Wednesday, 24 May 2017

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే

ఇలా నా ఒక్కడికే జరుగుతుందో లేక అందరికీ జరుగుతుందో నాకు తెలీదు గానీ అది మాత్రం అర్ధం కాని ఓ పెద్ద పజిల్. ఎప్పుడైనా బస్ లో ఊరెలుతున్నపుడు లేదా ఓ క్రొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒకరిద్దరు వ్యక్తులు మాత్రం అదే పనిగా తేరిపారా చూస్తుంటారు ఏదో బాగా పరిచయం ఉన్న వాళ్ళ లాగ. వాళ్లేమన్నా పరిచయస్తులా అంటే కాదు. పోనీ గతం లో ఎప్పుడైనా చూసామా అని ఆలోచిస్తే ఊహూ...ఎప్పుడూ చూడలేదనే చెబుతుంది మెదడు. మరి ఎందుకంత తీక్షణంగా (కనురెప్ప కూడా మూయకుండా) చూస్తారో ఎప్పటికీ అర్ధం కాదు. ఎంత అంటే  వాళ్లను దాటి ముందుకు వెళ్లిపోయినా వెనక్కి తిరిగి మరీ చూస్తుంటారు. పోనీ వెళ్లి ఆడిగేద్దామంటే వెధవ మోహమాటమొకటి అడ్డొస్తుంది. ఏ ఊరెళ్లినా, బస్ లోంచి బయటకు చూసినా ఎవడో ఒకడు ఇదే కార్యక్రమంలో ఉంటాడు. నా ఒక్కడిమీదే ఇలా పగ పట్టినట్టు చూస్తున్నారా లేక అందరికీ ఇలాగే జరుగుతుంటుందా అన్నది నాకు ఎప్పటికీ జవాబు దొరకని ప్రశ్న! 

Monday, 22 May 2017

షాకింగ్ కామెంట్స్

"ఫలానా సినిమా గురించి ఫలానా నటుడి షాకింగ్ కామెంట్స్"
"టాప్ హీరోయిన్ పరిస్థితి ప్రస్తుతం ఎంత ఘోరంగా ఉందొ చూడండి"
"ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ దుర్మరణం"
"వీరిద్దరి భాగోతం చూడండి. సరిగ్గా 23 సెకన్ల తర్వాత అస్సలు మిస్ కాకండి"

ఫేసుబుక్ తెరిచిన వెంటనే మనకు పైన కనబడే కామెంట్స్ చూడటం, నిజమేమో అని ఆతృతగా చూడటం, తీరా చదివాక(చూసాక) విషయం ఆవగింజంత కూడా లేకపోవడం....మోసపోయామని అర్ధం అయినా మళ్లీ ఇంకో పోస్ట్ చూసి మళ్లీ ఓపెన్ చేయడం... ఉసూరుమనడం మనకి పరిపాటి అయిపోయింది. సదరు కామెంట్లకు అర్ధాలు ఏంటో యిప్పుడు చూద్దాం.

'షాకింగ్ కామెంట్స్' అంటే మెచ్చుకోవడం(మామూలుగా కాదు విపరీతంగా) అన్నమాట.

టాప్ హీరోయిన్ అంటే తెలుగులో కాదండోయ్. ఏ మళయాలమో, తమిళం లో ఓ మోస్తరు హీరోయిన్ అన్నమాట. ఆవిడే ఎవరో తెలియదు.. మళ్లీ ఆవిడ ఇప్పటి పరిస్థితి మనకేం అర్ధమవుతుంది? మనకెందుకు?

టాప్ కమెడియన్ దుర్మరణం అంటే....ఎప్పుడో ఓ పాతికేళ్ల క్రితం అప్పటి కమెడియన్ సాధారణ మరణం అన్నమాట.

భాగోతం అంటే ఇంకేదో వ్యవహారం అని తెరిచారా .....భాగోతానికి వారిచ్చిన అర్ధం "నటించడం, లేదా డాన్స్ చేయడం"

ఇలా మన సహనానికి పరీక్ష పెడుతూ మనల్ని హింసించే ఈ పోస్టుల నుండి మనల్ని కాపాడేదెవరు?!



Sunday, 21 May 2017

గూడ్స్ పాసింజర్

ఇప్పుడు నేను చెప్పబోయేది జరిగే అవకాశం ఉందో లేదో తెలియదు గానీ ఆ వైపుగా ఒకసారి ఆలోచిస్తే మంచిదేమో. విషయం ఏంటంటే ఎక్కడ చూసినా జనమే....రైళ్లలో అయితే మరీను... పొరపాటున జనరల్ బోగీ ఎక్కామా, ఇక అంతే సంగతులు. నరకానికి చిరునామాలా ఉంటుంది. యిన్ని రైళ్లు ఉన్నా జనాల్ని సుఖంగా గమ్యానికి చేర్చలేకపోతున్నాయి. రైళ్ల సంఖ్య పెంచుదామా అంటే అవకాశం లేదంటున్నాయి రైల్వే వర్గాలు. రైళ్ల సంఖ్య పెంచలేరు, ఉన్న రైళ్లల్లో జనాల్ని పట్టించలేరు. మరి ఎలా?
ఒక సారి గూడ్స్ రైళ్లను చూడండి. ప్రతీ స్టేషన్ లోను కనబడతాయి... కాకపొతే సరుకుతో. ఓ చివర డ్రైవరు, మరో చివర గార్డ్ తప్ప మనిషన్నవాడు ఉండడు గూడ్స్ ట్రైన్ లో. మరి ఇదే గూడ్స్ ట్రైన్ కు ఓ జనరల్ భోగీ తగిలిస్తే ఎలా ఉంటుంది? ప్రతీ స్టేషన్ లో ఆగకపోయినా గూడ్స్ ట్రైనుకి కూడా ఓ గమ్య స్థానమంటూ ఉంటుంది కదా! ఎలాగూ దూర ప్రాంతాలకే వెళుతుంది కాబట్టి ప్రతీ గూడ్స్ ట్రైనుకి కనీసం ఓ జనరల్ భోగీని తగిలిస్తే కనీసం పేదవాళ్లన్నా దాంట్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది కదా? ప్రయాణీకుల రద్దీ కొంతైనా తగ్గే అవకాశం ఉంటుందేమో! ఏమంటారు ?




Saturday, 20 May 2017

ఎనక్కు తమిళ్ రొంబ ఇష్టం తంబీ

అప్పుడెప్పుడో రజనీకాంత్ నటించిన ఓ తమిళ సినిమాని తెలుగులో డబ్ చేసి వదిలారు. దాని పేరు "ముత్తు". భలే విచిత్రంగా అనిపించింది. ఒక తమిళ పేరుతో తెలుగు సినిమా ఏంటి అని? అసలు మన తెగులు...  క్షమించండి తెలుగు జనాల స్పందన ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ మన తెగులు(ఎన్ని సార్లు ప్రయత్నించినా మళ్ళీ అదే వచ్చేస్తోంది.. సర్థుకుపోండి ) ప్రజలు దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా దాన్ని సూపర్ హిట్ చేసి పారేశారు. మన దెబ్బకి అరవోళ్ళకే మతి పోయింది. అక్కడ్నించి మొదలు...  ఏ మాత్రం అవకాశమున్నా ఓ తమిళ పేరుతో ఓ సినిమాని మన మీదకి వదలడం.... ఎప్పుడెప్పుడు అలాంటి సినిమా వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా చూసి చివరికి దాన్ని ఆదరించిపారేయడం మనకి అలవాటైపోయింది. నిక్కరు కనిపించేలా పై లుంగీలు కట్టుకొని వేసే తమిళ నృత్యాలకి మన వాళ్ళు పులకరించిడం అటుంచి నరనరాన తమిళతనం ఎక్కేస్తోంటే మనవాళ్ళ ఆనందమే ఆనందం! ఒకసారి తమిళ పేర్లతో వచ్చిన సినిమాలు చూడండి ఎంత బాగున్నాయో!
"ఈ" (తమిళం లో దీని అర్ధం ఈగ అని. అదే పేరుతో దీన్ని వదిలారు తెగులోళ్ళ మీద)
"రాఘవన్"
"సూర్య s/o కృష్ణన్"
"రఘువరన్ btech"
"ఐ"
"కబాలి"
ఇవి కాకుండా త్వరలో మన తెగులు వాళ్ళ మీదకు ఓ క్రొత్త సినిమాని వదలబోతున్నారు. దాని పేరు విని తరించండి. ఏంటంటారా "కాదలి" (అర్ధం మాత్రం అడక్కండి (అడగరనుకోండి ఎలాగూ) తెలీదు)
రాబోయే రోజుల్లో శుభ్రంగా తమిళ సినిమాలే వచ్చేస్తాయేమో! (అదే బెటరేమో)
ఇంతకీ బాహుబలి అమ్మ శివగామా? శివకామినా?
లోగుట్టు రాజమౌళికెరుక!

Wednesday, 17 May 2017

సరైన విరుగుడు

ఈ భయంకరమయిన ఎండలను, వేడిని తట్టుకోలేక ఓ 9 ఏండ్ల పాప తన తల్లితో ఇలా అంది.
"అబ్బ... ఈ ఉక్కపోత భరించలేక పోతున్నాను అమ్మా. మాట్లాడితే చెమటలు పట్టేస్తున్నాయి వంటికి"
ఇది విన్న ఆ పాప చెల్లి తనతో ఇలా అంది.
"అయితే మాట్లాడటం మానేయ్. చెమటలు పట్టవు"

Monday, 15 May 2017

టింగ్లీష్ తో చంపేస్తా

ippudu telugu raashraallo whatsapp lonu, facebook lonu Tingleesh Trend nadustondi. ardham kaaleadaa? adeanandi teluguni english lo type cheayadamannamaata. teluguni teluguloa chadavatam veru, english lo chadavadam veru. eado okaTi rendu lanelu varaku chadavochchu gaanee ade panigaa peraalu peraalu englishlo type cheste aa chadiveavaadiki untundi choosaaroo.... asalu teluguni teluguloa, english ni engilshlo chadiviteane baaguntundi. alaa telugu matter ni englishlo type chesinavaadini chadavamannaa dekkukuntoo dekkukuntoo chadavaalsinde. ippuu daadaapu andaroo andoid vaadutunnaaru kaabaatti andaroo google indic keyboard ni download chesukuntea chakkagaa telugu ni telugulone type cheasukovachchu.ee tingleesh baadha tapputundi! eamanTaaru??!!

ఇదే విషయాన్ని తెలుగులో వ్రాసాను చదవండి. తేడా మీకే అర్ధమవుతుంది.


ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వాట్సాప్ లోను, ఫేస్ బుక్ లోను టింగ్లీష్ ట్రెండ్ నడుస్తోంది. అర్ధం కాలేదా? అదేనండి తెలుగుని ఇంగ్లీషులో టైప్ చేయడమన్నమాట. తెలుగుని  తెలుగులో చదవటం వేరు, ఇంగ్లీషు లో చదవడం వేరు. ఏదో ఒకటి రెండు లైన్లు వరకు చదవొచ్చు గానీ అదే పనిగా పేరాలు పేరాలు ఇంగ్లీషులో టైప్ చేస్తే ఆ చదివేవాడికి ఉంటుంది చూసారూ.... అసలు తెలుగుని తెలుగులో, ఇంగ్లీష్ ని ఇంగ్లీషులో చదివితేనే బాగుంటుంది. అలా తెలుగు మేటర్ ని ఇంగ్లీషులో టైప్ చేసినవాడిని చదవమన్నా డెక్కుకుంటూ డెక్కుకుంటూ చదవాల్సిందే. ఇప్పుడు దాదాపు అందరూ ఆండ్రాయిడ్ వాడుతున్నారు కాబాట్టి అందరూ గూగుల్ ఇండిక్ కీబోర్డ్ ని డౌన్లోడ్ చేసుకుంటే చక్కగా తెలుగు ని తెలుగులోనే టైప్ చేసుకోవచ్చు.ఈ టింగ్లీష్ బాధ తప్పుతుంది! ఏమంటారు??!!

భలే కనిపెట్టావే!

"లీటరుకు 490 కిలోమీటర్లు నడిచే వాహనాన్ని తయారు చేసిన IIT విద్యార్ధులు"
"నాచు నుంచి పెట్రోల్ తయారు చేసిన ఫలానా సంస్థ"
"ఉప్పు నీటిని మంచి నీటిగా తయారు చేయడానికి అతి తక్కువ ఖరీదుతో యంత్రం తయారీ"
"ఒక్క సారి ఛార్జింగ్ పెడితే 5 రోజులపాటు నిలుచుండే అద్భుతమైన మొబైల్ ని కనిపెట్టిన ఫలానా మొబైల్ కంపెనీ"
"ఎయిడ్స్ కు మందు కనిపెట్టిన ఫలానా డాక్టర్లు"
"పాము విషం నుంచి ఎయిడ్స్ కు మందు కనిపెట్టారు"

యిలాంటి వార్తలు చాలాకాలం నుంచి పేపర్లలోనూ యిప్పుడైతే సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము....చూస్తూనే ఉన్నాము. యిలాంటి వార్తలు చదివి సంతోషం, గర్వంతో ఉప్పొంగిపోతాం. యివన్నీ నిజమైతే ఎంతో ముందుకెళ్ళిపోతాం అనే ఆలోచన మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది....

కానీ మీరు గమనించారో లేదో కానీ యిలాంటి వార్తలు అలా వస్తూనే ఉంటాయి తప్ప ఏ ఒక్కటీ ఆచరణలో వచ్చినట్టు కనబడదు. మరి ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం కాదు. సదరు వార్తలు చూసి గర్వపడిపోవడం.....కొన్నాళ్ల తరువాత అది మర్చిపోయి మళ్లీ ఇంకో వార్త చూసి మురిసిపోవడం మనకు నిత్య కృత్యంగా మారిపోయింది. 

Saturday, 13 May 2017

ఫలానా వాడు నాకు బాగా క్లోజ్

'ఫలానా' మినిస్టర్ తెలుసా? ఆయనకు నేను బాగా దగ్గర చుట్టాన్ని.....
'ఫలానా' ఏక్టర్ నాకు బాగా క్లొజ్ ఫ్రెండ్.....మొన్నే మా యింటికొచ్చాడు.....ఏ సినిమా అయినా ముందు నా సలహా తీసుకొని గాని నటించడు.....

మీరు బీఎసెన్నెల్లా? మీకు 'ఫలానా' డీయీ (ఖచ్చితంగా మన కంటే పెద్ద క్యాడరు వాడి పేరే చెపుతారు) తెలుసా? ఆయన మనకి బాగా డీపెస్ట్ ఫ్రెండ్...మీకేమైనా పనులు కావాలంటే చెప్పండి.... వెంటనే చేయించేద్దాం....
 
'ఫలానా' డాక్టరు తమ్ముడి భార్య నా బామ్మర్ది కి మేనత్త వరసవుతుంది....
'ఫలానా' రౌడీ నాకు లెఫ్ట్ హాండు.... అవసరమైతే నాకోసం ఎవరి శాల్తీనైనా లేపేయడానికి రెడీ....

యిలా 'ఫలానా' బాకాలు, బడాయి కబుర్లతో మన బుర్ర తినేసే వాళ్ళు ఎవడో ఒకడు తగులుతూనే ఉంటారు ఎక్కడో చోట. ఫలానా వాడు తెలిస్తే ఏంటట? వీడు చెప్పే ఆ ఫలానా వాడు గొప్పోడయ్యుండచ్చు గానీ వీడు కాదు కదా?! ఆ ఫలానా వాడు ఆ స్ఠాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడుంటాడు? వీడికిలాగ 'వాడు తెలుసు', 'వీడు తెలుసు' అని అనకుండా తన కష్టాన్ని నమ్ముకొనే ఆ స్థాయికి చేరుకుంటాడుగా?   అసలు ఫలానా వాడి గురించి మాట్లాడుతున్నాడంటేనే ఆ చెప్పేవాడు తనను తాను తగ్గించుకునట్టేగా? అది మాత్రం వాడికి ఈ జన్మకి అర్ధం కాదు గాక కాదు..... పైగా వాడు చెప్పే ఈ 'ఫలానా' బడాయి సొల్లు విని మనం వాడిని చాలా గొప్పవాడని అనుకుంటామేమోనని ఓ పిచ్చి భ్రమలో ఉంటాడు పాపం.... యిది చదివైనా కనీసం ఈ 'ఫలానా' సుత్తి మన మీద ప్రయోగించకుండా ఉంటే అంతే చాలు!  

మరి బలవంతుడి కోపం?

ఒక బలహీనుడి (పిరికివాడి)  కోపమంతా అతడికంటే బలహీనుడి మీదే.   

Friday, 12 May 2017

పాటల రూపకల్పన :వంశీ

అస్సలు బడ్జెట్ లేకుండా, సెట్టింగులు వేయకుండా కేవలం సృజనాత్మకతనే నమ్ముకొని పాటలు తీయగల దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు మన తెలుగు సినిమా పరిశ్రమలో. ఒకరు వంశీ. మరొకరు రవిబాబు. వీళ్ళిద్దరి సినిమాల్లో పాటలు చూడండి. ఎంత బాగుంటాయో. వంశీ గురించి చెప్పుకోవాలంటే గత కొంత కాలం నుంచి ఆయన తీస్తున్న సినిమాలు చాలామటుకు విజయవంతం అవడంలేదు. దానికి కారణాలు మరోసారి చెప్పుకుందాం కానీ ఆయన సినిమాల్లోని పాటలు మాత్రం సూపర్. ఇప్పుడొస్తున్న చిన్న సినిమాల పేరుతో వస్తున్న సినిమాల్లో పాటలు చూడండి. రొటీన్ పాటలు, రొటీన్ (తమిళ) డాన్సులతో మోత మోగించేస్తున్నారు తప్ప ఒక్కరూ పాటల్ని చక్కగా కన్నులవిందుగా తీసే వాడు ఒక్కడూ లేడు. కనీసం వంశీ లాంటి వారికి ఈ పాటలు వరకు అయినా తీసే అవకాశం ఇవ్వవచ్చు కదా! అదెలా కుదురుతుందంటారా? మొన్నా మధ్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూసారు కదా. దానికి సంగీతం మిక్కీ జే మేయర్. కానీ నేపద్య సంగీతం మాత్రం మణిశర్మది. అలాగే టెంపర్ సినిమాకు సంగీతం అనూప్ రూబెన్స్ అయితే నేపద్య సంగీతం మళ్ళీ మణిశర్మదే. దాని వలన సినిమా రేంజ్ పెరిగిందే తప్ప అసలు సంగీత దర్శకుల విలువ ఏమీ తగ్గలేదు కదా? అదే విధంగా సినిమా మొత్తం ఒక దర్శకుడు తీసినా పాటలు మాత్రం వంశీ లాంటి వారికి వదిలేస్తే అధ్బుతంగా ఉంటుంది కదా? అలాగే కామెడీని బాగా తీయగలిగిన "రేలంగి నరసిం హారావు , కుటుంబకధా చిత్రాలు తీయగలిగిన 'ముత్యాల సుబ్బయ్య, కమర్షియల్ సినిమాలు తీయగలిగిన కోదండరామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి, కోడి రామకృష్ణ ..... యిలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీ గా ఉన్న అలనాటి ప్రముఖుల సేవలను ఏదో విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుందేమో కదా.    

Thursday, 11 May 2017

సింహపురిలో సింగినాధం

కాశీనాధుని విశ్వనాధ్.....ఈ పేరు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం ద్వారా...... తెలుగులో అతికొద్దిమంది గొప్ప దర్శకుల్లో ఆయనొకరు. యిప్పటికీ ఆయన ఒప్పుకుంటే సినిమా తీయడానికి కొంత నిర్మాతలు (ముఖ్యంగా ఎన్నారై లు) ఉన్నారు. కాకపోతే తీయడానికి ఆయనే సిధ్ధంగా లేరనుకోండి. ఆరోగ్యం సహకరించకపోవడం కావొచ్చు లేదా మారిన పరిస్తితుల్లో తీయలేక కావొచ్చు. కారణాలు ఏమైనా ఒక మంచి దర్శకుడిని కోల్పోతున్నారు తెలుగు ప్రేక్షకులు.
సరే... విశ్వనాధ్ తీసిన ఒక సినిమా యిప్పటికీ రిలీజ్ అవలేదంటే నమ్ముతారా? అవును నిజం. 1990 లో షూటింగ్ పూర్తయిపోయినా ఆర్ధిక కారణాల వలనో మరే ఇతర కారణాల వలనో ఆ సినిమా యిప్పటికీ విడుదలకి నోచుకోలేదు. సినిమా పేరు "సిరిమువ్వల సింహనాదం". బాగుంది కదూ?! నాకేమనిపిస్తుందంటే ఆయనతో సినిమా తీయడానికి సిధ్ధపడిన నిర్మాతలు ఈ సినిమానే విడుదల చేయడానికి ప్రయత్నించ్చొచు కదా? సాధ్యం కాదంటారా? కనీసం యిప్పుడు వెబ్ సిరీస్ అంటూ ఒక ట్రెండు మొదలయ్యింది కదా...కనీసం ఆ పధ్ధతిలోనైనా ఈ సినిమాని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే ఆ సినిమా చూసే భాగ్యం మనకి కలుగుతుంది కదా!...

సరే ఆ సినిమా లో నటించిన నటీనటులు ఎవరనే కదా మీ అనుమానం?! చంద్రమోహన్, ఓంపురి....కేవలం వీళ్ళిద్దరే మనకి పరిచయమున్న నటులు.....మిగతా వాళ్ళంతా కొత్తవారే, పరిచయం లేని వారే.    

Wednesday, 10 May 2017

యిలా షాక్ కొట్టించకు బాబోయ్ నీకు దండం పెడతా

యిప్పుడు నేను చెప్పే విషయం చదివి కొంత మందికి కోపం రావచ్చు. అయినా చెపుతాను. ప్రభుత్వానికి ప్రజలనించి పన్నుల రూపం లో రావలసిన డబ్బులు సకాలం లో రావడం లేదు. అంటే ఆస్తి పన్ను, నీటి పన్ను, కుళాయి పన్ను (ఉందా??) లాంటివన్నమాట. యిలాంటి పన్ను వసూలు కార్యక్రం ప్రభుత్వం సరిగా చేయలేకపోవడానికి కారణం ప్రజలు సరిగ్గా పన్నులు చెల్లించకపోవడమే. మరి వీటిని వసూలు చేయాలంటే ఏం చేయాలి?

వస్తున్నా...జనం ఏది లేకపోయినా ఉండగలరు గానీ కరెంట్ లేకపోతే మాత్రం అస్సలుండలేరు. ఏదైనా ఆలస్యం చేస్తారేమో గానీ కరెంట్ బిల్ కట్టడం మాత్రం అస్సలు ఆలస్యం చేయరు గాక చేయరు. కాబట్టి సదరు పన్నులని కరెంటు బిల్లుల్లో కలిపేస్తే పోలా??!! ఒకేసారి కాకపోయినా ఇన్స్టాల్మెంట్ పధ్ధతిలోనైనా కలిపేస్తే చచ్చినట్టు కట్టేస్తారేమో! కదా?      

Tuesday, 9 May 2017

భ్రమ...పిచ్చి భ్రమ

మరీ చిత్రం కాకపొతే బయట పది రూపాయలకు దొరికే స్వీట్ కార్న్ పొత్తు సినిమా హాల్లో ముప్పై రూపాయలకి (అది కూడా పూర్తి పొత్తు కాదు) అమ్మడమేమిటి? మనం ఎగబడి కొనేయడమేమిటి?

బయట పదహారు రూపాయలకు దొరికే కూల్ డ్రింకు థియేటరులో యిరవై ఐదు రూపాయలకు అమ్మడమేమిటి (కొన్ని చోట్ల ముప్పై రూపాయలు) మనం ఆవురావురమంటూ కొనుక్కొని తాగేయడమేంటి?

ఓ హోటల్ కెళ్ళినా, బట్టల షాపుకెళ్ళినా, ఓ పార్కు కెళ్ళినా, ఓ ఆఫీసుకెళ్ళినా ఫ్రీ గా పార్కింగ్ సదుపాయమున్నప్పుడు ఒక్క థియేటరు బయట మాత్రమే పార్కింగుకి యిరవై నుంచి ముప్పై రూపాయల వరకు వసూలు చేయడమేమిటి? మనం నోరు మూసుకొని వాడికి డబ్బులిచ్చేసి షో స్టార్ట్ అయ్యి ఎంత సేపయ్యింది అని అడిగి హాల్లోకి పరిగెట్టేయడమేంటి?

మూడు సంవత్సరాలు నిండితే టికెట్ తీసేయాలని రూల్స్ చెప్పే వాళ్ళు మరి టికెట్ మీద రేట్ ప్రింట్ చేయకుండా టికెట్లు అమ్మేస్తున్నా సరే, అదొదిలేసి సెంటర్లో సీట్లు కావాలని వాడిని ప్రాఢేయపడటమేంటి?

టాయిలెట్ సదుపాయాలు సరిగ్గా లేకపోయినా, ఏసీ సరిగ్గా వేయకపోయినా ఆనందంగా సినిమా చూసేయడమేంటి?

ఈ పరిస్థితి మన జీవిత కాలం లో ఎప్పటికైనా మారుతుందంటారా?

ఏమిటో......భ్రమ.....పిచ్చి భ్రమ...

Monday, 8 May 2017

బస్సు అయ్యింది మిస్సు

ఒక సారి మీ ఊళ్ళో బస్ స్టేషన్ కెళ్ళండి. బస్సులతో, జనాలతో కిటకిటలాడుతుంటుంది కదూ? అది నిజమే...అంత కన్నా ఇంకొక నిజమేమిటంటే బస్ స్టాండ్ బయట ఆటోలు కూడా అంతే సంఖ్యలో....ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ సంఖ్యలోనే ఉంటాయి. మీరు ఎక్కాలనుకున్న బస్ కోసం మీరు ఎదురు చూసేలోపు (షేర్) ఆటో డ్రైవర్లు మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు 'ఫలానా ఊరికి వెళ్తోంది రండి' అని. మీరు ఎక్కాలనుకున్న బస్ ఎంత సేపట్లో వస్తుందో తెలియదు...అసలు వస్తుందో రాదో తెలియదు, కాబట్టి ఆటో ఎక్కేయడం బెటర్ అని మీరు డిసైడ్ అయిపోయి పొరపాటున ఆటో ఎక్కేసారో ...అప్పుడొస్తుంది బస్సు. గాఢంగా నిట్టూర్చడం తప్ప మీరేం చేయలేరు. యిలా ఎందుకు జరుగుతోంది అంటే బస్ స్టాండుల్లో అనౌన్స్ మెంట్  వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే.  మీరు గమనించారో లేదో గాని బస్ స్టాండుల్లో అనౌన్స్ చేసేవాళ్ళు ఎంతసేపూ స్టాండుల్లో ఆగి ఉన్న బస్ గురించో లేక అది ఎప్పుడు బయలుదేరుతుందో చెపుతారే తప్ప ఫలానా ఊరికి వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుందో ఈ సమయలో అది ఎక్కడుందో, రావడానికి ఎంత సమయం పట్టచ్చో చెప్పరు. అలా చెపితే బస్సు రాదనుకొని ఆటోలు ఎక్కేవాళ్ళు కాసేపు బస్ కోసం వేచి చూస్తారు. అదే రైల్వే స్టేషన్లో చూడండి. ఫలానా నంబర్ గల ట్రైను మరి కొద్ది నిమిషాల్లో ఫలానా ప్లాట్ ఫామ్  కి వస్తుందనో.....రావడానికి లేటవుతుందనో ఏదో ఒకటి చెపుతూనే ఉంటారు. దానికి తోడు ఆన్లైన్ వ్యవస్థ ఉండనే ఉంది. అసలే నష్టాలలో ఉన్న ఆర్టీసీ కి కనీసం ఇలాంటి వ్యవస్థల ద్వారా అయినా కొంచెం మేలు జరిగితే బాగుండును. ఎప్పుడు జరుగుతుందో మరి ?!!    

Sunday, 7 May 2017

గరీబీ హఠావో

మీరెప్పుడైనా నేల టికెట్ కొనుక్కొని సినిమా చూసారా? అబ్బే ఛస్తే చూడను, బ్లాక్ లో కొనుక్కొనైనా బాల్కనీ టికెట్ మాత్రమే కొంటానంటారా? ఇకపై ఆ పప్పులు ఎంతమాత్రం ఉడకవు. మీరు బాల్కనీ టికెట్ కొన్నా సరే మిమ్మల్ని నేలలో కూర్చోబెట్టాలన్న బృహత్కరమైన ఆలోచన థియేటరు వాళ్ళకొచ్చిందో లేక గవర్నమెంటుకొచ్చిందో గాని పేదవాళ్ళను ధనికులను ఒక్క తాటికి తేవాలన్న ఆలోచన మాత్రం మా భలేగా ఉంది!  ఇంకా అర్ధం కాలేదా? మల్టీప్లెక్స్ థియేటర్లను చూడండి. నేల, బెంచీ, రిజర్వడ్ అన్న బేధం లేకుండా ఒక్కటే టికెట్ రేట్ పెట్టేసారు. దీని వలన పేద ధనిక అన్న తేడా లేకుండా అందరూ ఎంచక్కా నేల క్లాస్ లో కూర్చొని సినిమా చూసేస్తున్నారు.

ఆయినా కారులో హాలుకెళ్లి, ఒక్కొక్కరు రెండొందల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని అంతా నేల లో కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ పాప్ కార్న్ తింటూ సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా!