Monday, 23 December 2013

ఓ సమయమా ఎందుకింత నిర్దయ?

అరెరె అప్పుడే ఆ రోజులయిపోయాయా?
కార్కు బాలుతో ఫాస్టు బౌలింగు చేసేసి
కాళ్ళూ వికెట్లని విరొగ్గొట్టేసిన రోజులు
అపుడే అయిపోయాయా?

బ్లాకులో గీతాంజలీ
బొడ్లో చైనులు చుట్టుకొని శివ సినిమాలు
చూసి కేరింతలు కొట్టిన రోజులు
అపుడే దూరమయ్యాయా?

హవా హవా ఏ హావా అంటూ సోలో సాంగులు పాడేసి
ఏక్ దో తీనంటూ మాధురీ డేన్సులకి ఈలలు వేసేసి
చిరు స్టెప్పులకి స్టెప్పులు కలిపేసిన రోజులు
అప్పుడే కనుమరుగయ్యాయా?

Sunday, 22 December 2013

ఏమిటీ డబ్బింగు గోల?

వసంత కోకిల సినిమా గుర్తుందా మీకు? కమల్ హాసన్, శ్రీదేవి నటన అదిరిపోతుంది కదా? ఆ సినిమాని తమిళ్ లో తీసి తెలుగులో డబ్బింగ్ చేసారు. శ్రీదేవికి డబ్బింగు చెప్పిందెవరో తెలుసా? "S.P.శైలజ". అవును. అంతే కాదు నిరీక్షణ సినిమాలో అర్చనకి డబ్బింగు చెప్పింది ఎవరో తెలుసా?  "రోజారమణి". అంతే కాదు నటి విజయశాంతి తన నట జీవితం మొత్తములో స్వంతంగా డబ్బింగ్ చెప్పిన మొదటి చిత్రం "ఒసేయ్ రాములమ్మ". నటుడు రాజశేఖర్ ఇంతవరకు తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోలేదు. సాయికుమార్ అతనికి డబ్బింగ్ చెపుతాడు. సుమన్ కి కూడా అదే పరిస్థితి. ఒక సారి వారిద్దరూ (సుమన్, సాయికుమార్) నటించాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా పేరు "దోషి-నిర్దోషి". ఆ సినిమాలో సుమన్ కి సాయికుమార్ డబ్బింగ్ చెప్పాడు. మరి సాయికుమార్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా? రవిశంకర్. అంటే సాయికుమార్ తమ్ముడన్నమాట. ఈ మధ్య అరుంధతి సినిమాలో నటుడు 'సోనూసూద్' కి వాయిస్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే కమలహాసన్ తన స్ట్రెయిట్ తెలుగు చిత్రాలకి మాత్రమే డబ్బింగ్  చెప్పుకుంటాడు. తమిళం నుండి డబ్ అయిన చిత్రాలకు చెప్పడు. వాటికి 's.p.బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెపుతాడు. మన రాజమండ్రి M.P ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ సినిమాలో ఓ పాత్రకి (హీరోయిన్ తండ్రి ) తన వాయిస్ ఇచ్చాడు అచ్చమైన తూర్పు గోదావరి యాసలో. అది మలయాళం నుండి తెలుగు కి అనువదింపబడిన సినిమా. పేరు "జర్నలిస్టు". సురేష్ గోపి, మంజు వారియర్ నటీనటులు. ఆ డబ్బింగు వెర్షన్ కి నిర్మాత కూడా ఆయనే. 

సిగ్గు సిగ్గు

అదిగో మరొక రాక్షసత్వం బయటపడిన రోజది
ప్రకృతి తానేర్పరచిన ధర్మాన్ని
కాలరాసిన దుర్మార్గం బయటపడిన క్షణమది
సమాజం సిగ్గుతో తలదించుకున్న ఘడియ యది


మానవత్వం భోరుమని మూగగా రోదించిన క్షణమది
పురి విప్పిన విశృంఖలతకు సిగ్గుపడి
ఎక్కడో దాక్కుండిపోయిన సమయమది  

కాపాడవలసిన కనిపించని మూగ దేవుళ్ళంతా
మొకం చాటేసి హుండీల్లోని సొమ్ముల్ని లెక్కేసుకుంటూ
కాలక్షేపం చేసిన దుర్దినమిది  

ఏం జరుగుతోంది? అసలేమవుతోంది?
కోతి నుండి మనిషి పుట్టకే నిజమైతే
మనిషి నుండి పశువుగా మారుతోన్న 
దశ మొదలయినట్టేనా   

నరమాంసాన్ని తినేవాడిని
నరమాంస భక్షకుడంటే
మరి తన మాంసాన్ని
తానే తినే వాడిని ఏమని పిలవాలి?

తన రూపానికి ప్రతిరూపాన్ని తానే కాలరాస్తుంటే
తన బింబానికి ప్రతిబింబాన్ని తానే బద్దలు కొడుతుంటే
తన మాంసానికి కొనసాగింపుని తానే కోసేస్తుంటే
తన నీడని తన తోడుని తానే నలిపేస్తుంటే 
  
తన రెక్కలకింద వెచ్చగా భద్రంగా
చూస్తాడనుకున్న వాడే తనని చిదిమేస్తుంటే
తన చేతిలో చెయ్యేసి భరోసానివాల్సిన వాడే
కామంతో వళ్ళు తడుముతోంటే
పరుల కంట పడకుండా కాపాడాల్సినవాడే
వంకరగా చూస్తోంటే   

ఎవరికి చెప్పాలి?
ఏమని చెప్పాలి?
ఎలా మొర పెట్టాలి?

Saturday, 21 December 2013

ఎవరూ దీన్నించి తప్పించుకోలేరు చాలెంజ్ !

మనందరికీ చిన్నప్పట్నుండీ ఏవో ఒక నిక్ నేములు ఉండే ఉంటాయి. స్కూల్ లోనో లేక ఆఫీసులోనో ఎవరో ఒకరు మనకు నిక్ నేం పెట్టే ఉంటారు. ఎవరూ దీనికి అతీతులు కారు. ప్రతీ ఒక్కరూ ఈ నిక్ నేముల బారిన పడిన వారే (పడాల్సిన వారే). కాకపోతే ఈ పేర్లు మనకి ఇబ్బంది పెట్టనంత వరకూ ఓకే. అలా కాక మనలోని వైకల్యాన్నో లేక జబ్బు పేరో సూచిస్తూ నిక్ నేములు పెడితేనే యిబ్బంది. యింతకీ విషయమేమిటంటే చిన్నప్పుడు అంటే 10 వ తరగతి చదివేటప్పుడు PUMA అనే పేరుగల T-shirt వేసుకొని స్కూల్ కి వెళ్ళాను.

Thursday, 19 December 2013

గొంతులందు పెద్ద గొంతులు వేరయా.....

ఎందుకో తెలీదు గానీ సాధారణంగా పెద్ద గొంతుతో (గట్టిగా) మాట్లాడే  అమ్మాయిల జోలికి వెళ్ళరు అబ్బాయిలు. అంతే కాదు - అలా మాట్లాడే అమ్మాయిలు పెద్ద అందంగా కూడా ఉండరు మరి .

మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి అందుబాటులో లేరు

ఎవరికైనా అప్పిచ్చారా? ఇస్తానన్న రోజుకి తిరిగివ్వలేదా? లేదా ఏదైనా పని గురించి ఎవరి సహాయమైనా కోరారా? అయితే ఫోన్ చేయండి. చేసారా? మీ కాల్ లిఫ్ట్ చేయటం లేదా? ఎన్ని సార్లు చేసినా అదే తంతా? ఫోన్ పని చేయడం లేదనుకుంటున్నారా? అదేం కాదు. మీ నెంబరు చూసి అవతలి వ్యక్తి తీయడం లేదంతే. ప్రస్తుతము బయట జరుగుతున్న ప్రహసనం యిది. యిదొక కొత్త రకం సైకాలజీ అన్నమాట. అవతలి వ్యక్తికి మీ నెంబరు చూడగానే దాన్ని కట్ చేయటమో లేక మాట్లాడటమో చేయడు. దాన్ని అలా సైలెంట్ మోడ్ లో పెట్టేస్తాడన్న మాట. మీకు విషయం అర్ధం కాదు. ఆ తర్వాత అతను ఎప్పుడైనా కనిపిస్తే అతను మీకు వెంటనే చెప్పే జవాబు "వైబ్రేషన్ లో ఉంది - చూడలేదు", "ఫోన్ ఇంట్లో పెట్టి బయటకు వెళ్ళాను", ట్రాఫిక్ లో ఉన్నాను చూసుకోలేదు". అవన్నీ అబద్ధాలే.      

Saturday, 14 December 2013

జీవితమే ఓ చదరంగం

జీవితం కూడా 'చదరంగం' లాంటిదే. కాకపోతే 'చదరంగం'లో రాజుని కాపాడటానికి సైన్యం ఉంటుంది. కానీ నిజ జీవితంలో మనల్ని కాపడటానికి ఏ సైన్యమూ ఉండదు. మనకి మనమే ఓ సైన్యం. ఒంటరిగా పోరాటం చేయాల్సిందే. తప్పదు.

మంచివాడు

ఒక వ్యక్తికి 'మంచివాడు' అనే ముద్ర ఎలా వేస్తారో నాకు తెలీదు గానీ నాకు తెలిసీ 'మంచివాడు ' అనిపించుకోవాలంటే ఒకటే ఫార్ములా. "తన గురించి గొప్పలు చెప్పుకోకుండా, యితరుల గొడవల్లో తల దూర్చకుండా, అక్కడివి యిక్కడా, యిక్కడివి అక్కడా చెప్పకుండా ............ ఒక్క ముక్కలో చెప్పాలంటే తన చావు తను చచ్చేవాడు............ మంచివాడు." 

Thursday, 12 December 2013

నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను ఇష్టపడతాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను కోరుకుంటాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను ఆరాధిస్తాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను అనుమానిస్తాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను ద్వేషిస్తాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను అభిమానిస్తాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నీకోసం వేచియుంటా
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నీ సాన్నిత్యం కోరుకుంటా
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను ప్రేమిస్తున్నా
ఎందుకంటే


Monday, 9 December 2013

కాస్త ఆగు మిత్రమా

అబ్బ పండెంత బాగుందో
కాస్త ఆగు మిత్రమా
దానికి రంగేసారు

అబ్బ యిల్లెంత బాగుందో
కాస్త ఆగు మిత్రమా
దానికి రంగేసారు

అబ్బ అతని కురులెంత నల్లగున్నయో
కాస్త ఆగు మిత్రమా
వాటికి రంగేసాడు

అబ్బ ఆమె ఎంత సుందరాంగో
కాస్త ఆగు మిత్రమా
ఆ యింతి ఊసెత్తితే
పడుతింది  మనకు రంగు

ఆ రంగేసుకున్న రంగనాధుడే
ఈ రంగసాని మగడు
యిక పదవోయీ సారంగు


Sunday, 8 December 2013

కొడకో

మా సొమ్ము మాకు పంచి
ప్రజా సేవ అంటవేందిరా కొడకో
నీ యబ్బ సొమ్మా?నీ యమ్మ సొమ్మా?
నీ అక్క సొమ్మా? నీ అత్త సొమ్మా?

మేమిచ్చిన కారు ఎక్కి మేమిచ్చిన బట్ట తొడిగి
మేమిచ్చిన డబ్బు మెక్కి మేమిచ్చిన పదవి నొక్కి
మా మీదే సవారీ చేస్తావేందిర కొడకో

ఓటు అడిగెటప్పుడు కాళ్ళు మొక్కినావురో
నోటులు మస్తుగ పంచి పూటుగ తాగించినావురో
ఆపైన.....
తాపం తీరినంక గుర్రుమనే కుక్కలల్లె
మీద పడి కరుస్తవేందిర కొడకో

తెల్ల బట్టలెయ్యగానె శాంతమూర్తివయ్యిపోవు
నమస్కారమెట్టి మాకు మస్కాలు కొట్టలేవు
అంబేద్కర్కి దండమెట్టి దళితుడవు అయ్యిపోవు
తురక టోపీ పెట్టగనె ముసల్మానువయ్యిపోవు

ఆడు బొక్కినాడని నీవంటవ్
నీవు మెక్కినావని ఆడంటడు
ఖాళీ అయ్యింది మాత్రం
నా యింటి బొక్కసమేరా కొడకో
నా కొంప ముంచినావురో కొడకో

Tuesday, 3 December 2013

థియేటరు కార్డు

 ప్రతీ ఒక్కరికీ మొదటి రోజు మొదటి ఆట చూడాలని ఉంటుంది. కానీ క్యూలో నించుని టికెట్ సంపాదించడం చాలా కష్టం. అలా అని బ్లాక్ లో కొనలేము. ఆస్తులు రాసిచ్చేయాలి. మరెలా? నా దగ్గర ఓ ఐడియా ఉంది. ATM లో డబ్బులు డ్రా చేయటానికి  డెబిట్ కార్డ్ ఉన్నట్టే థియేటరుకెళ్ళి సినిమా చూసేవారికోసం 'థియేటర్ కార్డ్' ఉండాలి. ఆంధ్ర ప్రదేశ్ లోని ఆ థియేటరు ఈ థియేటరు అని కాకుండా మనకిష్టమొచ్చిన థియేటరుకెళ్ళి సినిమా చూసే సదుపాయము ఉండే విధంగా 'థియేటరు కార్డు ' ని రూపొందిస్తే బాగుంటుందని నా అభిప్రాయము. అంటే ఏమీ లేదు. ఆన్ లైన్ విధనములో ఓ వెయ్యి రూపాయలిచ్చి ఈ థియేటరు కార్డుని కొనుక్కున్నామనుకోండి  ( అంటే మొబైల్ రీచార్జ్ చేసినట్టన్న మాట) ఆ మొత్తం అయిపోయేంతవరకూ మనకిష్టమొచ్చిన సినిమా థియేటరుకెళ్ళి సినిమాలు చూసేయొచ్చన్న మాట. మనతో పాటూ మన ఫ్యామిలీని మన ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్ళొచ్చు. హాలుకెళ్ళి ఈ కార్డు చూపిస్తే చాలు, మనము చెప్పినన్ని టికెట్లు యివ్వాలి - తద్వారా మన అక్కౌంటులోని డబ్బు కూడా తగ్గుతుంది. క్రొత్త సినిమాకి మాత్రం రేపు రిలీజ్ అనగా ఈరోజు వెళితే టికెట్లు యివ్వాలి. క్రొత్త సినిమాకి ఎక్కువ టికెట్లు ఇవ్వటానికి వీలు కాకపోతే ఓ వారం రోజుల పాటు రెండో మూడో టికెట్లకు పరిమితం చేస్తే సరిపోతుంది. మిగతా సినిమాలకి ఎన్నైనా యివ్వాలి. కార్డులో డబ్బులు అయిపోగానే మళ్ళీ రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పైకం పెట్టి కార్డు రీచార్జ్ చేసుకునే వారికి మొత్తం లో రిబేటు యివ్వటమో లేక రిలీజ్ సినిమాకి ఎక్కువ టికెట్లు యివ్వటమో చేయాలి. ఎలా ఉంది?