Monday 28 October 2013

మనమింతే

బస్సులోనూ ట్రైనులోనూ ఎవరికీ కూర్చోవటానికి చోటివ్వం
కానీ మనకి చోటివ్వనప్పుడు మాత్రం అవతలివాడిని తెగ తిట్టుకుంటాం

సరదాగా అకేషనల్ గా అంటూ తాగేస్తాం
కానీ మందు బాబుల గురించి మాత్రం తెగ కామెంట్ చేస్తాం

అంటరానితనం గురించి తెగ లెక్చర్లు దంచేస్తాం
కానీ మన పిల్లల్నెవరినీ ఆ వైపుకి పోనివ్వం వాళ్ళతో పెళ్ళిల్లు చేయం

ఊరందరి దగ్గర వినయాలు ఒలకపోస్తాం అవమానాన్ని కూడా చిరునవ్వుతో భరిస్తాం
కానీ యింట్లోవాళ్ళ మీద బీపీలు పెంచుకుంటాం ఆవేశపడిపోతాం ఆయాసం తెచ్చుకుంటాం

వేరే వాళ్ళ గురించి రూమర్స్ వింటాం మాట్లాడతాం
కానీ మన గురించి నిజం మాట్లాడినా విలవిల్లాడిపోతాం  

బయట ఆడవాళ్ళ మీద వెకిలి కామెంటులు చేస్తాం
కానీ మన ఆడోళ్ళ మీద ఈగ కూడా వాలనివ్వం

ఎక్కడా చివరికి మన యింటి పెరటిలోనైనా చిన్న మొక్క నాటం
కానీ పర్యావరణం గురించి తెగ బాధ పడిపోతాం 


ఎక్కడో పేపెర్ మిల్లు పొల్యూషను గురించి వర్రీ అయిపోతాం
యింట్లో మనం చేసే సిగరెట్ పొల్యూషను గురించి మర్చిపోతాం

ఎండలు మండిపోతున్నాయనీ వాతావరణం వేడెక్కిపోయిందనీ తెగ నిట్టూరుస్తాం
కానీ ఆ రేడియేషనుకు కారణమైన ఏసీలూ రెఫ్రిజరేటర్లూ కొనటం మానం వాడటం మానం

పచ్చటి పొలాలు కనుమరుగైపోతున్నాయని ఆవేదన చెందుతాం
కానీ అవే పొలాలని ప్లాటులుగా వేస్తే ఎంచక్కా కొనేస్తాం

మానభంగాలు పెరిగిపోయాయి ఈవ్ టీజింగులు పెరిగిపోయాయి అని తెగ ఫీలైపోతాం
కానీ యింట్లోని మగ పిల్లలకి ఆడవాళ్ళతో మెలగటం ఎలాగో నేర్పం    


రైల్లలోనూ బస్సుల్లోనూ ఆఫీసుల్లోనూ తిని పారేసిన చెత్త పారేస్తాం
కానీ యింట్లో మాత్రం తెగ శుభ్రత పాటించేస్తాం


ఫలానా సినిమాని కాపీ కొట్టి సినిమా తీసారని వెటకారం చేస్తాం
కానీ అదే సినిమాని బ్లాక్ లో కొనుక్కొని లేదా పైరసీ సీడీ లో చూసేస్తాం 

వందల రూపాయలు ఖర్చు పెట్టి పిజ్జాలు బిరియానీలు జంకు ఫుడ్డులూ లాగించి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటాం
కానీ ఆరోగ్యాన్ని పంచిపెట్టే పండ్లు కొనటానికి ఆలోచిస్తాం కొనేటప్పుడు తెగ బేరమాడతాం

వందల రూపాయలు పెట్టి పిల్లలకి 'హ్యారీ పోట్టర్ ' బుక్కులు కొనిస్తాం
పది రూపాయలు పెట్టి చందమామ బాలమిత్ర కొనివ్వం వాటి గురించి వాళ్ళకి చెప్పం గాక చెప్పం

ఎక్కడి వాడో చేగువేరా గురించి గొప్పగా చెప్పుకుంటాం ఆదర్శంగా తీసుకుంటాం
మనవాడైన సుభాష్ చంద్రబోస్ గురించి భగత్ సింగ్ గురించి కనీసం తెలుసుకోవటానికి ప్రయత్నించం

జీవితం లో ఒక్క సారైనా ఓటు వేయం 
కానీ కనిపించిన ప్రతీ నాయకున్నీ తిట్టేస్తాం రాజకీయాల్ని విమర్శిస్తాం

చిన్న చితకా అవినీతి నుంచి పెద్ద అవినీతి దాకా పాల్పడిపోతాం
కానీ అవినీతి గురించి తెగ ఉపన్యాసాలు దంచేస్తాం


మనం ఎప్పటికీ మారం........ మనమింతే

2 comments:

  1. thank you గిరి గారూ... మీ కామెంట్ నాకు చాలా సంతోషాన్నిచ్చింది. మీ అభిప్రాయాలని ఎప్పుడూ తెలియచేస్తారని ఆశిస్తూ..... వరప్రసాద్ దాసరి.

    ReplyDelete