బాగా చదవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి. మీ డాడీని చూడు ఎంత కష్టపడుతున్నారో మీ కోసం. ఆయనకి మంచి పేరు తీసుకు రావాలి." యిలాంటి మాటలతో  చాలా తీయగా మాట్లాడతారు. పిల్లలతో పాటు మిమ్మల్నీ తెగ సంతోషపెడతారు, మంచి సోపేస్తారు. 

Tuesday, 28 January 2014

ఇంట్లో యింకో రకం టిఫిన్ తయారు చేయరుగా మరి?

ఏదైనా టిఫిన్ హోటల్ కి వెళ్ళండి. అక్కడ జనాలని గమనించండి. వారిలో ఏ ఒక్కరూ ఒక సారి తిన్న టిఫిన్ ని మళ్ళీ తినరు చూడండి. అంటే ఓ ప్లేట్ ఇడ్లీయో పూరీయో తిన్నవాడు అవి ఎంత బాగున్నా రెండో ప్లేట్ మాత్రం తినడు. వేరే రకం టిఫిన్ తింటాడు. కేవలం ఇంట్లో మాత్రమే తిన్నవే ఇంకా తింటాడు.