Saturday, 9 August 2014

రివ్యూలు వద్దు బాబోయ్

మార్కెట్ లోకి క్రొత్త సబ్బు వచ్చిందా?
టీవీల్లో, పత్రికల్లో ఆ సబ్బు గురించి తెగ అడ్వర్టైజ్ మెంటులు వచ్చేస్తున్నాయా?
మీరు ఆ సబ్బు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ మీకు ఆ సబ్బు ఎలా ఉంటుందో మీకు సలహా గానీ అభిప్రాయము గానీ చెప్పే వారు లేరా?
ఒక్క సబ్బే కాదు. క్రొత్త ప్రొడక్ట్ ఏది వచ్చినా అది ఎలా ఉంటుందో మీరు స్వయంగా వాడితే గానీ మీకు దాని గురించి తెలిసే అవకాశమే లేదు. కాదంటారా?
వాటిమీద సలహా గానీ, రివ్యూలు గానీ వ్రాసే చాన్సే లేదు.
కానీ ప్రపంచంలో ఒకే ఒక్క ప్రొడక్ట్ కి మాత్రం అది మార్కెట్ లోకి వచ్చిన వెంటనే అది ఎలా ఉంటుందో వెంటనే -  అంటే ఆ ప్రొడక్ట్ వచ్చిన గంటల్లోనే దాని మీద రివ్యూలు వచ్చేస్తాయి. అది బాగుందో లేదో చెప్పటమే కాకుండా దానికి రేటింగులు కూడా తెలియచేస్తాయి. అదేంటో మీకు తెలుసా?
అవును. మీ ఊహ నిజమే. ఆ ప్రొడక్ట్ పేరు
 ' సినిమా'
అది రిలీజైన ఓ గంట సేపటికే దాని మీద రివ్యూలు రాసి పాడేస్తున్నారు. యివి నిజంగా అవసరమా? ప్రపంచంలో మరే యితర ప్రొడక్ట్ కీ లేని రివ్యూలు సినిమాకి మాత్రం ఎందుకు? ఒక సబ్బుని కొని అదెలా ఉందో తెలుసుకుంటున్నప్పుడు సినిమాని మాత్రం రివ్యూ చదివి ఎందుకు చూడాలి? ఆ సినిమాని తీయడానికి ఆ నిర్మాత ఎంత డబ్బు పెట్టుంటాడు? ఎంత శ్రమ? మరెంతో క్రియేటివిటీ? యివన్నీ కలబోస్తే గానీ ఓ సినిమా తయారవ్వదు.  మరలాంటి సినిమా రిలీజైన ఓ గంటలోనే దాని భవిష్యత్తుని నిర్ధారించేస్తే ఎలా?
నా ఉద్దేశ్యం చెత్త సినిమాల్ని ప్రోత్సహించడం కాదు. కానీ ఆ చెత్త సినిమాని కూడా ఎంతో డబ్బు పెట్టే తీస్తారు నిర్మాతలు. కాబట్టి సినిమా బాగుందో లేదో ప్రేక్షకుడినే నిర్ణయించుకొనే అవకాశమివ్వాలి. కేవలం రివ్యూలు చదివో, చూసో సినిమా చూసే విధానం ఆగిపోవాలి.
ఆపలేమంటారా? సరే. కనీసం సినిమా రిలీజైన ఓ వారం పాటన్నా రివ్యూలని నిషేధించాలి. సినిమా కలెక్షన్లకి కీలకమైనది ఆ మొదటి వారమే. కనీసం ఆ వారం రోజులపాటైనా రివ్యూలని నిషేధించాలి.
ఓ సినిమా బాగుందనో లేక చెత్తగా ఉందనో రివ్యూలు రాసి పారేసే పత్రికలు ఐదుకి ఇంత అని రేటింగులు ఇచ్చి పారేసే చానల్సు ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఆ సదరు పత్రికలూ, చానెల్సు మీద ఎవరైనా రివ్యూలు వ్రాస్తేనో,  రేటింగులు ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. సదరు పత్రిక చెత్తగా ఉందనో,  లేదా ఫలానా చానలు పని తీరు ఐదుకి ఇంత అని రేటిగు ఇస్తే వాటి పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించండి.



Thursday, 7 August 2014

రైల్వే టోల్ గేట్

మొన్న జరిగిన స్కూల్ బస్ ఏక్సిడెంట్ వార్త యిప్పటికీ ఏదో చానల్ లో వస్తూనే ఉంది. కానీ అది చూడాలన్నా ఆ వార్త చదవాలన్నా ధైర్యం సరిపోవడంలేదు. ఏమి తప్పు చేసారు ఆ పిల్లలు? అసలు ఎందుకు జరిగింది? ఎవరి తప్పు? రైల్వేదా లేక బస్ డ్రైవర్ దా? డ్రైవరు సెల్ ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటడం వలన ఏక్సిడెంట్ జరిగిందని చెపుతున్నారు పిల్లలు. నా ఉద్దేశ్యం ప్రకారము బస్ డ్రైవరుది తప్పు ఉన్నా ఈ పాపం లో ఎక్కువ భాగము రైల్వే డిపార్ట్మెంటుదేనని నా అభిప్రాయము. ఎందుకంటే ఆ ప్రదేశం లో అంటే రైల్వే క్రాసింగు ప్రదేశంలో సిగ్నల్ గేట్ లేకపోవడమే ప్రధాన కారణము. కాదాంటారా?  
సరే. మరి మరి ప్రతీ రైల్వే క్రాసింగు ప్రదేశంలో ఆ గేటులు పెట్టొచ్చు కదా? ఎందుకు వాటిని కొన్ని చోట్ల మాత్రమే పెడుతున్నారు? అని ప్రశ్నిస్తే మనకు ఓ సమాధానం వస్తుంది "నిధుల కొరత " అని. భారతదేశమంతా సిగ్నల్ గేటుల్ని పెట్టాలంటే కనీసం 30 వేల కోట్లు అవసరమవుతాయంట. అంతే కాదు ప్రస్తుతమున్న పరిస్తితుల్లో రైల్వే కు అంత సొమ్ము భరించే శక్తి లేదట.  మరి అయితే ఈ విషయంలో ప్రైవేటు భాగస్వామ్యము తీసుకోవచ్చు కదా?  
ఎలా అంటే "రైల్వే టోల్ గేట్" లను ఏర్పాటు చేయడం ద్వారా. అవును ఇప్పుడు జాతీయ రహదారుల్లో మనకు చాల చోట్ల కనిపించే టోల్ గేట్ ల మాదిరిగానే రైల్వే టోల్ గేట్ లను ఏర్పాటు చేయాలి. అంటే టోల్ గేట్లు దాటినపుడు టికెట్ ఎలా తీసుకొని వెళతామో అలాగే రైల్వే క్రాసింగు గేట్ దాటేటప్పుడు టికెట్ తీసుకొని దాటాలన్న మాట. ఈ పద్దతిలో వెళితే రైల్వేకు 30 వేల కోట్ల రూపాయలను స్వంతంగా భరించే అవసరముండదు. ప్రైవేటు పార్టీల ద్వారా ఈ రైల్వే టోల్ గేటు లను ఏర్పాటు చేయించి,  తిరిగి ఆ సొమ్ముని ప్రజల ద్వారా తిరిగి పొందే అవకాశం కలిపిస్తే రాబోయే కాలంలో మరెన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఏమంటారు?  

Tuesday, 5 August 2014

కొంచెం ముందూ వెనకా చూద్దురూ !

ఈ మధ్య ప్రతీ సినిమా క్లైమాక్స్ తర్వాత -  అంటే సినిమా పూర్తయ్యాక వచ్చే తంతు గమనించండి. ఆ సినిమా తాలూకు షూటింగ్ జరిగిన సన్నివేశాలను చూపుతూ దాని ప్రక్కన టైటిల్స్ వస్తూ ఉంటాయి. చూట్టానికి ఆ సన్నివేశాలు మంచి ఆశక్తిగా ఉంటుంటాయి. బానే ఉంది. కానీ సినిమా మొదట్లో రావలసిన టైటిల్స్ చివర్లో, అదీ ఆ సన్నివేశాల ప్రక్కన వేస్తోంటే ఆ టైటిల్స్ ని ఎవరు చూస్తారు చెప్పండి? దృష్టి అంతా ఆ నటీనటుల షూటింగ్ విన్యాసాలపై ఉంటుంది గానీ ఆ సినిమా కోసం తెర వెనుక కష్టపడిన సాంకేతిక నిపుణులపై ఎలా ఉంటుంది?  ఆ టైటిల్సు వేసేదేదో సినిమా మొదట్లోనే వేస్తే అందరూ చూసే అవకాశముంటుంది కదా?    

Wednesday, 23 July 2014

పైత్యం బయట పడేది అప్పుడేగా!

చాలా మంది ఇంట్లోనో లేక వంటరిగా ఉన్నప్పుడు సాధారణంగా చేసే పని యిష్టమైన పాటలు పెట్టుకొని  వినడం. అదీ చాలా ప్రశాంతంగా. చివరికి అది ఎంత హుషారైన పాటైనా సరే. కానీ విచిత్రమేమిటంటే అదే పాటని స్నేహితులు లేదా కొంచెం క్లోజ్ గా ఉండేవాళ్ళు ఉన్నప్పుడు అంతకు ముందు ఎప్పుడూ విననట్టు, గట్టిగా పాడేస్తూ, పిచ్చి పిచ్చిగా డాన్సు మూమెంట్లు యిస్తూ ఉంటారు. వంటరిగా ఉన్నప్పుడు కుదురుగా వినే వాళ్ళు   జనాలున్నప్పుడు అలా ఎందుకు ప్రవర్తిస్తారో మరి?         

Tuesday, 22 July 2014

ఒక్క మెతుకు చూస్తే చాలదా మరి?

ఒకే ఒక్క రోజులో, ఒకే ఒక్క సంఘటనతో అవతలి వ్యక్తిని మంచివాడు అని భావించేస్తాం దురదృష్టవశాత్తూ. కానీ ఆ ఒక్క రోజు -  వేరే దారి లేక అతను మంచితనం నటించిన రోజు అయి ఉండవచ్చు.      

Sunday, 20 July 2014

విక్టరీ వెంకటేష్ ఏ సినిమాలోనూ చేయనిది ఏంటి?

యిది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు గానీ, కానీ నిజం. విషయమేమిటంటే, నాకు గుర్తుండీ, వెంకటేష్ యింతవరకూ ఏ సినిమాలోనూ పరిగెత్తలేదు (రన్ చేయలేదు). అటువంటి సీను ఏ సినిమాలోనూ లేదు. నిజమే కదూ?


(ఈ పోస్టు పెట్టిన తర్వాత నాకు తెలియవచ్చిన విషయమేమిటంటే వెంకటేష్ కొన్ని సినిమాల్లో పరిగెత్తాడు (కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా, జయం మనదేరా వగైరా వగైరా..... ఈ విషయాన్ని 'చందు తులసీ గారు తన కామెంటు ద్వారా తెలియచేసారు. జరిగిన పొరపాటుకి చింతిస్తున్నాను. యిక మీద పెట్టే పోస్టులకు జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇస్తున్నాను)  

Wednesday, 16 July 2014

ఓ పజిల్

యిప్పుడు నేను చెప్పబోయేది ఓ పజిల్. ఈ పజిల్ని నేను ఇంటర్మీడియట్ లో ఉండగా నా స్నేహితుడు అడిగాడు. కానీ ఎంత కొట్టుకున్నా సమాధానమివ్వలేకపొయను. చివరికి సమాధానము అతనే చెప్పేసాడనుకోండి. కానీ సమాధానము తెలిసి అవాక్కైపోయాను. అప్పట్నించీ ఈ పజిల్ని చాలా మంది మీద ప్రయోగించాను. కానీ ఎవ్వరూ సరైన సమాధానమివ్వలేకపోయారు. మీరేమైనా చెప్పగలరేమో ప్రయత్నించి చూడండి. యింతకీ పజిల్ ఏంటంటే.....

"ఒక డాక్టరు, ఒక వ్యాపారవేత్త, ఒక ఇంజనీరు కలిసి ఓ హోటల్ లో రూము తీసుకున్నారు. ఆ రాత్రి వారి మధ్య ఏమి జరిగిందో గానీ తెల్లారేసరికి ఇంజనీరు కత్తి గాయాలతో కొన ఊపిరితో ఉన్నాడు. రూములో వారు ముగ్గురే ఉన్నారు.  పోలీసులొచ్చారు. ఎస్సై చావు బ్రతుకుల్లో ఉన్న ఇంజనీరు దగ్గరకొచ్చి 'ఎవరు పొడిచారు మిమ్మల్ని ?'
ఇంజనీరు అతి కష్టం మీద కూడబలుక్కొని 'వాడే పొడిచాడు ' అని చెప్పి ప్రాణం వదిలేసాడు. ఇంజనీరు యిద్దరి వంకా ఎవరినీ చేత్తో చూపించలేదు. ఇంజనీరు కాకుండా రూములో ఉన్నది యిద్దరే. డాక్టరూ, వ్యాపారవేత్త.  అయినా పోలీసులు  వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యాపారవేత్తని అరెస్ట్ చేసేసారు. 
పోలీసులు అంత ఖచ్చితంగా వ్యాపారవేత్తనే ఎందుకు అరెస్ట్ చేసారు? డాక్టరుని ఎందుకు అరెస్ట్ చేయలేదు?"
    

Tuesday, 15 July 2014

అసలే నా యింటి అడ్రసు దొరక్క చస్తుంటే నీ గోలేంటెహె

 మీరు ఓ అడ్రసు కోసం తెలియని ప్రదేశానికెళ్ళరనుకోండి. అక్కడ ఎవరినైనా మీరు చెప్పిన అడ్రసు గురించి వాకబు చేయండి. అందులో కొంత మంది అడ్రసు గురించి అడగ్గానే వెంటనే "ఈ అడ్రసా? ఏ ఏరియా అని చెప్పారు? ఏ సందని చెప్పారు? యిలాంటి ప్రశ్నలు వేసి మిమ్మల్ని ఇంటరాగేట్ చేస్తారు. వారు అలాంటి ప్రశ్నలు వేస్తున్నారంటే దానర్ధం వారికి ఆ అడ్రసు గురించి ఏ మాత్రం తెలియదని. కానీ వారు ఆ విషయం అస్సలు ఒప్పుకోరు. 'తెలియదు ' అని ఎంత మాత్రం చెప్పరు సరి కదా 'ఇలా తిన్నగా వెళ్ళి ఆ లెఫ్ట్ కి వెళ్ళండి.'... అని చెపుతారు. వారు చెప్పింది నమ్మి ఆ రూటులో వెళ్ళారంటే అంతే సంగతులు. మీ టైమంతా వృధా చేసుకున్నట్లే.  "తెలియదు" అనే చిన్న మాట చెప్పటానికి వచ్చిన తంటాలు యివి.

అందులోనే ఆనందముందేమో మరి !

మనల్ని మోసగించేవాడిని లేదా మోసగించాలనుకున్నవాడినైనా నమ్ముతాము గానీ మనల్ని "మోసగాడు" అని భావించేవాడిని మాత్రం జీవితం లో నమ్మము - దగ్గరికి చేరనివ్వము. అదేంటో మరి

Sunday, 13 July 2014

అరిస్తే పోతుందా భయం ?

హర్రర్ సినిమాకి వెళ్ళారు కదా? గమనించండి సినిమా చూస్తున్న జనల్లో చాలా మంది హర్రర్ సీను మొదలవడానికి ముందు గట్టి గట్టిగా అరుస్తుంటారు. అవి విని మిగతా వాళ్ళు గట్టిగా నవ్వుతుంటారు. అదంతా కామెడీ చేయడానికి అనుకుంటున్నారా? కానే కాదు. వారు లోలోపల చాలా భయపడుతుంటారు. తమ భయాన్ని పోగొట్టుకోవడానికి ఆ విధంగా అరుస్తుంటారన్న మాట. ఈ సారి వెళ్ళినప్పుడు గమనించండి.