Thursday 26 September 2013

నీ దిక్కున్న చోట చెప్పుకో

నమస్తే మీరు చూస్తున్నది టీవీ నైంటీ.  నా పేరు తృప్తి వాజ్ పాయ్. ముందుగా హెడ్ లైన్స్.
"విడుదలైన అన్ని సెంటర్లలోనూ దుమ్ము దులిపేస్తున్న "నీ దిక్కున్న చోట చెప్పుకోరా బాడ్ ఖవ్".
"గత తెలుగు సినిమా రికార్డులని తిరగరాస్తున్న "నీ దిక్కున్న చోట చెప్పుకోరా బాడ్ ఖవ్".
"సినిమా సూపర్ హిట్ తో పండగ చేసుకుంటున్న అభిమానులు"
"రేపు రాష్ట్రానికి రానున్న అధిష్టానం ప్రత్యేక దూత. ఘన స్వాగతం పలకటానికి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం"
"అనేక మలుపులు తిరుగుతున్న హీరొయిన్ అప్రాచీ అగర్వాల్ విడాకుల కేసు"
"గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోన్న ఆ ఊరి శునకం. ఆ వింతని చూడటానికి తండోపతండాలుగా తరలి వస్తున్న అశేష జనం"
"సక్సెస్ అయిన అగ్ని-6 పరీక్ష" 
యిక వివరాల్లోకొస్తే అతడొక నిప్పు ఖనిక. ఆయన పేరు చెపితే ప్రత్యర్దుల గుండెల్లో 'మెట్రో రైళ్ళు' పరిగెడతాయి. అతని ఆకారాన్ని ముందు నించి చూస్తే వెనకవైపుకు పారిపోతారు. ఆయన మొహం లో మొహం పెట్టి చూస్తే డెంగ్యూ జ్వరం వచ్చేస్తుంది. ఆయన నిటారుగా నడిస్తే నిలువెల్లా దహించుకుపోతారు.  ఆయన మరెవరో కాదు మన యుగాస్టార్ కామేష్ (అసలు పేరు కామరాజు). ఆయన నటించిన "నీ దిక్కున్న చోట చెప్పుకోరా బాడ్ ఖవ్" సినిమా ఈ రోజు విడుదలైన అన్ని సెంటర్లలోనూ రికార్డులని తిరగరాస్తోంది ఆ సినిమా గురించి మన హీరో గారితో ముచ్చటిద్దాం.  నమస్తే సార్. వెల్ కం టూ అవర్ స్టుడియో. "చెప్పండి ఎలా ఫీలవుతున్నారు? ఈ విజయాన్ని ఎలా అస్వాదిస్తున్నారు?" అడిగింది ఏంకరు.   
ఎదురుగా కూర్చున్న హీరో కామేష్ చిద్విలాసంగా చూస్తూ "చాలా హాప్పీ గా ఫీల్ అవుతున్నానండీ. ఈ సినిమాని యింత హిట్ చేసినందుకు అఖిలాంధ్ర ప్రేక్షకులకి నా..... అ బె ద బా దె బా.... .....
"హృదయపూర్వక" అందించింది ఏంకరు 
"ఆ ఆ అదే హృదయపూర్వక కృతఙ్నతలు తెలుపుకుంటున్నాను. ఈ విజయం నాది కాదు. అఖిలాంధ్ర ప్రేక్షకులది మరియు నా అభిమానులది" అన్నాడు హీరో.      
"నీ దిక్కున్న పేరు చోట చెప్పుకోరా బాడ్ ఖవ్ అని ప్రత్యర్ధులని ఉద్దేశ్యించి యింత పవర్ ఫుల్ గా సవాల్ చేయటం అన్నది ఈ మధ్య కాలం లో లేదు. అయ్ బాబోయ్ మీరు యిలా బెదిరిస్తే వాళ్ళు ఎక్కడికి వెళతారు? ఎక్కడ చెప్పుకుంటారు? హిహిహి.....సరే....అసలు ఈ సినిమాకి యింత పవర్ ఫుల్ పేరు పెట్టాలన్న అలోచన ఎవరికొచ్చింది? ఎలా వచ్చింది? నాకు తెలిసి యిలాంటి ఐడియాలు మీకు తప్ప ఎవరికీ రావు. ఏం ఐ రైట్ సార్?" హింట్ ఇచ్చింది ఏంకరు.     
"అవునండీ ఇది నా ఆలోచన లోంచి పుట్టుకొచ్చిందే. కాకపోతే దీని వెనకాల చిన్న తమాషా విషయం ఒకటుంది......"
"వావ్! మన హీరో గారు ఇప్పటి వరకు ఎక్కడా ప్రస్తావించని పేరు వెనకాల రహస్యాన్ని మనకి ఫస్ట్ టైము చెప్పబోతున్నారు. అఖిలాంధ్ర ప్రేక్షకులకి మొట్టమొదటి సారిగా ఈ విషయాన్ని మీ ముందుకు తెస్తోంది టీవీ నైంటీ. చెప్పండి సార్. మా ప్రేక్షకులని యింక ఏమాత్రం టెన్షనుని గురి  చేయకుండా".
 
"నేను ఓ షూటింగ్ లో ఉండగా కధ చెప్పటానికొచ్చాడు ఈ సినిమా డైరెక్టరు. అతనితో కధా చర్చల్లో ఉండగా టీ తెచ్చాడు అసిస్టంట్. నాకు యిస్తున్నప్పుడు అది నా మీద కొచెం వొలిగింది. నాకు వళ్ళు మండింది. వెంటనే లేచి వాడి చెంప పగలగొట్టాను. వాడు "అయ్ గారు. పొరపాటున వలిగింది. చూసుకోలేదు" అన్నాడు. అదే టైము లో నా అభిమానినంటూ ఒకడు వచ్చి 'ఆటోగ్రాఫ్' అడిగాడు. అసలే మంట మీద ఉన్న నాకు వాడు అలా అడిగే సరికి వళ్ళు మండి వాడికి కూడా ఒకటిచ్చాను. 'సార్ ' అంటూ చూశాడు నన్ను. వెంటనే వాడిని యిలా అన్నాను "ఏంట్రా అలా చూస్తున్నావు? నీ దిక్కున్న చోట చెప్పుకో" అని. ఆ పక్కనున్న డైరెక్టరు వెంటనే " సూపర్ సార్. అదిరిపోయింది. మన సినిమా టైటిల్ యిదే" అని అరిచాడు. అక్కడున్న వాళ్ళంతా వెంటనే చప్పట్లు కొట్టారు. అలా వచ్చిందన్నమాట. కాకపోతే నేను నీ దిక్కున్న చోట చెప్పుకో అని మాత్రమే అన్నాను. దానికి బాడ్ ఖవ్ అని చేరిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి చెపితే అందరూ చాలా బాగుంటుందని చెప్పారు" చెప్పాడు హీరో.       
"వావ్. సూపర్ సార్. మీ స్పాంటేనిటీ సింప్లీ సూపర్ సార్. సో సార్ మాకు ఇప్పుడు బాగా అర్ధమవుతోంది. గతం లో మీ సినిమాలు  "మక్కెలిరగ తీస్తా", "పింజారి వెధవ" సినిమాలకి టైటిల్సు ఎలా వచ్చాయో. అభిమానులకి యింత విలువిచ్చే హీరో ఇంకెక్కడైనా ఉంటారా చెప్పండి.  చూస్తున్నారుగా అభిమానులూ. ఈ సినిమా కి టైటిల్ పెట్టటానికి మీరు కూడా ఓ కారణమన్న మాట. బీ రెడీ. మన హీరో గారితో దెబ్బలు తినటానికి రెడీ గా ఉండండి. మీరు తిన్న ప్రతీ దెబ్బకీ ఓ సినిమా టైటిలు వస్తుందన్నమాట."
హిహిహి అని ముసిముసి నవ్వులు నవ్వాడు హీరో.
" సార్ యింక మీ ఏక్షను గురించి చెప్పండి. యిప్పటివరకూ మీరు చెసిన సినిమాళ్ళో మీ నటన ఒక ఎత్తయితే ఈ సినిమాలో మీ నటన మరో ఎత్తు. విశ్వరూపం చూపించారు. కొన్ని సీన్లల్లో మీ నటన ఎక్ స్ట్రార్డినరీ గా ఉంది. ముఖ్యంగా విలన్ ని చాలెంజ్ చేసే సన్నివేశం లోను, మదర్ తో సెంటిమెంట్ సీన్ లోను, హీరొయిన్ తో రొమాన్స్ పండించే సీన్ లోను మీ నటన అదిరిపోయింది. మీ నటన రురించి ఏం చెప్తారు? చాలా క్లిష్టమైన సీన్లని పండించటానికి ఏదైనా హోం వర్క్ లాంటిది ఏదైనా చేశారా?"
"నటన అనేది నా రక్తం లోనే ఉంది. హోం వర్కులూ, క్లాస్ వర్కులూ చేసే అలవాటు ఎప్పుడూ లేదు ఈ యుగా స్టార్ కి. అప్పటికప్పుడు పాత్రని అర్ధం చేసుకొని స్పాట్ లో నటించటమే తప్ప ఏదీ ముందు ప్రాక్టీస్ చేయను" అన్నాడు.
"గ్రేట్. ఇప్పుడు మ్యూజిక్ విషయానికొద్దాం. ఈ సినిమాలో అన్ని పాటలూ సూపర్ హిట్.  ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తన కెరీర్ లోనే అధ్బుతమైన సంగీతాన్ని అందించాడు. ఏదైనా సినిమాలో రెండు లేదా మూడు పాటలు హిట్టవటం చూస్తూ ఉంటాము మనము. కానీ మీ సినిమాలో ఆరు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సిట్యువేషన్ కి తగ్గట్టుగా ఎంతో నేచురల్ గా ఉంది. అలాగే మ్యూజిక్ లో ఎంతో వైవిద్యముంది. మ్యూజిక్ మీద మీ అభిప్రాయం?"
తాను చెప్పల్సినదంతా ఆవిడే చెప్పేసరికి హీరో కి యింక ఏం చెప్పాలో తెలియక "అవునండి మ్యూజిక్ చాలా బాగా కుదిరింది సినిమాకు." అని చెప్పాడు హీరో.
"యింక ఫైట్స్. ఈ సినిమాలో ఫైట్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ అయితే అద్దిరిపోయింది. అదిరిపోయింది అనే కంటే మహా అధ్బుతం అని చెప్పాలి. ఆ ఫైట్ ని చూడటానికే సినిమాకి వెళ్ళొచ్చు. అంత బాగా తీసారు. ముఖ్యంగా మీరు ఫైట్ సీన్స్ లో డూప్ లేకుండా నటించారు మీరు. చాలా రిస్కీ షాట్స్ లో కూడా ఎంతో ఈజ్ తో చేసారు. ముఖ్యంగా మీరు ఆటో నడుపుకుంటూ విలన్ ని చేజ్ చేసే సీన్ అయితే న భూతో న భవిష్యత్. ఫైట్స్ గురించి చెప్పండి."
'యింక చెప్పటానికి ఏముంది నా బొంద. అంతా నువ్వే చెప్పేసావుగా' అని మనసులో అనుకొని " అవునండి. ఫైట్స్ చాలా అధ్బుతంగా వచ్చాయి." అన్నాడు.
"యింక ఫోటోగ్రఫీ విషయానికొస్తే "ఫలానా" ఆయన చాలా అధ్బుతంగా తీసారు.  ముఖ్యంగా ఫారిన్ లొకేషన్సుని చాలా ఎక్ స్ట్రార్డినరీగా తీసారు. హీరోయిన్ ని చాలా అందంగా చూపించారు. మీరు ఈ సినిమాలో చాలా హేండ్సం గా కనిపించారంటే దట్ క్రెడిట్ గోస్ టూ కెమేరామాన్. ఈ సినిమాకి నాచురల్ లైట్ ని ఉపయోగించి చాలా తక్కువ లైటింగ్ తో ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేలా తీసుకున్న కెమేరామాన్ కి హేట్స్ ఆఫ్. సో ఫోటోగ్రఫీ గురించి ఏం చెప్తారు?"
నేను చెప్పినా కూడా యింత బాగా చెప్పలేనేమో అని అనుకొని "ఆ ఆ ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రాణం" అన్నాడు హీరో.  
"యిక కొరియోగ్రఫీ విషయానికొస్తే మీ డాన్సులు. ఏం డాన్సులండీ బాబు. అబ్బబ్బబ్బ. మతిపోగొట్టేసారు. విరగతీసారు. మీ డాన్సులు చూడటానికి అభిమానులకి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. కొత్త రకం స్టెప్పులతో చాలా వైవిధ్యమైన డాన్సులతో ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. గడిచిన పది సంవత్సరాలలో యింత గొప్ప డాన్సులని చూడలేదని అంటున్నారు అందరూ. ముఖ్యంగా మూడో సాంగ్ లో రెండో చరణానికి ముందు వచ్చే గిటార్ స్టెప్ అయితే కుమ్మేసారనుకోండి. మరి యింత అధ్బుతమైన డాన్సులందించిన కొరియోగ్రాఫరు  గురించి ఏం చెప్తారు?"
"??!@$*%్...."
"అన్నట్టు మీకు ఈ సినిమాలో నచ్చిన సాంగ్ ఏది సార్?"
"అన్ని పాటలు నాకు నచ్చాయి. కానీ మూడో సాంగ్ అంటే కొంచెం ఎక్కువ నచ్చింది."
"can you sing for us?"
 "ఓహ్. నాకు పాటలు పాడటం రాదండి"
"లేదు లేదు మీరు పాడాల్సిందే. జస్ట్ ఫ్యూ లైన్స్"
"నేను పాడితే మీరు, మీతో పాటు టీవీ చూస్తున్న వారందరూ పారిపోతారు" ముందే హింటిచ్చాడు కానీ ఆ ఏంకరు ఊరుకోలేదు.
"అలాంటిదేం లేదు. మీరు పాడాల్సిందే. మాకు తెలుసు మీరు పాటలు బాగా పాడతారని"
సరే నీ ఖర్మ అనుకొని "హిహిహి..." అని పాటెత్తుకున్నాడు హీరో. ఆ గొంతు శ్రావ్యతకి ప్రకృతి సిగ్గుతో తల దించుకొంది. పశువులు బేర్ మన్నాయి. చూసే ప్రేక్షకుల కడుపులో నానా రకాలుగా అనిపించాయి. ఆ ఏంకర్ మాత్రం విశ్వ విజేత. అన్నిటికీ అతీతురాలు. ఆ పాట అయిపోయేసరికి ఆనందం తో చప్పట్లు కొట్టింది. దాదాపు ఏడ్చినంత పని చేసింది. 
"గ్రేట్ సార్. సూపర్బ్ గా పాడారు. యింత టాలెంట్ ని ఉంచుకొని ఇప్పటి వరకు ఒక్క పాటైనా పాడకపోవటం అన్యాయము సార్" అంది బుంగ మూతి తో. " నెక్స్ట్ సినిమా లో మా కోసం, మీ అభిమానుల కోసం ఒక్క పాటైనా పాడాలి సార్" అంది.
"హిహిహి...ట్రై చేస్తాను"
"ట్రై అంటే ఊరుకోము. మాటివ్వాలి. అభిమానులూ చూస్తున్నారుగా. మేము వదిలినా మీరు మాత్రం అస్సలు వదలద్దు. సరేనా?"
"హిహిహి"
"ఓకే. నాట్ బట్ లీస్ట్. డైరెక్షన్ దగ్గరికొద్దాం. యింత అధ్బుతమైన దృశ్య కావ్యాన్ని తెరకెక్కించటం, అదీ ఎంతో అందంగా చెప్పలనుకున్న విషయాన్ని సూటిగా ఎంతో నేరుపుగా, యింత మంది ఆర్టిస్టులని సమన్వయపరిచి....... ఆర్టిస్టులంటే గుర్తొచ్చింది ఈ సినిమాలో కనీసం వంద మంది ఏక్టర్స్ ఉన్నారు కదా సార్?"
"అవును"
"యింత మందిని ఒకే తాటి మీదకి తీసుకు వచ్చి యింత అధ్బుతమైన నటనను రాబట్టటమంటే మామూలు విషయం కాదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సిస్టర్ సెంటిమెంట్ సీన్ కానివ్వండి, హీరో హీరోయిన్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు కానివ్వండి, ఏక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్, డాన్స్, ఫైట్స్, కామెడీ యిలా చెప్పుకుంటూ పోతే అన్నింటిలోను డైరెక్షను 'కేక '. కేక అన్నా సరిపోదు 'కెవ్వు కేక '. డైరెక్షను మీద మీ అభిప్రాయం?"
"~!@$%్*................"
"ఫైనల్ గా చెప్పండి ఈ సినిమా గురించి ఆడియెన్స్ కి ఏమైనా చెప్పలనుకుంటున్నారా?"
యింకేం చెప్పాలో తెలియక "పైరసీ సీడీలు చూడకండి. థియేటరులో సినిమా చూడండి. ఈ యిండస్ట్రీ మీది. మాది. మనందరిదీ" ముగించాడు.
కన్నీళ్ళు తుడుచుకొంది ఏంకరు.


  

No comments:

Post a Comment