Tuesday, 23 September 2014

నటుడు 'మాడా' పతనానికి కారకులు ఎవరో తెలుసా?

నటుడు 'మాడా' పతనానికి కారకులు ఎవరో తెలుసా? దర్శకుడు స్వర్గీయ 'E.V.V.సత్యనారాయణ'. అవును. వినడానికి కొంచెం 'యిది'గా ఉన్నా అది నిజం. 'మాడా వెంకటేశ్వర రావు' 'చిల్లరకొట్టు చిట్టెమ్మ ' సినిమా లో 'ఆ' టైపు క్యారెక్టరు చేసి ఉండవచ్చు. కానీ ఆ సినిమాకు ముందూ, ఆ తర్వాత సినిమాలు చాలా వాటిల్లో కమెడియనుగానూ, సహాయనటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నాడాయన. కానీ ఈవీవీ దర్శకత్వము మొదలుపెట్టిన తర్వాత ఆయన కొన్ని సినిమాల్లో 'మాడా' పేరుని ఆడా మగా కాని వారికి పర్యాయ పదంగా మార్చేసాడు ఈవీవీ. 'నేనేమైనా ఆడా మగా కాని మాడా గాడిని అనుకున్నావా?' లాంటి డైలాగులు పలికించడం ద్వారా 'మాడా వెంకటేశ్వర రావు' లాంటి మంచి నటుడి స్థాయిని దిగజార్చాడు. యిక అక్కడినించి ఆయనకి దాదాపు అన్ని సినిమాల్లో 'ఆ' టైపు పాత్రలు మాత్రమే వచ్చాయి. ఈవీవీ వలన బలైపోయిన మరో నటుడు గునుపూడి విశ్వనాధ శాస్త్రి. ఎవరో అర్ధమయ్యిందా? లేదు కదూ?. అదే 'ఐరన్ లెగ్ శాస్త్రి ' అంటే అర్ధమవుతుంది. అతనికి ఆ పేరు పెట్టడమే కాకుండా అతన్ని ఆ పేరుతో తెగ పాపులర్ చేసేశాడు ఈవీవీ. వృత్తి రీత్యా పౌరోహిత్యం చేసుకొనే విశ్వనాధ శాస్త్రి సినిమాల్లో 'ఐరన్ లెగ్ శాస్త్రి'గా పేరు తెచ్చుకోవడం వలన అతనికి పౌరోహిత్య అవకాశాలు రావడమే కరువయ్యాయి. ఆ క్రమము లోనే చివరికి చావుని కొని తెచ్చుకున్నాడు విశ్వనాధ శాస్త్రి...... అదే ఐరన్ లెగ్ శాస్త్రి. ప్చ్ !

Monday, 22 September 2014

మీ వయసెంత?

మీ వయసెంత అని ఎవరైనా అడిగారనుకోండి. ఎంత చెపుతారు? అదేం ప్రశ్న ? నా వయసెంతో అంతే చెపుతాను. అని చిరాకు పడుతున్నారు కదూ? ఆగండాగండి. యిందులో ఒక చిన్న తిరకాసుంది. ఎలాగో చూద్దాం. మీరు 1-1-1974 సంవత్సరములో పుట్టారనుకుందాము. యిప్పుడు చెప్పండి మీ వయసెంత చెపుతారు?
40 సంవత్సరాలా? లేక 41 సంవత్సరాలా?
చాలా మంది చెప్పే జవాబు 41. కానీ యిది తప్పు. ఎందుకంటే మనము చెప్పాల్సింది మనము ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసాము అని. అంతే గానీ పూర్తి చేయాల్సిన వయసు చెప్పగూడదు. యింకా కొంచెం లోతులోకి వెళ్ళి చెప్పుకుంటే ఓ మూడు నెలల క్రితం మీకు ఒక అబ్బాయి పుట్టాడనుకొనడి ఆ అబ్బాయి వయసు ఎంత చెపుతారు? మూడు నెలలు చెపుతారా లేక సంవత్సరమా? అర్ధమయ్యిందనుకుంటా?!

Friday, 19 September 2014

మళ్ళీ చప్పట్లు !

అప్పుడెప్పుడో వచ్చిన హిందీ సినిమా "తేజాబ్" గుర్తుందిగా? అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ నటించారు. మాధురీ 'ఏక్ దో తీన్ పాట ఒక ఊపు ఊపేసింది అప్పట్లో.  దాన్ని తెలుగులో కూడా తీసారు. వెంకటేష్, రాధ హీరో, హీరోయిన్లు. యిదంతా తెలిసిన విషయమే. బానే ఉంది. ఆ సినిమాకి సంబంధించిన యింకో విషయం చెప్పనా? తేజాబ్ సినిమాని తెలుగులో మళ్ళీ యింకో సారి తీసారు. కాకపోతే మక్కీకి మక్కీ కాకుండా దాదాపు అదే కధతో అన్నమాట. ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లు. సినిమా గుర్తొచ్చిందా? సరే చెప్పేస్తున్నా. "వర్షం". అవును. "వర్షం" సినిమా తేజాబ్ కధాంశంతో తీసిన సినిమానే. M.S.రాజు మంచి తెలివిగా తీసాడు, ఎక్కడా తేజాబ్ సినిమా గుర్తు రాకుండా. ఆయన తీసిన యింకో సినిమా "నువ్వొస్తానటే నేనొద్దంటానా?" సినిమా కూడా అదే బాపతు. హిందీ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా "మైనే ప్యార్ కియా" సినిమా కధాంశంతో తీసిన సినిమా అది. భలే ఉంది కదా?!  

Friday, 5 September 2014

ఇంటెర్వెల్ లేని తెలుగు సినిమాలు

నాకు తెలిసీ ఇంటర్వెల్ లేని తెలుగు సినిమా గతం లో ఒకటొచ్చింది. దాని పేరు "ఆఖరి పోరాటం". నాగార్జున, శ్రీదేవి నటించిన సినిమా అది. ఆ సినిమా కి ఇంటెర్వెల్ లేదు. యిప్పుడు చాలా కాలం తర్వాత అలాంటి ఇంటెర్వెల్ లేని సినిమా ఒకటి రాబోతోంది. దాని పేరు "అనుక్షణం". మంచు విష్ణు హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తోంది. గమ్మత్తేమిటంటే ఈ రెండు సినిమాలు ఇంగ్లీష్ అక్షరం 'A' తో  మొదలవ్వడం. రెండు సినిమాల దర్శకుల పేర్లు కూడా R అక్షరం తో మొదలవుతాయి.

Saturday, 30 August 2014

కాలనీ బస్సులు

'పల్లె వెలుగు' బస్సుల స్థానం లో మినీ బస్సులు ప్రవేశపెడతారంట. ఎందుకో మరి? యిప్పుడున్న బస్సుల్లోనే కిక్కిరిసిపోయేంత జనముంటున్నారు. మరి మినీ బస్సుల్లో యింత మంది జనాన్ని ఎలా పట్టిస్తారు? పోనీ బస్సుల సంఖ్య పెంచుతారా అంటే ఖచ్చితంగా పెంచరు గాక పెంచరు. ఎందుకంటే బస్సుల్ని పెంచగలరేమో గానీ డ్రైవర్లు, కండక్టర్ల సంఖ్యని పెంచలేరు కదా? అంటే ఎన్ని పల్లె వెలుగు బస్సులు పోతాయో అన్ని మినీ బస్సులు వస్తాయన్న మాట.  దీనికి పరిష్కారమొక్కటే. ముందు డ్రైవర్ల సంఖ్యని పెంచాలి. పల్లె వెలుగు బస్సులని అలాగే ఉంచాలి. మినీ బస్సులని కూడా ప్రవేశపెట్టాలి. కాకపోతో వాటిని దూర ప్రాంతాలకు కాకుండా అదే ఊరిలో ఆటోలు, రిక్షాలు తిరిగే కాలనీల్లో తిరిగేటట్టు చేయాలి. అంటే సిటీ బస్సుల్లా అన్నమాట. కాకపొతే అవి కాలనీల్లో తిరగవు, ఇవి తిరుగుతాయి. దాని వలన ఆదాయానికి ఆదాయం -  ఆటోల్లో యిరుక్కొని కూర్చునే బాధా తప్పుతుంది. ఈ విధానము అంటే కాలనీల్లో బస్సులు తిరగడమన్నది తమిళనాడులో సంవత్సరం నుండి విజయవంతంగా నడుపుతున్నారు. 

Friday, 29 August 2014

స్కిట్లు చూస్తోంటే వస్తున్నాయి నోట్లోంచి తిట్లు !

ఈ మధ్య టీవీల్లో కామెడీ స్కిట్స్ అంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు. బానే ఉంది. కానీ అందులో విపరీత పోకడలే మరీ ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. మగ వాళ్ళకి ఆడవేషం వేయాల్సిన అవసరమేంటో నాకైతే అర్ధం కాలేదు. ఆ అవతారాలు మరీ జుగుప్సాకరంగా రోత పుట్టించేలా ఉంటున్నాయి. యింత మంది లేడీ ఆర్టిస్టులుండగా వాళ్ళనొదిలేసి మగవారే ఆడ వేషాల్సిన అవసరమేంటో మరి ! వేస్తే వేసారు గానీ అందులో కూడా వెకిలితనమే.  యింకో విషయమేమిటంటే వీళ్ళు చేసే కామెడీ కొన్ని నవ్వు పుట్టిస్తున్నాయి గానీ కొన్ని మాత్రం కితకితలు పెట్టుకున్నా నవ్వు రావడం లేదు సరి కదా  డోకొస్తున్నాయి. అయినా ఆ జడ్జిల స్థానంలో కూర్చున్న వారు మాత్రం విరగబడి నవ్వేస్తున్నారు. ఆ స్కిట్టు అయిపోయాక చివరాఖరులో అందరు నటులూ (యాంకరుతో సహా) కలిసి డాన్సు వేయడం ఒకటి. హతోస్మీ !

ఓ చిన్న చిట్కా

బాటిల్ తో గానీ గ్లాస్ తో గానీ నీళ్ళు తాగుతున్నారా? ఆగండి. మీరు బాటిల్ ని గానీ గ్లాస్ ని గానీ ఎత్తిపెట్టుకొని తాగితే నీళ్ళు ఎక్కువ తాగలేరు. అదే బాటిల్ ని గానీ గ్లాస్ ని గానీ నోటితో కరిచిపెట్టుకొని తాగండి. నీళ్ళు ఎక్కువ తాగగలరు. అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం. ప్రయత్నించి చూడండి. 

Tuesday, 26 August 2014

మరి మంచివాడు పోగిడేదెప్పుడో

మంచివాడి తిట్టు లో నిజాయితీ ఉంటుంది. చెడ్డవాడి పొగడ్త లో కపటత్వం ఉంటుంది.  

Sunday, 24 August 2014

మన హీరోలకి అలా పడుకుంటే గానీ నిద్ర రాదేమో ?!

తరతరాలుగా మన తెలుగు సినిమాలో ఓ దృశ్యము మాత్రం తప్పనిసరిగా చూస్తూనే ఉంటాము. బ్లాక్ అండ్ వైటు సినిమాల నుండి నేటి సినిమాల వరకూ అదే తీరు. యింతకీ ఆ దృశ్యమేమిటంటారా?
"హీరో నీట్ గా ఇన్ షర్ట్ చేసుకొని షూ తొడుక్కుని అదే గెటప్పుతో మంచం మీద పడుకోవడం."
ఎంత తల బాదుకున్నా ఈ గెటప్పుతో బెడ్ మీద పడుకోవడమేంటో మనకస్సలు అర్ధం కాదు. ఈ హీరోలు ఎప్పుడు మారతారో మరి.    

Sunday, 17 August 2014

ఆ ముగ్గురూ...

నాకు తెలిసీ మొదటి సినిమాతోనే ఉర్రూతలూగించిన హీరోయిన్లు ముగ్గురున్నారు మన తెలుగు సినీ పరిశ్రమలో. వాళ్ళు ఎవరంటే " దివ్య భారతి, ఇలియానా, నిత్యా మీనన్ '. కేవలం వీళ్ళు ముగ్గురు మాత్రమే "మొదటి సినిమా ద్వారా విపరీతమైన పేరు, పాపులారిటీ తెచ్చుకున్నారు. బాగా పాపులరైన హీరోయిన్లు చాలా మంది ఉండొచ్చు. కానీ వాళ్ళంతా తరువాతి సినిమాల ద్వారానే పేరు తెచ్చున్నవాళ్ళే. ఉదహారణకి దివ్యభారతిని గుర్తు తెచ్చుకోండి. "బొబ్బిలి రాజా" సినిమాలో అందరినీ ఎంత సమ్మోహనపరిచిందో. ఆ సినిమా ఆడుతున్నంత సేపూ ఆమె గురించి టాపిక్ లేని ప్రాంతము, రోజు లేదంటే నమ్మండి. కేవలం ఆమె కోసమే బొబ్బిలి రాజా సినిమాని పది సార్లు యిరవై సార్లు చూసిన వాళ్ళున్నారు. ఆమె రెండో సినిమా ఎప్పుడొస్తుందాని కళ్ళు కాయలు కాచేలా చూసారు జనం. అలాగే ఇలియానా. తన అందచందాలతో ప్రేక్షకుల్ని కట్టిపారేసిందామె. యిక నిత్యా మీనన్ సంగతి వేరు. అందం, అభినయం, గాత్రం ఈ మూడింటిని కలిగలిపి ప్రేక్షకులని సంభ్రమాశ్చర్యపరిచిన నటి ఈమె. కాజల్, అనుష్క, తమన్నా, శృతి హాసన్, కాజల్, సమంతా లాంటి వాళ్ళు అందం, నటనతో పైకొచ్చిన వాళ్ళే. కానీ కేవలం హిట్టు సినిమాల కారణంగానే పైకొచ్చారు తప్ప నేను చెప్పిన ఆ ముగ్గురిలాగ "ఫస్ట్ సినిమా" వండరు కాదు.