అస్సలు బడ్జెట్ లేకుండా, సెట్టింగులు వేయకుండా కేవలం సృజనాత్మకతనే నమ్ముకొని పాటలు తీయగల దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు మన తెలుగు సినిమా పరిశ్రమలో. ఒకరు వంశీ. మరొకరు రవిబాబు. వీళ్ళిద్దరి సినిమాల్లో పాటలు చూడండి. ఎంత బాగుంటాయో. వంశీ గురించి చెప్పుకోవాలంటే గత కొంత కాలం నుంచి ఆయన తీస్తున్న సినిమాలు చాలామటుకు విజయవంతం అవడంలేదు. దానికి కారణాలు మరోసారి చెప్పుకుందాం కానీ ఆయన సినిమాల్లోని పాటలు మాత్రం సూపర్. ఇప్పుడొస్తున్న చిన్న సినిమాల పేరుతో వస్తున్న సినిమాల్లో పాటలు చూడండి. రొటీన్ పాటలు, రొటీన్ (తమిళ) డాన్సులతో మోత మోగించేస్తున్నారు తప్ప ఒక్కరూ పాటల్ని చక్కగా కన్నులవిందుగా తీసే వాడు ఒక్కడూ లేడు. కనీసం వంశీ లాంటి వారికి ఈ పాటలు వరకు అయినా తీసే అవకాశం ఇవ్వవచ్చు కదా! అదెలా కుదురుతుందంటారా? మొన్నా మధ్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూసారు కదా. దానికి సంగీతం మిక్కీ జే మేయర్. కానీ నేపద్య సంగీతం మాత్రం మణిశర్మది. అలాగే టెంపర్ సినిమాకు సంగీతం అనూప్ రూబెన్స్ అయితే నేపద్య సంగీతం మళ్ళీ మణిశర్మదే. దాని వలన సినిమా రేంజ్ పెరిగిందే తప్ప అసలు సంగీత దర్శకుల విలువ ఏమీ తగ్గలేదు కదా? అదే విధంగా సినిమా మొత్తం ఒక దర్శకుడు తీసినా పాటలు మాత్రం వంశీ లాంటి వారికి వదిలేస్తే అధ్బుతంగా ఉంటుంది కదా? అలాగే కామెడీని బాగా తీయగలిగిన "రేలంగి నరసిం హారావు , కుటుంబకధా చిత్రాలు తీయగలిగిన 'ముత్యాల సుబ్బయ్య, కమర్షియల్ సినిమాలు తీయగలిగిన కోదండరామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి, కోడి రామకృష్ణ ..... యిలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీ గా ఉన్న అలనాటి ప్రముఖుల సేవలను ఏదో విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుందేమో కదా.
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Friday, 12 May 2017
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment