Sunday 15 September 2013

వెసులుబాటు


                                                        
రిగ్గా గుర్తు లేదు కాని ఒక రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా మా రాజమండ్రి లో జరిగిన ఒక సంఘటన చెపుతాను. ఒక సాయంత్రం టీవీ లో వార్తలు చూస్తున్నాను. మొత్తం చానల్స్ అన్నిటిలో ఒకే వార్తని పముఖంగా ప్రసారం చేస్తున్నారు. ఎప్పుడూ తప్పులు తడకలతో డెక్కుకుంటూ వార్తలు చదివే న్యూస్ రీడర్ 'ప్రతాప్' కూడా అదే వార్తని తెగ చదివేస్తున్నాడు CCC టీవీలో. ఇంతకీ వార్త సారాంశం ఏంటయ్యా అంటే పదిహేడేళ్ళ అమ్మాయికి, అరవై ఏళ్ళ అబ్బాయికి, సారీ తాతయ్యకి పెళ్ళి. రాజమండ్రి కి సంబంధించిందీ, పైగా మాంచి ఇంట్రస్టింగ్ గా ఉందే అనుకుంటూ చూడటం మొదలెట్టా. ఒక గుడిలో జరుగుతున్న పెళ్ళి గురించి తెలుసుకున్న మహిళా సంఘాలూ, మీడియా వాళ్ళూ, సామాజిక చైతన్యవంతులూ (అంటే ఏంటబ్బా?!) అక్కడికి చేరిపోయారు. రోజు ఆనం కళా కేంద్రం లో ప్రొగ్రామూ లేకపొవటము వలన టైంపాస్ రాయుళ్ళు కూడా వచ్చేసారక్కడికి. ఇంకేం కావలసినంత సందడి. దురదృష్టమేమిటంటే వీళ్ళంతా అక్కడికి వెళ్ళేసరికే సదరు అబ్బాయి, సారీ తాతయ్య బాలిక మెళ్ళో తాళి కట్టేసి మాంఛి చిద్విలాసంగా చూస్తున్నాడు అందరినీ. ఇంకేం! ఆగ్రహంగా ఊగిపోయారు అక్కడున్న వాళ్ళు. తాతయ్యని పట్టుకొని దాదాపు కొట్టినంత పని చేసారు. అమ్మాయి మాత్రం బిక్క మొకమేసుకొని చూస్తోంది. సదరు తాతయ్య భార్య కొన్నేళ్ళ క్రితం చనిపోయిందనీ, మధ్యే ఆయన రిటైర్ అయ్యాడనీ, ఖాళీగా ఉండటమెందుకని పెళ్ళి చేసుకున్నాడని అక్కడున్న వారు చెప్పిన సమాచారం. మహిళా సంఘాల నాయకురాలొకావిడ పూనకం వచ్చిందానిలా ఊగిపోతూ "ఇంత దారుణము జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ వెరిఫై చేయకుండా కల్యాణ మండపం లో పెళ్ళి జరగటానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు? అమ్మాయ్ తల్లిదండ్రులు, ఆలయ E.O లను వెంటనే అరెస్ట్ చేయాలి, అమ్మాయిని బాలికల సొసైటీలో ఉంచాలి" ఇలాంటి డిమాండ్స్ తో హోరెత్తించేస్తోంది. టీవీ చూస్తున్న నాకే తెగ కోపం వచ్చిందంటే అక్కడున్న వాళ్ళ పరిస్తితేంటో ఊహించుకోవచ్చు. మొత్తం అన్ని చానల్ లో స్క్రోలింగ్ ఒక్కటే "రాజమండ్రి లో దారుణం. పదిహేడేళ్ళ బాలిక తో అరవై యేళ్ళ వృద్దుడి పెళ్ళి". సరే.. మొత్తానికి క్లైమాక్స్ లో పోలీసులు ఎలాగూ వస్తారుగా. అలాగే వచ్చేసారు పొలీసులు. వాళ్ళని చూడగానే మరింత ఊగిపోయారు అక్కడున్నవాళ్ళు "ఇంత దారుణం జరుగుతోంటే ఏం చేస్తున్నారంటూ". "వర్షం వచ్చినప్పుడు మా కాలనీ మొత్తం మునిగిపోతోంది మమ్మల్ని రక్షించండి మహాప్రభో" అని లలితా నగర్ వాళ్ళు ఎన్నో సార్లు మొర పెట్టుకున్నా, మాత్రం ఖాతరు చేయని మునిసిపాలిటీ వాళ్ళలాగ, వీళ్ళని ఏమత్రం పట్టించుకోకుండా 'మాకివి మామూలే' అన్నట్టు తాతయ్యని, అమ్మయిని పోలిస్ స్టేషన్ కి తీసుకెళ్ళిపోయారు పోలీసులు.
మీడియా వాళ్ళు కూడా పొలోమంటూ పోలిస్ స్టేషన్ కి పరిగెత్తారు. కాసేపటి తర్వాత పోలీసులు తేల్చిందేంటంటే అమ్మాయి వయస్సు పదిహేడు సంవత్సరాల రెండు వందల నలభై రొజులు అని. మైనారిటీ తీరటానికి ఇంకా నూటా ఇరవై ఐదు రొజుల టైముందని. మొత్తానికి మైనారిటీ తీరకుండా ఒక మైనర్ బాలికని పెళ్ళి చేసుకున్నందుకు ముసలి అబ్బాయిని అరెస్ట్ చేసారు పోలీసులు. దాంతో అందరూ చప్పట్లు కొట్టారు ఆనందంగా, ముసలోడికి తగిన శాస్తి జరిగిందని. ఎందుకో తెలేదు కానీ నాకు కూడా వొళ్ళు పులకరించింది . రాజమండ్రి కి మంచి రోజులొచ్చేసాయనిపించింది   క్షణం. మొత్తానికి కధ సుఖాంతమయ్యిందనుకుంటున్న తరుణంలో ఒక సంఘటన జరిగింది. మీడియా వాళ్ళు పెళ్ళికూతురి దగ్గరకెళ్ళారు భవిష్యత్ లో అమ్మాయి చేయబోతొందో తెలుసుకోవటానికి. ఎవారూ ఊహించని విధంగా అమ్మాయి ఇలా సెలవిచ్చింది "మా ఆయన కొసం ఎదురు చూస్తాను" అని. దెబ్బకి మీడియా వాళ్ళతో సహా టీవీ చూస్తోన్న నేనూ గతుక్కుమన్నాను జవాబుకి.
సరే ఏదైతేనేం! అమ్మాయి ఎపిసొడ్ అలా ముగిసింది. మా రాజమండ్రి ప్రజానీకం కూడా చాలా విషయాల్లాగే విషయాన్ని కూడా మర్చిపోయారు. కానీ నాకు మాత్రం విషయము చాలా సార్లు గుర్తొస్తూండేది. జనమంతా ముసలి పెళ్ళికొడుకు మీద ఎందుకంత తిరగబడ్డారు? అతను అరవై ఏళ్ళ వయసులో పెళ్ళి చేసుకున్నందుకా? లేక మైనారిటీ తీరని పదిహేడేళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నందుకా? రెండూ కావచ్చు. కాదు కాదు. రెండోదే నిజమనిపించింది. అమ్మాయికి పదిహేడేళ్ళు కాబట్టి వీళ్ళంతా వెళ్ళి అంత గొడవ చేసారు. అదే అమ్మాయికి పద్దెనిమిదేళ్ళు నిండిపోయుంటే ఏమి చేద్దురు? అప్పుడు పెళ్ళికొడుకుని ఏమీ అనలేకపోయేవారు కదా? అంటే దానర్ధం అమ్మాయి వయస్సు పద్దెనిమిదేళ్ళు నిండితే చాలు అబ్బాయి వయస్సు ఎంతున్నా పర్లేదు. నిజమే కదా? అంటే నూట ఇరవై ఐదు రోజుల తర్వాత అమ్మాయి ఇదే పెళ్ళికొడుకుని ఇదే మీడియా ముందు, ఇదే మహిళా సంఘాల ముందు, ఇదే సామాజిక చైతన్యవంతుల ముందు పెళ్ళి చేసుకున్నా అక్షితలు వేయటం తప్ప ఏమీ చేయలేకపోదురన్నమాట. దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది నాకు అది తలుచుకున్నప్పుడు. అప్పుడనిపించింది నాకు మన చట్టాల్లో ఇలాంటివి కొన్ని (చాలా) వెసులుబాట్లు ఉన్నాయని. అందరికీ తెలిసినవే, అయినా సరే అందులో మీకోసం మచ్చుకి కొన్ని.
*        *             *
మీరు ఎక్కడైనా లక్ష రూపాయలు అప్పు చేసేయండి మూడేళ్ళ తర్వాత మీరు పైసా కూడా కట్టకర్లేదు, మీరు గనక ప్రామిసరీ నోటు రాసుకుంటే. ఐపీ పెట్టుకొని ఋణ మాఫీ చేసుకొనే సదుపాయము కూడా ఉంది.

జంతు హింస చేయకూడదు. అంటే నెమలి, జింక, తాబేలు ఇలాంటి జంతువులని లేదా పక్షులని చంపకూడదు, తినకూడదు. ఒక వేళ రెండింటిలో ఏది చేసినా శిక్షార్హులు. కానీ ప్రభుత్వం మీకొక వెసులుబాటు ఇచ్చింది కోడి, మేక, యెద్దు లేదా గేదె ఇలాంటి వాటిని శుభ్రంగా చంపేయొచ్చు లేదా తినేయొచ్చు.

పద్దెనిమిదేళ్ళ లోపు వాళ్ళకి A సర్టిఫికేట్ సినిమాలు చూడటం నిషేధం(అసలు చూసినా వాళ్ళను ఆపేవాళ్ళు ఎవరూ లేరనుకోండి) కానీ టీవీలో మాత్రం ఎంచగ్గా చూడొచ్చు.

పద్దెనిమిదేళ్ళ లోపు పిల్లలు పని చేయకూడదు. ఒక వేళ వాళ్ళచే పని చేయిస్తే శిక్షకి గురి అవుతారు. కానీ సినిమాల్లో నటించొచ్చు, టీవీల్లో డాన్స్ ప్రొగ్రాములు చేయొచ్చు. 

కట్నం తీసుకోకూడదు కానీ గిఫ్ట్ పేరుతో అమ్మయికి వాళ్ళ తల్లిదండ్రులు పొలమో పుట్రో ఏదైనా ఇచ్చేయొచ్చు.

రికార్డింగ్ డాన్సులు నిషేధం. కానీ బార్లలో చక్కగా చేసుకోవచ్చు. టీవీలలో ఇంకా భేషుగ్గా చేసుకోవచ్చు.

మీ ఇంట్లో ఉన్న ప్రతీ పైసాకు మీరు లెక్క చెప్పాలి గవర్నమెంట్ కి. కానీ అదే మీరు దేవుడి హుండీలో వేసే డబ్బులకి అస్సలు లెక్క చెప్పక్కర్లేదు (లెక్క చెప్పటం మొదలు పెడితే తిరుపతి హుండీ లో ఒక్క రూపాయి పడదు)
అదే తిరుపతిలో మీరు ఆర్డినరీ క్యూ లో వెళితే ఒక్క సెకను కన్నా ఎక్కువ సేపు దర్శనం చేసుకోలేరు. అదే అంబానీ తోనొ, విజయ్ మాల్యా తోనొ, హీనపక్షంలో చిరంజీవితోనొ వెళితే ఎంత సేపు కావాలంటే అంత సేపు దర్శనం చేసుకోవచ్చు వీఐపీ హోదాలో.
మీరు తిరుపతికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలనుకుంటున్నారా? కానీ అక్కడికి వెళ్ళటానికి వీలు దొరకటం లేదా? ఏం ఫర్లేదు. శుభ్రంగా హెయిర్ సెలూన్ కి వీళ్ళి గుండు చేయించేసుకొని జుట్టుని కవర్లో పెట్టి తిరుపతికి పార్సిల్ చేసేయొచ్చు (అలా మీ జుట్టుని తిరుపతికి తీసుకెళ్ళే సంస్థలున్నాయి).
మీరు లెక్క లేనన్ని పాపాలు గట్రా చేసేసున్నారా? ఏం ఫర్లేదు. మీ పాప ప్రక్షాళన కోసం దేవాలయాలు, చర్చిలు, మసీదులు పాప పరిహారం చేసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నాయి. పాప పరిహారం చేసుకున్నాక మీరు మళ్ళీ ఫ్రెష్ష్ గా కొత్త పాపాలు మొదలెట్టేయొచ్చు.

వ్యభిచారం చేస్తే తప్పు. కానీ సహజీవనం మాత్రం భేషుగ్గా  చేయొచ్చు.

మైనర్ పిల్లలకు ఓ వెసులుబాటు ఉంది. వాళ్ళు ఎవరినైనా మానభంగం చేసినా తీవ్రమైన శిక్షలనుండి తప్పించుకోవచ్చు. మహా అయితే ఓ మూడేళ్ల శిక్ష అనుభవించి ఎంచక్కా వచ్చేయొచ్చు

ఇల్లు కొనటం కానీ కట్టటం కానీ చేయలేకపోతున్నారా? ఏం ఫర్వాలేదు. గవర్నమెంట్ మీకొక వెసులుబాటు ఇచ్చింది. శుభ్రంగా ఒక ఇంట్లో ఏడేళ్ళ పాటు అద్దెకి ఉండిపోండి. తర్వాత ఇల్లు మీ సొంతమై కూర్చుంటుంది.

యానాం నుండి మందు బాటిలు తెచ్చుకోలేక పోతున్నారా? సింపుల్. బాటిల్ మూత వూడతీసి తెచ్చుకోండి. మిమ్మల్ని ఎవ్వరూ పట్టుకోరు. నాదీ హామీ. 

ఇంట్లోనో లేదా ఇంటి బయటో పేకాడటం నిషేదం. కానీ మీరు క్లబ్బులలో హాయిగా ఆడేసుకోవచ్చు.


మీరు అమ్మాయా? మీకు అబ్బాయి అస్సలు నచ్చలేదా? అతను మీకు లవ్యూ చెప్పేస్తాడని భయంగా ఉందా? అస్సలు ఖంగారు పడకండి. రాఖీ పండగ రోజున అతనికి రాఖీ కట్టేసి 'అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధీ అని పాట పాడేయండి. వెసులుబాటు ఉంది మీకు.

మీరు షెడ్యూల్ కాస్టుకి చెందిన హిందువా? ఐతే మీకు రిజర్వేషన్లు ఉంటాయి. అదే మీరు క్రిస్టియన్ మతం లోకి మారితే మాత్రం మీకు రిజర్వేషను కట్. అదే మీరు మళ్ళీ హిందూ మతంలోకి మళ్ళీ మారారనుకోండి మళ్ళీ మీ రిజర్వేషన్లు మీకే.

మీరు ఎక్కడా పోటీ చేయకుండానే ప్రధాన మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ అయిపొవాలనుందా? చాలా సింపుల్ గా అయిపోవచ్చు. ఎలా అంటే మిమ్మల్ని ఒక పార్టీ లీడర్ గా ఎన్నుకొని గవర్నర్ కో లేక రాష్ట్రపతికో సిఫార్సు చేస్తే ఆయన గనక ఒప్పుకుంటే మీరు ఆరు నెలల వరకు పోస్టు లో కూర్చోవచ్చు. తర్వాత కూడా పోటీ చేసి గెలవక్కరలేదు. ఒక సారి రాజీనామా చేసి మళ్ళీ ఆరు నెలలు పోస్టులో కూర్చోవచ్చు. ఇలా ఐదేళ్ళ పదవీ కాలమంతా చేసే సదుపాయముంది. ఒక సారి ట్రై చేయండి కావాలంటే.

ఒక వ్యక్తిని చంపటం నేరం. కానీ ఒక వ్యక్తి దొంగతనము చేస్తున్నప్పుడో లేక రేప్ చేయటానికి ప్రయత్నించినప్పుడో లేక ఆత్మ రక్షణార్ధమో సదరు వ్యక్తిని చంపేయొచ్చు. శిక్ష పడదు.
అదే పోలీసులకి అయితే మాత్రం కండీషన్లు కూడా అఖర్లేదు. ఎవర్నిబడితే వాళ్ళని ఎన్ కౌంటర్ చేసేసుకొనె వెసులుబాటు ఉంది వాళ్ళకి.

బండిమీద ముగ్గురు కూర్చొని ప్రయాణము చేయటము నేరం. అదే మీరు ఒక పాప ఒక బాబు ని వేసుకొని ఎంచగ్గా ప్రయాణం చేసేయొచ్చు. ఎవ్వరూ పట్టుకోరు. అంతే కాదు మీరు సింగిల్ గా బండి మీదెల్తుంటే మిమ్మల్ని ఆపి డ్రైవింగ్ లైసెన్స్,సీబుక్,పొల్యూషన్ సర్టిఫికేట్ గట్రా అడుగుతారు. అదే ఫ్యామిలీతో... అంటే లేడీస్ తో వెళ్ళారనుకోండి మీ బండిని ఎవరూ ఆపరు. నిజం.

ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి అయితే ఈ రూల్స్ గట్రా అస్సలు వర్తించవు. గమనించండి. హెల్మెట్ పెట్టుకోకపొయినా లేదా లైసెన్స్ లేకపోయినా సరైన డాక్యుమెంట్స్ లేకపోయినా మన దగ్గర ఫైను కట్టించుకుంటారు కానీ వాళ్ళు మాత్రం హెల్మెట్ పెట్టుకోరు, సీట్ బెల్ట్ పెట్టుకోరు.  గవర్నమెంట్ ఇవ్వకపోయినా ఆ వెసులుబాటు వాళ్ళకి వాళ్ళే కల్పించుకున్నారు. 

మీదగ్గర ప్లేట్ మీల్స్ కి సరిపడా డబ్బులు మాత్రమే ఉన్నాయా? కానీ ఫుల్ మీల్స్ తినాలనుకుంటున్నారా? ఏం ఫర్లేదు. ప్లేట్ మీల్స్ టికెట్ తీసుకొని, ఫుల్ మీల్స్ టికెట్ తీసుకున్నవాడి పక్కనే కూర్చోండి. వాడికేసిన అన్నం, కూరలు గట్రా వాడిదాంట్లోంచి వేసేసుకోవచ్చు (వాడొప్పుకుంటేనే సుమా).

వెధవ పేంట్లూ జీన్స్ వేసుకొవటానికి చిరాగ్గా ఉందా? హాయిగా లుంగీ కట్టుకొని ఊరంతా తిరిగేయాలనుందా? ఇక్కడ కుదరదు కానీ చెన్నై లోనో, కేరళ లోనో అయితే భేషుగ్గా తిరగొచ్చు. ఎవ్వరూ మిమ్మల్ని పట్టించుకోరు. పైగా అది వాళ్ళ ట్రెడిషన్ కూడాను.

మీరు డాక్టర్ అవుదామనుకొని అవ్వలేకపోయారా? ఏం ఫర్లేదు. PHD చేయండి. మీ పేరుకు ముందు డాక్టర్ చేర్చుకోవచ్చు. లేదా సినిమా ఏక్టర్ అయిపోయి కొన్నాళ్ళ తర్వాత ఏదైన సన్మానాలు గట్రా చేసే సంఘం నుండి డాక్టరేట్ ఇప్పించేసుకోండి. అదీ కుదరదంటారా? ఫర్లేదు. మీరే క్లినిక్ మొదలెట్టేయండి. శంకర్ దాదా R.M.P టైపులో.

టికెట్ తీసుకోకుండా రైల్లో ప్రయాణం చేయాలనుకుంటున్నారా? ఒక పని చేయండి "చలో" పిలుపులిచ్చిన వాళ్ళతో వెళ్ళిపోండి. టికెట్ లేకుండా వెళ్ళిపోవచ్చు మీరనుకున్న ప్లేసుకి. (కాకపొతే ఇవి అప్పుడప్పుడు మాత్రమే కుదురుతాయి). అదే మీకు యాభై శాతం రాయితీ కావాలనుకుంటే స్వాతంత్ర సమరయోధుడితోనో, వికలాంగుడితోనొ ప్రయాణం చేయండి. మీకు 50% దబ్బులు ఆదా. 

మీరు మహా బద్దకస్తులా? ఏం ఫర్లేదు. మీరు చేయలేని పనులతో సహా అన్ని పనులు చేసిపెట్టే రోబోలు వచ్చేస్తున్నాయి. సో... డోంట్ వర్రీ. 

చివరాఖరుగా ఒకమ్మాయిని అందరి ముందు ముద్దు పెట్టుకోవలనుకుంటున్నారా? మామూలుగా అయితే కష్టం. అదే మీరు సినిమాలో హీరోగానో, విలన్ గానో నటించేయండి. చాలా హేప్పీగా మీరనుకున్నది కానిచ్చేయొచ్చు. పైగా డబ్బులు కూడా ఇస్తారు.
చింగ్ పాంగ్. 









 
 







                       

2 comments: