Monday, 27 January 2014

చిన్న సినిమాని బ్రతికించడం ఎలా?

ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి, సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో  కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు. మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ. 

"చిన్న సినిమాని బ్రతికించండి"
"చిన్న సినిమా మనుగడకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి"
"చిన్న సినిమాకు రాష్ట్రంలో థియేటర్లు దొరకడం లేదు."
 తరచుగా చిన్న సినిమా నిర్మాతల నుండి మనకు వినిపించే మాటలు. నిజమే. చిన్న సినిమాకు థియేటర్లు దొరకడం లేదు. దొరికినా అరకొర వసతులుండే థియేటర్లు మాత్రమే దొరుకుతున్నాయి. కారణం ఉన్న మంచి థియేటర్లు అన్నీ పెద్ద సినిమాలకే (???) కేటాయించేస్తున్నారు. అవి ఆడినంత కాలం వేరే సినిమాలకి అంటే చిన్న సినిమాలకి రిలీజ్ చేసే పరిస్థితి ఉండడంలేదు. మరి దీన్ని ఎలా అధిగమించాలి? వస్తున్నా. చాలా కాలం క్రితం అంటే ఓ యిరవై ఏళ్ళ క్రితం ఒక థియేటరులో 4 ఆటలుంటే 3 ఆటలు మెయిన్ సినిమా వేసేవారు - మార్నింగ్ షో మాత్రం వేరే సినిమా వేసేవారు. దాన్నే కొంచెం అటూ యిటూ మార్చి ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్లలో రెండు ఆటలు ఒక సినిమాని, రెండు ఆటలు యింకో సినిమాని ఆడిస్తున్నారు.   మామూలు థియేటర్లకి కూడా యిదే పద్ధతి లో సినిమాలని ఆడిస్తే బాగుంటుంది కదా. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే 3 ఆటలో లేక రెండు ఆటలో పెద్ద సినిమా ని ఆడించి ఒకటో లేక రెండో ఆటలు చిన్నసినిమాకి కేటాయిస్తే బాగుంటుంది కదా? దాని వల్ల చిన్న సినిమా కూడా మంచి థియేటర్లో ప్రదర్శనకి నోచుకుంటుంది కదా?



మరొక విషయం.  చిన్న సినిమా టికెట్ రేట్ పెద్ద సినిమా టికెట్ రేట్ తో సమానంగా కాకుండా పెద్ద సినిమా  టికెట్ రేట్ కన్నాఒక 50 శాతం తక్కువ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పెద్ద సినిమా తో పోలిస్తే బడ్జెట్ లోను ప్రమోషన్ లోను అవి పోటీ పడలేవు గనక. ప్రేక్షకులకు కూడా చిన్న సినిమా చూడాలన్న ఆసక్తి పెరుగుతుంది.

యింకో విషయం. యిపుడు ఏ థియేటరు చూసినా బ్లాకు లో టికెట్లు అమ్మే థియేటర్లే తప్ప మామూలు థియేటర్లు ఎక్కడా కనబడవు. నా సూచన ఏమిటంటే బ్లాకులో అమ్మండి కానీ యింకో పద్దతిలో. అంటే పెద్ద సినిమా టికెట్ కావాలంటే మార్నిగ్ షో లో ఆడుతున్న చిన్న సినిమా టికెట్ ఒకటి కొనాలని నిబంధని పెట్టండి. దానివల్ల చిన్న సినిమా కూడా ఫుల్ అవుతుంది. ఏమంటారు? 

No comments:

Post a Comment