Thursday 19 September 2013

తెలుగు అమ్మ కన్నడ నాన్న ఓ మళయాళీ అమ్మాయి

కన్నడ తండ్రికి, తెలుగు తల్లికి ఓ తెలుగబ్బాయి పుడతాడు. అతనే హీరో.హీరో తండ్రి హీరో కన్నా, హీరో తల్లి కన్నా చిన్నవాడు. అంటే వయసుల ప్రకారం చూస్తే హీరొ తల్లి, హీరో, అతని తండ్రి వరసక్రమం లో ఉంటారన్న మాట. సరే ఫ్లేష్ బాక్ లో హీరొ తండ్రి ఓ బాక్సరు. అతని బాక్సింగ్ ప్రాక్టీస్ దెబ్బ తింటుందని అతని భార్యకి విడాకులిచ్చేస్తాడు. యిచ్చినోడు పోనీ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాడా అంటే లేదు. మళ్ళీ ఇంకొక తమిళ యువతిని పెళ్ళి చేసుకుంటాడు (ఆ మాత్రానికి మొదటి పెళ్ళానికి విడాకులివ్వడమెందుకో? ). వాళ్ళకి ఓ తెలుగమ్మాయి పుడుతుంది. అది పక్కన పెట్టండి. హీరో తల్లి హీరోని కష్టపడి పెంచి పెద్ద చేసి ఓ బాక్సర్ని చేస్తుంది (వదిలించుకున్న ఆముదాన్ని మళ్ళీ వంటికి రాసుకోవటమన్నమాట). సదరు హీరో కూతురు వయసున్న ఓ మలయాళీ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిది సినిమాలో మాత్రం తమిళమ్మాయి వేషం. ఆ అమ్మాయి తండ్రి తెలుగు వాడు. కానీ సినిమాలో మాత్రం మళయాళీ వేషం. సరే ఈ ప్రేమ సంగతి పక్కన పెడితే హీరో అమ్మ సడెన్ గా చనిపోతుంది. చనిపోతూ చనిపోతూ హీరోని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళమంటుంది. ఇష్టం లేకపోయినా తన కన్న వయసులో చిన్నవాడైన తండ్రి దగ్గరికి వెళతాడు హీరో. తండ్రి నడుపుతున్న బాక్సింగ్ కోచింగ్ సెంటరులో జ్యూసులందించే పని చేస్తుంటాడు. అతని తండ్రికి హీరో ఓ బాక్సర్ అన్న విషయము తెలియదు. ఆ ట్రూప్ లో ఒకడితో హీరో సవతి చెల్లెలు ప్రేమ లో పడుతుంది. వాడితో హీరో కి మధ్య మాటా మాటా అనుకునే సీనులు, హీరో సవతి తల్లి, చెల్లి హీరో మీద చిరాకు పడే సీనుల మధ్య సినిమా రన్ అవుతూ ఉంటుంది. అన్నట్టు తమిళమ్మాయి వేషం కట్టిన మళయాళీ హీరొయిన్ కూడా అక్కడికి వచ్చి హీరో తో డ్యూయెట్లు అవి పాడేస్తుంది వెనకాల తమిళ గ్రూప్ డాన్సర్ల తో. సరే కధని చివరాఖరికి తీసుకెలితే హీరో, హీరో సవతి బామ్మర్ది (కరెక్టేనా?) మధ్య బాక్సింగ్ పోటీ జరిగి ఇద్దరూ ఓడిపోయి ఇద్దరూ గెలుస్తారు. ఆ? అదేంటి అంటారా? అదంతే. హీరో తన సవతి చెల్లి కోసం బాక్సింగ్ లో ఓడిపోవాలనుకొని తన చెల్లి మనసు గెలుచుకుంటాడు. బామ్మర్ది తన తప్పు తెలుసుకొని హీరో చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటాడు. అదీ కధ. బాగుంది కదూ. ఏంటి అర్ధం కాలేదా? అదేంటండి బాబు? ఇంత విపులంగా చెప్పాను కదా? ఇంతకీ ఆ సినిమా పేరు గుర్తొచ్చిందా? అయితే ఏంటో చెప్పండి.          



2 comments:

  1. Prakash Raj DOB: March 26, 1965 (age 48)

    Ravi teja DOB: January 26, 1968 (age 45)

    Jaya Sudha DOB: December 17, 1958 (age 54),

    Source wiki, Check Once

    ReplyDelete