నిజాయితీ. అసలు నిజాయితీ అంటే ఏంటి మీ దృష్టిలో? అవినీతికి పాల్పడకపోవటమా? మనది కాని దాన్ని ఎవరి దగ్గరా ఏమీ ఆశించకపోవటమా? ఉన్నదానితోనే సంతృప్తి పడటమా? ఎవరి మీదా ఆధారపడకుండా బ్రతకటమా? అబద్దాలు చెప్పకపోవటమా? పోనీ ఇవన్నీ కలిసిన లక్షణాలు కలిగి ఉండటమా? ఏమి చెపుతారు? మీకు తెలిసిన అత్యంత నిజాయితీపరుడు ఎవరు అంటే ఎవరి పేరు చెపుతారు? అసలు ఎవరి పేర్లు గుర్తొస్తున్నాయి? ఆలోచించండి. మహాత్మా గాంధీ, అన్నా హజారే, కిరణ్ బేడీ,అరవింద్ కేజ్రీవాల్...... ఇలాంటి పేర్లు గుర్తొస్తున్నాయా? మరి మీ రాష్ట్రంలో? మీ ఊళ్ళో? మీ ఆఫీస్ లో? మీ రాజకీయ నాయకుల్లో?మీ ఇంట్లో? మీ ఇంటిప్రక్కన? మీ వీధిలో? మీ చుట్టాల్లో? మీ స్నేహితుల్లో? మీకు తెలిసిన వాళ్ళల్లో? అసలున్నారా? ఉంటే ఒకరిద్దరి పేర్లు గుర్తొస్తున్నాయా? వాళ్ళు ఎంత శాతం నిజాయితీపరులు? అసలు వంద శాతం నిజాయితీపరులున్నారా? చివరిగా మీ సంగతేంటి? మీరు ఎంత నిజాయితీపరులు? ఎంత శాతం నిజాయితీపరులు? అసలు ఈ శాతాల గొడవేంటి? నిజాయితీ గా ఉండేవాడు వంద శాతం నిజాయితీగా ఉండక మరెంత ఉంటాడు అని ఎదురు ప్రశ్న వేయబోతున్నారా? కాస్త ఆగండి. మీకు అలాంటి అవకాశము లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు విన్న తర్వాత ఖచ్చితంగా మీరే ఒప్పుకుంటారు, వంద శాతం నిజాయితీపరులు ఈ లోకం లో ఎవరూ ఉండరని. అసలు ఉండటానికే అవకాశం లేదని. నమ్మడం లేదా? సరే. మీరు మహా నిజాయితీపరుడు అన్నవాడు ఇప్పుడు నేను చెప్పబోయే వాటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా చేసే ఉంటాడు తన జీవితకాలములో- తరచుగా లేదా అప్పుడప్పుడూ లేదా కనీసం ఒక్క సారైనా. కావలంటే చెక్ చేసుకోండి.
ఏదో ఒక సందర్భము లో బ్లాక్ లో టికెట్లు కొని సినిమా చూసుంటాడు లేదా ఎవరైనా బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నా పట్టించుకోకుండా ఉండి ఉంటాడు. (స్వయంగా బ్లాక్ లో టికెట్లు కొనకపోయినా వాటిని అమ్మే వారిని పోలీసులకి పట్టివ్వకపోవటమూ నేరమే లేదా అవినీతిని ప్రోత్సహించటమే). బ్లాక్ లో బైక్ కొనటము కూడా దీనికిందకే వస్తుంది.
అతను స్వయంగా లంచాలు తీసుకోకపోవచ్చు. కానీ అతని ఆఫీసులోనో లేదా చుట్టుప్రక్కల ఎవరైనా లంచాలు తింటుంటే పట్టించుకోకపోయుంటాడు. (అది కూడా నేరమే. లంచగొండులను పట్టించకపోతే వారిని ప్రోత్సాహించినట్లే). లేదా వారిచ్చిన పార్టీ లకి హాజరయుంటాడు. ఆ విధంగా వాళ్ళ లంచం సొమ్ము ఇన్ డైరెక్ట్ గా తిన్నట్టే.
వాళ్ళబ్బాయికో లేక అమ్మాయికో ఉద్యోగం కోసం లంచమిచ్చి ఉంటాడు. అతను స్వయంగా ఇవ్వకపోయినా ఇంట్లో వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తుంటే అభ్యంతరము చెప్పి ఉండకపోయుంటాడు.
ఏదో ఒక సందర్భములో అతనే ఇతరులకి లంచమిచ్చి ఉంటాడు. (లంచము తీసుకోవటము ఎంత నేరమో ఇవ్వటమూ అంతే నేరం). ముఖ్యంగా ఈ సందర్భాలలో లంచమిచ్చి ఉంటాడు.
బెర్త్ కోసం రైల్వే టీటీ కి.
గ్యాస్ కనెక్షన్ కోసం.
రేషన్ కార్డు కోసం.
కాస్ట్ సర్టిఫికేట్ కోసం.
డేట్ ఆఫ్ బర్త్, డెత్, మ్యారేజ్ సర్టిఫికేట్ ల కోసం.
పాస్ పోర్ట్ కోసం, వీసా కోసం.
ట్రాఫిక్ పోలీసులకి ఫైను కట్టకుండా తప్పించుకోవటం కోసం.
తిరుపతి లడ్డుని బ్లాక్ లో కొనటం.
వగైరా వగైరా.
స్థలము లేదా ఇల్లు లేదా పొలము ఏవైనా అమ్మినప్పుడు లేదా కొన్నప్పుడు వాటి విలువని తక్కువ చేసి రిజిస్ట్రేషన్ చేసుకునుని ఉంటాడు.
అతని పిల్లలకి కట్నం తీసుకొనుంటాడు, లేదా ఇచ్చుంటాడు. రెండూ నేరమే.
బయట ఏదైనా వస్తువు లేదా డబ్బు లేదా సెల్ ఫోన్ లాంటివి దొరికినప్పుడు వాటిని ఆ సంబందిత వ్యక్తులకి అప్పగించకపోవటమో లేదా పోలీసులకి సమాచారమివాకపోవటమో చేసుంటాడు.
కళ్ళ ముందు ఏదైనా ఘోరం (హత్య, మానభంగం లేదా దొంగతనము) జరిగినప్పుడు ఆ చేసిన వారిని గుర్తించినా చట్టానికి పట్టించకుండా మనకెందుకులే అని ఊరకుండి ఉంటాడు.
పైరసీ సీడీ లో సినిమా చూసుంటాడు. లేదా అలా చూసే వారిని పట్టించుకోకపోయుంటాడు. రెండూ నేరమే.
పిల్లలకి మూడేళ్ళు దాటిన తర్వాత కూడా వాళ్ళకి టికెట్ తీయకుండా సినిమాకి తీసుకెళ్ళుంటాడు. లేదా ఐదేళ్ళు దాటినా ట్రైన్ లో టికెట్ తీసుకొనుండకపోయుంటాడు.
పిల్లల్ని స్కూల్ లేదా కాలేజీ లో జాయిన్ చేసినపుడు డొనేషన్ కట్టి ఉంటాడు లేదా డొనేషన్ కట్టించుకుంటున్నారని తెలిసినా కంప్లైంట్ ఇవ్వకపోయుంటాడు.
అనారోగ్యం లేకపోయినా లీవ్ కోసం సిక్ లీవ్ లేదా మెడికల్ లీవ్ పెట్టి ఉంటాడు.
15 సంవత్సరాలు దాటిపోయినా రి-రిగిస్ట్రషన్ చేసుకోకుండా అదే బండిని లేదా కారుని వాడుతూ ఉండి ఉంటాడు. లేదా ఎవరైనా అటువంటి బండి తెచ్చినప్పుడు దాని మీద ప్రయాణము చేసి ఉంటాడు.
గవర్నమెంట్ ప్లేస్టిక్ కవర్లని నిషేధించినా వాటిని వాడుతూ ఉంటాడు.
కొన్న ఏ వస్తువుకీ రశీదు తీసుకోకుండా (అద్దె రశీదు తో సహా) ఉంటాడు.
స్మగుల్డ్ గూడ్స్ ఏదైనా కొనటం లేదా వాటిని ఎవరైనా గిఫ్ట్ గా ఇచ్చినపుడు తీసుకొని ఉంటాడు.
అబద్దాలు చెప్పుంటాడు. నిజాయితీ కోటాలో ఇదెందుకొస్తుంది? అని మీకు అనుమానం రావచ్చు. కానీ ఒక సారి గుర్తు చేసుకోండి. మన మాజీ సైన్యాద్యక్షుడు తన వయసు విషయములో అబద్దము చెప్పటము వలన ఎంత గొడవయ్యిందో. మొత్తం పార్లమెంట్ అట్టుడికిపోయిందీ విషయంలో.
మైనర్ వివాహానికి హాజరయ్యుంటాడు లేదా ఆ విషయము తెలిసినా కంప్లైంట్ ఇవ్వకపోయుంటాడు.
ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయుంటాడు.
'A' సర్టిఫికేట్ సినిమాని 18 యేండ్లు నిండక ముందే చూసుంటాడు లేదా తన పిల్లల్ని 18 యేండ్లు దాటక ముందే సినిమాకి తీసుకెళ్ళుంటాడు.
అదే సినిమా హాళ్ళో బ్లాక్ లో కూల్ డ్రింక్ కొని త్రాగుంటాడు లేదా అలా అమ్ముతున్నా వాళ్ళని ప్రశ్నించక పోవటమో లేదా వాళ్ళ మీద ఫిర్యాదు చేసుండకపోయుంటాడు.
MRP రేట్ల కన్నా ఎక్కువ ఉండే వస్తువులని కొనుంటాడు.
చిన్నప్పట్నుండి ఇప్పటి వరకు జరిగిన పరీక్షలలో ఏదైనా ఒక పరీక్షకైనా కాపీ కొట్టుంటాడు లేదా అలా కాపీ కొట్టే వాళ్ళ గురించి ఫిర్యాదు చేసుండకపోయుంటాడు.
చాలా ఇంకా కావాలా? యిప్పుడు చెప్పండి. పైన నేను చెప్పిన పాయింట్లలో ఏ ఒక్కటైనా చేయని వాడు ఈ లోకం లో ఉంటడంటారా? ఉండడు. కనీసం ఒక్కటైనా తప్పనిసరిగా చేసే ఉంటాడు మీరు గుర్తు చేసుకున్న అన్న హజారే, కిరణ్ బేడీ లతో సహా.. అంటే దానర్ధం వంద శాతం నిజాయితీపరుడు లేడనే కదా? అవును. వంద శాతం నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తే మహా అయితే ఓ యభయ్యో అరవై శాతమో మాత్రమే నిజాయితీగా ఉండగలము. ఇది అక్షర సత్యం. ఇప్పుడు మనకి నీతి,నిజాయితీల మీద తీసిన సినిమాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అవి కూడా(అన్నీ కాదు) ఎక్కడ్నించో కాపీ కొట్టినవో లేక ఇన్స్పైర్ అయ్యి తీసినవే. చివరికి నీతి నిజాయితీలమీద తీసిన "భారతీయుడు" సినిమాలో కమల్ హాసన్ కూడా వంద శాతం నిజాయితీపరుడేం కాదు. నిజమా? అవును. కావాలంటే ఆ సినిమాను మళ్ళీ ఒక్క సారి గుర్తు చేసుకోండి. కన్న కూతురు వళ్ళంతా కాలిపోయిన పరిస్తితుల్లో హాస్పిటల్ లో అద్మిట్ చేయటానికి సవా లక్ష ఫార్మాలిటీలు ఫాలో అయి చివరికి తనని పోగొట్టుకుంటాడు. అదే కమల్ హాసన్ అవినీతిపరులని చంపేటప్పుడు మాత్రం ఫార్మాలిటీలను ఏ మాత్రం ఫాలో అవ్వడు. ఒక అవినీతిపరుడైన డాక్టర్ ని చంపటానికి ఒక టెలివిజన్ స్టుడియో లో కి వాళ్ళ పర్మిషన్ లేకుండా ప్రవేశించి ఒక్క పైసా కూడా కట్టకుండా వాళ్ళ ఎక్వూప్ మెంట్ మొత్తం వాడేసుకుంటాడు కెమేరాతో సహా. చివరికి కన్న కొడుకు అవినీతిపరుడని తెలిసి అతన్ని చంపటానికి ఎయిర్ పోర్ట్ లోకి ఎంట్రీ ఫీజు కట్టకుండా ప్రవేశించటమే కాకుండా ఎయిరోప్లేన్లు లేండింగ్ అయ్యే స్థలములోకి పర్మిషన్ లేకుండా అక్రమంగా వెళ్ళిపోయి మరీ కొడుకుని చంపేస్తాడు. అదీ విషయం.
ఏంటి మరీ కోడిగుడ్డుకి ఈకలు పీకేస్తున్నానంటారా? తప్పదు మరి. విషయమొచ్చినప్పుడు అన్నీ చెప్పాల్సిందే. చిట్టచివరిగా ఓ జోక్ చెప్పనా? నీతి నిజాయితీల మీద తీసిన ఆ సినిమాని బ్లాక్ లో కొనుక్కుని చూడటం.
డిర్రి......జిప్.
నిన్ననే ఇలాంటి పోస్ట్ మన పల్లె ప్రపంచం బ్లాగ్ లో పెట్టారు , http://blog.palleprapancham.in/2016/10/blog-post_94.html
ReplyDeleteఅవునా?
ReplyDelete