Friday 15 November 2013

పరీక్ష హాళ్ళో చండశాశనున్ని...... క్లాసు రూములో మాత్రం నిమిత్తమాత్రున్ని



మీరేం చదివారు? బీటెక్ లేదా ఎమ్మెస్సీ లేదా డిగ్రీ లేదా C.A లేదా ఎంబీబీఎస్ వీటిలో ఏదో ఒకటి చదివే ఉంటారు కదూమీరు ఇవి చదివారంటే పదో తరగతి నుంచి చాలా పరీక్షలు వ్రాసే ఉంటారు. మీరొకసారి పరీక్షలు జరిగే పద్దతి గుర్తు తెచ్చుకోండిఅక్కడ అంటే ఆ పరీక్ష జరిగే చోట వాటిని నిర్వహించే వారి తీరుతెన్నులు ఎలా ఉంటాయో గుర్తు తెచ్చుకోండి.
ఒక్క నిమిషంకే.......లం ఒక్క నిమిషం ఆలస్యంగా వస్తే మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు. మీరు ఎంత బ్రతిమలాడినా, ఎంత బామాడినా సరే. ఏమాత్రం కనికరం చూపరు. ఒక వేళ మీరు సమయానికొచ్చినా పరీక్ష జరిగే కాలేజీకో, యూనివర్సిటీ లోకి ప్రవేశిస్తున్నప్పుడు మిమ్మల్ని వళ్ళంతా తడిమి పరీక్షిస్తారు ఏమైనా స్లిప్పులో చీటీలో తెచ్చారేమోనని. తతంగం అయిపోయిన తర్వాత లోపలికెళ్ళాక అంటే పరీక్ష జరిగే చోటికెళ్ళాక యిన్విజిలేటరొకాయన మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తాడు 'ఏదైనా చీటీలు గానీ స్లిప్పులు గానీ ఉంటే బయట పారేయండి లేకపోతే పట్టుకుంటే డీబార్ చేసేస్తామని'.


సరే. పరీక్ష ప్రారంభమవుతుంది. మధ్యలో యింకో ఆయన వస్తాడు. హాల్లో ఉన్నవాళ్ళందరినీ నేరస్తుల్లా చూసి మళ్ళీ వార్నింగిస్తాడు. మీరు వీళ్ళందరి నసని తట్టుకొని పరీక్ష మీద ఏకాగ్రత చూపించటానికి ప్రయత్నిస్తున్న తరుణములో అంటే అరగంట తర్వాత స్క్వాడ్ పేరుతో ఒక మంద వస్తుంది. అప్పుడు చూడాలి హడావిడి. టెర్రరిస్టులని పట్టుకోవటానికొచ్చినప్పుడు కూడా ఉండదు అంత హడావిడి. అసలే చదివింది గుర్తు రాక టెన్షనుతో మీరుంటే వీళ్ళ హెచ్చరికలకి, హడావిడికి మీకు ఏకాగ్రత పూర్తిగా చెదిరిపోయి చదివింది కూడా మర్చిపోవటం ఖాయం. వీటన్నిటికీ తట్టుకొని కూడా మీరు పరీక్ష వ్రాస్తుంటే హఠాత్తుగా మీ ప్రక్కన యిన్విజిలేటరు కూర్చొని మీదో, లేదా మీ ప్రక్కనున్న వాడిదో టేబుల్ క్రింద వెతుకుతూ ఉంటాడు ఏవైనా దొరుకుతాయేమోనని. మీకు సమయములో ఎంత అసౌకర్యంగా ఉంటుందో ఆలోచించండి.  

యిదంతా చెపుతున్నాను కాబట్టి పరీక్ష వ్యవస్థని నేను పూర్తిగా తప్పు పట్టటం లేదు. కఠినంగా ఉండాల్సిందే. కాదనను. కానీ పరీక్ష వ్రాసే వాడి ఏకాగ్రతని పాడు చేసేంత ఉండకూడదదని నా అభిప్రాయమునిజమే. కేవలము ప్రతిభావంతులకి మాత్రమే న్యాయము జరగాలి. కాదనను. కానీ పేరుతో యీ దారుణమైన స్కానింగులెంతవరకు సబబు?

యిన్విజలేషను పేరుతో అక్కడ ఉండేది లెక్చరర్లు, టేచర్లే. వాళ్ళలో ఎవరైనా, ఏనాడైనా తన క్లాసు రూములో ఏ విద్యార్ధి దగ్గరకైనా వెళ్ళి 'నేను చెప్పేది మీకు అర్ధమయ్యిందా? ఏమైనా అనుమానాలున్నాయా? మళ్ళీ ఒక సారి చెప్పమంటావా?' అని ఒక్కరైనా అడుగుతారా? అసలు వాళ్ళు చెప్పేది అర్ధమయితే ట్యూషనులకీ, కోచింగులకెందుకెళతారు? ప్రతీ చోటా కోచింగు సెంటర్లు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయంటే కారణము ఎవరు? యిన్విజలేషను మాత్రమే అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే సదరు ఉపాధ్యాయులు కాదా? చివరి బెంచీలో కూర్చొని పరీక్ష వ్రాసే వాడి ప్రక్కన కూర్చొని వాడు చూసి వ్రాస్తున్నాడో స్లిప్పులు పెట్టి వ్రాస్తున్నాడో అంత పరీక్షగా చూసే శ్రద్ధ తన క్లాసు రూములోని చివరి బెంచీ విద్యార్ధి దగ్గరకి వెళ్ళి వాడెలా చదువుతున్నాడో ఏం వ్రాస్తున్నాడో పరిశీలిస్తే పరీక్ష రోజున వాడు కాపీ చేయాల్సిన అవసరము రాదు కదా? అసలు తన తరగతి లోని చివరి బెంచీ విద్యార్ధి పేరు కూడా తెలుసో లేదో అనుమానమే. యిన్విజలేషను మీద చూపే శ్రద్ధలో కనీసం పది శాతమైనా చూపితే ప్రతీ విద్యార్ధి భవిష్యత్తూ బంగారు బాటే కదా.       

చివరిగా మాట. తనకు కేటాయించిన పీరియడు సమయము కన్నా ఒక్క నిమిషము కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించని ఉపాధ్యాయుడికి పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చే విధ్యార్ధిని అడ్డుకొనే హక్కు ఉందంటారా? ఆలోచించండి.

2 comments: