Sunday 5 January 2014

సతీ సావిత్రి

'మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో.....'
ఎఫ్ ఎం లో m.m.శ్రీలేఖ పాడిన పాట వస్తోంది. అప్పుడు సమయం ఉదయం ఆరు గంటలు. చిన్నగా హం చేస్తూ స్టౌ మీద కాఫీ పెడుతోంది సావిత్రి. అది తనకెంతో యిష్టమైన పాట. తన భర్త శేఖర్ ఓసారి అన్నాడు 'ఇష్టమైన పాటల్ని అలా కూనిరాగాలు తీసే బదులు సిస్టం లో కాపీ చేసుకోవచ్చు కదా? నీకిష్టమైనప్పుడు వినొచ్చు ' అని.
తను ఒప్పుకోలేదు.
ఏo? ఎందుకు అని అడిగాడు.
'మనకిష్టమైన పాటలు యింట్లోనే ఉంటే ఎప్పుడుబడితే అప్పుడు వినేస్తాం. కొన్నాళ్ళకి బోర్ కొట్టేస్తాయి. యిలా అప్పుడప్పుడు వింటేనే వాటికి విలువ' అంది.
శేఖర్ కి మతి పోయింది ఈ లాజిక్కి. వెంటనే అడిగాడు
'మరి నేను?'
సావిత్రికి అతనేం అడుగుతున్నాడో అర్ధం కాక
'మీరేంటి?'
'నేను యిన్నాళ్ళ నుండి నీతోనే ఉన్నాను కదా? మరి నేను కూడా బోర్ కొట్టేసానా?'
ఒక్క క్షణం శేఖర్ ని చూసి 'నేను చెప్పేది నాకిష్టమిన వాటి గురించి బాస్!' అంది కన్ను కొట్టి.
ఆమె చెప్పింది అర్ధమయ్యేటప్పటికి శేఖర్ కి కొద్ది సమయం పట్టింది. 'ఏయ్ నిన్నూ...... ' అంటూ ఆమె చెవి మెలి తిప్పాడు.'
సావిత్రికి నవ్వుకొంది అది గుర్తొచ్చి.
కాఫీని రెండు కప్పుల్లో పోసి బెడ్ రూం కి వెళ్ళింది. పిల్లలిద్దరూ శేఖర్ కి చెరో వైపున పడుకొనున్నారు. యిద్దరూ శేఖర్ మీద కాళ్ళు వేసుకొని ఉన్నారు. సావిత్రికి ఆ దృశ్యం ఎంతో అపురూపంగా అనిపించింది. యిప్పుడే కాదు ఎన్ని సార్లు చూసినా అలాగే అనిపిస్తుంది.
'ఏమండీ...'
'ఊ' అన్నాడు శేఖర్. అన్నాడే గానీ లేవలేదు.
'ఏమండోయ్' మళ్ళీ లేపింది.
'ఊ.... ఏంటి? అడిగాడు శేఖర్.
'లేవండి కాఫీ తాగండి.'
'కాసేపున్నాక తాగుతాను. పడుకోనీ......' పడుకొనే చెప్పాడు శేఖర్.
'ప్రయాణం ఉంది మర్చిపోయారా?'
వెంటనే లేచి కూర్చున్నాడు. రెండు నిమిషాల్లో కాఫీ తాగేసి బాత్రూం కి వెల్లిపోయాడు శేఖర్.
వాళ్ళిద్దరికీ పెళ్ళయి ఏడేళ్ళవుతోంది. వారిద్దరికీ యిద్దరు పిల్లలు. ఒకమ్మాయి ఒకబ్బాయి. పాపకి ఐదేళ్ళు బాబుకి రెండేళ్ళు. అతనో ప్రభుత్యోద్యోగి. జీతం తో పాటు 'గీతం' కూడా తోడయ్యి వాళ్ళ జీవితం బానే గడిచిపోతోంది మధ్యతరగతికి కాస్త పైనే. ఒక వారం రోజులు ఆఫీసు పని మీద ఉత్తరాఖండ్ వెళుతున్నాడు. పుణ్య క్షేత్రాలు ఉంటాయి కదాని ఫ్యామిలీ ని కూడా తీసుకెల్దామనుకున్నాడు కానీ పాపకి పరీక్షలు ఉండటంతో తానొక్కడే వెళ్ళక తప్పడం లేదు. పదకొండు గంటలకి ట్రైను. అతని ప్రయాణానికి కావల్సినవన్నీ ఏర్పాటు చేసింది. అతనికి సెండాఫివ్వటానికి పిల్లలతో సహా బయల్దేరింది సావిత్రి.


*                    *                            *                
ట్రైను రావటానికి యింకా యిరవై నిమిషాల సమయముంది. ప్లాట్ ఫాము మీద నించొని ట్రైను కోసం ఎదురు చూస్తున్నారు శేఖర్, సావిత్రి, వారి పిల్లలు. రైల్వే స్టేషను మంచి కోలాహలంగా ఉంది.
'అన్నీ పెట్టుకున్నారా?' భర్తనడిగింది సావిత్రి.
'ఆ. అన్నట్టు నీ దగ్గర డబ్బులున్నాయా?' అడిగాడు శేఖర్.
ఏం? మీకేమైనా కావాలా?
నేను అడుగుతోంది నా కోసం కాదు. మీ కోసం. 
'ఉన్నాయి లెండి. అయినా మీరు వారం రోజుల్లో వచ్చేస్తారుగా. అప్పటివరకు సరిపోతాయి. అయినా అంత అవసరాలేముంటాయి? మా గురించి మర్చిపోండి. హేప్పీగా వెళ్ళి వచ్చేయండి '
ఏదైనా అవసరమొస్తే నాకు ఫోన్ చేయ్. సరేనా?
తలూపింది సావిత్రి.
అనౌన్స్ మెంట్ అయ్యింది. జనాల హడావిడి ఎక్కువయ్యింది. భారీ లగేజీలతో అటూ యిటూ పరిగెడుతున్నారు. అంత హడావిడిలోనూ టీనేజీ కుర్రాళ్ళ దగ్గర్నించి ముసలి వారి వరకూ తనని పట్టి పట్టీ చూడటం గమనించి  నవ్వుకొంది సావిత్రి. యివన్నీ తనకి మమూలే. తన అందం అలాంటిది. కాలేజీ రోజుల్నించీ తన ప్రాప్తం కోసం వెంపర్లాడిన వాళ్ళ సంఖ్య ఎక్కువే. తనని ప్రేమిస్తున్నానీ పెళ్ళి చేసుకుంటానని ఎంతో మంది వెంటపడేవారు. తను చూస్తేనే చాలనుకొనే వారు. కానీ తను ఎవరికీ దక్కలేదు. యిదిగో- ఈ శేఖర్ కి దక్కింది. అందరూ అంటుండేవారు 'తనని చేసుకొనే అదృష్టవంతుడెవడో' అని. ఏ మాటకా మాట చెప్పుకోవాలి నిజంగా శేఖర్ అదృష్టవంతుడే. లేకపోతే ఏంటి? తన అంత అందగత్తె దొరకటం మామూలు విషయమా? ఎంత మంది ప్రేమలేఖలిచ్చేవారో? పెళ్ళి ప్రపోజల్స్ తెచ్చేవారో? తలచుకుంటే అదంతా ఓ కలగా అనిపిస్తుంది.
'ఏమిటి ఆలోచిస్తున్నావు?'
శేఖర్ మాటతో ఈ లోకం లోకొచ్చింది సావిత్రి.
'అబ్బే ఏమీ లేదు '
ట్రైను వచ్చింది. శేఖర్ ఎక్కాడు. ట్రైను కదిలింది.
'వెళ్ళిన వెంటనే ఫోను చేయండి' అంది సావిత్రి చేయి ఊపుతూ.
*              *                 *      

పిల్లలతో యింటికి చేరుకొంది. సాయంత్రం ఐదు గంటలకి విమల వచ్చింది. విమల తనకి కజిన్ అవుతుంది. కాసేపు అవీ యివీ మట్లాడుకున్నాకా విమల అడిగింది
'అక్కా ఓ రెండువేలుంటే యివ్వవే. ఊరెళ్తున్నాను'
సావిత్రి ముందే అనుకొంది పనిగట్టుకొని వచ్చింది అంటే ఏదో అవసరానికే వచ్చుంటుందని. యింట్లో ఐదు వేలున్నాయి. శేఖర్ రావటానికి ఓ వారం రోజులు పడుతుంది. దీనికి ఓ రెండు వేలు ఇచ్చినా మిగతా మూడువేలు వారానికి సరి పోతాయిలే అనుకొని లోపలికి వెళ్ళి రెండు వేలిచ్చింది విమలకి.
థాంక్స్ అక్కా ఫస్టుకిచ్చేస్తాను అని డబ్బు తీసుకొని వెళ్ళిపోయింది విమల.
ఎలాగూ యివ్వదని తెలుసు. అప్పు అడిగే వాళ్ళు ఎప్పుడూ ఉపయోగించే టెక్నిక్కు అది. అయినా తప్పదు. బంధుత్వం మరి!
డబ్బులు వెళ్ళిపోయింది విమల.
*                      *                     *       
మర్నాడు శేఖర్ ఫోన్ చేశాడు. ఆఫీసు పని యింకో రెండు రోజుల్లో అయిపోతుందనీ ఆ తర్వాత బద్రీనాద్, కేదారీనాద్ కి వెళ్ళి వస్తాననీ చెప్పాడు. సరేనంది సావిత్రి. ఆ సాయంత్రం బాబు నీరసంగా ఉండటం చూసి వళ్ళు పట్టుకొని చూసింది. వళ్ళు వేడిగా ఉండటంతో కంగారు పడింది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళింది సావిత్రి.
అది చిన్న పిల్లలకి బాగా పేరున్న హాస్పిటల్ కావటంతో చాలా రద్దీగా ఉంది. నంబరు తీసుకొని వెయిటింగ్ హాల్ లో కూర్చుంది. తమ వంతు రావడానికి ఇంకా చాలా సమయం పట్టేటట్టుంది. చంటి పిల్లల్నెత్తుకొని వచ్చిన తలిదండ్రులతో నిండిపోయుంది ఆ హాలు.  సిస్టరు బాబుకి టెంపరేచరు చూసింది. 102 ఉంది.  సావిత్రికి కొద్దిగా ఆందోళనగా ఉంది. తమ నంబరు తొందరగా వస్తే బాగుండుననిపించింది. అప్పటికీ ఒక సారి సిస్టరు దగ్గరికి వెళ్ళి రిక్వస్టు చేస్తే ససేమిరా అంది సిస్టరు. చేసేదేమీ లేక ఓ కుర్చీ లో కూర్చుంది.ఆ హాల్లో ఆడవాళ్ళతో సహా తనని పట్టి పట్టి చూడటం గమనించింది కానీ అదేమీ ఆనందానివ్వలేదామెకి ఆ సమయంలో.  తన బాబు పరిస్థితి కన్నా ఏవీ ముఖ్యం కాదు ఆమెకి. కానీ ఓ రెండు నిమిషాల్లో తన బాబు పరిస్థితిని కూడా మరపించే సంఘటన ఒకటి జరగబోతోందన్న విషయం ఆమెకి తెలీదు. 

*                             *                                  *
          
ఒకావిడ భుజం మీద ఒక బాబునేసుకొని వచ్చి తన ప్రక్క సీటు ఖాళీగా ఉండటముతో అక్కడ కూర్చుంది. ఆ బాబు విపరీతంగా ఏడుస్తున్నాడు. సావిత్రి తదేకంగా చూసింది. ఆమె చేతిలో ఉన్న బాబుని కాదు- 'ఆమె'ని. సావిత్రికి అనిపించింది 'ఎంత అందంగా ఉంది ఈమె! యింత అందగత్తెనైన తనకే అందగత్తె అనిపించిందంటే ఆమె ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తను ఆమె ముందు పూర్తి దిగదిడుపే'. చుట్టూ ఒక సారి చూసింది. అందరూ చూస్తున్నారు. తనని కాదు - ఆమెని. ఒక సారి పరీక్షగా చూసింది సావిత్రి ఆమెని. అంత అందంగా ఉన్నా చాలా సింపుల్ గా ఉంది. మొహంలో పేదరికం స్పష్టంగా కనిపిస్తోంది. ఆవిడ చేతిలో ఉన్న బాబు చాలా బాగున్నాడు ఆవిడలాగే. సావిత్రిని అలాగే చూస్తున్నాడు వాడు. సావిత్రి నవ్వింది వాడిని చూసి. వాడు కూడా నవ్వాడు. వాడి బుగ్గ చిదిమి చేయి చాపింది రమ్మన్నట్టుగా. వెంటనే ఆమె చేతుల్లోకి వచ్చేసాడు. బాబుని తన చేతుల్లోకి తీసుకొని ఎత్తుకొంది సావిత్రి. హాల్లో ఉన్న మగాళ్ళు ఆమెని తినేసేలా చూడటం గమనించి నవ్వుకొంది సావిత్రి. ఎవడి బాధ వాడిది!
బాబుకి ఏమయ్యింది? అడిగింది సావిత్రి.
'రాత్రి నించి జ్వరమండీ' అంది ఆమె.
'బాబుకి ఏమయ్యింది?' అడిగింది సావిత్రి.
'రాత్రి నించి జ్వరమండీ' అంది ఆమె.
'అవునా? మా బాబుకి కూడా జ్వరమే'
'అవునా?'
'ఎక్కడుంటారు మీరు?'
'రాజమండ్రేనండి'.
'అవునా? ఎప్పుడూ చూడలేదే మిమ్మల్ని. ఏం చేస్తుంటారు మీరు?'
సమాధానం చెప్పకుండా తల  దించుకొంది ఆమె. ఆమె మౌనాన్ని మరోలా అర్ధం చేసుకొన్న సావిత్రి
'మీరంటే మీరు కాదు. మీ వారేం చేస్తారని అడుగుతున్నా' అంది
అయినా ఆమె ఏమీ బదులివ్వలేదు. యింతలో
'మామూలు నంబరు ముప్పై ఆరూ' అరిచింది నర్సు. వెంటనే బాబుని సావిత్రి చేతిలోంచి తీసుకొని డాక్టరున్న గదిలోకి వెళ్ళిపోయింది.
సావిత్రి మొహం ప్రశ్నార్ధకంగా పెట్టింది. ఏమిటీవిడ తనకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది? అనుకుంటూ ఉండగా ఆమె ఆలోచనని చెదరగొడుతూ ప్రక్కనున్న ఒకావిడ అంది సావిత్రితో
'ఆవిడ మంచిది కాదండీ'
'మంచిది కాదా? అంటే?'
ఆవిడ వెటకారంతో కూడిన నవ్వుతో స్వరం నెమ్మదిగా తగ్గించి అంది
'అదే....ఆవిడ వ్యభిసారం సేత్తాదండి '

*                       *                         *         
ప్రక్కనే ఓ పెద్ద బాంబు పడినట్లయ్యిందామెకి. ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదామెకి. యింకా నమ్మబుద్ది కావటం లేదు. యింత సేపు తాను మట్లాడింది ఓ వ్యభిచారిణి తోటా? ఒక్క క్షణం తన మీద తనకే అసహ్యం కలిగింది. ఈ చేతులతోనా ఆవిడ బిడ్డనెత్తుకొంది. చీ. యింటికెళ్ళి తల స్నానం చేయాలి.మనసంతా వికలమైపోయింది ఆమెకి. అసలిలాంటివారిని హాస్పిటల్ లోకి రానివ్వకుండా ఉంటే బాగుండును. అసలు తనే కాసేపున్నాక రావల్సింది ఈ దరిద్రం ప్రక్కనే కూర్చోవలసి రాకపోవును. సావిత్రి మనసు పరివిధాలుగా అలోచిస్తుంది.
కాసేపటికి బాబుతో బయటకొచ్చింది 'ఆవిడ '.  డాక్టరిచ్చిన మందుల చీటీతో మందులు కొనటానికి బయటకి వెళుతోంది. సావిత్రి వెంటనే పాపని తీసుకొని వడివడిగా ఆమె దగ్గరికి చేరుకొంది.
'నిన్నే........... ఆగు '
వెనక్కి తిరిగి సావిత్రి వంక చూసింది 'ఆవిడ '.
'నీతో మాట్లాడాలి '
'ఆమెకి ' అర్ధం కాలేదు సావిత్రి ఏం మాట్లాడదల్చుకుందో అని.
'నీకు సిగ్గనిపించటం లేదా?'
'ఆ?'
'ఈ పని చేయటానికి సిగ్గనిపించటం లేదా?ఏదోక పని చేసుకు బ్రతకొచ్చు కదా?
సావిత్రి మాటలకి ఎలా సమాధానం చెప్పాలో తెలీక మౌనంగా చూస్తూ ఉండిపోయింది 'ఆమె '.
సమాధానమేమీ చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయింది అక్కడ్నించి.
చీ.... యిలాంటి వాళ్ళతో మాట్లాడటమే వేస్టు. అయినా తనకెందుకు? అసలిలాంటివారికోసం తన సమయాన్ని వృధా చేసుకొవటమెందుకు?
"మామూలు నెంబరు నలభై ఎనిమిదీ" లోపలనించి నర్సు గట్టిగా అరుస్తోంది.అది తనదే. బాబుని తీసుకొని వడి వడిగా డాక్టరు రూములోకి వెళ్ళింది సావిత్రి.
బాబుని పరీక్షించిన డాక్టరు
'మామూలు ఫీవరేనమ్మా. కంగారు పడాల్సిందేమీ లేదు. ఈ టాబ్లెట్లు వాడండి. తగ్గిపోతుంది '
హమ్మయ్య అనుకొని బాబునెత్తుకొని బయటకొచ్చింది.
టాబ్లెట్లు కొన్నది. హాస్పిటల్ బయటకొచ్చిన సావిత్రి ఆటో కోసం చూసింది. బయట ఆటోలు లేవు.

*                     *                          *                      
ఓ ఆటో యిటు వైపు రావటం చూసి చేయి ఊపింది. ఆటో ఎక్కబోతూ ఎందుకో ఓ కారులో ఉన్న వ్యక్తిని చూసి ఆగింది. కొంచెం దూరం లో ఉన్నా అతన్ని పోల్చుకోగలిగింది. సుధీర్. అవును అతను సుధీరే. తన క్లాస్ మేట్. తనంటే పడి చచ్చిన...కాదు... చచ్చినంత పని చేసిన సుధీర్. ఒక్కసారిగా మనసు గతం లోకి వెళ్ళింది.
తనని ప్రేమిస్తున్నానని వెంట పడిన వాళ్ళలో టాప్ ప్లేస్ అని చెప్పాలి.


కాలేజీలో ఉన్న మూడేళ్ళూ పుస్తకాల కన్నా తననే ఎక్కువ చదివాడు. తననే స్మరిస్తుండేవాడు. తన కంట పడాలని తను చూడాలని పిచ్చిగా ప్రయత్నించేవాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అతను తన ఆరాధకుడు. తనకా విషయం తెలిసినా తెలియనట్టే ఉండేది. మొదటి కారణం - అతను పెద్ద ఆస్తిపరుడు కాకపొవటము. రెండోది అతను వేరే కులస్తుడు కావటము. 
కానీ ఏ మాటకామాట చెప్పుకోవాలి సుధీర్ మంచి అందగాడు. శేఖర్ కన్నా కూడా. కానీ అది పెద్దలు కుదిర్చిన సంబంధం.  అక్కడ కులం, ఆస్తి, అంతస్తూ, హోదా యిలాంటివి పెద్ద పీటలేస్తాయి.  కారణం ఏదైనా అతని ప్రేమని తాను తిరస్కరించింది. అదీ డిగ్రీ ఆఖరి సంవత్సరంలో. అతను తనకి ప్రపోజ్ చేసింది అప్పుడే. అతనికి ఏం జవాబివ్వాలో ముందే ప్రిపేర్ అయి ఉండటం వల్ల తాను పెద్ద కష్టపడకుండానే చెప్పేసింది 'నో' అని. అతను చాలా హర్టయ్యాడు. ఒక వారం రోజులైతే కాలేజీకే రాలేదు. తర్వాత తెలిసింది అతను ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని. చావు బ్రతుకుల మధ్య ఉన్న అతనిని స్నేహితులే రక్షించారని. అయినా తన మనసు కరగలేదు. సింపతీతోనో  లేదా జాలితోనో ప్రేమ పుట్టుకు రాదు కదా. అతని ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్ చాలా మంది నచ్చచెప్పి చూసారు తనని. అయినా అందరికీ చెప్పిన సమాధానం ఒక్కటే "సారీ".
ఆ తర్వాత అతను ఎప్పుడూ కనిపించలేదు తనకి. కాలేజీ మానేసాడని తెలిసింది. ఆ తర్వాత అతని వివరాలు ఏనీ తెలియలేదు. తను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు కూడా. ఆ తర్వాత శేఖర్ సంబంధం రావడం తన పెళ్ళి జరిగిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. మూడేళ్ళు తన ప్రేమ కోసం తన చుట్టూ తిరిగిన సుధీర్ ని కాదని కేవలం మూడు నిమిషాల్లో శేఖర్ ని పెళ్ళి చేసుకోవడానికి తాను ఒప్పుకోవడం విచిత్రమే కదా. ఏం చేస్తాం. అన్నీ లెక్క ప్రకారం జరగాలనేది తన పద్దతి. కారు హార్న్ సౌండ్ తో ఈ లోకం లోకి వచ్చింది. 
రోడ్డుకి అవతల వైపు కారులోంచి దిగుతూ "హాయ్ సుధీర్" అన్న పిలుపుతో చూసాడు సుధీర్. ఎదురుగా 'సావిత్రి.'

*                  *                      *                

'హయ్ సుధీర్. ఎలా ఉన్నావు? బాగున్నావా?'
తన కళ్లని తానే నమ్మలేక పోయాడు సుధీర్. తన ముందు తన ఒకప్పటి దేవత 'సావిత్రి.' కలా? నిజమా? పెద్ద మారలేదు తను. కాస్త వళ్ళు చేసింది అంతే. అదే అందం, అదే చలాకీతనం.  
తేరుకొని "హాయ్" అన్నాడు. "మీరు......నువ్వు......మీరు ఎలా ఉన్నారు?"
'మీరూ నీరూ లాంటివి వద్దు గానీ సింపుల్ గా నువ్వు అని పిలువ్ చాలు' అంది నవ్వుతూ.
అతనూ నవ్వాడు.
"ఏంటి నువ్వు ఇక్కడ ఇలా?" ఇద్దరూ ఒకేసారి అన్నారు.
యిద్దరూ నవ్వుకున్నారు.
"సరే ముందు నువ్వు చెప్పు. నువ్వు  యిక్కడేం చేస్తున్నావు?"
'ఒక బిజినెస్ పని మీద వచ్చాను. మీ బాబా?" ఆమె చేతిలో ఉన్న బాబుని చూస్తూ.
'అవును. జ్వరమొస్తే చూపిద్దామని వచ్చాను. యింతకీ ఏం బిజినెస్?'
'మీ యిల్లెక్కడ?' ఎదురు ప్రశ్నించాడు సుధీర్.
చెప్పింది. 'రా. డ్రాప్ చేస్తాను. కారులో కూర్చొని మాట్లాడుకుందాం.'
ఒక్క క్షణం తటపటాయించింది వెళదామా వద్దా అని.
'ఫర్లేదు. ప్రతీకారం లాంటివి ఏవీ తీర్చుకోను.'

నవ్వి కారులో కూర్చుంది బాబుతో.కారు పోనిచ్చాడు సుధీర్. సుధీర్ ని చూసి అనుకొంది 'కొంచెం వళ్ళు చేసాడు తప్పితే పెద్ద మారలేదు.
'యింకేంటి సంగతులు? మీ వారేం చేస్తారు? నువ్వు ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా?' వరుస ప్రశ్నలు సంధించాడు.
'నేనడిగిందానికి జవాబు చెప్పలేదు నువ్వు. '
'ఓ నా గురించా? ఏముంది. నువ్వు లవ్ రిజెక్ట్ చేసాక కాలేజీ మానేసాను. కొన్నాళ్ళు ఖాళీ గా ఉండిపోయాను. అంటే ఒక రెండు సంవత్సరాలన్న మాట. ఆ తర్వాత ఏం చేయాలో అర్ధం కాలేదు. కానీ కారణమేంటో తెలీదు గానీ ఒకటి మాత్రం అనిపించింది. బాగా డబ్బు సంపాదించాలని.  కానీ ఎలా సంపాదించాలో, ఏం వ్యాపారం చేయాలో అర్ధం కాలేదు. అప్పుడు ఓ ఫ్రెండ్ ఓ సలహా ఇచ్చాడు.
'దానికంత ఆలోచించడమెందుకురా? ప్రపంచం లో ఏ పనీ చేతకానివాడు,ఎందుకూ పనికి రాని వాడు కూడా చేయగలిగే ఓ వ్యాపారమొకటుంది. చేస్తావా? అన్నాడు.
'ఏ వ్యాపారము అది?' అడిగింది సావిత్రి.
'అదే నేనూ అడిగాను. వాడేం చెప్పాడో తెలుసా?

"వడ్డీ వ్యాపారము" అని.
ఫక్కున నవ్వింది సావిత్రి. సుధీర్ కూడా తనతో నవ్వు కలిపాడు.
'సో వడ్డీ వ్యాపారం చేసి యింత వాడివయ్యావన్నమాట. బాగుంది.  యిక మా వారి విషయానికొస్తే ఆయనకి ఏం పని చేయాలో క్లారిటీ ఉంది కాబట్టి చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించేసుకొని నన్ను పెళ్ళి చేసుకున్నారన్నమాట. పెళ్ళంటే గుర్తొచ్చింది. నువ్వు పెళ్ళెప్పుడు చేసుకున్నావు? పిల్లలెంతమంది?'
సుధీర్ సమాధానమివ్వకుండా నవ్వాడు.
సావిత్రికి అర్ధం కాలేదు. 'ఏంటి నవ్వుతున్నావు? యింతకీ పెళ్ళి అయ్యిందా లేదా?'
'కాలేదు.'
'ఏంటీ యింకా పెళ్ళి చేసుకోలేదా? కొంపదీసి 'నిన్ను మర్చిపోలేక, యింకెవరినీ ప్రేమించలేక, మరెవరినీ నీ స్థానంలో ఊహించుకోలేక పెళ్ళి చేసుకోలేదు....... లాంటి సినిమా డైలాగులేమీ చెప్పవు కదా?! భయం నటిస్తూ అంది సావిత్రి.
సుధీర్ పెద్దగా నవ్వాడు.
'అలాంటిదేం లేదులే. బిజినెస్ లో పడిపోయి తీరిక లేక చేసుకోలేదు. అంతే.'
'తొందరగా తీరిక చేసుకో బాబు. లేకపోతే కొన్నాళ్ళు పోయాక నువ్వెంత తీరిక చేసుకున్నా ఉపయోగముండదు. అదీ గాక నువ్వు కూడా ఏ బాబునో పాపనో చంకనెత్తుకొని ఈ కష్టాలు పడుతుంటే నేనూ చూడాలిగా?
బదులుగా నవ్వాడు సుధీర్.
'ఆ లెఫ్ట్ లో ఆపు. ఆ ప్రక్క వీధిలోనే మా యిల్లు.'
 కారాపి తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు సుధీర్. దాన్ని తీసుకొని
'సరే ఈ సారి మాయింటికి తప్పకుండా రావాలి. సరేనా?'
'ఒకే'
బాబునెత్తుకొని కారు దిగి 'వస్తాను ' అని చెప్పి వెళ్ళబోతోండగా
'సావిత్రీ' అన్న సుధీర్ పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది సావిత్రి.
'యిందాక నువ్వు చెప్పింది నిజమే.'
'ఏంటి?'
'నేను పెళ్ళి చేసుకోకపోవటానికి నువ్వు చెప్పిన కారణం'  చెప్పేసి ఆమె ప్రతిస్పందన కోసం చూడకుండా వెంటనే కారుని ముందుకి పోనిచ్చాడు సుధీర్.
అతను చెప్పింది విని అలా చూస్తూ ఉండిపోయింది సావిత్రి.
*               *                                  *        

సావిత్రికి మనసంతా వికలమైపోయింది. బెడ్ మీద పడుకొని ఆలోచిస్తోంది. సుధీర్ చెప్పింది పదే పదే గుర్తొస్తోంది. తన పెళ్ళి కాకపోవడానికి కారణం తనా? అతను నిజమే చెపుతున్నాడా? తన కోసం పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయాడా?
వెంటనే సావిత్రికి కోపమొచ్చింది. అతను పెళ్ళి చేసుకొంటే ఏమిటి పెళ్ళీ చేసుకోకపోతే తనకేమిటి? అది అతని సమస్యే కానీ తనది కాదు. అయినా అప్పుడెప్పుడో తను ప్రేమ నిరాకరిస్తే దానికోసం యిప్పటివరకూ పెళ్ళి చేసుకోకపోవటం ఏమిటి? 
ఆలోచిస్తూనే కళ్ళు మూసుకొని పడుకుండిపోయింది.
ఆమెకి తెలీకుండానే సాయంత్రం నాలుగు గంటల వరకు పడుకుండిపోయింది. పాప అరుపుతో హఠాత్తుగా లేచింది సావిత్రి. బాబు యింకా పడుకునే ఉన్నాడు. వళ్ళు పట్టుకొని చూసింది. కొంచెం వేడిగానే ఉంది. వాడిని లేపి టాబ్లెట్ వేసింది. బాబు మళ్ళీ పడుకున్నాడు.
హాల్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేసింది. కాసేఅపు మామూలు ప్రోగ్రాంస్ చూసాక న్యూస్ చానెల్ పెట్టింది.
అందులో ఒక వార్త పెద్ద అక్షరాలతో వస్తోంది. దాని సారాంశమేమిటంటే
"ఉత్తరాఖండ్ లో భారీ వరదలు"
*                    *                          *

సావిత్రికి గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఉత్తరాఖాండ్ అంటే తన భర్త వెళ్ళిన ప్రదేశం. అంటే......
వెంటనే మొబైల్ తీసుకొని తన భర్త నెంబరు కొట్టింది. కవరేజి ఏరియాలో లేదని మెసేజ్ వచ్చింది.
వళ్ళంతా సన్నగా వణకసాగింది.
యింకో చానల్ పెట్టింది. అదే వార్త. ఏమి చేయాలో అర్ధం కాలేదామెకి.
శేఖర్ స్నేహితుడు సుభానీ గుర్తొచ్చాడు. వెంటనే అతనికి ఫోన్ చేసింది.
'నిజమేనమ్మా. నేనూ యిపుడే చూస్తున్నా టీవీలో. ఖంగారు పడకమ్మా. భయపడాల్సిందేమీ లేదు.' అన్నాడు.
అతని ఓదార్పు ఏ మాత్రం పని చేయలేదు సావిత్రి మీద. కానీ ఆ పరిస్థితిలో చేయగలిగింది కూడా ఏమీ లేదు. భర్త ఫోన్ కోసం ఎదురు చూడసాగింది.
కానీ ఆమెకాక్షణంలో తెలీదు యింకో రెండు ఆపదలు పొంచి ఉన్నాయని. తెలిసినా చేసేదేమీ కూడా లేదనుకోండి.
అతని ఓదార్పు ఏ మాత్రం పని చేయలేదు సావిత్రి మీద. కానీ ఆ పరిస్థితిలో చేయగలిగింది కూడా ఏమీ లేదు. భర్త ఫోన్ కోసం ఎదురు చూడసాగింది. 
"500 మంది గల్లంతు"
"45 శవాలు లభ్యం"
"గాలింపు చర్యలకు విఘాతం కల్పిస్తున్న తుఫాను"
టీవీలో హెడ్ లైన్స్ చదువుతున్న సావిత్రికి టెన్షను పెరిగిపోసాగింది.
మళ్ళీ ఇంకోసారి శేఖర్ కి ఫోన్ చేసింది. అదే జవాబు. 
ఆమె కంట్లో ఆమెకి తెలీకుండానే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ప్రతీ మనిషికీ తన జీవిత కాలంలో ఏదో సందర్భంలో పరీక్షా సమయమొకటుంటుంది. ఆ పరీక్ష భగవంతుడు పెడతాడా లేక విధి పెడుతుందా అనది ప్రక్కన పెడితే ఆ పరీక్షని ఎదుర్కోవడం మాత్రం మనుష్యులుగా మనకి తప్పనిసరి. కాకపోతే ఆ పరీక్షకు ముందస్తు ప్రిపరేషన్లూ, ముందస్తు జాగ్రత్తలూ గట్రా ఉండవు. అమాయకంగా ఆ పరీక్షని ఎదుర్కోవడం తప్ప.
ఆమె కూడా ఎదుర్కోబోతోంది - కాకపోతే ఒకటి కాదు మూడు.

*                            *                 *           
అమ్మా....... పాప పిలుపుతో అటు చూసింది సావిత్రి.
ఆదుర్దాగా తన వైపు చూస్తున్న కూతురు కనిపిచింది.
'ఏంటమ్మా?'
'తమ్ముడు వళ్ళు కాలిపోతోందమ్మా'
ఒక్క ఉదుటున లేచి బెడ్ రూంలోకి పరిగెత్తింది సావిత్రి.
బాబు నిద్రపోతున్నాడు. వళ్ళు పట్టుకొని చూసింది. కాలిపోతోంది.ఆమెకి అర్ధం కాలేదు. టాబ్లెట్లు వేసింది కదా తగ్గిపోతుంది అనుకుంటే ఇదేంటి?
ఓరి భగవంతుడా...అప్పటికి ఆ మాటని ఓ ఇరవైసార్లు అనుకొనుంటుంది.
వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేసింది అపాయింట్ మెంట్ కోసం.
సాయంత్రం ఆరు గంటలకి రమ్మన్నారు. సావిత్రికి గల పగిలిపోతోంది.  కాఫీ తాగితే గానీ మనసు కుదుట పడదు. కాఫీ పెట్టుకుందామని వంట గదిలోకి వెళుతుండగా టీవీలో బ్రేకింగ్ న్యూస్ లో ఓ వార్త వస్తోంది
"ఉత్తరాఖాండ్ మృతుల్లో 20 మంది ఆంధ్రులు"
 *                     *                         *

సావిత్రికి కళ్ళు తిరుగుతున్నట్టనిపించింది. వంట్లో ఒక్క సారిగా నీరసం నిస్సత్తువ ఆవహించాయి. ఏంటిది? తనకేంటి యిలా జరుగుతోంది? ఒక ప్రక్క బాబు మరొక ప్రక్క తన భర్త? ప్రక్కన ఉన్న సీట్లో అమాంతం కూలబడిపోయింది. తన భర్త కి ఎలా ఉంది? తనకి ఏమీ కాలేదు కదా? చా. ఫోన్ చేయొచ్చు కదా? ఒక్కసారి తన మీద తనకే చిరాకొచ్చింది. ఏమిటి ఇలా ఆలోచిస్తోంది తను? శేఖర్ అక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఏంటో? మొబైల్ తీసుకొని మళ్ళీ ప్రయత్నించింది శేఖర్ కి. మళ్ళీ అదే జాబు 'ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా' అని.
మళ్ళీ బాబుని చూసింది యింకా వళ్ళు కాలిపోతోంది. యిక లాభం లేదనుకొని బాబుని తీసుకొని బయలుదేరింది హాస్పిటల్ కి తన కూతురితో సహా. 
షరా మామూలుగానే జనాలతో కిటకిటలాడిపోతోంది హాస్పిటల్. వెంటనే స్పెషల్ నెంబరు తీసుకొంది. అయినా వెంటనే లోపలికి పంపించలేదు సిస్టరు. ఎందుకంటే యింకా స్పెషల్ నెంబర్లు తీసుకున్న వాళ్ళు వైటింగులో ఉన్నారు. చేసేదేమీ లేక లోపల గదిలో కూర్చుంది తన నెంబరు కోసం ఎదురు చూస్తూ. శేఖర్ గుర్తొస్తూనే ఉన్నాడు.
ఓ పదిహేను నిమిషాల తర్వాత ఆమె వంతు వచ్చింది. బాబునీ తీసుకొనె డాక్టరు గదిలోకి పరిగెత్తింది పాపని చేత్తో పట్టుకొని.

డాక్టరు ఆమెని గుర్తు పట్టి ఏంటి మళ్ళీ వచ్చారన్నట్టు చూసాడామెని. విషయం చెప్పిందామె. బాబుని మళ్ళీ పరీక్షించాడు డాక్టరు. ఆమెకి ఆతృత పెరిగిపోతోంది. డాక్టరు ఏమి చెపుతాడా అన్నట్టు ఎదురు చూడసాగింది.
'యిది వైరల్ ఫీవరులా ఉందండి. ఎందుకైనా మంచిది కొన్ని పరీక్షలు చేయిద్దాం' అని కొన్ని పరీక్షలు వ్రాసాడు.   బాబుని తీసుకొని లాబొరేటరీ గదిలోకి వెళ్ళింది. ల్యాబ్ అబ్బాయి ఆ చీటీ తీసుకొని 'పన్నెండొందలివ్వండి ' అన్నాడు.
హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి పన్నెండొందలిచ్చింది. అప్పుడు చూసుకొంది. బ్యాగులో కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి.
 ఆమెకి తెలీకుండానే ఆమె నోటిలోంచి ఓ మాట వచ్చేసింది. కాకపోతే అప్పటికి అది ముప్పైయ్యో సారి. అది
''ఓరి భగవంతుడా.....!"
*                     *                       * 
ఓ గంటసేపటి తర్వాత రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ డాక్టరు దగ్గరికి వెళ్ళింది. వాటిని పరీక్షించిన డాక్టరు 'బాబుని హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలండీ అన్నాడు.
'ఏమైందండి ?' ఆతృతగా అడిగింది సావిత్రి.
'బాబుకి డెంగ్యూ ఫీవరు వచ్చిందండి. పెద్ద భయపడాల్సిందేమీ లేదు. ఓ వారం రోజులు హాస్పిటల్ లో ఉంచి ట్రీట్ మెంట్ చేద్దాం, తగ్గిపోతుంది ' అని సిస్టరుని పిలిచి చెప్పాడు బాబుని రూం లో అడ్మిట్ చేసుకోమని.
సావిత్రి బాబుని తీసుకొని రూం కి వెళ్ళింది పాపతో సహా.
ఈ పరిస్థితిలో శేఖర్ ఉంటే ఎంత బాగుండును?! శేఖర్ కి మళ్ళీ ఫోన్ చేసింది. మళ్ళీ అదే జవాబు.
కాసేపటి తరువాత డాక్టరు వచ్చి డెంగ్యూ ఫీవరు గురించి ఏదేదో చెప్పాడు ప్లేట్లెట్లూ అదీ యిదీ అని. ఆయన మాటలు వింటూనే ఓ ప్రక్క ఆలోచిస్తోంది సావిత్రి. ఆయన చెప్పడం ఆపాక అడిగింది డాక్టరుని 
'ఎంతవుతుందండి?'
'ఓ పాతిక- ముప్పై వేలు వరకు'
గుండె గుభేలుమంది ఆమెకి. చేతిలో కేవలం పదిహేడు వందలున్నాయి, ఎలా ??
ఆమె మొబైల్ రింగయ్యింది. ఏదో తెలియని నంబరు.
ఆన్సరు బటను నొక్కి 'హలో ఎవరూ?' అంది
'సావీ. నేను శేఖర్ ని.'
*                *                       *
ప్రాణం లేచొచ్చింది ఆమెకి భర్త గొంతు విని. అంత టెన్షనులోనూ ఆమెకి సంతోషం పొంగుకొచ్చింది.
'ఏవండీ. ఎక్కడున్నారండీ? చాలా సార్లు ఫోన్ చేసాను మీకు. ఏమైపోయారు?........ ఓ ఐదు నిమిషాలు వరుస ప్రశ్నలు గుప్పించింది అతని మీద.
ఆమె చెప్పింది విన్న శేఖర్ అక్కడ తాను పడిన యిబ్బందులు గురించి చెప్పాడు.
'ఎప్పుడొస్తున్నారు?'
'చెప్పలేను. యిక్కడ అంతా అగమ్యగోచరంగా ఉంది. రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. సాధ్యమైనంత త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను. కంగారు పడవద్దు.'
బాబు విషయం చెప్పింది సావిత్రి. కంగారు పడ్డాడు శేఖర్.
'అయ్యో. అవునా? మరి నీ దగ్గర డబ్బులు లేవు కదా ఎలా మరి?'
అంత టెన్షనులోనూ నవ్వొచ్చింది ఆమెకి. యిప్పటి దాకా నేను అనుకున్నాను. యిప్పుడు నాకు ఈయన తోడయ్యారన్న మాట.
శేఖర్ వెంటనే అరిచినట్టుగా అన్నాడు 'సావీ, గుర్తొచ్చింది. లాకరులో ఓ కవరులో నా చెక్కు ఒకటుంటుంది. దాని మీద అమౌంట్ ఏమీ రాయలేదు. దాని మీద ఓ యాభై వేలు రాసి రేపు బ్యాంకులో మార్చుకో. సరేనా?'
శేఖర్ చెప్పింది విని ప్రాణం లేచొచ్చింది సవిత్రికి. హమ్మయ్య. సమస్య తీరిపోయింది. ఎంత టెన్షను పడ్డాను?! ఆమెకి ఆనందంతో కన్నీళ్ళు కారిపోయాయి తెలీకుండానే.
'సరే ఉంటాను. మళ్ళీ అవకాశముంటే ఫోన్ చేస్తాను. వీలైనంత తొందరగా వచ్చేస్తాను. బాబు జాగ్రత్త.'
ఫోన్ పెట్టేసాడు శేఖర్.
నర్సు వచ్చి మందుల చీటీ ఇచ్చింది.
'ఈ మందులు రాసిచ్చారండి డాక్టరు గారు'
ఆ చీటీని తీసుకొని ఆసుపత్రిలోనే ఉన్న మందుల షాపుకి వెళ్ళింది సావిత్రి. చీటీ తీసుకొని మందులిచ్చాడు షాపు లోని అబ్బాయి.
'ఎంత?'
'రెండు వేల రెండు వందలు '
మళ్ళీ గుండె ఝల్లుమంది. బ్యాగులో పదిహేడు వందలే ఉన్నాయి. యింకా ఐదు వందలు తక్కువ. చెక్కు రేపు మార్చొచ్చు. కానీ వీటికి డబ్బులెలా?
'ఈ డబ్బులు తీసుకోండి.'
ఎక్కడో విన్న గొంతు. అటు వైపు చూసింది. ఎదురుగా 'ఆమె '. ఎవరినైతే తను చీదరించుకొందో, ఎవరినైతే తను అసహ్యించుకుందో.... 'ఆమె. చేతిలో 500 రూపాయల నోటుతో నించొనుంది.'
కోపం తారాస్థాయికి చేరుకుంది సావిత్రికి. 
'ఏమీ అఖర్లేదు. పదిహేడొందలకి ఎన్నొస్తే అన్నివ్వండి. మిగతావి రేపొద్దున్న తీసుకుంటాను. ఎవరి దయా దాక్షిణ్యం అవసరం లేదు.' దాదాపు అరిచినట్టు చెప్పింది సావిత్రి.
ఆ డబ్బులకి సరిపడ మందులిచ్చాడు ఆ అబ్బాయి. వాటిని తీసుకొని విసురుగా వెళ్ళిపోయింది సావిత్రి.
సావిత్రి వంక అలా చూస్తుండిపోయింది 'ఆమె.'
బాబు ఉన్న రూం లోకి వెళ్ళింది సావిత్రి. నర్సు బాబుకి  ఇంజెక్షను చేసింది. సావిత్రి బాబు తల నిమురుతూ అలా నించుండిపోయింది.
ఓ పావుగంట తర్వాత సావిత్రికి హాస్పిటల్ బయట ఏవో అరుపులు వినిపించాయి. అక్కడే ఉన్న నర్సుని అడిగింది 'ఏంటి ఆ అరుపులు?'
'ఏమోనండి తెలీదు '
సావిత్రి గది తలుపు తీసుకొని బయటకు వచ్చి చూసింది. అక్కడ ఓ యాభై నుంచి అరవై మంది వరకు జనం గట్టిగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలిస్తున్నారు
'జై సమైక్యాంధ్ర'


ఆమెకి అర్ధం కాలేదు. నర్సుని పిలిచి అడిగింది.
'అదేనండి తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వము ప్రకటించిందంటండి. యిందాక టీవీలో చెప్పారు. దానికి నిరసనగా యిదిగోండి యిలా రోడ్ల మీదకొచ్చి గొడవ చేస్తున్నారు. బహుశా రేపట్నుండి అల్లర్లు గట్టిగా జరిగేటట్టున్నాయండి. టీవీలో కూడా అదే చెపుతున్నారు.........' చెప్పుకుపోతోంది నర్సు. సావిత్రి వింటోంది కానీ యింకా ఏదో ఆలోచిస్తోంది.అంటే రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటే తన పరిస్తితి ఏంటి? బ్యాంకులు పనిచేస్తాయో లేదో?
ఒక్క సారి ఉలిక్కిపడింది. సిస్టరుని కంగారుగా అడిగింది.
'రేపు బ్యాంకులు ఉంటాయి కదా?'
'ఎందుకుండవండి? ఈ గొడవలు మామూలేనండి. రేపటికి సర్దుకుపోతాయి......' ఏదో తనకు అంతా తెలిసినట్టు భరోసా యిచ్చిపారేసింది సావిత్రికి.
గోడమీద ఫోటో లోని బాబు నోటిమీద వేలు పెట్టుకున్ని నవ్వుతున్నాడు ఆమె చెప్పింది విని 'హన్నన్నా' అన్నట్టుగా.
 
*                      *                        *

ఆ రాత్రి చాలా భారంగా గడిచింది ఆమెకి. రాత్రంతా దాదాపు జాగారం చేసింది. బాబుకి టెంపరేచరు ఏమాత్రం తగ్గటం లేదు. చాలా నీరసంగా ఉన్నాడు. పాపని తన వళ్ళోనే నిద్రపించి బాబుని చూస్తూ ఉంది సావిత్రి.  మధ్య మధ్యలో సిస్టరుని లేపి చూపుతోంది. ప్రొద్దున్న ఎప్పుడవుతుందా, యింటికి వెళ్ళి ఆ చెక్కుని బ్యాంకులో వేద్దామా అన్నట్టుంది ఆమెకి. ఆమె కోరిక నెరవేరినట్టుగా తెల్లారింది.
సిస్టరుని పిలిచి చెప్పింది యింటికి వెళ్ళాలని.
'మరి బాబుని యిక్కడే వదిలేస్తారా?'
'ఒక్కడినే ఎలా వదులుతాను? నా వెంట తీసుకెళతాను.'
'వద్దమ్మా. బాబు పరిస్థితి బాలేదు కదా. మీరొక్కరే వెళ్ళొచ్చేయండి. మేము ఉంటాము కదా. పాపని కూడా యిక్కడే ఉంచండి.'
సావిత్రి కంగారు పడింది. కానీ తప్పదు.
పోనీ ఒకసారి విమలకి ఫోన్ చేస్తేనో? అవును. ఆమెకి ఫోన్ చేసి బాబు దగ్గర ఉండమంటే?
వెంటనే విమలకి ఫోన్ చేసింది.
'అదేంటక్కా. ఊరెల్తున్నాను అని చెప్పను కదా?'
ఉసూరుమని ఫోన్ పెట్టేసింది. సుభాని గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పింది.
'అయ్యో. నేను బయల్దేరి వస్తున్నా ఉండమ్మా. నువ్వేం ఆందోళన పడొద్దు.'
కొంచెం ధైర్యంగా అనిపించింది ఆమెకి. ఓ అరగంట అతని కోసం ఎదురు చూసింది కానీ అతని జాడ లేదు. యింకో రెండు నిమిషాల తరువాత మళ్ళీ ఫోన్ చేసింది.
'బయట పరిస్థితి చాలా దారుణంగా ఉందమ్మా. చాలా అల్లర్లు జరుగుతున్నాయి. ఎక్కడికీ వెళ్ళే పరిస్థితి లేదు. నువ్వు కూడా హాస్పటల్ నుంచి బయటకి రాకపోవడమే మంచిది.'
ఆమెకి పీకల దాకా కోపం వచ్చింది. నేను కూడా హాస్పిటల్ లోనే ఉంటే చెక్కు ఎవరు తెస్తారు? తప్పించుకోవడానికిదో సాకు.
విసురుగా కట్ చేసింది.
సిస్టరు తో చెప్పింది.
'లాభం లేదు, నేనే వెళ్ళాలి పాపని యిక్కడే వుంచుతున్నా. జాగ్రత్తగా చూస్తావు కదూ?
'మీరు నిశ్చింతగా వెళ్ళండమ్మా.'
పాపని దగ్గరకి తీసుకొని చెప్పింది యింటికి వెళ్ళి కాసేపట్లో వచ్చేస్తానని.
పాప బేలగా చూసింది తన తల్లి వంక. ఆమె మనసు చివుక్కుమంది. కానీ తప్పదు. నెమ్మదిగా బయటకొచ్చింది సావిత్రి.
ఆటో కోసం చూసింది. ఒక ఆటో కనిపించిది. ప్రాణం లేచి వచ్చింది. ఆటోని పిలిచి చెప్పింది తన యింటి అడ్రెస్. 
'వంద ' చెప్పాడు ఆటోడ్రైవర్.
'ఏమిటి వందా? ముప్పై రూపాయలే కదా?'
'బయట పరిస్థితి ఎలా ఉందో తెలీదాండి? ఈ పరిస్థితిలో రావడమే గొప్ప. యింకా బేరమాడతారేంటండి?' అన్నాడు చిరాగ్గా.
ఒక్కసారి హ్యాండ్ బ్యాగు చూసింది. కొన్ని పది రూపాయల నోట్లు కొంత చిల్లర అంతా కలిపి ఓ యాభై రూపాయలుంటాయేమో.
'సరే యాభై యిస్తాను. తర్వాత నీ యిష్టం.
'ఎక్కండి '. ఆటో ఎక్కి కూర్చుంది. ఆటో బయల్దేరింది. F.M ఆన్ చేసాడు ఆటో డ్రైవర్.
'వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. రెడ్ ఎఫెం......ఆ రెడ్ ఎఫెం....
తరువాతా ఓ పాట వచ్చింది.
సావిత్రికి అసహనంగా ఉంది. ఆటో డ్రైవరు తో చెప్పింది పాటలు ఆపేయమని. ఆటో డ్రైవరు కట్టేసాడు. యింతకీ ఆ సమయంలో F.M లో వస్తున్న పాట ఆమెకిష్టమైన పాట.
'మంచుకొండల్లోని చంద్రమా......చందనాలు చల్లిపో......'
*                       *                           *                    
పరిస్థితి ఆమె ఊహించిన దానికన్నా భయంకరంగా ఉంది. ఎటు చూసినా ఆందోళనలే. ప్రతీ రోడ్డుమీద టైర్లు కాల్చి రోడ్డుకి అడ్డంగా పడి ఉన్నాయి. ఎక్కడ చూసినా ఒకటే నినాదము
'జై సమైక్యాంధ్ర '.
కొంత దూరం వెళ్ళాక రోడ్డుకి అడ్డంగా నించున్న జన సమూహం కనిపించింది. దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలుచేస్తున్నారు. సావిత్రికి ఆందోళన మరింత పెరిగింది. వాళ్ళు ఆటోని అక్కడే ఆపేసారు ముందుకి కదలనీకుండా. ఆటో డ్రైవరు, ఆమె కలిసి ఎంతో ప్రాధేయ పడితే గానీ వదల్లేదు ఆటోని. కానీ అక్కడితో సమస్య తీరలేదు. కొంత దూరం వెల్లినా మళ్ళీ అదే పరిస్థితి. వాళ్ళని తప్పించుకుంటూ అడ్డ రోడ్డుల్లో వెళుతూ చివరికి ఎలాగో యింటికి చేరుకుంది.  యిల్లు చూడగానే ప్రాణం లేచి వచ్చిందామెకి. వెంటనే ఆటో దిగి లోపలికి పరిగెత్తింది. బెడ్ రూం కి వెళ్ళి బీరువా తలుపు తీసి చూసింది. అల్మారా లో చెక్కు కనిపించింది. వణుకుతున్న చేతులతో తీసుకొని బ్యాగులో పెట్టుకొంది. ప్రక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగలేక అడగలేక డబ్బులడిగింది ఓ ఐదొందలిమ్మని.
'అయ్యో. అడగక అడగక అడిగారు. అంత లేవండి. ఓ రెండొందలున్నాయి. యిమ్మంటారా?
'సరే యివ్వండి '
డబ్బులు తీసుకొని బయటకొచ్చింది.ఆటో అబ్బాయిని అక్కడే ఉండమని చెప్పింది.
'స్టేట్ బ్యాంకుకి పద '. ఆటో ముందుకి కదిలింది. మళ్ళీ అవే అల్లర్లు, అవే నినాదాలు. అతి కష్టం మీద బ్యాంకుకి చేరుకుంది. ఆమెని వెక్కిరిస్తున్నట్టుగా బ్యాంకు మూసేసుంది. 
సావిత్రి చిగురుటాకులా వణికిపోయింది. తనకున్న ఏకైక ఆధారం కూడా పోయింది. యిప్పుడెలా?
బ్యాంకు బయట వారిని అడిగింది. ఎప్పుడు తెరుస్తారని. ఈ గొడవలు యిప్పట్లో తగ్గవని యింకో నాలుగైదు రోజుల వరకు తీయక పోవచ్చని చెప్పారు.
నీరసం ఆవహించింది. ఏమి చేయాలి? ఆటో లో ఎక్కి కూర్చున్న ఆమెని అడిగాడు డ్రైవరు
'ఎక్కడికి తీసుకెళ్ళాలండి?'
'హాస్పిటల్ కి '
ఆటో ఆసుపత్రి వైపు పరుగు తీసింది.
*                    *                           *
ఆసుపత్రి లోపలికెళ్ళేసరికి సిస్టరు ఎదురు పడింది.
'ఏమ్మా? వచ్చేసారా? బాబుకి టెంపరేచరు తగ్గటం లేదండి. డాక్టరు గారు మిమ్మల్ని వెంటనే కలవమన్నారు '
ఆమె మాటలు పూర్తి కాక ముందే బాబు ఉన్న గది లోకి చేరుకొంది సావిత్రి. బాబు ప్రక్కనే బేలగా కూర్చొనుంది పాప. తల్లిని చూడగానే ఒక్క సారిగా ఏడ్చేసింది. ఆమెకి కూడా ఏడుపోచ్చేసింది. పాపని దగ్గరకి తీసుకొని బాబు వళ్ళు పట్టుకొని చూసింది. కాలిపోతోంది.
సిస్టరు చెప్పింది గుర్తొచ్చి డాక్టరు ఉన్న రూము లోకి పరిగెత్తింది.
డాక్టరు ఆమెని చూడగానే 'వచ్చారా? ఎక్కడికి వెళ్ళిపోయారు? బాబుని అలా వంటరిగా వదిలి వెళ్ళొచ్చా? యింతకీ నేను చెప్పిన మెడిసిన్ తీసుకున్నారా?' వరుస ప్రశ్నలు సంధించాడు డాక్టరు.
నెమ్మదిగా విషయం చెప్పింది. ఆమె చెప్పింది విన్న డాక్టరు మొహం లో కొంత అసహనం కనిపించింది.
'మీకు ఆల్రెడీ చెప్పాను ట్రీట్ మెంటుకి ఖర్చవుతుందని. యింకా కొన్ని టెస్టులు చేయాలి. కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలి. రూం ఖర్చులు వగైరా వీటన్నిటికీ  పే చేయాలి కదా?'
'డాక్టరు గారు నాకు కొంచెం టము యివ్వండి. యిచ్చేస్తాను. నా భర్త కూడా యిక్కడ లేరు. నా దగ్గర చెక్కు ఉందండి. కావాలంటే అది మీకు ఇస్తాను......'
'సారీ. చెక్కులతో పని కాదమ్మా. యిలా చెపుతున్నానని ఏమీ అనుకోవద్దు. నేను మీకు హెల్ప్ చేయలేను. మీరు బాబుని తీసుకొని వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళండి.' నిర్దయగా చెప్పేసాడు డాక్టరు.
హతాశురాలయ్యింది. రెగ్యులర్ గా వచ్చే హాస్పిటల్ డాక్టరు యింత దారుణంగా మాట్లాడుతున్నాడేంటి?
అతన్ని ప్రాధేయపడినా  లాభం లేదని తెలిసాక బయటకొచ్చేసింది. ఫోన్ తీసుకొని తెలిసిన వాళ్ళకి, కొంతమంది బంధువులకి ఫోన్ చేసింది. అందరి సమాధానమొక్కటే
''సారీ. ఈ పరిస్థితిలో సహాయపడలేము ' అని. 
ఎంత వడ్డీ అయినా ఫర్వాలేదు అన్నా లాభం లేకుండా పోయింది. పరిస్థితి నిజంగా కూడా అదే. ఆమెకి నిజంగా సహాయం చేయాలని వాళ్ళలో కొంత మందికి ఉన్నా చేయలేని పరిస్థితి.
గంట గంటకి బాబు పరిస్థితి దిగజారిపోతోంది. మధ్యలో సిస్టరు వచ్చి చెప్పింది రూం ఖాళీ చేయమని..... వేరే పేషెంట్ కి రూం కేటాయించారని.
ఎలా......యిప్పుడెలా? అన్ని దారులూ మూసుకుపొయాయి తనకి. బాబుని చూస్తోంటే గుండె తరుక్కుపోతోంది. ఒక్కరన్నా తనకి సహాయపడేవారు లేరా? ఒక్కరు.......
'సుధీర్ '.
సుధీర్ కి ఫోన్ చేస్తే? అతను ఫైనాన్స్ వ్యాపారే కదా. ఒక్క క్షణం తన మీద అతనికున్న ఒన్ సైడు ప్రేమ గుర్తొచ్చింది. తప్పదు. ఈ సమయం లో అవన్నీ అనవసరం. బాబు ముఖ్యం. ఓ స్థిరభిప్రాయానికొచ్చిన ఆమె సుధీర్ నెంబరుకి ఫోన్ చేసింది.
*                        *                            *
'హలో' అవతల సుధీర్.
'హ...లో సుధీర్. నేను సావిత్రిని మాట్లాడుతున్నా.'
సావిత్రి గొంతు వినగానే ఎక్కడ లేని ఉత్సాహమొచ్చేసింది సుధీర్ కి.
'హలో సావీ.' అచ్చం శేఖర్ పిలిచినట్టే పిలిచాడు సుధీర్. ఒక్క క్షణం ఉలిక్కిపడింది.
'ఎలా ఉన్నావు? బానే గుర్తొచ్చానే? నాకు జన్మలో ఫోన్ చెయవనుకున్నాను. ఐ యాం సో లక్కీ.......'
'నీతో కొంచెం పనుండి ఫోన్ చేసాను ' అతని మాటలుకి అడ్డు తగులుతూ అంది.
'యా... చెప్పు '.
విషయం చెప్పింది సావిత్రి.
'సరే. ఏం చేయమంటావ్?' సుధీర్ గొంతులో ఓ వ్యాపారి గొంతు వినిపించింది.
'నాకు ఓ ముప్పై వేలు కావాలి. ఎంత వడ్డీ అయినా ఫర్వాలేదు '
అటునుండి జవాబు రాలేదు. అతనికి వినబడలేదేమోనని
'హలో సుధీర్. వింటున్నావా?'
'విన్నాను. నీకు ముప్పై వేలు కావాలి. అంతే కదా? వడ్డీ ఎంత ఇస్తావు మరి?'
'ఎంతయినా ఫర్వాలేదు. వెంటనే కావాలి.' ఠక్కున అంది.
'నేను కోరినంత యిస్తావా?'
'యిస్తాను. ఎంతో చెప్పు '
'నేను కోరినంత.....అంటే నీ మీద నాకున్న కోరికంత............. యిస్తావా?'
రక్తం చివ్వున ఆమె మొహం లోకి చిమ్మింది. ఏమంటున్నాడు ? కోరికా? అంటే?.....అంటే?
అంటే త....న.....శ....రీ...రా....న్ని......
చీ. సుధీర్ యింత దుర్మార్గుడా? అతనంటే అసహ్యమేసింది.
'సుధీర్. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్ధమవుతుందా? నువ్వసలు మనిషివేనా? మానవత్వమనేది ఉందా నీకు? నా అవసరాన్ని యిలా ........'
'అవును.మనిషిని కాదు. మృగాన్ని. పశువుని. రాక్షసుడిని. ఏమైనా అనుకో - ఫర్వాలేదు. నీ మైకం లో పడి జీవితాన్ని కోల్పోయాను. యింకా కోల్పోతున్నాను. జాగ్రత్తగా విను. నీ ప్రేమకి దూరమై ఆత్మ హత్యా ప్రయత్నం చేసినపుడు నువ్వు కనీసం పరామర్శించడానికైనా రాకుండా నీ దారి నువ్వు చూసుకున్నావు. అంటే.....  నేనేమైనా ఫర్వాలేదు. నీ స్వార్ధం నువ్వు చూసుకున్నావు. యిప్పుడు నేను చేస్తోంది కూడా అదే. కానీ నీ మీద ద్వేషం తోనో లేక ప్రతీకారం తోనో కాదు సుమా! నీ మీద అత్...యంత ప్రేమా.....యిష్టం......కోరికా.....మోజూ...వగైరా వగైరాలతో. నాకు తెలుసు నువ్వు నాకు యింక దక్కవని. దక్కే అవకాశం కూడా లేదు అని. కానీ ఏం చేయను? నిన్ను తప్ప యింకొకరిని జీవితంలోకి ఆహ్వానించలేను. ఎలాగూ జీవితాంతం నిన్నే తలచుకుంటూ బ్రతికేస్తాను కాబట్టి నేను కోరుకున్న అమ్మాయితో ఒక్కసారి........
'నోర్ముయ్. అని విసురుగా ఫోన్ పెట్టేసింది సావిత్రి. ఎంత సులువుగా అడుగుతున్నాడు? చీ. వీడికి ఫోన్ చేసినందుకు తన మీద తనకే అసహ్యమేసింది.
'అమ్మా. డాక్టరు గారు మీకు మళ్ళీ చెప్పమన్నారమ్మా.' సిస్టరు అంటోంది. ఈ సారి సరాసరి బాబుని ఎత్తుకొని వచ్చింది.  అయిపోయింది. అంతా అయిపోయింది. అన్ని దారులూ మూసుకుపోయాయి. డబ్బు దొరికే మార్గం ఏ కోశానా లేదు. బాబుని తీసుకొని వెళ్ళడం తప్ప యింకేమీ చేయలేదు తను. అంటే తన బాబు.......??????
నో. ఏమైనా చేసి తన బాబుని కాపాడుకోవాలి. ఎలా? ఎలా? ఒక్కటే దారి. సుధీర్ కోరిక తీర్చడం. అంతే. అదొక్కటే మార్గం. అవును. అది తప్ప యింకో దారి లేదు. సుధీర్ కోరిక తీర్చితే అతను డబ్బులిస్తాడు. అంటే
తను వ్యభిచారం చేయాలి.
వ్య....భి.....చా......రం.
యింత డబ్బూ, యింత స్టేటస్, సమాజం లో అత్యంత గౌరవ మర్యాదలున్న తనకు వ్యభిచారం చేయాల్సిన  పరిస్థితి. అయినా తప్పదు. బాబుని కాపాడుకోవాలంటే తప్పదు. బాబు కోసం ఏది చేయటానికైనా తను సిద్ధమే.
'బాబుకెలా ఉందండి? ప్రశ్న విని అటువైపు చూసింది.
'ఆమె '.
తను ఎవరినైతే అసహ్యించుకొందో 'ఆమె.' వ్యభిచారిణి. మరి తను??? కాబోయే వ్యభిచారిణి. అంత దిగులులోనూ నవ్వొచ్చింది. ఒక్కసారి ఆమెని చూసింది. ఎంత హీనంగా చూసింది తను ఆమెని? ఎన్ని నీతులు చెప్పింది తను. అడుక్కు తినైనా బ్రతకొచ్చు కదా అంది తను.
మరి తను?  తను చేస్తోందేమిటి?  యింత డబ్బున్న తనకే వ్యభిచారం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే - ఎటువంటి పరిస్తితుల్లో ఆమె యిటువంటి పని  చేసుండొచ్చు?
చివరికి ఆమె యిచ్చిన డబ్బులు తీసుకోవడానికి ఎంత రాద్ధాంతం చేసింది తను?
సావిత్రికి తెలీకుండానే కళ్ళల్లో నీళ్ళు ఉబికి వచ్చాయి. అమాంతం ఆమెని పట్టుకొని ఏడ్చేసింది. 'ఆమెకేమీ అర్ధం కాలేదు. సావిత్రిని నెమ్మదిగా ఊరడిస్తూ ' ఏం ఫర్లేదమ్మా. దిగులు పడకండి. బాబుకి ఏమీ కాదు. పైన భగవంతుడున్నాడు.'
నెమ్మదిగా ఆమె నుండి వేరుపడి చేతులెత్తి దండం పెట్టింది సావిత్రి. భగవంతుడికి కాదు
ఎదురుగా ఉన్న 'ఆమె'కి.
*              *                      *
బాబు, పాపతో సహా యింటికి చేరుకొనేసరికి ఓ పావుగంట పట్టింది. అప్పటికే ఆమె ఓ అభిప్రాయానికొచ్చేసింది. తను ఏమైనా ఫర్వాలేదు. తన శీలం , మానం, ప్రాణం అన్నీ బాబు తర్వాతే. బాబు బ్రతకాలి అంతే. వణుకుతున్న చేతులతో మొబైల్ తీసుకొని సుధీర్ నెంబరుకి కొట్టసాగింది.
9......

అయిపోయింది..... అంతా అయిపోయింది....

8.....

ఈ రోజుతో తన పవిత్రత కోల్పోతోంది.....

4.....

తన భర్తకి ద్రోహం చేయబోతోంది....

6......

తను ఓ జీవచ్చవం......

5.....

తన పేరు సావిత్రి...... పతివ్రత పేరు. తను చేస్తుందో??

2.......

ట్రింగ్......ట్రింగ్........ట్రింగ్......ట్రింగ్......
ల్యాండ్ లైను రింగవుతోంది.
సుధీర్ కి ఫోన్ చేయడం ఆపి ఫోన్ ఎత్తింది.
'హలో సావీ. కంగారు పడకు. నేనొచ్చేస్తున్నా. యింకో అరగంటలో అక్కడుంటా. నేవీ వాళ్ళు హెలీకాఫ్టరులో హైదరాబాదు తీసుకొచ్చారు. అక్కడ సుబ్బారావు మామయ్య దగ్గర యాభైవేలు తీసుకున్నాను. రాజమండ్రి కి ఫ్లైటులో వచ్చేస్తున్నా. కంగారు పడకు. బాబుకి ఎలా ఉంది? ..........శేఖర్ చెప్పుకుంటూ పోతున్నాడు.
ఆమెకేమీ వినిపించడం లేదు.











 


 






 
 



     



1 comment:

  1. అబ్బా మళ్ళీ తరువాయి భాగమా...

    ReplyDelete