Monday, 16 September 2013

నా తిండి నా ఇష్టం


మొన్న మా ఫ్రెండొకడు పొద్దున్నే ఫోన్ చేసి "గ్రీన్ టీ తాగొచ్చు కదా?" అని అడిగాడు. "భేషుగ్గా" అని జవాబిచ్చాను. "ష్యూర్ కదా" అని రెట్టించాడు. అవును అని అనబోయి అలోచనలో పడ్డాను. గ్రీన్ టీ తాగోచ్చా లేదా అని. మామూలు వాళ్ళు తాగొచ్చు కానీ "షుగర్" ఉన్న వాళ్ళు తాగొచ్చా లేదా అని. డయాబెటిక్ పేషెంట్లు గ్రీన్ టీ తాగితే మంచిదని మధ్య ఒక పత్రిక లో చదివినట్టు గుర్తు. కానీ మళ్ళీ అనుమానమొచ్చింది. ఏదైతేనేంలే అని "గ్రీన్ టీ తాగొచ్చు అని దైర్యంగా చెప్పేసా వాడికి. మధ్య ఇలాంటి అనుమానాలు తీర్చుకోవటానికి తరచుగా ఫొన్లు చేస్తున్నాడు మావాడు "అవి తాగొచ్చా" "ఇవి తినొచ్చా" అని. ఎందుకంటే వాడు "షుగర్" మెంబర్ల క్లబ్బులో మధ్యే సభ్యత్వం తీసుకున్నాడు మరి. వాడు ఫోన్ చేసినప్పుడల్లా నాకు భయమేస్తూ ఉంటుంది ఎక్కడ వాడి క్లబ్ లో చేరాల్సివస్తుందో అని. అదే కాదు షుగర్ మీద వచ్చే వార్తల్ని చదవటానికి కూడా. అది రాకుండా ఉండటానికి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో అని మధ్య పత్రికల్లో టీవీల్లో, తెగ రాసేస్తున్నారు చూపించేస్తున్నారు. ఒక పేపెర్ లో బొప్పాయి కాయలు తినమని, ఇంకో పేపెర్ లో మెంతులు తినమని ఇలాంటివి బోలెడన్ని వ్రాస్తున్నారు. దానికి తోడు మంతెన సత్యనారయణ రాజు గారి టీవీ ప్రోగ్రాం గానీ చూసామంటే చచ్చినట్టే. తిండంటేనే విరక్తి పుడుతుంది. ఉప్పు, నూనె, పంచదార, మసాల మొత్తానికే మానేయమని చెపుతాడాయన. పోనీ ప్రకారం ముందుకి పోదామంటే ఇంకో పేపెర్ లో ఉప్పు మానేయకూడదని , నూనె మానితే వంటికి కావలసిన మంచి కొలెస్ట్రాలు చేరదని, ఇలా ఆయన చెప్పిందానికి విరుగుడుగా ఉంది. ఎలా చచ్చేదీ?!. షుగర్ రాకుండా ఉండాలంటే వ్యాయాయము చేయాలని చదివాను. మరి మా కొలీగు ఒకాయన 120 కిలోల బరువుంటాడు. అస్సలు వ్యాయాయము చేయడంట కానీ షుగరు లేదట. అదేంటో మరి?
సరే ఎందుకైనా మంచిదని మా ఆర్ట్స్ కాలేజి లో వాకింగ్ కని వెళ్తే అక్కడ ఒకాయన చేతిలో అట్ట, పెన్ తో నిలబడి అందరినీ ఆపుతున్నాడు. ఏంటో చూద్దామని నేను కూడా ఆగాను. అతని దగ్గర హైటూ, వెయిటు, బీపీ లు గట్రా కొలిచే స్టాండ్ లాంటిది ఉంది. అందరినీ వరసపెట్టి దాని మీద నిలబెట్టి కొలిచేస్తున్నాడు. నేను కూడా కొలుచుకుందామనుకున్నాను గానీ డౌటొచ్చింది డబ్బులేమైనా కట్టాలేమోనని. ఎందుకంటే డబ్బులేమీ వేసుకెళ్ళలేదు మరి. అనుమానంగానే అడిగాను అతన్ని "ఫీజెంత" అని. ఒక్క సారి నన్ను ఎగాదిగా చూసి భళ్ళున నవ్వి "ఫీజేమీ లేదు సార్ ఫ్రీ" అన్నడు. నేను కూడా వెర్రి నవ్వు నవ్వి స్టాండ్ మీద నుంచున్నాను. నా హైటూ, వెయిటూ గట్రా కొలిచి అవన్నీ పేపెర్ లో రాసాడు. తర్వాత నాకు చెప్పటం (భయపెట్టటం) మొదలెట్టాడు. మీరు ఉండాల్సిన దాని కంటే యింత బరువెక్కువున్నారు. మీ BMI యిదీ, మీ కొలెస్ట్రాలు యిదీ అని ఏవేవో చెప్పుకుంటూ పోయాడు. పొద్దున్నే హర్రర్ సినిమా చూసింట్లనిపించింది నాకు. అతన్నే అడిగాను "మరేం చేయాలి" అని. మీరు ఆఫీసు అడ్రెస్ కి రేపొద్దున్న 7.30 కి రండి. అక్కడ మీకు కౌన్సిలింగ్ చేస్తారు అని చెప్పాడు. ఎందుకైనా మంచిదని "మరి ఫీజు" అని నసిగాను. మళ్ళీ భళ్ళున నవ్వి "అక్కడ కూడా ఎటువంటి ఫీజు లేదు సార్" అన్నాడు. అంతే. తెగ ఉత్సాహమొచ్చేసింది నాకు. పైగా అతనంటే ఒక మంచి అభిప్రాయము ఏర్పడింది నాకు ఉచితంగా సమాజ సేవ చేస్తున్నదుకు.   

*                       *                     *          
మర్నాడు పొద్దున్నే ఠంచనుగా 7.15 కి ఫోన్ వచ్చింది అతను చెప్పిన అడ్రెస్ నించి "సార్ మీకు 7.30 కి అప్పాయింట్ మెంట్" ఉంది అని. పైగా ఏమీ తినకుండా రమ్మన్నాడు. వెంటనే రెడీ అయిపోయి జెండా పంజా రోడులో అతనిచ్చిన అడ్రెస్ కి వెళ్ళిపోయాను. దొరికింది. పై అంతస్తులో ఉంది హెల్త్ సెంటరు. సరే అని అక్కడకెళ్ళేసరికి ఇద్దరు ముగ్గురు నించొనున్నారు. వాళ్ళు నా పేరూ ఊరూ అన్ని రాసుకొని మళ్ళీ స్టాండ్ దగ్గరకి తీసుకెళ్ళారు. మళ్ళీ ఎందుకు నిన్న తీసుకున్న రిపోర్ట్ ఉంది కదా అని చూపించపోయాను. అబ్బే మళ్ళీ తీసుకోవాలి సార్ అని స్టాండ్ ఎక్కించారు నన్ను. సర్లే మనకి పోయేదేముందీ అని మళ్ళీ నుంచున్నాను. వివరాలు అవీ రాసుకొని ఇక్కడ కూర్చోండి. డాక్టర్ గారికి రిపోర్ట్ చూపిందురు గాని అన్నారు. సరే అని అక్కడ కూర్చున్నాను. నా వంతొచ్చింది. లోపలికి వెళ్ళబోయి గతుక్కుమన్నాను డాక్టర్ ని చూసి.

*                           *                             *
  
అతను మరెవరో కాదు. నిన్న గ్రౌండ్ లో నా వివరాలు రాసుకున్న అతనే. నన్ను చూసి మాంచి చిద్విలాపంగా నవ్వి కూర్చోండి సార్ అన్నాడు. కూర్చున్నాను. మళ్ళీ మొదలెట్టాడు మీరు యింత వెయిటు ఉన్నారు మీ BMI యిదీ.... మళ్ళీ అదే సుత్తి. సరే ఇంతకీనేనేం  చేయాలి” అని అడిగాను అతన్ని. వెంటనే చార్ట్ తీసి చూపించాడు నాకు. అదేదో న్యూట్రిషియను ఫుడ్డంట. పొద్దున్న గ్లాసు మధ్యానమో గ్లాసూ, రాత్రి రెండు గ్లాసులూ తాగాలి అని చెప్పాడు. అంటే మరి తిండి ఏమీ తినక్కర్లేదా అని అడిగాను. అబ్బే అన్నీ ఇందులో కవరైపోతాయి అని చెప్పాడు. సరే ఎంత పేకెట్టు అని అడిగాను. అప్పుడు మొదలెట్టాదు కోర్సుల గురించి. వారానికింత, నెలకింత, రోజుకింత అని చెప్పుకుంటూ పోతున్నాడు. మొత్తానికి తేలిందేంటంటే పాతిక నించి యాభై వేల వరకు వుతుందన్నమాట. అమ్మనీ....... అదా సంగతి! అనుకొని, ఏదో ఒకటి చెప్పి బయటపడదామని వెళ్ళబోతుండగా నన్ను వెళ్ళనివ్వలేదు అతను. సెల్ ఫోనె తీసిదున్నపోతు’లా ఉండే ఒకతని ఫోటో చూపించాడు. ఎవరు అని అడిగాను. భయంకరంగా నవ్వి "అది నేనే సార్" , కోర్స్ మొదలు పెట్టాక ఇలా అయిపోయాను అన్నాడు. మొత్తానికి అతన్ని వదిలించుకొని వచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చిందంటే నమ్మండి. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసి వార్త చెప్పాడు. అది ఎంత వరకు నిజమో తెలేదు కానీ నేను మాత్రం షాక్ కి గురయ్యాను వార్త విని. ఇంతకీ వార్తేంటంటే "మంతెన గారికి హార్ట్ ఎటాక్ వచ్చింది"




 

No comments:

Post a Comment