Monday, 23 December 2013

ఓ సమయమా ఎందుకింత నిర్దయ?

అరెరె అప్పుడే ఆ రోజులయిపోయాయా?
కార్కు బాలుతో ఫాస్టు బౌలింగు చేసేసి
కాళ్ళూ వికెట్లని విరొగ్గొట్టేసిన రోజులు
అపుడే అయిపోయాయా?

బ్లాకులో గీతాంజలీ
బొడ్లో చైనులు చుట్టుకొని శివ సినిమాలు
చూసి కేరింతలు కొట్టిన రోజులు
అపుడే దూరమయ్యాయా?

హవా హవా ఏ హావా అంటూ సోలో సాంగులు పాడేసి
ఏక్ దో తీనంటూ మాధురీ డేన్సులకి ఈలలు వేసేసి
చిరు స్టెప్పులకి స్టెప్పులు కలిపేసిన రోజులు
అప్పుడే కనుమరుగయ్యాయా?


పేజీలకి పేజీలు ప్రేమ లేఖలు రాసేసి
జేబులో పెట్టుకొని సైకిలు మీద
చక్కర్లు కొట్టిన రోజులు
అపుడే వెళ్ళిపోయాయా?

ఫిజిక్స్ హీటు భరించలేక
కెమిస్ట్రీ కాంబినేషన్లు సాధించలేక
లెక్చరర్ల కన్ను గప్పి పారిపోయిన రోజులు
అపుడే గతించిపోయాయా?

యిష్టమైన కూల్ డ్రింకు స్ప్రింట్ ఏమైపోయింది?
రావుగోపాలరావూ అల్లురామలింగయ్య ఏమైపోయారు?
పచ్చని చెట్టూ చేమా మాయమైపోయాయేంటి?
అన్నట్టు టెలిగ్రామేమైపోయింది?  

అన్నయ్యా అనే పిలుపు అంకుల్ గా మారిపోయిందేమిటీ?
మీసంలో అక్కడక్కడా తెల్లబడిందేమిటీ?
వత్తుగా ఉన్న జుట్టు పల్చబడిందేమిటీ?
రివటలా ఉన్నవాడిని నాకు నేనే భారమైపోయానేమిటీ?

ఏమిటిదంతా? ఎందుకిలా? 
సమయానికి ఎందుకింత తొందర?
నిదానమే ప్రధానమన్న సూక్తి మరచిపోయిందా?
ఏమో ! నిజమేనేమో !

అయినా సమయానికి గతముతో పని ఏముంది
గతంలోని సంగతులని తనలో పొందుపరుచుకొని
వర్తమానం వైపు పయనించడము తప్ప 


  




No comments:

Post a Comment