'పల్లె వెలుగు' బస్సుల స్థానం లో మినీ బస్సులు ప్రవేశపెడతారంట. ఎందుకో మరి? యిప్పుడున్న బస్సుల్లోనే కిక్కిరిసిపోయేంత జనముంటున్నారు. మరి మినీ బస్సుల్లో యింత మంది జనాన్ని ఎలా పట్టిస్తారు? పోనీ బస్సుల సంఖ్య పెంచుతారా అంటే ఖచ్చితంగా పెంచరు గాక పెంచరు. ఎందుకంటే బస్సుల్ని పెంచగలరేమో గానీ డ్రైవర్లు, కండక్టర్ల సంఖ్యని పెంచలేరు కదా? అంటే ఎన్ని పల్లె వెలుగు బస్సులు పోతాయో అన్ని మినీ బస్సులు వస్తాయన్న మాట. దీనికి పరిష్కారమొక్కటే. ముందు డ్రైవర్ల సంఖ్యని పెంచాలి. పల్లె వెలుగు బస్సులని అలాగే ఉంచాలి. మినీ బస్సులని కూడా ప్రవేశపెట్టాలి. కాకపోతో వాటిని దూర ప్రాంతాలకు కాకుండా అదే ఊరిలో ఆటోలు, రిక్షాలు తిరిగే కాలనీల్లో తిరిగేటట్టు చేయాలి. అంటే సిటీ బస్సుల్లా అన్నమాట. కాకపొతే అవి కాలనీల్లో తిరగవు, ఇవి తిరుగుతాయి. దాని వలన ఆదాయానికి ఆదాయం - ఆటోల్లో యిరుక్కొని కూర్చునే బాధా తప్పుతుంది. ఈ విధానము అంటే కాలనీల్లో బస్సులు తిరగడమన్నది తమిళనాడులో సంవత్సరం నుండి విజయవంతంగా నడుపుతున్నారు.
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Saturday, 30 August 2014
Friday, 29 August 2014
స్కిట్లు చూస్తోంటే వస్తున్నాయి నోట్లోంచి తిట్లు !
ఈ మధ్య టీవీల్లో కామెడీ స్కిట్స్ అంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు. బానే ఉంది. కానీ అందులో విపరీత పోకడలే మరీ ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. మగ వాళ్ళకి ఆడవేషం వేయాల్సిన అవసరమేంటో నాకైతే అర్ధం కాలేదు. ఆ అవతారాలు మరీ జుగుప్సాకరంగా రోత పుట్టించేలా ఉంటున్నాయి. యింత మంది లేడీ ఆర్టిస్టులుండగా వాళ్ళనొదిలేసి మగవారే ఆడ వేషాల్సిన అవసరమేంటో మరి ! వేస్తే వేసారు గానీ అందులో కూడా వెకిలితనమే. యింకో విషయమేమిటంటే వీళ్ళు చేసే కామెడీ కొన్ని నవ్వు పుట్టిస్తున్నాయి గానీ కొన్ని మాత్రం కితకితలు పెట్టుకున్నా నవ్వు రావడం లేదు సరి కదా డోకొస్తున్నాయి. అయినా ఆ జడ్జిల స్థానంలో కూర్చున్న వారు మాత్రం విరగబడి నవ్వేస్తున్నారు. ఆ స్కిట్టు అయిపోయాక చివరాఖరులో అందరు నటులూ (యాంకరుతో సహా) కలిసి డాన్సు వేయడం ఒకటి. హతోస్మీ !
ఓ చిన్న చిట్కా
బాటిల్ తో గానీ గ్లాస్ తో గానీ నీళ్ళు తాగుతున్నారా? ఆగండి. మీరు బాటిల్ ని గానీ గ్లాస్ ని గానీ ఎత్తిపెట్టుకొని తాగితే నీళ్ళు ఎక్కువ తాగలేరు. అదే బాటిల్ ని గానీ గ్లాస్ ని గానీ నోటితో కరిచిపెట్టుకొని తాగండి. నీళ్ళు ఎక్కువ తాగగలరు. అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం. ప్రయత్నించి చూడండి.
Tuesday, 26 August 2014
మరి మంచివాడు పోగిడేదెప్పుడో
మంచివాడి తిట్టు లో నిజాయితీ ఉంటుంది. చెడ్డవాడి పొగడ్త లో కపటత్వం ఉంటుంది.
Sunday, 24 August 2014
మన హీరోలకి అలా పడుకుంటే గానీ నిద్ర రాదేమో ?!
తరతరాలుగా మన తెలుగు సినిమాలో ఓ దృశ్యము మాత్రం తప్పనిసరిగా చూస్తూనే ఉంటాము. బ్లాక్ అండ్ వైటు సినిమాల నుండి నేటి సినిమాల వరకూ అదే తీరు. యింతకీ ఆ దృశ్యమేమిటంటారా?
"హీరో నీట్ గా ఇన్ షర్ట్ చేసుకొని షూ తొడుక్కుని అదే గెటప్పుతో మంచం మీద పడుకోవడం."
ఎంత తల బాదుకున్నా ఈ గెటప్పుతో బెడ్ మీద పడుకోవడమేంటో మనకస్సలు అర్ధం కాదు. ఈ హీరోలు ఎప్పుడు మారతారో మరి.
"హీరో నీట్ గా ఇన్ షర్ట్ చేసుకొని షూ తొడుక్కుని అదే గెటప్పుతో మంచం మీద పడుకోవడం."
ఎంత తల బాదుకున్నా ఈ గెటప్పుతో బెడ్ మీద పడుకోవడమేంటో మనకస్సలు అర్ధం కాదు. ఈ హీరోలు ఎప్పుడు మారతారో మరి.
Sunday, 17 August 2014
ఆ ముగ్గురూ...
నాకు తెలిసీ మొదటి సినిమాతోనే ఉర్రూతలూగించిన హీరోయిన్లు ముగ్గురున్నారు మన తెలుగు సినీ పరిశ్రమలో. వాళ్ళు ఎవరంటే " దివ్య భారతి, ఇలియానా, నిత్యా మీనన్ '. కేవలం వీళ్ళు ముగ్గురు మాత్రమే "మొదటి సినిమా ద్వారా విపరీతమైన పేరు, పాపులారిటీ తెచ్చుకున్నారు. బాగా పాపులరైన హీరోయిన్లు చాలా మంది ఉండొచ్చు. కానీ వాళ్ళంతా తరువాతి సినిమాల ద్వారానే పేరు తెచ్చున్నవాళ్ళే. ఉదహారణకి దివ్యభారతిని గుర్తు తెచ్చుకోండి. "బొబ్బిలి రాజా" సినిమాలో అందరినీ ఎంత సమ్మోహనపరిచిందో. ఆ సినిమా ఆడుతున్నంత సేపూ ఆమె గురించి టాపిక్ లేని ప్రాంతము, రోజు లేదంటే నమ్మండి. కేవలం ఆమె కోసమే బొబ్బిలి రాజా సినిమాని పది సార్లు యిరవై సార్లు చూసిన వాళ్ళున్నారు. ఆమె రెండో సినిమా ఎప్పుడొస్తుందాని కళ్ళు కాయలు కాచేలా చూసారు జనం. అలాగే ఇలియానా. తన అందచందాలతో ప్రేక్షకుల్ని కట్టిపారేసిందామె. యిక నిత్యా మీనన్ సంగతి వేరు. అందం, అభినయం, గాత్రం ఈ మూడింటిని కలిగలిపి ప్రేక్షకులని సంభ్రమాశ్చర్యపరిచిన నటి ఈమె. కాజల్, అనుష్క, తమన్నా, శృతి హాసన్, కాజల్, సమంతా లాంటి వాళ్ళు అందం, నటనతో పైకొచ్చిన వాళ్ళే. కానీ కేవలం హిట్టు సినిమాల కారణంగానే పైకొచ్చారు తప్ప నేను చెప్పిన ఆ ముగ్గురిలాగ "ఫస్ట్ సినిమా" వండరు కాదు.
Tuesday, 12 August 2014
శెలవిక నేస్తం
ఎక్కడ్నించో వచ్చాము
ఒక్కటిగా కలిసాము
బాధల్ని పంచుకున్నాము
కష్టాల్లో ఓదార్చుకున్నాము
మూడు నెలల ఈ సావాసాన్ని యిట్టే గడిపేసాము
నవ్వుకుంటూ- నవ్వించుకుంటూ
చివరికి వచ్చింది
ఆ రోజు
మనమంతా విడిపోయే రోజు
రానే వచ్చింది
తడబడుతూ వచ్చినా
తడి నిండిన గుండెతో తిరిగెళుతున్నాము
మది నిండా తీపి గురుతులతో
మరెన్నో మధుర జ్ఞాపకాలతో
వీలుంటే
మళ్ళీ అవకాశముంటే
మళ్ళీ కలుద్దాము
లేదంటే వాట్సప్ లోనో
జీమెయిల్ లోనో టచ్ లో ఉందాము
ఉంటాను మరి
శెలవిక నేస్తం
(ఈ కవిత కూడా మైసూరు ట్రైనింగు లో చివరి రోజు వ్రాసాను.)

Sunday, 10 August 2014
బ్యాచ్ నెంబరు ఆరు
ట్రైనింగుకి వచ్చాము మైసూరు
ఎంతో బాగుందిగా ఈ ఊరు
యిచ్చారు బ్యాచ్ నెంబరు ఆరు
ఎల్ ఓ ఏమో కర్రి కిషోరు
యింటికి దూరమయ్యి తగ్గింది హుషారు
శెలవొచ్చిందంటే చాలు మనసు జోరు జోరు
చేసేస్తాం తెగ షికారు
తినలేక చస్తున్నాము రోజూ చారూ సాంబారు
ముక్క లేక కడుపేమో క్యారు క్యారు
పాఠాలు అర్ధం కాక కొట్టుకుంటున్నాం నెత్తీ నోరు
పుస్తకాలు చదవలేక అవుతున్నాము బేజారు
పరీక్షలంటే పుడుతోంది కంగారు
సరిగా వ్రాయకపోతే సీనియారిటీ చేజారు
ఏమో నారు పోసినవాడే పోయడా నీరు !
తిరుగు ప్రయాణానికి టికెట్లు మాత్రం ఖరారు
అవుతాములే చివరికి జూనియరు టెలికం ఆఫీసరు!
(యీ సరదా కవిత నేను మైసూరులో ట్రైనింగు సమయములో వ్రాసాను. ఈ కవిత వ్రాయడములో సహకరించిన నా స్నేహితుడు మరియు రూమ్మేటు అయిన భీమిశెట్టి రంజిత్ కుమార్ కు నా కృతజ్ఞతలు - వరప్రసాద్ దాసరి )

Saturday, 9 August 2014
రివ్యూలు వద్దు బాబోయ్
మార్కెట్ లోకి క్రొత్త సబ్బు వచ్చిందా?
టీవీల్లో, పత్రికల్లో ఆ సబ్బు గురించి తెగ అడ్వర్టైజ్ మెంటులు వచ్చేస్తున్నాయా?
మీరు ఆ సబ్బు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ మీకు ఆ సబ్బు ఎలా ఉంటుందో మీకు సలహా గానీ అభిప్రాయము గానీ చెప్పే వారు లేరా?
ఒక్క సబ్బే కాదు. క్రొత్త ప్రొడక్ట్ ఏది వచ్చినా అది ఎలా ఉంటుందో మీరు స్వయంగా వాడితే గానీ మీకు దాని గురించి తెలిసే అవకాశమే లేదు. కాదంటారా?
వాటిమీద సలహా గానీ, రివ్యూలు గానీ వ్రాసే చాన్సే లేదు.
కానీ ప్రపంచంలో ఒకే ఒక్క ప్రొడక్ట్ కి మాత్రం అది మార్కెట్ లోకి వచ్చిన వెంటనే అది ఎలా ఉంటుందో వెంటనే - అంటే ఆ ప్రొడక్ట్ వచ్చిన గంటల్లోనే దాని మీద రివ్యూలు వచ్చేస్తాయి. అది బాగుందో లేదో చెప్పటమే కాకుండా దానికి రేటింగులు కూడా తెలియచేస్తాయి. అదేంటో మీకు తెలుసా?
అవును. మీ ఊహ నిజమే. ఆ ప్రొడక్ట్ పేరు
' సినిమా'
అది రిలీజైన ఓ గంట సేపటికే దాని మీద రివ్యూలు రాసి పాడేస్తున్నారు. యివి నిజంగా అవసరమా? ప్రపంచంలో మరే యితర ప్రొడక్ట్ కీ లేని రివ్యూలు సినిమాకి మాత్రం ఎందుకు? ఒక సబ్బుని కొని అదెలా ఉందో తెలుసుకుంటున్నప్పుడు సినిమాని మాత్రం రివ్యూ చదివి ఎందుకు చూడాలి? ఆ సినిమాని తీయడానికి ఆ నిర్మాత ఎంత డబ్బు పెట్టుంటాడు? ఎంత శ్రమ? మరెంతో క్రియేటివిటీ? యివన్నీ కలబోస్తే గానీ ఓ సినిమా తయారవ్వదు. మరలాంటి సినిమా రిలీజైన ఓ గంటలోనే దాని భవిష్యత్తుని నిర్ధారించేస్తే ఎలా?
నా ఉద్దేశ్యం చెత్త సినిమాల్ని ప్రోత్సహించడం కాదు. కానీ ఆ చెత్త సినిమాని కూడా ఎంతో డబ్బు పెట్టే తీస్తారు నిర్మాతలు. కాబట్టి సినిమా బాగుందో లేదో ప్రేక్షకుడినే నిర్ణయించుకొనే అవకాశమివ్వాలి. కేవలం రివ్యూలు చదివో, చూసో సినిమా చూసే విధానం ఆగిపోవాలి.
ఆపలేమంటారా? సరే. కనీసం సినిమా రిలీజైన ఓ వారం పాటన్నా రివ్యూలని నిషేధించాలి. సినిమా కలెక్షన్లకి కీలకమైనది ఆ మొదటి వారమే. కనీసం ఆ వారం రోజులపాటైనా రివ్యూలని నిషేధించాలి.
ఓ సినిమా బాగుందనో లేక చెత్తగా ఉందనో రివ్యూలు రాసి పారేసే పత్రికలు ఐదుకి ఇంత అని రేటింగులు ఇచ్చి పారేసే చానల్సు ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఆ సదరు పత్రికలూ, చానెల్సు మీద ఎవరైనా రివ్యూలు వ్రాస్తేనో, రేటింగులు ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. సదరు పత్రిక చెత్తగా ఉందనో, లేదా ఫలానా చానలు పని తీరు ఐదుకి ఇంత అని రేటిగు ఇస్తే వాటి పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించండి.

Thursday, 7 August 2014
రైల్వే టోల్ గేట్
మొన్న జరిగిన స్కూల్ బస్ ఏక్సిడెంట్ వార్త యిప్పటికీ ఏదో చానల్ లో వస్తూనే ఉంది. కానీ అది చూడాలన్నా ఆ వార్త చదవాలన్నా ధైర్యం సరిపోవడంలేదు. ఏమి తప్పు చేసారు ఆ పిల్లలు? అసలు ఎందుకు జరిగింది? ఎవరి తప్పు? రైల్వేదా లేక బస్ డ్రైవర్ దా? డ్రైవరు సెల్ ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటడం వలన ఏక్సిడెంట్ జరిగిందని చెపుతున్నారు పిల్లలు. నా ఉద్దేశ్యం ప్రకారము బస్ డ్రైవరుది తప్పు ఉన్నా ఈ పాపం లో ఎక్కువ భాగము రైల్వే డిపార్ట్మెంటుదేనని నా అభిప్రాయము. ఎందుకంటే ఆ ప్రదేశం లో అంటే రైల్వే క్రాసింగు ప్రదేశంలో సిగ్నల్ గేట్ లేకపోవడమే ప్రధాన కారణము. కాదాంటారా?
సరే. మరి మరి ప్రతీ రైల్వే క్రాసింగు ప్రదేశంలో ఆ గేటులు పెట్టొచ్చు కదా? ఎందుకు వాటిని కొన్ని చోట్ల మాత్రమే పెడుతున్నారు? అని ప్రశ్నిస్తే మనకు ఓ సమాధానం వస్తుంది "నిధుల కొరత " అని. భారతదేశమంతా సిగ్నల్ గేటుల్ని పెట్టాలంటే కనీసం 30 వేల కోట్లు అవసరమవుతాయంట. అంతే కాదు ప్రస్తుతమున్న పరిస్తితుల్లో రైల్వే కు అంత సొమ్ము భరించే శక్తి లేదట. మరి అయితే ఈ విషయంలో ప్రైవేటు భాగస్వామ్యము తీసుకోవచ్చు కదా?
ఎలా అంటే "రైల్వే టోల్ గేట్" లను ఏర్పాటు చేయడం ద్వారా. అవును ఇప్పుడు జాతీయ రహదారుల్లో మనకు చాల చోట్ల కనిపించే టోల్ గేట్ ల మాదిరిగానే రైల్వే టోల్ గేట్ లను ఏర్పాటు చేయాలి. అంటే టోల్ గేట్లు దాటినపుడు టికెట్ ఎలా తీసుకొని వెళతామో అలాగే రైల్వే క్రాసింగు గేట్ దాటేటప్పుడు టికెట్ తీసుకొని దాటాలన్న మాట. ఈ పద్దతిలో వెళితే రైల్వేకు 30 వేల కోట్ల రూపాయలను స్వంతంగా భరించే అవసరముండదు. ప్రైవేటు పార్టీల ద్వారా ఈ రైల్వే టోల్ గేటు లను ఏర్పాటు చేయించి, తిరిగి ఆ సొమ్ముని ప్రజల ద్వారా తిరిగి పొందే అవకాశం కలిపిస్తే రాబోయే కాలంలో మరెన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఏమంటారు?

Tuesday, 5 August 2014
కొంచెం ముందూ వెనకా చూద్దురూ !
ఈ మధ్య ప్రతీ సినిమా క్లైమాక్స్ తర్వాత - అంటే సినిమా పూర్తయ్యాక వచ్చే తంతు గమనించండి. ఆ సినిమా తాలూకు షూటింగ్ జరిగిన సన్నివేశాలను చూపుతూ దాని ప్రక్కన టైటిల్స్ వస్తూ ఉంటాయి. చూట్టానికి ఆ సన్నివేశాలు మంచి ఆశక్తిగా ఉంటుంటాయి. బానే ఉంది. కానీ సినిమా మొదట్లో రావలసిన టైటిల్స్ చివర్లో, అదీ ఆ సన్నివేశాల ప్రక్కన వేస్తోంటే ఆ టైటిల్స్ ని ఎవరు చూస్తారు చెప్పండి? దృష్టి అంతా ఆ నటీనటుల షూటింగ్ విన్యాసాలపై ఉంటుంది గానీ ఆ సినిమా కోసం తెర వెనుక కష్టపడిన సాంకేతిక నిపుణులపై ఎలా ఉంటుంది? ఆ టైటిల్సు వేసేదేదో సినిమా మొదట్లోనే వేస్తే అందరూ చూసే అవకాశముంటుంది కదా?
Subscribe to:
Posts (Atom)