Sunday, 22 December 2013

సిగ్గు సిగ్గు

అదిగో మరొక రాక్షసత్వం బయటపడిన రోజది
ప్రకృతి తానేర్పరచిన ధర్మాన్ని
కాలరాసిన దుర్మార్గం బయటపడిన క్షణమది
సమాజం సిగ్గుతో తలదించుకున్న ఘడియ యది


మానవత్వం భోరుమని మూగగా రోదించిన క్షణమది
పురి విప్పిన విశృంఖలతకు సిగ్గుపడి
ఎక్కడో దాక్కుండిపోయిన సమయమది  

కాపాడవలసిన కనిపించని మూగ దేవుళ్ళంతా
మొకం చాటేసి హుండీల్లోని సొమ్ముల్ని లెక్కేసుకుంటూ
కాలక్షేపం చేసిన దుర్దినమిది  

ఏం జరుగుతోంది? అసలేమవుతోంది?
కోతి నుండి మనిషి పుట్టకే నిజమైతే
మనిషి నుండి పశువుగా మారుతోన్న 
దశ మొదలయినట్టేనా   

నరమాంసాన్ని తినేవాడిని
నరమాంస భక్షకుడంటే
మరి తన మాంసాన్ని
తానే తినే వాడిని ఏమని పిలవాలి?

తన రూపానికి ప్రతిరూపాన్ని తానే కాలరాస్తుంటే
తన బింబానికి ప్రతిబింబాన్ని తానే బద్దలు కొడుతుంటే
తన మాంసానికి కొనసాగింపుని తానే కోసేస్తుంటే
తన నీడని తన తోడుని తానే నలిపేస్తుంటే 
  
తన రెక్కలకింద వెచ్చగా భద్రంగా
చూస్తాడనుకున్న వాడే తనని చిదిమేస్తుంటే
తన చేతిలో చెయ్యేసి భరోసానివాల్సిన వాడే
కామంతో వళ్ళు తడుముతోంటే
పరుల కంట పడకుండా కాపాడాల్సినవాడే
వంకరగా చూస్తోంటే   

ఎవరికి చెప్పాలి?
ఏమని చెప్పాలి?
ఎలా మొర పెట్టాలి?

No comments:

Post a Comment