Saturday, 21 September 2013

మీరా భజన్ సంఘం & కో

అదొక సినిమా ఆడియో ఫంక్షను. ఓ పెద్ద ఫంక్షను హాల్ లో జరుగుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ పేరున్న నటుడి సినిమా అది. చాలా పెద్ద సంఖ్యలో అతని అభిమానులు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చారు. అతను యింకా ఆ ఫంక్షను కి రాలేదు. ఈ లోపులో సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో కొన్ని సర్కస్ ఫీట్లు జరిగాయి. మధ్య మధ్యలో యాంకరు 'సంధ్యాబాను ' ఆ హీరో గారి గురించి ఊదరగొట్టేస్తోంది. ఆయన ఏదో ఆకాశం నుండి అమాంతం భూమి మీదకి ఊడిపడినట్టు తెగ మోసేస్తోంది. 'వచేస్తున్నారు. మన ............ స్టార్ ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తున్నారు అని అప్పటికి ఓ గంట నుండి చెపుతోంది. చివరికి రానే వచ్చాడు మన హీరో గారు. వస్తూనే జనాలందరికీ చేతులూపుతూ అభివాదం చేసారు. 'ఓ' అని గట్టిగా కేరింతలు కొట్టారు. హీరో గారు వచ్చాక కూడా ఆడియో ఫంక్షను ప్రారంభం కాలేదు. ఆయన గారు నటించిన కొన్ని సినిమాల్లోని పాటలకి డాన్సులు గట్రా చేసారు కొంతమంది. అవి చూస్తున్న హీరో గారు కూడా ఉత్సాహంగా ఆ పాటకి తగ్గట్టుగా లిప్ మూమెంట్స్ యిచ్చాడు. అంతే. ఆ ప్రోగ్రాం ని కవర్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ కి వళ్ళు పులకరించింది. వెంటనే కెమేరాని అతని ముందు పెట్టేశాడు. కెమెరాని చూసిన మన హీరో గారు మరింత రెచ్చిపోయి ఊగిపోతూ పాడేసాడు. హీరొయిన్ ఆల్రెడీ వచ్చింది అక్కడికి. డైరెక్ట్ గా బోంబే నుండి దిగుమతయ్యింది ఆమె. గత ఐదు సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో నటిస్తున్నా తెలుగు ఒక్క ముక్క కూడా రాదు పాపం.  ప్రోగ్రాం ని మంచి ఉల్లాసంగా చూస్తోంది. మధ్య మధ్యలో తన జుట్టుని చెవుల మీదకి సరి చేసుకుంటూ. సరే. కాసేపటికి అసలు తంతు మొదలయ్యింది. వేదిక మీదకి ఒక్కక్కరినే ఆహ్వానిస్తున్నారు. హీరోని వేదిక మీదకి పిలవగానే బ్రహ్మాండం బద్దలయినట్టు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు అభిమానులు. తర్వాత హీరొయిన్ ని కూడా పిలిచారు. మళ్ళీ అవే ఈలలు, కేకలు. యింకా అందులో నటించిన నటీ నటులు కొంత మంది స్టేజెక్కారు. ఆ హీరో, ఒకరిద్దరు కమెడియన్లు తప్ప తప్ప అందులో నటించిన మిగతా అందరూ పరభాషా నటులే. తర్వాత నిర్మాత కూడ స్టేజు మీదకొచ్చాడు. చివరాఖరిగా ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా స్టేజు ఎక్కాడు. అతనికి పెద్ద ప్రాధాన్యమీయలేదనుకొండి. వెళ్ళి ఓ మూలన నుంచొన్నాడు. ముందుగా నిర్మాతకి మైకిచ్చారు. దాదాపు ఏడ్చినంత పని చేసాడు. ఎందునంటారా? ఆ హీరో గారు ఎంతో కోపరేషనిచ్చారంట. తన సొంత సినిమాలా భావించి సినిమా చేసాడంట. యిలా మొత్తం హీరో గారి భజన చేస్తూ ప్రసంగం ముగించాడు. ఆడియో ఫంక్షను అయినా ఎక్కడా సంగీత దర్శకుడి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. తర్వాత అందులో నటించిన కమెడియన్లు, సహ నటులు అందరూ మాట్లాడారు. అందరూ హీరో గారి భజనే. ఎక్కడా సంగీత దర్శకుడి ఊసు లేదు. తర్వాత వంతు హీరో గారిది. ఆయన మొదలెట్టక ముందే జానాలంతా పిచ్చి కేకలేసి తెగ గోల చేసారు. అందరినీ చిద్విలాసంగా చూస్తూ ప్రసంగం మొదలు పెట్టాడు. మొత్తం ప్రసంగమంతా తన స్వభజన చుట్టూ సాగింది. చివరిగా హీరొయిన్ వంతు వచ్చింది. హీరోయిన్ మైకు తీసుకోగానే జనాలు మళ్ళీ గోల చేసారు. హీరోయిన్ మాట్లాడుతూ "అన్....ద......రికీ......నమ...ష్కారం" అంది. అంతే. జనాలు పిచ్చెక్కిపోయారు. చొక్కాలు చింపుకున్నంత పని చేసారు. హీరోయిన్ ఇంకా కొనసాగిస్తూ "బా...గున్న...రా" అంది. తట్టుకోలేక ఏడవటం మొదలెట్టారు అభిమానులు. వాళ్ళని మరింత ఏడ్పించటానికన్నట్లు వాళ్ళ మీదకొ ఓ ఫ్లైయింగ్ కిస్సొకటి విసిరింది. అంతే.... తమ జన్మ ధన్యమయినట్లు ఫీలయ్యారు అబిమానులు. 
తెలుగు ప్రేక్షకులకి జిందాబాద్.   

No comments:

Post a Comment