Monday, 23 December 2013

ఓ సమయమా ఎందుకింత నిర్దయ?

అరెరె అప్పుడే ఆ రోజులయిపోయాయా?
కార్కు బాలుతో ఫాస్టు బౌలింగు చేసేసి
కాళ్ళూ వికెట్లని విరొగ్గొట్టేసిన రోజులు
అపుడే అయిపోయాయా?

బ్లాకులో గీతాంజలీ
బొడ్లో చైనులు చుట్టుకొని శివ సినిమాలు
చూసి కేరింతలు కొట్టిన రోజులు
అపుడే దూరమయ్యాయా?

హవా హవా ఏ హావా అంటూ సోలో సాంగులు పాడేసి
ఏక్ దో తీనంటూ మాధురీ డేన్సులకి ఈలలు వేసేసి
చిరు స్టెప్పులకి స్టెప్పులు కలిపేసిన రోజులు
అప్పుడే కనుమరుగయ్యాయా?

Sunday, 22 December 2013

ఏమిటీ డబ్బింగు గోల?

వసంత కోకిల సినిమా గుర్తుందా మీకు? కమల్ హాసన్, శ్రీదేవి నటన అదిరిపోతుంది కదా? ఆ సినిమాని తమిళ్ లో తీసి తెలుగులో డబ్బింగ్ చేసారు. శ్రీదేవికి డబ్బింగు చెప్పిందెవరో తెలుసా? "S.P.శైలజ". అవును. అంతే కాదు నిరీక్షణ సినిమాలో అర్చనకి డబ్బింగు చెప్పింది ఎవరో తెలుసా?  "రోజారమణి". అంతే కాదు నటి విజయశాంతి తన నట జీవితం మొత్తములో స్వంతంగా డబ్బింగ్ చెప్పిన మొదటి చిత్రం "ఒసేయ్ రాములమ్మ". నటుడు రాజశేఖర్ ఇంతవరకు తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోలేదు. సాయికుమార్ అతనికి డబ్బింగ్ చెపుతాడు. సుమన్ కి కూడా అదే పరిస్థితి. ఒక సారి వారిద్దరూ (సుమన్, సాయికుమార్) నటించాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా పేరు "దోషి-నిర్దోషి". ఆ సినిమాలో సుమన్ కి సాయికుమార్ డబ్బింగ్ చెప్పాడు. మరి సాయికుమార్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా? రవిశంకర్. అంటే సాయికుమార్ తమ్ముడన్నమాట. ఈ మధ్య అరుంధతి సినిమాలో నటుడు 'సోనూసూద్' కి వాయిస్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే కమలహాసన్ తన స్ట్రెయిట్ తెలుగు చిత్రాలకి మాత్రమే డబ్బింగ్  చెప్పుకుంటాడు. తమిళం నుండి డబ్ అయిన చిత్రాలకు చెప్పడు. వాటికి 's.p.బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెపుతాడు. మన రాజమండ్రి M.P ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ సినిమాలో ఓ పాత్రకి (హీరోయిన్ తండ్రి ) తన వాయిస్ ఇచ్చాడు అచ్చమైన తూర్పు గోదావరి యాసలో. అది మలయాళం నుండి తెలుగు కి అనువదింపబడిన సినిమా. పేరు "జర్నలిస్టు". సురేష్ గోపి, మంజు వారియర్ నటీనటులు. ఆ డబ్బింగు వెర్షన్ కి నిర్మాత కూడా ఆయనే. 

సిగ్గు సిగ్గు

అదిగో మరొక రాక్షసత్వం బయటపడిన రోజది
ప్రకృతి తానేర్పరచిన ధర్మాన్ని
కాలరాసిన దుర్మార్గం బయటపడిన క్షణమది
సమాజం సిగ్గుతో తలదించుకున్న ఘడియ యది


మానవత్వం భోరుమని మూగగా రోదించిన క్షణమది
పురి విప్పిన విశృంఖలతకు సిగ్గుపడి
ఎక్కడో దాక్కుండిపోయిన సమయమది  

కాపాడవలసిన కనిపించని మూగ దేవుళ్ళంతా
మొకం చాటేసి హుండీల్లోని సొమ్ముల్ని లెక్కేసుకుంటూ
కాలక్షేపం చేసిన దుర్దినమిది  

ఏం జరుగుతోంది? అసలేమవుతోంది?
కోతి నుండి మనిషి పుట్టకే నిజమైతే
మనిషి నుండి పశువుగా మారుతోన్న 
దశ మొదలయినట్టేనా   

నరమాంసాన్ని తినేవాడిని
నరమాంస భక్షకుడంటే
మరి తన మాంసాన్ని
తానే తినే వాడిని ఏమని పిలవాలి?

తన రూపానికి ప్రతిరూపాన్ని తానే కాలరాస్తుంటే
తన బింబానికి ప్రతిబింబాన్ని తానే బద్దలు కొడుతుంటే
తన మాంసానికి కొనసాగింపుని తానే కోసేస్తుంటే
తన నీడని తన తోడుని తానే నలిపేస్తుంటే 
  
తన రెక్కలకింద వెచ్చగా భద్రంగా
చూస్తాడనుకున్న వాడే తనని చిదిమేస్తుంటే
తన చేతిలో చెయ్యేసి భరోసానివాల్సిన వాడే
కామంతో వళ్ళు తడుముతోంటే
పరుల కంట పడకుండా కాపాడాల్సినవాడే
వంకరగా చూస్తోంటే   

ఎవరికి చెప్పాలి?
ఏమని చెప్పాలి?
ఎలా మొర పెట్టాలి?

Saturday, 21 December 2013

ఎవరూ దీన్నించి తప్పించుకోలేరు చాలెంజ్ !

మనందరికీ చిన్నప్పట్నుండీ ఏవో ఒక నిక్ నేములు ఉండే ఉంటాయి. స్కూల్ లోనో లేక ఆఫీసులోనో ఎవరో ఒకరు మనకు నిక్ నేం పెట్టే ఉంటారు. ఎవరూ దీనికి అతీతులు కారు. ప్రతీ ఒక్కరూ ఈ నిక్ నేముల బారిన పడిన వారే (పడాల్సిన వారే). కాకపోతే ఈ పేర్లు మనకి ఇబ్బంది పెట్టనంత వరకూ ఓకే. అలా కాక మనలోని వైకల్యాన్నో లేక జబ్బు పేరో సూచిస్తూ నిక్ నేములు పెడితేనే యిబ్బంది. యింతకీ విషయమేమిటంటే చిన్నప్పుడు అంటే 10 వ తరగతి చదివేటప్పుడు PUMA అనే పేరుగల T-shirt వేసుకొని స్కూల్ కి వెళ్ళాను.

Thursday, 19 December 2013

గొంతులందు పెద్ద గొంతులు వేరయా.....

ఎందుకో తెలీదు గానీ సాధారణంగా పెద్ద గొంతుతో (గట్టిగా) మాట్లాడే  అమ్మాయిల జోలికి వెళ్ళరు అబ్బాయిలు. అంతే కాదు - అలా మాట్లాడే అమ్మాయిలు పెద్ద అందంగా కూడా ఉండరు మరి .

మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి అందుబాటులో లేరు

ఎవరికైనా అప్పిచ్చారా? ఇస్తానన్న రోజుకి తిరిగివ్వలేదా? లేదా ఏదైనా పని గురించి ఎవరి సహాయమైనా కోరారా? అయితే ఫోన్ చేయండి. చేసారా? మీ కాల్ లిఫ్ట్ చేయటం లేదా? ఎన్ని సార్లు చేసినా అదే తంతా? ఫోన్ పని చేయడం లేదనుకుంటున్నారా? అదేం కాదు. మీ నెంబరు చూసి అవతలి వ్యక్తి తీయడం లేదంతే. ప్రస్తుతము బయట జరుగుతున్న ప్రహసనం యిది. యిదొక కొత్త రకం సైకాలజీ అన్నమాట. అవతలి వ్యక్తికి మీ నెంబరు చూడగానే దాన్ని కట్ చేయటమో లేక మాట్లాడటమో చేయడు. దాన్ని అలా సైలెంట్ మోడ్ లో పెట్టేస్తాడన్న మాట. మీకు విషయం అర్ధం కాదు. ఆ తర్వాత అతను ఎప్పుడైనా కనిపిస్తే అతను మీకు వెంటనే చెప్పే జవాబు "వైబ్రేషన్ లో ఉంది - చూడలేదు", "ఫోన్ ఇంట్లో పెట్టి బయటకు వెళ్ళాను", ట్రాఫిక్ లో ఉన్నాను చూసుకోలేదు". అవన్నీ అబద్ధాలే.      

Saturday, 14 December 2013

జీవితమే ఓ చదరంగం

జీవితం కూడా 'చదరంగం' లాంటిదే. కాకపోతే 'చదరంగం'లో రాజుని కాపాడటానికి సైన్యం ఉంటుంది. కానీ నిజ జీవితంలో మనల్ని కాపడటానికి ఏ సైన్యమూ ఉండదు. మనకి మనమే ఓ సైన్యం. ఒంటరిగా పోరాటం చేయాల్సిందే. తప్పదు.

మంచివాడు

ఒక వ్యక్తికి 'మంచివాడు' అనే ముద్ర ఎలా వేస్తారో నాకు తెలీదు గానీ నాకు తెలిసీ 'మంచివాడు ' అనిపించుకోవాలంటే ఒకటే ఫార్ములా. "తన గురించి గొప్పలు చెప్పుకోకుండా, యితరుల గొడవల్లో తల దూర్చకుండా, అక్కడివి యిక్కడా, యిక్కడివి అక్కడా చెప్పకుండా ............ ఒక్క ముక్కలో చెప్పాలంటే తన చావు తను చచ్చేవాడు............ మంచివాడు." 

Thursday, 12 December 2013

నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను ఇష్టపడతాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను కోరుకుంటాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను ఆరాధిస్తాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను అనుమానిస్తాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను ద్వేషిస్తాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను అభిమానిస్తాను
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నీకోసం వేచియుంటా
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నీ సాన్నిత్యం కోరుకుంటా
ఎందుకంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను ప్రేమిస్తున్నా
ఎందుకంటే


Monday, 9 December 2013

కాస్త ఆగు మిత్రమా

అబ్బ పండెంత బాగుందో
కాస్త ఆగు మిత్రమా
దానికి రంగేసారు

అబ్బ యిల్లెంత బాగుందో
కాస్త ఆగు మిత్రమా
దానికి రంగేసారు

అబ్బ అతని కురులెంత నల్లగున్నయో
కాస్త ఆగు మిత్రమా
వాటికి రంగేసాడు

అబ్బ ఆమె ఎంత సుందరాంగో
కాస్త ఆగు మిత్రమా
ఆ యింతి ఊసెత్తితే
పడుతింది  మనకు రంగు

ఆ రంగేసుకున్న రంగనాధుడే
ఈ రంగసాని మగడు
యిక పదవోయీ సారంగు


Sunday, 8 December 2013

కొడకో

మా సొమ్ము మాకు పంచి
ప్రజా సేవ అంటవేందిరా కొడకో
నీ యబ్బ సొమ్మా?నీ యమ్మ సొమ్మా?
నీ అక్క సొమ్మా? నీ అత్త సొమ్మా?

మేమిచ్చిన కారు ఎక్కి మేమిచ్చిన బట్ట తొడిగి
మేమిచ్చిన డబ్బు మెక్కి మేమిచ్చిన పదవి నొక్కి
మా మీదే సవారీ చేస్తావేందిర కొడకో

ఓటు అడిగెటప్పుడు కాళ్ళు మొక్కినావురో
నోటులు మస్తుగ పంచి పూటుగ తాగించినావురో
ఆపైన.....
తాపం తీరినంక గుర్రుమనే కుక్కలల్లె
మీద పడి కరుస్తవేందిర కొడకో

తెల్ల బట్టలెయ్యగానె శాంతమూర్తివయ్యిపోవు
నమస్కారమెట్టి మాకు మస్కాలు కొట్టలేవు
అంబేద్కర్కి దండమెట్టి దళితుడవు అయ్యిపోవు
తురక టోపీ పెట్టగనె ముసల్మానువయ్యిపోవు

ఆడు బొక్కినాడని నీవంటవ్
నీవు మెక్కినావని ఆడంటడు
ఖాళీ అయ్యింది మాత్రం
నా యింటి బొక్కసమేరా కొడకో
నా కొంప ముంచినావురో కొడకో

Tuesday, 3 December 2013

థియేటరు కార్డు

 ప్రతీ ఒక్కరికీ మొదటి రోజు మొదటి ఆట చూడాలని ఉంటుంది. కానీ క్యూలో నించుని టికెట్ సంపాదించడం చాలా కష్టం. అలా అని బ్లాక్ లో కొనలేము. ఆస్తులు రాసిచ్చేయాలి. మరెలా? నా దగ్గర ఓ ఐడియా ఉంది. ATM లో డబ్బులు డ్రా చేయటానికి  డెబిట్ కార్డ్ ఉన్నట్టే థియేటరుకెళ్ళి సినిమా చూసేవారికోసం 'థియేటర్ కార్డ్' ఉండాలి. ఆంధ్ర ప్రదేశ్ లోని ఆ థియేటరు ఈ థియేటరు అని కాకుండా మనకిష్టమొచ్చిన థియేటరుకెళ్ళి సినిమా చూసే సదుపాయము ఉండే విధంగా 'థియేటరు కార్డు ' ని రూపొందిస్తే బాగుంటుందని నా అభిప్రాయము. అంటే ఏమీ లేదు. ఆన్ లైన్ విధనములో ఓ వెయ్యి రూపాయలిచ్చి ఈ థియేటరు కార్డుని కొనుక్కున్నామనుకోండి  ( అంటే మొబైల్ రీచార్జ్ చేసినట్టన్న మాట) ఆ మొత్తం అయిపోయేంతవరకూ మనకిష్టమొచ్చిన సినిమా థియేటరుకెళ్ళి సినిమాలు చూసేయొచ్చన్న మాట. మనతో పాటూ మన ఫ్యామిలీని మన ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్ళొచ్చు. హాలుకెళ్ళి ఈ కార్డు చూపిస్తే చాలు, మనము చెప్పినన్ని టికెట్లు యివ్వాలి - తద్వారా మన అక్కౌంటులోని డబ్బు కూడా తగ్గుతుంది. క్రొత్త సినిమాకి మాత్రం రేపు రిలీజ్ అనగా ఈరోజు వెళితే టికెట్లు యివ్వాలి. క్రొత్త సినిమాకి ఎక్కువ టికెట్లు ఇవ్వటానికి వీలు కాకపోతే ఓ వారం రోజుల పాటు రెండో మూడో టికెట్లకు పరిమితం చేస్తే సరిపోతుంది. మిగతా సినిమాలకి ఎన్నైనా యివ్వాలి. కార్డులో డబ్బులు అయిపోగానే మళ్ళీ రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పైకం పెట్టి కార్డు రీచార్జ్ చేసుకునే వారికి మొత్తం లో రిబేటు యివ్వటమో లేక రిలీజ్ సినిమాకి ఎక్కువ టికెట్లు యివ్వటమో చేయాలి. ఎలా ఉంది?

Sunday, 24 November 2013

బాగా బోర్ కొడుతోందా?

బాగా బోర్ కొడుతోందా? జీవితం నిస్సారంగా అనిపిస్తోందా? చిరాగ్గా ఉందా? ఏమీ తోచడం లేదా? అయితే ఈ క్రింద చెప్పిన వాటిలో మీకు నచ్చింది చేయండి.

ఏదైనా పార్కుకెళ్ళండి. వాకుంగు చేయటానికొచ్చే 'తాతారావు'లుంటారు. పది నిమిషాలు వాకింగు చేసి, ఓ రెండు గంటలు కూర్చొని  రాజకీయాలనించి సినిమాల దాక అన్ని విషయాలు తమకే తెలుసన్నట్టు అనర్గళంగా ఉపన్యాసం దంచేస్తుంటారు. అవి వింటే కాస్త బోర్ తగ్గచ్చేమో.

బాలేదా? అయితే రైల్వే స్టేషనుకెళ్ళండి.  ఖాళీగా ఉన్న ఓ బెంచీ మీద కూర్చొని ట్రైను ఎక్కే దిగే జనాల్ని గమనించండి. వీలుంటే ఓ టీటీ దగ్గరకెళ్ళి బెర్త్ యిమ్మని అడగండి. షరా మామూలుగా లేదనే చెప్తాడు. అయినా వదలకండి, బ్రతిమలాడండి. ఫ్యామిలీ తో వచ్చానని దీనంగా చెప్పండి. డబ్బులిస్తానని చెప్పండి. సరేనన్నాడనుకోండి ఫ్యామిలీని తీసుకొస్తానని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోండి.
అక్కడే సెండాఫివ్వటానికొచ్చే వాళ్ళు, వాళ్ళకి దూరమవుతున్న వాళ్ళ ఫీలింగ్సూ గమనించండి.  ట్రైను బయల్దేరేటప్పుడు వాళ్ళతో పాటూ మీరు కూడా వాళ్ళకి టాటా చెప్పండి. స్టేషనులోపలికి వెళ్ళేటపుడు ప్లాట్ ఫాం టికెట్ తీసుకోవటం మాత్రం మర్చిపోకండేం!  

Saturday, 16 November 2013

నో ఓట్......నో రేషన్

టు వేయకపోతే ప్రభుత్వ సబ్సిడీలు, మరే యితర ప్రభుత్వ ఫలాలు అనుభవించడానికి అర్హత కోల్పోతారు అనే ఓ నిబంధన పెడితే బాగుంటుంది కదా. చచ్చినట్టు అందరూ ఓటు వేస్తారు.

 

Friday, 15 November 2013

ఆడవారిని లైంగిక దాడుల నించి కాపాడే మార్గమేదైనా ఉందా?

ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి, సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో  కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు. మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ. 

వరైనా ఒక చిన్న పరికరాన్ని కనిపెడితే బాగుండును. అది ఎలాంటిదై ఉండాలంటే....... ఒక చేతిలో పట్టేంత ఉండాలి. పాకెట్ లో పట్టేంత ఉంటే మరీ బాగుంటుంది. ఆ పరికిరం కి ఒక బటనుండాలి. ఆ బటను నొక్కితే ఓ మూడు (3) కిలోమీటర్ల వరకు వినబడేంత గట్టిగా సౌండు రావాలి. దాన్ని క్రింద కొట్టినా లేక పగలగొట్టినా పగలనంత గట్టిదై ఉండాలి. కానీ ఆ శభ్డాన్ని ఆపాలంటే పోలీసు వాళ్ళు వచ్చి లాక్ ఓపెన్ చేస్తే తప్ప ఇంకెవరూ ఆపలేని పరిస్థితి ఉండాలి. ప్రతీ అమ్మాయీ, ప్రతీ మహిళ ఆ పరికరాన్ని తమ వెంట ఎప్పుడూ ఉంచుకోవాలి. ఎవరైనా వారి మీద లైంగిక దాడి చేయటానికి ప్రయత్నించినపుడు వారు వెంటనే ఈ పరికరము లోని బటన్ ని నొక్కాలి. వెంటనే అది గట్టిగా ఓ మూడు కిలోమీటర్లు వినబడేంత శబ్దం చేయాలి. దాడి చేయటానికి వచ్చిన వాడు ఆ పరికరాన్ని పగలకొట్టటానికి ప్రయత్నించినా పగలదు. దాంతో వాడు పలాయనం చిత్తగించాలి. ఆ శబ్డం విని చుట్టు ప్రక్కల వాళ్ళు అక్కడికి చేరుకోవాలి. ఆ అమ్మాయిని కాపాడాలి. దాని లాక్ మాత్రం పోలీసుల దగ్గరే ఉండాలి.
ఎవరైనా యిలాంటి పరికరం కనిపెడితే బాగుంటుంది కదా? నా ఈ కల ఎప్పటికైనా నెరవేరుతుందంటారా?

((నవంబరు 15 న నేను పెట్టిన పోస్టు యిది)  

యిది ఈ రోజు అంటే 23.11.2013 ఈనాడు పేపర్ లో ప్రచురించిన వార్త. ఆదలో ఉన్న మహిళకు రక్షణ 'నిర్భయ '. ECIL తయారు చేసిన పరికరం (పేరు నిర్భయ) ఆడవారిని లైంగిక దాడికి గురైనపుడు బటన్ నొక్కితే తన బంధువులకు, సన్నిహితులకు, పోలీసులకు వెంటనే సమాచారం చేరుతుంది. సరిగ్గా యిలాంటి పరికరాన్నే నేను సూచించింది. కాకపోతే ECIL కి నా సూచన ఏమిటంటే ఆ పరికరానికి నేను సూచించిన విధంగా మీట నొక్కితే సౌండ్ గట్టిగా వచ్చే విధంగా ఉంటే బాగుంటుంది. తద్వారా దాడి చేసే వాడు భయపడే అవకాశముంటుంది. ఏది ఏమైనా చాలా సంతోషంగా ఉంది ఓ పరికరాన్ని కనిపెట్టినందుకు.    

పరీక్ష హాళ్ళో చండశాశనున్ని...... క్లాసు రూములో మాత్రం నిమిత్తమాత్రున్ని



మీరేం చదివారు? బీటెక్ లేదా ఎమ్మెస్సీ లేదా డిగ్రీ లేదా C.A లేదా ఎంబీబీఎస్ వీటిలో ఏదో ఒకటి చదివే ఉంటారు కదూమీరు ఇవి చదివారంటే పదో తరగతి నుంచి చాలా పరీక్షలు వ్రాసే ఉంటారు. మీరొకసారి పరీక్షలు జరిగే పద్దతి గుర్తు తెచ్చుకోండిఅక్కడ అంటే ఆ పరీక్ష జరిగే చోట వాటిని నిర్వహించే వారి తీరుతెన్నులు ఎలా ఉంటాయో గుర్తు తెచ్చుకోండి.
ఒక్క నిమిషంకే.......లం ఒక్క నిమిషం ఆలస్యంగా వస్తే మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు. మీరు ఎంత బ్రతిమలాడినా, ఎంత బామాడినా సరే. ఏమాత్రం కనికరం చూపరు. ఒక వేళ మీరు సమయానికొచ్చినా పరీక్ష జరిగే కాలేజీకో, యూనివర్సిటీ లోకి ప్రవేశిస్తున్నప్పుడు మిమ్మల్ని వళ్ళంతా తడిమి పరీక్షిస్తారు ఏమైనా స్లిప్పులో చీటీలో తెచ్చారేమోనని. తతంగం అయిపోయిన తర్వాత లోపలికెళ్ళాక అంటే పరీక్ష జరిగే చోటికెళ్ళాక యిన్విజిలేటరొకాయన మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తాడు 'ఏదైనా చీటీలు గానీ స్లిప్పులు గానీ ఉంటే బయట పారేయండి లేకపోతే పట్టుకుంటే డీబార్ చేసేస్తామని'.

Thursday, 14 November 2013

చివరికి వాళ్ళే మనోడి కొంప ముంచుతారు

పేకాట ఆడుతున్నప్పుడు ఎవరైనా డ్రాప్ గానీ మిడిల్ డ్రాప్ చేస్తే వాళ్ళు తన ప్రక్కనున్న ఆటగాడికి హెల్ప్ చేస్తుంటారు కార్డ్ డిస్కార్డ్ చేయటములోనూ, ఆట తిప్పడములోనూ అతను తన ప్రత్యర్ధి అని తెలిసినా సరే.

Sunday, 10 November 2013

లేకపోతే కధ వ్రాయమంటావా?

మీరు ఎవరికైనా ఒక పేపెరూ పెన్నూ యిచ్చి వ్రాస్తుందో లేదో పరీక్షించమని చెప్పండి. నూటికి తొంభై ఐదు మంది తమ సంతకాలు పెట్టడమో లేక తమ పేరు వ్రాయటమో చేస్తారు. కావాలంటే యీసారి పరీక్షించండి.    

Wednesday, 6 November 2013

ఇంటింటా దీపావళి

మనమంతా దీపావళి టపాసుల కోసం వేలకి వేలు ఖర్చు పెట్టేస్తున్నామనీ, డబ్బుని కాల్చి తగలేస్తున్నామనీ, ఆ డబ్బుతో చాలా మంచి పనులు చేయొచ్చనీ యింటా బయట అందరూ అంటుంటారు. ఆ డబ్బుతో అనాధలకి తిండి పెట్టొచ్చనీ, బాలబాలికలకు బట్టలు కొనివ్వచ్చనీ, ఎంతో మంది నిరుపేదలకి వైద్య సహాయం చేయొచ్చనీ, యింకా యిలాంటివి చాలా మంచి పనులు చేయొచ్చని అంటారు. నిజమే. సంవత్సరానికి ఒక్కసారొచ్చే దీపావళి గురించి బాగానే చెపుతున్నారు. సంతోషం. మరి సంవత్సరమంతా జరుపుకొనే దీపావళి మాటేంటి? అవును. నేను చెప్పే దీపావళి 'సిగరెట్ స్మోకింగ్' గురించి. దీపావళి రోజున మహా అయితే ఓ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టామనుకుంటే ఈ సిగరెట్ స్మోకింగ్ చేసే వారికి ఆ ఖర్చు కేవలం నెల రోజులకే సరిపోతుంది.యింకా ఎక్కువ కూడా అవ్వొచ్చు. అంటే సంవత్సరానికి ఎంతవుతుందో ఆలోచించండి. అలా అని దీపావళి రోజున పెట్టే ఖర్చుని నేనేమీ సమర్ధించటం లేదు. కేవలం దీపావళి గురించి మాత్రమే విమర్శించేవాళ్ళు సిగరెట్ స్మోకింగ్ ని కూడా విమర్శిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు? 

Tuesday, 5 November 2013

మరి సమోసాలకి బదులు ఏమి అమ్మాలి?

ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి, సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో  కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు. మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ. 

కూల్ డ్రింక్స్ ఎక్కువ సేల్ అయ్యేది ఎక్కడో మీకు తెలుసా? గుర్తొచ్చిందా? అవును. సినిమా థియేటర్లలో. ఇంటెర్వెల్ టైములో కూల్ డ్రింక్ కి మొఖం వాచిపోయినట్టు తెగ తాగేస్తారు జనం. ఎగబడి ఎగబడీ మరీ కొనుక్కుంటారు. మామూలుగా బయట పద్నాలుగు రూపాయలుండే కూల్ డ్రింక్ అక్కడ మాత్రం యిరవై రూపాయలకు అమ్మినా ఏ మాత్రం ఖాతరు చేయరు.  కానీ ఈ కూల్ డ్రింకుల వలన ఆరోగ్యం పాడవటం తప్ప ఏ విధమైన ప్రయోజనమూ లేదు. అందుకని నాకొచ్చిన ఐడియా చెపుతాను. కూల్ డ్రింక్ స్థానం లో కొబ్బరి బొండాలు అమ్మితే ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యానికి ఆరోగ్యమూ, అమ్మకాలకి అమ్మకాలూ.  ఎలా ఉంది?  

Sunday, 3 November 2013

అంతా బ్లాకు మయం...ఈ జగమంతా బ్లాకు మయం

మీకొక చిన్న పరీక్ష. మన రాష్ట్రంలో సినిమా హాల్లో గానీ, రైల్వే స్టేషన్ లో గానీ, బస్ స్టేషన్ లో గానీ, ఒక కూల్ డ్రింక్ గానీ వాటర్ బాటిల్ గానీ కొనండి. ఆ బాటిల్ మీద ఉన్న అసలు  రేటుకి గానీ మీరు కొనగలిగితే మీరు చాలా అదృష్టవంతుల క్రిందే లెక్క. కానీ నా అభిప్రాయము ప్రకారము మీరు ఎట్టి పరిస్తితుల్లోనూ అదృష్టవంతులయ్యే అవకాశమే లేదు. బాటిల్ రేట్ కన్నా రెండ్రూపాయలో మూడ్రూపాయలో ఎక్కువ పెట్టి కొనాల్సిందే.పట్టించుకొనే నాధుడే లేడు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తారనే భయం కూడా లేదు. మీరు ఒకవేళ దాన్ని ప్రశ్నించినా మిమ్మల్ని ఓ వెర్రి వెధవలా చూస్తారు. గట్టిగా అడిగితే అవి పాత రేట్లంటారు. యివే కాదు. గోలీకాయలంత సైజు ఉండే మూడు సమోసాలు పది రూపాయలట. రెండు గరిటల క్వాంటిటీ ఉండే పాప్ కార్న్ పేకెట్ పదిహేను రూపాయలు. బయట న్యూస్ పేపెరు రేటు ఐదు రూపాయలుంటే అక్కడ ఆరు రూపాయలు.  చాలా దారుణమైన విషయమేమిటంటే మామూలు షాపుల్లో కూడా యిదే విధానాన్ని అమలు చేస్తున్నారు.  


Thursday, 31 October 2013

బస్సుల్లో రైళ్ళలో అగ్ని ప్రమాదాల్ని అరికట్టటమెలా?

యిప్పుడు బస్సుల్లోనూ రైళ్ళలోనూ అగ్ని ప్రమాదాలు జరగటం మామూలైపోయింది. మరి వీటిని అరికట్టటం ఎలా? చూస్తూ చూస్తూ వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోవటమేనా? మనమేమీ చేయలేమా? మీరు గమనించారో లేదో బస్సుల్లో గానీ రైళ్ళలో గానీ ఎక్కడా fire extinguishers ఉండవు. ఫస్ట్ ఎయిడ్ బాక్సులుంటాయి గానీ fire extingushers ఎక్కడా ఉన్నట్టు కనబడవు. అవే గనక ఉంటే నిన్న జరిగిన ప్రమాదం లో అన్ని ప్రాణాలు పోయేవి కాదేమో. కాబట్టి ప్రతీ బస్సులోను, రైలు లోని ప్రతీ భోగీలోను యివి ఉండే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము. ఏమంటారు? దాంతో పాటు యింకో చిన్న సూచన. యిప్పుడున్న బస్సుల్లోని రైల్లల్లని ఆటోమేటిక్ fire extinguishers ఉండేలా డిజైన్ చేస్తే బాగుంటుంది. అంటే మంట రాగానే ఆటోమేటిక్ గా fire extinguishers పని చేసేలా అన్న మాట. అది సాధ్యం కాకపోతే కనీసం డ్రైవర్ దగ్గరో లేక కండక్టరు దగ్గరో ఒక బటను ఉంచి దాన్ని నొక్కగానే fire extinguishers పని చేసేలా డిజైను చేయాలని నా అభిప్రాయము.
 

Monday, 28 October 2013

మనమింతే

బస్సులోనూ ట్రైనులోనూ ఎవరికీ కూర్చోవటానికి చోటివ్వం
కానీ మనకి చోటివ్వనప్పుడు మాత్రం అవతలివాడిని తెగ తిట్టుకుంటాం

సరదాగా అకేషనల్ గా అంటూ తాగేస్తాం
కానీ మందు బాబుల గురించి మాత్రం తెగ కామెంట్ చేస్తాం

అంటరానితనం గురించి తెగ లెక్చర్లు దంచేస్తాం
కానీ మన పిల్లల్నెవరినీ ఆ వైపుకి పోనివ్వం వాళ్ళతో పెళ్ళిల్లు చేయం

ఊరందరి దగ్గర వినయాలు ఒలకపోస్తాం అవమానాన్ని కూడా చిరునవ్వుతో భరిస్తాం
కానీ యింట్లోవాళ్ళ మీద బీపీలు పెంచుకుంటాం ఆవేశపడిపోతాం ఆయాసం తెచ్చుకుంటాం

Friday, 25 October 2013

శ్రావణి చెప్పిన ఓ బ్రష్షు కధ

                 
మయం ఉదయం పదకొండు గంటలు కావస్తోంది. అది అంబాజీపేట బస్ స్టేషన్. జనాలంతా 'రాజమండ్రి ' వెళ్ళే బస్ కోసం ఎదురు చూస్తున్నారు. పల్లెటూరే అయినా అటు అమలాపురం నుండి యిటు నరసాపురం నుండి  వచ్చే బస్సులన్నీ ఆ వూరు మీదుగా వెళతాయి కాబట్టి దాదాపు అన్ని బస్సులు ఆగుతాయి అక్కడ. స్కూళ్ళకి, కాలేజీలకి శెలవులిచ్చేయటం తో బస్సులన్నీ జనాలతో నిండిపోతున్నాయి. రాజమండ్రి వెళ్ళే బస్ రానే వచ్చింది. అది రావటమే పాపం పరుగు పందెంలో విజిల్ ఊదిన వెంటనే పరుగు ప్రారంభించే పరుగు వీరుల్లా జనాలు పొలోమని ఎక్కేసారు. రెండు నిమిషాల్లో బస్ కిక్కిరిసిపోయింది. బస్సు కదలటానికి రెడీగా ఉంది. 'శ్రావణీ' అన్న పిలుపుకి బస్సులోని వారంతా క్రిందకి చూసారు.

Monday, 21 October 2013

మీ బ్లాగు గురించి కాస్త...

మీ బ్లాగులు లేదా మీకు తెలిసిన బ్లాగుల గురించి వివరిస్తూ నా బ్లాగుకి పంపండి. యీ క్రిందనున్న 'కామెంట్' బటన్ ని నొక్కి అందులో బ్లాగుని గురించిన వివరాలు, విశేషాలు రెండు లైన్లలో వ్రాయండి. 

Saturday, 19 October 2013

పెళ్ళిలో ఈ భాగాన్ని మీకు సమర్పిస్తున్న వారూ....

శుభలేఖ లో ఏముంటుంది? ఏముంటుంది? ఫెండ్లి కొడుకి వివరాలు, పెండ్లి కూతురి వివరాలు, పెండ్లి ఫలానా రోజు, విందు వివరాలు, యివే కదా అంటారా? నిజమే. యివే ఉంటాయి. ఆ కార్డులో చాలా భాగము ఖాళీగా ఉంటుంది కదా. ఆ ప్లేస్ లో యాడ్స్ ఉంటే ఎలా ఉంటుదంటారు?   పెళ్ళికి చాలా ఖర్చు అవుతుంది కదా? కొంతైనా యాడ్స్ ద్వారా భారం తగ్గొచ్చేమో? ఆలోచించండి. చీ. పవిత్రమైన పెండ్లి శుభలేఖ లో యాడ్స్ ఏమిటంటారా? ఏమో మరి. నాకు అలా అనిపించింది. యిప్పుడు కాకపోయినా భవిష్యత్ లో యిలాంటివి జరగొచ్చేమోనని నా అభిప్రాయం. (నాకు గనక యిప్పుడు పెండ్లి జరుగుంటే శుభలేఖ లో తప్పకుండా నా బ్లాగ్ గురించి నేనే ఒక యాడ్ వేసుకునేవాడినేమో!)      

Friday, 18 October 2013

చూడూ....ఒక వైపే చూడూ...

మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారనుకోండి. ఎదురుగా మీకు తెలిసిన వాడో లేక స్నేహితుడో వస్తున్నాడనుకోండి. అతను మీ వైపుకి కాకుండా వేరే వైపుకి అంటే మీకు విరుద్ధమైన వైపుకి తీక్షణంగా చూస్తూ వెళ్ళిపోతున్నాడనుకోండి. ఖచ్చితంగా అతను మిమ్మల్ని చూసాడని అర్ధం. మిమ్మల్ని avoid చేయటానికే యింకో వైపుకి చూస్తున్నాడని అర్ధం. కావాలంటే యీసారి పరీక్షించుకోండి చూద్దాం.   

Friday, 4 October 2013

లాంగ్వేజీ ప్రాబ్లెమా?


"ఫలానా సినిమా భలే ఉందిరా. పది సార్లు చూశాను యిప్పటికి"
 "అదేం? అర్ధం కాలేదా?"

Wednesday, 2 October 2013

చిల్లర మనుషులు

సరిగ్గా తోలత్ స్కూల్ దగ్గరకొచ్చేసరికి పెట్రోల్ అయిపోయింది. నాకిది మామూలే. ఒక లీటరో, యాభై రూపాయలకో పెట్రోల్ కొట్టించటం సరిగ్గా పెట్రోల్ బంక్ కి కిలోమీటరు దూరం లో ఆగిపోవటం. మరీ బొటాబొటిగా కొట్టించుకోకపోతే కాస్త ఎక్కువ కొట్టించుకోవచ్చు కదా అంటుంది మా ఆవిడ. అప్పుడు తలకెక్కదు. యిదిగో యిలాంటి టైము లో అనిపిస్తుంది. చోక్ యిచ్చి కాస్త దూరం లాగించాను. అది కూడా మార్కెట్ యార్డ్ దగ్గరకొచ్చేసరికి యిక మొరాయించింది. చేసేదేముంది.

Saturday, 28 September 2013

పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్

మీరొక బస్సులో (పాసింజర్ బస్ అనుకోండి) వెళుతున్నరనుకోండి. దారిలో జనాలు బస్ ఆపారనుకోండి. వారంతా బస్ లోపలికి ఎక్కేటప్పుడు అంటే బస్ లోపలికి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తారు ఒక రకమైన సిగ్గుతో. కావాలంటే ఈ సారి గమనించండి.

వానా వానా

వర్షం వస్తుందని తెలిసినా చేతులు బయట పెట్టి చూసుకుంటాం వర్షం వస్తుందో లేదో అని.

Thursday, 26 September 2013

నీ దిక్కున్న చోట చెప్పుకో

నమస్తే మీరు చూస్తున్నది టీవీ నైంటీ.  నా పేరు తృప్తి వాజ్ పాయ్. ముందుగా హెడ్ లైన్స్.
"విడుదలైన అన్ని సెంటర్లలోనూ దుమ్ము దులిపేస్తున్న "నీ దిక్కున్న చోట చెప్పుకోరా బాడ్ ఖవ్".
"గత తెలుగు సినిమా రికార్డులని తిరగరాస్తున్న "నీ దిక్కున్న చోట చెప్పుకోరా బాడ్ ఖవ్".
"సినిమా సూపర్ హిట్ తో పండగ చేసుకుంటున్న అభిమానులు"
"రేపు రాష్ట్రానికి రానున్న అధిష్టానం ప్రత్యేక దూత. ఘన స్వాగతం పలకటానికి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం"
"అనేక మలుపులు తిరుగుతున్న హీరొయిన్ అప్రాచీ అగర్వాల్ విడాకుల కేసు"
"గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోన్న ఆ ఊరి శునకం. ఆ వింతని చూడటానికి తండోపతండాలుగా తరలి వస్తున్న అశేష జనం"
"సక్సెస్ అయిన అగ్ని-6 పరీక్ష" 
యిక వివరాల్లోకొస్తే అతడొక నిప్పు ఖనిక. ఆయన పేరు చెపితే ప్రత్యర్దుల గుండెల్లో 'మెట్రో రైళ్ళు' పరిగెడతాయి. అతని ఆకారాన్ని ముందు నించి చూస్తే వెనకవైపుకు పారిపోతారు. ఆయన మొహం లో మొహం పెట్టి చూస్తే డెంగ్యూ జ్వరం వచ్చేస్తుంది. ఆయన నిటారుగా నడిస్తే నిలువెల్లా దహించుకుపోతారు.  ఆయన మరెవరో కాదు మన యుగాస్టార్ కామేష్ (అసలు పేరు కామరాజు). ఆయన నటించిన "నీ దిక్కున్న చోట చెప్పుకోరా బాడ్ ఖవ్" సినిమా ఈ రోజు విడుదలైన అన్ని సెంటర్లలోనూ రికార్డులని తిరగరాస్తోంది ఆ సినిమా గురించి మన హీరో గారితో ముచ్చటిద్దాం.  నమస్తే సార్. వెల్ కం టూ అవర్ స్టుడియో. "చెప్పండి ఎలా ఫీలవుతున్నారు? ఈ విజయాన్ని ఎలా అస్వాదిస్తున్నారు?" అడిగింది ఏంకరు.   
ఎదురుగా కూర్చున్న హీరో కామేష్ చిద్విలాసంగా చూస్తూ "చాలా హాప్పీ గా ఫీల్ అవుతున్నానండీ. ఈ సినిమాని యింత హిట్ చేసినందుకు అఖిలాంధ్ర ప్రేక్షకులకి నా..... అ బె ద బా దె బా.... .....
"హృదయపూర్వక" అందించింది ఏంకరు 
"ఆ ఆ అదే హృదయపూర్వక కృతఙ్నతలు తెలుపుకుంటున్నాను. ఈ విజయం నాది కాదు. అఖిలాంధ్ర ప్రేక్షకులది మరియు నా అభిమానులది" అన్నాడు హీరో.      
"నీ దిక్కున్న పేరు చోట చెప్పుకోరా బాడ్ ఖవ్ అని ప్రత్యర్ధులని ఉద్దేశ్యించి యింత పవర్ ఫుల్ గా సవాల్ చేయటం అన్నది ఈ మధ్య కాలం లో లేదు. అయ్ బాబోయ్ మీరు యిలా బెదిరిస్తే వాళ్ళు ఎక్కడికి వెళతారు? ఎక్కడ చెప్పుకుంటారు? హిహిహి.....సరే....అసలు ఈ సినిమాకి యింత పవర్ ఫుల్ పేరు పెట్టాలన్న అలోచన ఎవరికొచ్చింది? ఎలా వచ్చింది? నాకు తెలిసి యిలాంటి ఐడియాలు మీకు తప్ప ఎవరికీ రావు. ఏం ఐ రైట్ సార్?" హింట్ ఇచ్చింది ఏంకరు.     
"అవునండీ ఇది నా ఆలోచన లోంచి పుట్టుకొచ్చిందే. కాకపోతే దీని వెనకాల చిన్న తమాషా విషయం ఒకటుంది......"
"వావ్! మన హీరో గారు ఇప్పటి వరకు ఎక్కడా ప్రస్తావించని పేరు వెనకాల రహస్యాన్ని మనకి ఫస్ట్ టైము చెప్పబోతున్నారు. అఖిలాంధ్ర ప్రేక్షకులకి మొట్టమొదటి సారిగా ఈ విషయాన్ని మీ ముందుకు తెస్తోంది టీవీ నైంటీ. చెప్పండి సార్. మా ప్రేక్షకులని యింక ఏమాత్రం టెన్షనుని గురి  చేయకుండా".

Tuesday, 24 September 2013

న్యూ జెమినీ సర్కస్



యిప్పుడు చాలా సర్కస్ కంపెనీలు మూతపడిపోయాయి. కారణం జనాదరణ లేకపోవటం. కానీ సర్కస్ అనేది మరో రూపం లో ప్రేక్షకులను కనువిందు చేస్తూనే ఉంది. అవును. యిప్పుడు తెలుగు టీవీ లో రియాలిటీ షో పేరుతో సర్కస్ లేని లోటుని తీరుస్తున్నాయి. కాబట్టే ప్రేక్షకులు సర్కస్ ని మర్చిపోయారు. మీరు గమనించారో లేదో యిప్పుడొస్తున్న అన్ని రియాలిటీ షో లో కామన్ పాయింటు ఏంటంటే అన్ని షోల్లోను ఏంకర్లు, సీరియల్ నటిస్తోన్న నటీనటులు మాత్రమే ఉండటం. దాదాపు అన్ని షోల్లోను ఒకటే మేటరు. వాళ్ళల్లో వాళ్ళే పిచ్చి పిచ్చి ఆటలు ఆడేసుకోవటం క్యాష్ ప్రైజులిచ్చేసుకోవటం. అన్ని టీవీల్లోనూ అదే తంతు. అన్ని టీవీళ్ళోను అవే మొహాలు. ఒకరోజు ఒక టీవీలో మరొక రోజు ఇంకొక టీవీలో. యింకెన్నాళ్ళు భరించాలో వీటిని ?!.      

        

Monday, 23 September 2013

మంచి-చెడు

ఈ లోకం లో చిన్న కులమూ, పెద్ద కులమూ, మంచి కులమూ, చెడ్డ కులమూ అంటూ ఉండవు. మంచీ, చెడూ, గొప్పతనము అన్నవి మనుష్యుల్లో మాత్రమే ఉంటాయి, కులాల్లో కాదు. 


భాష నేర్చుకుందాం రండి



ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి, సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో  కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు. మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ. 
  
మీకు ఎన్ని భాషలొచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీషు. అంతే కదా? చాలా కొద్ది మందికి మాత్రమే యింకో భాష తెలిసే అవకాశముంది. మీరు గానీ మన పక్క రాష్ట్రాలైన తమిళనాడుకో, కర్ణాటకకో వెళితే నోరెళ్ళబెట్టాల్సిందే. నా సూచన ఏంటంటే యిప్పుడున్న స్కూల్స్ లో తమిళం, కన్నడ, మలయాళ భాషలని ప్రాధమిక విద్యా స్థాయి నించే ప్రవేశపెట్టాలి. పిల్లలకి ఏదో ఒక భాషని ఎంచుకొనే స్వేచ్చనివ్వాలి. ఒక సంవత్సరము ఒక భాషని నేర్చుకోవటం మొదలెడతాడు. అతను కావాలనుకుంటే తర్వాతి సంవత్సరము కూడా అదే భాషని కొనసాగిస్తాడు లేదా యింకో భాషని ఎంచుకొనే అవకాశమివ్వాలి. కానీ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి లోపు కనీసం రెండు భాషలనైనా నేర్చుకోవాలనే నిబంధనని పెట్టాలి. తద్వారా అతని విద్యా సంవత్సరాలలో చాలా భాషలు నేర్చుకొనే అవకాశము లభిస్తుంది. ఆ భాషలకి మార్కులు కూడా అదనంగా యిచ్చి ప్రోత్సహించాలి.  ఎలా ఉంది ఐడియా?   

ఎగ్ స్ట్రా షో



ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి, సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో  కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు. మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ. 
    
యిప్పుడు ఆంధ్రప్రదెశమంతా సింగిల్ థియేటరులో రోజుకి నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శితమవుతున్నాయి. 5 ఆటలు ప్రదర్శిస్తే నష్టమేంటి? ఆ షో ని మార్నింగ్ షో కి ముందు అంటే 8.45 కి వేస్తే సరిపోతుంది. దాని వలన బయట చాల వరకు ట్రాఫిక్ తగ్గుతుంది. పైగా కొత్త సినిమాలకి ఎంతో లాభం. షోస్ పెరుగుతాయి కూడా. కానీ నా సూచన ఏంటంటే ఆ షో కి మాత్రం తక్కువ రేట్ కే టికెట్ అమ్మాలి. అంటే 10,15,20 రూపాయలకి అన్నమాట. దాని వలన సామాన్య ప్రెక్షకుడు సినిమా థియేటర్ కి  దూరమవకుండా ఉంటాడు. ఆ రేట్ కి అమ్మటం నష్టమంటారా? అవసరమైతే ఆ షో కి A.C ని తీసేసి షో వేస్తే సరి. ఖర్చు మిగులుతుంది.       

ఆ నేల కావాలా నేలా?



ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి, సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో  కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు. మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ. 
  
మీరు ఎప్పుడైనా 'నేల ' అంటే క్రింది తరగతి టికెట్ కొనుక్కొని సినిమా చూసారా? చూస్తే తెలుస్తుంది ఆ మూడు గంటలు ఎంత యిబ్బంది పడతామో. హౌస్ ఫుల్ అయినప్పుడు సరే. కానీ సినిమా ఖాళీ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళని అక్కడే కూర్చోబెట్టే బదులు దాని తర్వాత క్లాస్ అంటే 'బెంచీ లో కూర్చోనివ్వచ్చు కదా? సీట్లని  ఖాళీ గా ఉంచే బదులు వారిని అందులో కూర్చోవటానికి అనుమతించచ్చు కదా? ఆలోచించండి.

ఆల్ షోస్ హౌస్ ఫుల్లే



ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి, సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో  కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు. మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ. 
   
కొత్త సినిమా రిలీజయ్యిందంటే సినిమా ప్రియులందరికీ ఒకటే ఆలోచన. ఎలాగైనా ఆ సినిమాని మొదటి రోజో, రెండో రోజో చూసేయాలని. కానీ ఆ రెండు మూడు రోజుల్లో థియేటర్ కి వెళ్ళామంటే భయపడాల్సిన పరిస్థితి. కారణం 'బ్లాక్'. అవును ఆ వారమంతా మనము సినిమా చూడాలంటే తప్పనిసరిగా బ్లాక్ లో కొనుక్కుని చూడాల్సిందే. ఎందుకంటే సాధారణంగా అన్ని థియేటర్లు టికెట్లని బ్లాక్ లో అమ్మేసుకంటాయి కాబట్టి. యిది బహిరంగ రహస్యమే. దీన్ని అరికట్టటమెలా? యిప్పుడు రిలీజయ్యే అన్ని సినిమాల టార్గెట్టు మొదటి వారపు కల్లెక్షన్ల మీదే. నేను చెప్పేదేంటంటే ఆ వారము టికెట్లని అడ్వాన్స్ గా ముందే అమ్మేయాలి. అది చాలా చోట్ల జరిగేదే కదా అంటారా? అమ్మినట్టు మనకి బోర్డ్ మీద చూపెడతారు. కానీ నిజానికి ఆ టికెట్లని విక్రయించేది బ్లాక్ మార్కెటీర్లకే. అవే టికెట్లని మమూలు ప్రేక్షకులకే బ్లాకులో అమ్మితే? అంటే నిజంగా బ్లాకులో అమ్మమని కాదు. ఒక టికెట్టుకి యింకో టికెట్టుని అదనంగా చేర్చి అమ్మడమన్నమాట. అంటే మీరు మొదటి రోజు సినిమా చూడాలంటే మీరు అదే సినిమాకి ఏడవ రోజు  ఏదైనా షో టికెట్టు కొనుక్కోవాలన్నమాట. రెండో రోజుకి కూడా యిదే పద్దతి. అంటే మూడు రోజుల టికెట్లు అమ్మగలిగితే వారం రోజులు 'హౌస్ ఫుల్ అన్నమాట. ఎలా ఉంది?

'సాధారణ' కష్టాలు



ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి, సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో  కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు. మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ. 
  
యిది రైలు ప్రయాణం గురించి. రోజూ కొన్ని లక్షల మంది రైల్లో ప్రయాణం చేస్తుంటారు. నేను యిప్పుడు చెప్పబోయేది A.C, స్లీపర్ లాంటి రిజర్వేషన్ ప్రయాణికుల గురించి కాదు. 'సాధారణ’ అంటే 'జనరల్ ' కోటా లో ప్రయాణం చేసే వాళ్ళ గురించి. 'జనరల్ ' భోగీల్లో ప్రయాణం ఎంత నరకంగా ఉంటుందో అది ప్రయాణించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. యిప్పుడు నేను చెప్పేది శాశ్వత పరిష్కారం కాదు కానీ కొంత ఉపశమనం ఉంటుందేమో అలోచించండి. అదేంటంటే యిప్పుడున్న 'జనరల్ ' భోగీలకి కూడా రిజర్వేషన్ సిస్టం పెట్టాలి దానికి అదనంగా ఏమీ వసూలు చేయకుండానే. దాని వలన దూర ప్రయాణం చేసేవారికి కాస్త ఉపయోగకరంగా ఉంటుంది కదా. మరి మిగతా ప్రయాణికుల మాటేంటి? వస్తున్నా. 'జనరల్ ' భోగీ లో ప్రయాణం చేసేవారిలో కూడా తక్కువ దూరం ప్రయాణం చేసేవారుంటారు. వాళ్ళ కోసం 'జనరల్ '  భోగీ ని ఒక దాన్ని కేటాయించాలి. ఆ భోగీలో ఎక్కువ మంది నుంచునేటట్టుగా ఉండాలి. సీట్లు అన్నీ భోగీ కి ఒక సైడులో ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే లోకల్ ట్రైను లో ఉన్నట్టన్న మాట. దూరం ప్రయాణం చేసేవాళ్ళకోసం ఒక భోగీ, దగ్గర ప్రయాణం చేసేవాళ్ళ కోసం యిలాంటి భోగీ. ఎలా ఉంది? అంతే కాదు యింకో సూచన. 'జనరల్ '  టికెట్లు రైల్వే స్టేషను లోనే ఎందుకివ్వాలి? ట్రైను లో కూడా యివ్వొచ్చు కదా? రైల్వే స్టెషన్ లో గంటల తరబడి నించొని టెన్షను పడే బదులు ట్రైను లోనే టికెట్లు యిస్తే ఈ బాధ తప్పుతుంది కదా? దాని వలన టికెట్ లేకుండా ప్రయాణించే వారిని అరికట్టొచ్చు కదా? రైల్వే కి బోలెడు లాభాలు కదా? ఆలోచించండి. 

నీరు-మీరు



ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి, సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో  కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు. మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ. 
  
నీరు. అది లేకపోతే మనము లేము. కానీ మన అవసరాలకి తగినంత నీరు దొరకటం లేదిప్పుడు. యిప్పుడున్న జనాభాకి తగినంత నీటి లభ్యత లేక చాలా యిబ్బందులు పడుతున్నము. మనకి అవసరమైన నదీ జలాలు తక్కువ పరిణామము లో ఉంటే సముద్రపు నీరు మాత్రం చాలా ఉంది. కానీ మనము దానిని వాడే పరిస్థితి లో లేము. ఎందుకంటే అది ఉప్పు నీరు కాబట్టి. నిజమే. ఉప్పు నీరుని తాగలేము, ఆ నీటితో పంట పండించలేము, బట్టలుతకలేము. కానీ ఒకే ఒక అవసరానికి ఈ నీరు ఉపయోగపడుతుందేమో అలోచించండి. అదేంటంటారా? రోజూ యిళ్ళల్లో, ట్రైనుల్లో, హోటల్లల్లో, సినిమా హల్లల్లో టాయిలెట్స్ కి ఈ ఉప్పు నీటిని ఉపయోగించచ్చేమో? అంటే టాయిలెట్స్ కి, లేవట్రీలకి "ఫ్లష్' చేయటానికి ఈ నీటిని వాడితే మామూలు నీటిని చాలా వరకు ఆదా చేయొచ్చేమో కదా?. నేను చెప్పేది కేవలం 'ఫ్లష్' చేయుట కొరకు మాత్రమే సుమా. మరి ఉప్పు నీటి వలన ఆ సంబంధిత పరికరాలు దెబ్బ తింటాయంటారా? మనసుంటే మార్గముంటుంది కదండీ. ఆ పరికరాలని ఉప్పు నీటికి తగ్గట్టుగా డిజైనుని మలచుకుంటే సరిపోతుంది. ఉప్పు నీటిని స్వచ్చమైన నీరు కింద మార్చాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ ఆ నీటిని ఈ అవసరాలకి వాడుకోవటానికి ఎటువంటి ఫిల్టర్ చేయనవసరం లేకుండా వాడుకోవచ్చని నా అభిప్రాయము.

కులం డాట్ కాం



చేతకానివాడు మాత్రమే తన గురించి కాకుండా తన 'కులం' గురించి మాట్లాడతాడు, అవతలి వాడి 'కులం' గురించి ఆరా తీస్తాడు.

  

ఏ టాబ్లెట్ వేసుకోవాలి మరి?

ఈ ప్రపంచంలో H.I.V, కేన్సర్ కన్నా భయంకరమైన జబ్బు ఒకటుంది. దాని పేరు "మొహమాటం"

Sunday, 22 September 2013

లోకం తీరు

మన ప్రమేయం ఏమీ లేకపోయినా ఒక్కొక్కసారి లోకం దృష్టిలో 'మంచివాడుగానో' లేదా 'చెడ్డవాడుగానో' గా ముద్ర పడిపోతాం.


ష్యూరిటీ పెట్టటం కూడా

అప్పు తీసుకోవటం కన్నా దరిద్రమైన విషయం "అప్పు యివ్వటం".


Saturday, 21 September 2013

మీరా భజన్ సంఘం & కో

అదొక సినిమా ఆడియో ఫంక్షను. ఓ పెద్ద ఫంక్షను హాల్ లో జరుగుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ పేరున్న నటుడి సినిమా అది. చాలా పెద్ద సంఖ్యలో అతని అభిమానులు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చారు. అతను యింకా ఆ ఫంక్షను కి రాలేదు. ఈ లోపులో సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో కొన్ని సర్కస్ ఫీట్లు జరిగాయి. మధ్య మధ్యలో యాంకరు 'సంధ్యాబాను ' ఆ హీరో గారి గురించి ఊదరగొట్టేస్తోంది. ఆయన ఏదో ఆకాశం నుండి అమాంతం భూమి మీదకి ఊడిపడినట్టు తెగ మోసేస్తోంది. 'వచేస్తున్నారు. మన ............ స్టార్ ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తున్నారు అని అప్పటికి ఓ గంట నుండి చెపుతోంది. చివరికి రానే వచ్చాడు మన హీరో గారు. వస్తూనే జనాలందరికీ చేతులూపుతూ అభివాదం చేసారు. 'ఓ' అని గట్టిగా కేరింతలు కొట్టారు. హీరో గారు వచ్చాక కూడా ఆడియో ఫంక్షను ప్రారంభం కాలేదు. ఆయన గారు నటించిన కొన్ని సినిమాల్లోని పాటలకి డాన్సులు గట్రా చేసారు కొంతమంది. అవి చూస్తున్న హీరో గారు కూడా ఉత్సాహంగా ఆ పాటకి తగ్గట్టుగా లిప్ మూమెంట్స్ యిచ్చాడు. అంతే. ఆ ప్రోగ్రాం ని కవర్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ కి వళ్ళు పులకరించింది. వెంటనే కెమేరాని అతని ముందు పెట్టేశాడు. కెమెరాని చూసిన మన హీరో గారు మరింత రెచ్చిపోయి ఊగిపోతూ పాడేసాడు. హీరొయిన్ ఆల్రెడీ వచ్చింది అక్కడికి. డైరెక్ట్ గా బోంబే నుండి దిగుమతయ్యింది ఆమె. గత ఐదు సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో నటిస్తున్నా తెలుగు ఒక్క ముక్క కూడా రాదు పాపం.  ప్రోగ్రాం ని మంచి ఉల్లాసంగా చూస్తోంది. మధ్య మధ్యలో తన జుట్టుని చెవుల మీదకి సరి చేసుకుంటూ. సరే. కాసేపటికి అసలు తంతు మొదలయ్యింది. వేదిక మీదకి ఒక్కక్కరినే ఆహ్వానిస్తున్నారు. హీరోని వేదిక మీదకి పిలవగానే బ్రహ్మాండం బద్దలయినట్టు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు అభిమానులు. తర్వాత హీరొయిన్ ని కూడా పిలిచారు. మళ్ళీ అవే ఈలలు, కేకలు. యింకా అందులో నటించిన నటీ నటులు కొంత మంది స్టేజెక్కారు. ఆ హీరో, ఒకరిద్దరు కమెడియన్లు తప్ప తప్ప అందులో నటించిన మిగతా అందరూ పరభాషా నటులే. తర్వాత నిర్మాత కూడ స్టేజు మీదకొచ్చాడు. చివరాఖరిగా ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా స్టేజు ఎక్కాడు. అతనికి పెద్ద ప్రాధాన్యమీయలేదనుకొండి. వెళ్ళి ఓ మూలన నుంచొన్నాడు. ముందుగా నిర్మాతకి మైకిచ్చారు. దాదాపు ఏడ్చినంత పని చేసాడు. ఎందునంటారా? ఆ హీరో గారు ఎంతో కోపరేషనిచ్చారంట. తన సొంత సినిమాలా భావించి సినిమా చేసాడంట. యిలా మొత్తం హీరో గారి భజన చేస్తూ ప్రసంగం ముగించాడు. ఆడియో ఫంక్షను అయినా ఎక్కడా సంగీత దర్శకుడి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. తర్వాత అందులో నటించిన కమెడియన్లు, సహ నటులు అందరూ మాట్లాడారు. అందరూ హీరో గారి భజనే. ఎక్కడా సంగీత దర్శకుడి ఊసు లేదు. తర్వాత వంతు హీరో గారిది. ఆయన మొదలెట్టక ముందే జానాలంతా పిచ్చి కేకలేసి తెగ గోల చేసారు. అందరినీ చిద్విలాసంగా చూస్తూ ప్రసంగం మొదలు పెట్టాడు. మొత్తం ప్రసంగమంతా తన స్వభజన చుట్టూ సాగింది. చివరిగా హీరొయిన్ వంతు వచ్చింది. హీరోయిన్ మైకు తీసుకోగానే జనాలు మళ్ళీ గోల చేసారు. హీరోయిన్ మాట్లాడుతూ "అన్....ద......రికీ......నమ...ష్కారం" అంది. అంతే. జనాలు పిచ్చెక్కిపోయారు. చొక్కాలు చింపుకున్నంత పని చేసారు. హీరోయిన్ ఇంకా కొనసాగిస్తూ "బా...గున్న...రా" అంది. తట్టుకోలేక ఏడవటం మొదలెట్టారు అభిమానులు. వాళ్ళని మరింత ఏడ్పించటానికన్నట్లు వాళ్ళ మీదకొ ఓ ఫ్లైయింగ్ కిస్సొకటి విసిరింది. అంతే.... తమ జన్మ ధన్యమయినట్లు ఫీలయ్యారు అబిమానులు. 
తెలుగు ప్రేక్షకులకి జిందాబాద్.   

Friday, 20 September 2013

ముష్టియా

మీరెవరో తెలియకపోయినా, మీరెలాంటివారైనా, మీరు పలకరించినా పలకరించకపోయినా, మిమ్మల్ని పలకరించే వాడొకడున్నాడు. వాడే "బిక్షగాడు". అడుక్కునేవాడు, ముష్టివాడు ఇలా బోలెడు ముద్దు పేర్లు ఉన్నాయతనికి. సరే ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ఈ అడుక్కోవటం అనేది మారుతున్న టెక్నాలజీ లానే అది కూడా మారిపోయింది. వాళ్ళు కూడా తమ పంధాని మార్చుకున్నారు. ముసలివారు, వికలాంగులని మినహాయిస్తే చాలా మంది ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా అడుక్కోవటం మొదలెట్టారు. ట్రైనుళ్ళో చిన్న చిన్న అమ్మాయిలకి పెళ్ళికూతురు అలంకారము చేసి అడుక్కోవటం, అనాధ పిల్లలకి డొనేషను కావాలంటూ అడుక్కోవటం లాంటివి కాకుండా కొత్త తరహా అడుక్కోవటం మొదలయ్యింది. కొన్ని రోజుల క్రిందట దేవీ చౌక్ లో ఏదో కొంటుండగా ఒకతన్ను నా దగ్గరకొచ్చి "ఆప్ కో హిందీ మాలూం హై?" అని అన్నాడు. అతనితో పాటు అతని వెనకాల అతని భార్య అనుకుంటా ఒక పిల్లాడిని చేతిలో ఎత్తుకుని ఉంది. నా వచ్చీ రాని హిందీ టేలెంట్ ని అతని దగ్గర చూపిద్దామని "హా బొలో" అన్నాను ఉత్సాహంగా. అప్పుడు మొదలెట్టాడు 'వాళ్ళంతా ట్రైన్ లో వెళుతుండగా ఎవరో డబ్బులు కొట్టేసారని, చేతిలో డబ్బులు లేకపోవటముతో యిక్కడే ఉండిపోయామనీ, ఏదైనా సహాయం చేయమని చెప్పుకొచ్చాడు. సరే ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని ఓ పది రూపాయలు అతనికిచ్చాను. కానీ అతను నన్ను వదిలిపెట్టలేదు. యింకా యిమ్మని పట్టుకున్నాడు. అతన్ని వదిలించుకొనేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్ళకు మళ్ళీ ఇలాంటి బ్యాచ్ ఒకటి తగిలింది. అందులొ ఒకడు షరా మామూలుగా నా దగ్గరకొచ్చి "ఆప్ కో హిందీ మాలూం హై?" అని అడిగాడు. దానికి నేనిచ్చిన సమాధానం విని అతను షాక్ కి గురయ్యాడు. నేనేం చెప్పానో ఈ ఆర్టికల్ చివరలో చదవండి.        

నేను ఉద్యోగం లో చేరిన కొత్తలో ఓ కుర్రాడు వచ్చాడు మా ఆఫీసుకి. చాలా నీట్ గా యిన్ షర్ట్ చేసుకొని ఉన్నాడు. వచ్చిన వెంటనే చెప్పాడు తాను AMIE ప్రైవేట్ గా చదువుతున్నాననీ, ఫలానా సార్ దగ్గర ట్యూషను చెప్పించుకుంటున్నాననీ, ఆర్ధిక స్తోమత లేకపోవటం వలన ఫీజులకి, పుస్తకాలకి డబ్బులు సరిపోవటం లేదనీ ధన సహాయం చేయమని ప్రాధేయపడ్డాడు. అసలే IETE చేస్తూ మధ్యలో మానేసిన నాకు ఆ అబ్బాయిని చూస్తే చాలా జాలేసింది. అందరి కంటే ఎక్కువ 'చదివించాను' కూడా. మొత్తానికి ఆ రోజు మంచి కల్లెక్షనుకింగు లా వెళ్ళాడు అతను. ఇది నల్గొండ లో ఉన్నప్పుడు జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు రాజమండ్రికి ట్రాన్స్ ఫర్ మీద రావటం జరిగింది. రాజమండ్రి లో ఉండగా ఓ పది రోజులు గుంటూరు కి డిపార్ట్ మెంట్ పని మీద వెళ్ళల్సొచ్చింది. అక్కడ పని చేస్తుండగా మళ్ళీ ఈ కలెక్షను కింగు అక్కడికి వచ్చాడు. అతడిని చూసి ఆశ్చర్యపోయా. మళ్ళీ అదే గెటప్. మళ్ళీ అందరి దగ్గరికొచ్చి అదే స్టోరీ వినిపిస్తున్నాడు. ఈ సారి గుంటూరు లోని ఓ సారు పేరు చెప్పాడు. కధ మామూలే. మామూలుగా అయితే అర్ధ రూపాయి కూడ ఖర్చు పెట్టని వాడు కూడా 50 రూపాయలు, 100 రూపాయలు రాయటం నాకు భలే ఆశ్చర్యమేసింది. అందరూ  అయిపోయాక నా దగ్గరకొచ్చాడు. నన్ను చూసిన వెంటనే కొంచెం ఖంగారు పడినట్టు అతని మొహము చెపుతోంది. అయిన దాన్ని కప్పిపుంచుకొని పేపర్ నా దగ్గర పెట్టాడు. నేను అతనిని అడిగాను "ఐదు యేండ్ల క్రితం నల్గొండ లో ఇదే విధంగా చెప్పి డబ్బులు తీసుకున్నావు కదా? ఇంకా AMIE పూర్తి కాలేదా లేక ఇదే నీ వ్యాపారమా?" అని. అతను వెంటనే "నేనెప్పుడూ నల్గొండ రాలేదు సార్. నేను ఇప్పుడే జాయిను అయ్యాను. మీరు చెపుతున్న అతనెవరో నాకు తెలియదు" అన్నాడు. నేనేమీ మాట్లాడకుండా "సర్లే వెళ్ళు" అన్నాను. నేను అలా అనటం పాపం వెంటనే అక్కడ్నించి వెంటనే జంపైపోయాడు. ఇద్ జరిగిన కొన్నాళ్ళకి అంటే ఓ 5 యేండ్ల తర్వాత రాజమండ్రి లో ఉన్నప్పుడు మళ్ళీ వచ్చాడు వీడు. ఈ సారి మాంచి నున్నగా తయారయ్యాడు. బాగా కండ పట్టి ఉన్నాడు. మళ్ళీ అదే తంతు. ఈ సారి మాత్రం ఊరుకోలేదు. గట్టిగా అరిచాను వాడిని. చాలా సేపు బుకాయించాడు గానీ ఎక్కువ సేపు అక్కడుండకుండా వెళ్ళిపోయాడు. అదీ సంగతి.

ఇంకా లక్ష రూపాయలు కడితే నెలకి పన్నెండు వేలు చొప్పున రిటర్న్స్ ఇస్తామంటూ వెలసిన సంస్థలు కొన్నాళ్ళకు బోర్డ్ తిప్పేస్తుంటాయి. ఇది కూడా అడుక్కోవటము కిందే లెక్క. మమూలుగా అయితే మీరు పది రూపాయలు కంటే ఎక్కువ భిక్షమెయ్యరు. కానీ మీలోని ఆశని ఎన్ కేష్ చేసుకుంటూ మీ దగ్గర లక్షలు లక్షలు 'అడుక్కొని' ధనవంతులైపోతారన్నమాట. డబ్బులు గల్లంతయ్యాయని తెలిసాక చేసేదేమీ ఉండదు, కొన్ని లక్షలు ఎవడికో దానం చేసామని ఉసూరుమనటం తప్ప.

ఇంతకీ నేను చెప్పిన జవాబేంటంటే "ముఝే హిందీ నహీ మాలూం


ఎందుకైనా మంచిది ఇంట్లో చెప్పి వెళ్ళండి

కామెడీ సినిమాలకి మొఖం వాచిపోయిన సినీ ప్రేక్షకులకో శుభవార్త. మిమ్మల్ని కడుపుచెక్కలయ్యేలా నవ్వించటానికో సినిమా వస్తోంది. గతంలో తమ గెటప్పుల ద్వారా, ఏక్షన్ ద్వారా (ఓవర్) మనల్ని తెగ నవ్వించిన రాజశేఖర్ (ఆగ్రహం), సాయికుమార్ ( పోలీస్ స్టోరీ), బాలకృష్ణ (ఒక్క మగాడు), చిరంజీవి (స్నేహం కోసం), వెంకటేష్ (సూర్య వంశం) లాగానే ఇప్పుడు రాజ్ కుమార్ (గుర్తుందా?) 'బారిస్టర్ శంకర్ నారాయణ్ ' అనే సినిమాలో ఓల్డ్ ఏజ్  గెటప్ ద్వారా మనల్ని కడుపు చెక్కలయ్యేలా నవ్వించటానికి వస్తున్నాడు. టీజర్స్ ఆల్రెడీ తెగ నవ్విస్తున్నాయి. 

Thursday, 19 September 2013

తెలుగు అమ్మ కన్నడ నాన్న ఓ మళయాళీ అమ్మాయి

కన్నడ తండ్రికి, తెలుగు తల్లికి ఓ తెలుగబ్బాయి పుడతాడు. అతనే హీరో.హీరో తండ్రి హీరో కన్నా, హీరో తల్లి కన్నా చిన్నవాడు. అంటే వయసుల ప్రకారం చూస్తే హీరొ తల్లి, హీరో, అతని తండ్రి వరసక్రమం లో ఉంటారన్న మాట. సరే ఫ్లేష్ బాక్ లో హీరొ తండ్రి ఓ బాక్సరు. అతని బాక్సింగ్ ప్రాక్టీస్ దెబ్బ తింటుందని అతని భార్యకి విడాకులిచ్చేస్తాడు. యిచ్చినోడు పోనీ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాడా అంటే లేదు. మళ్ళీ ఇంకొక తమిళ యువతిని పెళ్ళి చేసుకుంటాడు (ఆ మాత్రానికి మొదటి పెళ్ళానికి విడాకులివ్వడమెందుకో? ). వాళ్ళకి ఓ తెలుగమ్మాయి పుడుతుంది. అది పక్కన పెట్టండి. హీరో తల్లి హీరోని కష్టపడి పెంచి పెద్ద చేసి ఓ బాక్సర్ని చేస్తుంది (వదిలించుకున్న ఆముదాన్ని మళ్ళీ వంటికి రాసుకోవటమన్నమాట). సదరు హీరో కూతురు వయసున్న ఓ మలయాళీ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిది సినిమాలో మాత్రం తమిళమ్మాయి వేషం. ఆ అమ్మాయి తండ్రి తెలుగు వాడు. కానీ సినిమాలో మాత్రం మళయాళీ వేషం. సరే ఈ ప్రేమ సంగతి పక్కన పెడితే హీరో అమ్మ సడెన్ గా చనిపోతుంది. చనిపోతూ చనిపోతూ హీరోని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళమంటుంది. ఇష్టం లేకపోయినా తన కన్న వయసులో చిన్నవాడైన తండ్రి దగ్గరికి వెళతాడు హీరో. తండ్రి నడుపుతున్న బాక్సింగ్ కోచింగ్ సెంటరులో జ్యూసులందించే పని చేస్తుంటాడు. అతని తండ్రికి హీరో ఓ బాక్సర్ అన్న విషయము తెలియదు. ఆ ట్రూప్ లో ఒకడితో హీరో సవతి చెల్లెలు ప్రేమ లో పడుతుంది. వాడితో హీరో కి మధ్య మాటా మాటా అనుకునే సీనులు, హీరో సవతి తల్లి, చెల్లి హీరో మీద చిరాకు పడే సీనుల మధ్య సినిమా రన్ అవుతూ ఉంటుంది. అన్నట్టు తమిళమ్మాయి వేషం కట్టిన మళయాళీ హీరొయిన్ కూడా అక్కడికి వచ్చి హీరో తో డ్యూయెట్లు అవి పాడేస్తుంది వెనకాల తమిళ గ్రూప్ డాన్సర్ల తో. సరే కధని చివరాఖరికి తీసుకెలితే హీరో, హీరో సవతి బామ్మర్ది (కరెక్టేనా?) మధ్య బాక్సింగ్ పోటీ జరిగి ఇద్దరూ ఓడిపోయి ఇద్దరూ గెలుస్తారు. ఆ? అదేంటి అంటారా? అదంతే. హీరో తన సవతి చెల్లి కోసం బాక్సింగ్ లో ఓడిపోవాలనుకొని తన చెల్లి మనసు గెలుచుకుంటాడు. బామ్మర్ది తన తప్పు తెలుసుకొని హీరో చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటాడు. అదీ కధ. బాగుంది కదూ. ఏంటి అర్ధం కాలేదా? అదేంటండి బాబు? ఇంత విపులంగా చెప్పాను కదా? ఇంతకీ ఆ సినిమా పేరు గుర్తొచ్చిందా? అయితే ఏంటో చెప్పండి.          



ప్రకృతి పిలుస్తుందేమో మరి

కాలేజీ లో ఒకమ్మాయికి సైటు కొట్టటానికి ఓ అబ్బాయి బైకు ని చాలా రాష్ గా, స్పీడ్ గా నడుపుతున్నాడు. అది చూసిన ఆ అమ్మాయి తన ఫ్రెండ్ తో "పాపం అర్జెంటేమో" అంది. 

షారీ... రూల్ ఈష్ రూల్ ...ఎవిరిబడీ దేర్

ఎప్పుడో ఒక సారి తాగేవాడికి డిసెంబర్ 31 రాత్రి పార్టీ చేసుకోవటం లో అర్ధముంది గానీ రోజూ తాగేవాడు కూడా ఆ రోజు పార్టీ చేసుకోవటమేంటి? వాడికి 364 రోజులూ పార్టీలే కదా?! కాబట్టి ఆ రోజు మానేస్తేనే పార్టీ చేసుకున్నట్టు.  

 

వినబడలా!

తెలుగు వాళ్ళంతా తెలుగులోనే మట్లాడుదాం.తెలుగు సినిమాల్లో తెలుగు నటులకే అవకాశం యిద్దాం.

Wednesday, 18 September 2013

యింతకీ చికెన్ బిర్యానీనా లేక మటన్ బిర్యానీనా?

"ఎక్కడికెళ్ళావ్"? అదిగాడు సురేష్ తన ఫ్రెండ్ రాజేష్ ని.
"హైదరాబాద్ కెళ్ళాను. పొద్దున్నే వచ్చా గౌతమీకి" చెప్పాడు రాజేష్.
"మరి ఆల్ఫా లో బిర్యానీ తిన్నావా?"
"తినలేదు. ఏం బాగుంటుందా?"
"బాగుంటుందా... అదిరిపోద్ది. సికిందరాబాద్ నుండి ట్రైన్ ఎక్కేడప్పుడు అందరూ కంపల్సరీ గా ఆల్ఫా హోటెల్ లో బిర్యానీ పార్సెల్ చేసుకొని ట్రైన్ లో తింటారు తెలుసా? అంతే కాదు ట్రైన్ మనూర్లో దిగగానే మనల్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న "ఆల్ఫా లో బిర్యానీ తిన్నావా" అని.  అంత బాగుంటుంది ఆ బిర్యాని. ఒక వేళ మనం చెప్పినా చెప్పకపోయినా మనకి షేక్ హాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ చేతికి బిర్యాని వాసన అంటుకొని వెంటనే పసిగట్టేసి "ఓహో! ఆల్ఫా లో బిర్యానీ తిన్నావన్నమాట" అంటారు. ఎవరి చేతికైనా బిర్యానీ వాసన గానీ రాకపోతే వాడిని ఒక వెర్రి వెధవలా చూస్తారు. అందుకే అందరూ కంపల్సరీ గా బిర్యానీ తీసుకొంటారు. పొరపాటున తీసుకోవటం మర్చిపోయారనుకో ఎవడైనా తినేసి పారేసిన బిరియానీ పార్సిల్ కవర్ ని చేతులకి అంటించుకొని చేతులు కడుక్కుంటారు పొద్దున్న జనాల దృష్టి లో వెర్రి వెధవలైపోవటం ఇష్టం లేక" చెప్పుకుంటూ పోతున్నాడు సురేష్ ఆల్ఫా హోటల్ బిర్యానీ గురించి లేని పోని బడాయిలు పోతూ.    

మనల్నేం చేయాలంటారూ?


మననందరికీ ఎఫెక్షన్స్, ఫీలింగ్స్, ఎటాచ్ మెంట్స్ లాంటివన్నీ తగ్గిపోతున్నాయి. ఎవరైనా ఏదైనా occassion కి ఆహ్వానిస్తే కేవలం వాళ్ళు పెట్టే తిండి తినటానికి మాత్రమే వెళుతున్నాము. ఒక పెళ్ళి లేదా ఎంగేజ్ మెంట్ లేదా మరేదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు కనీసం వాళ్ళని పలకరించటానికికూడా మనలో చాలా మందిమి ఇష్టపడటం లేదు. వెళ్ళిన వెంటనే తిండి ఎక్కడ పెడుతున్నారో చూసుకోవటం, ఆ కార్యక్రమం అయిన తర్వాత కాసేపు ఆ తిండి గురించి చర్చించుకోవటం అంటే అదిరిపోయిందనో లేదా చండాలంగా ఉందనో, ఉప్పు ఎక్కువయ్యిందనో, కారం తక్కువయ్యిందనో తప్ప వాళ్ళని ఒకసారి విష్ చేద్దామని లేదా మనసారా వాళ్ళతో మాట్లాదామని అనుకోవటం లేదు. ఒక వేళ విష్ చేయాల్సొచ్చినా అదేదో కెమెరా కు సంబంధించిన కార్యక్రమమనుకుంటాము తప్ప అది ఇద్దరి మనుష్యులకు సంబంధించింది అనుకోము. వాళ్ళకు అక్షింతలు వేసేటప్పుడు కూడా కెమెరా కు ఫోజిస్తూ వేస్తాము తప్ప వారిని ఆశీర్వదిద్దాం అనే ఫీలింగు ని ఎప్పుడో మర్చిపోయాము.       
   

దేశాన్ని కూడా


సొంత తల్లి తండ్రి తమ్ముడు చెల్లి ని ప్రేమించలేనివాడికి ఇంకో అమ్మాయిని ప్రేమించే అర్హత లేదు. ప్రేమించలేడు కూడా.

మాటలున్నాయ్ ..... మాట్లాడుకోవడాలున్నాయ్

ఈ ప్రపంచం లో చాలా విషయాలు మాట్లాడుకుంటే పరిష్కాకారమైపోతాయి. దెబ్బలాట  వరకు వెళ్ళనవసరం లేదు      

ఫస్ట్ 'వీకు ' పబ్లిక్

కొత్త సినిమా రిలీజైన ఫస్ట్ వీక్ లో సినిమాకి వెళ్ళేవాళ్ళు 3 విధాలుగా ఉంటారు.
ఒకటో రకం :
వీళ్ళు ఏదో రకంగా సినిమాని చూసేయాలనుకునే వాళ్ళు.  సినిమా కొసం ఎన్ని గంటలైనా క్యూ లో నుంచొని చివరికి టికెట్ దొరక్కపోతే చివరికి ఎంత రేటైనా బ్లాక్ లో కొనేస్తారు. ఎలాగైనా ఆ రోజు సినిమా చూసి తీరాలంతే.
రెండో రకం :
వీళ్ళూ సినిమా పిచ్చోళ్ళే. కాకపోతే కొంచెం క్లాస్ టైప్ అన్నమాట. వీళ్ళు చాలా నీట్ గా తయారై కార్లు, బైక్ ల మీద ఫ్యామిలీస్ తో సహా వస్తారు. వీళ్ళు టికెట్స్ ఎక్కడ సంపాదిస్తారో , ఎలా సంపాదిస్తారో, ఎప్పుడు సంపాదిస్తారో ఎవరికీ తెలియదు. అదో పెద్ద పజిల్. అందరూ టికెట్ల కోసం వీర తిప్పలు పడుతుంటే వీళ్ళు మాత్రం చాలా కూల్ గా 15-20 టికెట్స్ తో ఒక పెద్ద బృందం తో సహా సినిమా చూస్తారు. టికెట్లు లేని వారు వీళ్ళని చాలా అసూయగా చూస్తూ ఉంటారు. 
ఇక మూడో రకం :
వీళ్ళు దీనజనులు. వీళ్ళు గంటలు తరబడి క్యూలో నుంచుంటారు, కానీ వీళ్ళ దగ్గరకొచ్చేసరికి టికెట్లు అయిపోతుంటాయి. ఇక అక్కడ్నుండి వీళ్ళ దీనావస్థ మొదలవుతుంది. హాల్ ముందు నుంచొని లోపలికి వెళ్ళేవాళ్ళందరిని "ఎగ్ స్ట్రా టికెట్లున్నాయా?" అని అడుగుతుంటారు. చాలా సార్లు అవతలి వాళ్ళు వీళ్ళకేసి చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి "మేము కూడా టికెట్స్ కోసం ట్రై చేస్తున్నాము" అని చెపుతుంటారు. పోనీ బ్లాక్ లో కొంటారా అంటే కొనరు. పొరపాటున ఎవడైనా ఒకడు ఎగ్ స్ట్రా టికెట్స్ ఉన్నాయి కావాలా అని అంటే వీళ్ళంతా అక్కడ వాలిపోతారు. మాకు కావాలంటే మాకు కావాలి అని వాడిని దాడి చేసినంత పని చేస్తారు. ఎలాగైనా అతని దగ్గర టికెట్ సంపాదించాలని వీళ్ళలో కొంత మంది అతడితో "సార్ ఫ్యామిలీ తో వచ్చాం మాకివ్వండి" అనో "చిన్న పిల్లలతో వచ్చాం మాకివ్వండి సార్" అని అడుక్కుంటారు.         

మరి స్టాండో?!

పగలు ఎదుటోడి స్కూటర్ లైట్ వెలుగుతుంటే వాడిని ఆఫ్ చేయమని చెప్పే ముందు మన బండి లైట్ ఆఫ్ లో ఉందో లేదో చూసుకోవాలి    

లీటరు నలభై కి.మీ మైలేజీ

"అవకాశం లేదు గానీ పెట్రోల్ అయిపోతే విమానాన్ని కూడా స్కూటర్ ని వంచినట్టు వంచేస్తారు మనవాళ్ళు" చెప్పడొకడు తన ఫ్రెండ్తో.
"అబ్బే....దాన్నీ కూడా వంచుతారు. నిన్న టీవీలో చూసాను. అప్పుడర్ధం కాలేదు కానీ నువ్వు చెపుతుంటే ఇప్పుడర్ధమవుతోంది. బహుశా పెట్రోల్ అయిపోయుంటుంది" అన్నాడు "ఎయిర్ ఫోర్స్" వాళ్ళ విన్యాసాలు గుర్తు తెచ్చుకుంటూ.     

మాంచి పబ్లిసిటీ కూడాను

'నా లవర్ తో పెళ్ళికి మా ఇంట్లో ఒప్పుకోవటం లేదురా' దిగులుగా చెప్పాడో ప్రేమికుడు.
'ఓస్ ఇంతేనా! రేపు 'వేలంటైన్స్ డే' కదా. ఆ అమ్మాయిని ఏదైనా పార్క్ కి తీసుకెళ్ళు. ఆ 'భజరంగ్ దళ్' వాళ్ళే  చేసేస్తారు మీ పెళ్ళి కానీ ఖర్చు లేకుండా.

హీరోయిన్ హీరోయిన్ .....హీరోయిన్ భాగ్యశ్రీ

ఇప్పటికి ఓ వంద సార్లు విని ఉంటాను ఆ పాటని. కానీ ఆ పాట లో కొన్ని మాటలు మాత్రం ఇప్పటికీ ఒక లాగే వినిపిస్తాయి. పాట "చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చిందీ...." "క్షణక్షణం" సినిమా లోనిది. రెండో చరణం మొదలవటానికి ముందు వచ్చే మ్యూజిక్ లో కోరస్ సింగర్సు గట్టిగా అరుస్తూ కొన్ని మాటలు అంటారు. అవి నాకు "హీరోయిన్ హీరోయిన్.....హీరోయిన్ భాగ్యశ్రీ....హొనెడ హొనెడ" అన్నట్టుగానే వినిపిస్తాయి. ఎన్ని సార్లు విన్నా అదే తంతు. కావాలంటే మీరు కూడా వినండి. దాని అర్ధం తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి ప్లేజ్. 



కొంప తీసి మళ్ళీ తీయరుగా..?

చాలా కాలం క్రితం "ఖుద్ గర్జ్" అని ఓ హిందీ సినిమా వచ్చింది. బాగా హిట్టు కూడా అయ్యింది. దాన్ని తెలుగు లో "ప్రాణ స్నేహితులు" గా రీమేక్ చేసారు. 'స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా' అన్న హిట్ సాంగ్ దాంట్లోదే. ఇక్కడివరకు బానే ఉంది. కొంత కాలం పోయాక ఈ రెండు సినిమాలని కలగలిపి సుమన్ హీరోగా "భరత్" అని ఓ సినిమా తీసారు. భాను ప్రియ హీరొయిన్. మరి కొంత కాలం పోయాక "ఖుద్ గర్జ్" ని తమిళం లో "అన్నామలై" గా రీమేక్ చేసారు. రజనీ కాంత్ హీరొ. పెద్ద హిట్ అయ్యింది. వెంటనే మన తెలుగు నిర్మాతలు పోటీ పడి "అన్నామలై" రీమేక్ రైట్స్ సంపాదించి దాన్ని తెలుగులో "కొండపల్లి రాజా" గా తీసారు. ఆ విధంగా ఒకే సినిమా చాలా రకాలుగా మన చుట్టూ తిరిగిందన్నమాట. కొసమెరుపేంటంటే "భరత్" లో హీరో గా నటించిన సుమన్ ఈ సినిమాలో 'వెంకటేష్' కి స్నేహితుడిగా నటించటం.  

మ్యూజిక్ బై ఎస్పీ బాలు

S.P.బాలసుబ్రహ్మణ్యం మనకు గాయకుడిగానే తెలుసు. కానీ ఆయన 56 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తూర్పు వెళ్ళే రైలు, మయూరి, పడమటి సంధ్యారాగం, ఓ భార్య కధ, లాయర్ సుహాసిని లాంటి ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి.

Tuesday, 17 September 2013

నాదీ పూచీ

షాప్ లో ఒక ఐటెం కొని షాప్ వాడికి 500 రూపాయల నోటిచ్చాడు ఒకడు. ఆ షాప్ వాడు ఆ నోట్ ని ఎగాదిగా పరిశీలిస్తున్నాడు మంచిదా కాదా అని. అది చూసిన ఆ నోటిచ్చినోడు షాప్ వాడితో "అబ్బే! చూసుకోవక్కర్లేదు. స్వయంగా మా ఇంట్లో తయారు చేసిందే"

నాకు నచ్చలే......


నాకు నచ్చలే......
గజం వంద రూపాయలుండే ఎందుకూ పనికి రాని స్థలము ఇప్పుడు పదివేలయిపోవటం  
నాకు నచ్చలే......
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే జనాలకి కేబుల్ టీవీలోచ్చి వాళ్ళ ప్రశాంతతని పాడు చేసేయటం  
నాకు నచ్చలే......
అవసరమున్నా లేకపోయినా పదే పదే రోజంతా సెల్ ఫోను లో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఎదురుగా ఉన్న మనిషితో మాత్రం పొడిపొడిగా మాట్లాడటం
నాకు నచ్చలే...... 
ఖాళీగా ఉండే రోడ్లన్నీ జనాలతోను, వెహికిల్స్ తోను, ఆటోలతోను నిండిపోయి నడవటానికి కూడా జాగా లేకపోవటం
నాకు నచ్చలే......
కొంచెం తింటే చాలు బీపీ,షుగరు వచ్చెస్తొందేమోనని భయపడి చావటం
నాకు నచ్చలే......
అవసరం ఉన్నా లేకపోయినా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో వేలు వేలు ఖర్చు పెట్టేయటం
చక్కగా రెండు జెళ్ళు వేసుకొని లంగా వోణీ, పైటా పావడాతో ఎంచక్కా పొందికగా అందంగా ఉండాల్సిన అమ్మాయిలు పంజాబీ డ్రెస్సులు, జీన్ పేంట్లు, ట్-షర్ట్లు వేసుకొని తిరిగేయటం
నాకు నచ్చలే......
శెలవులొచ్చాయంటే చక్కగా పళ్ళెటూర్లు వెళ్ళిపోయి చక్కగా కొన్ని రోజులు అక్కడ గడిపి రావటం మానేసి కనీసం మనూర్లో ఉన్న గోదావరి ని కూడా సంవత్సరానికొక సారి కూడా చూడలేకపోవటం
నాకు నచ్చలే......
అమ్మా నాన్నా బాబాయ్ పినీ మవయ్యా తాతయ్యా నానమ్మా అమ్మమ్మా అని నోరారా పిలుచుకోక డాడీ మమ్మీ అంకుల్ ఆంటీ గ్రానీ అని పిలుచుకోవటం
నాకు నచ్చలే...... 
బొమ్మరిల్లు, బాలమిత్ర, చందమామ, చినబాలశిక్ష, పెదబాలశిక్ష పిల్లల చేత చదివించటం మానేసి కార్టూన్ నెట్ వర్కులూ, పోగోలు చూపించటం
నాకు నచ్చలే......  
అపార్ట్ మెంటుల్లో బ్రతుకుతున్నా పక్క ఫ్లాట్ వాడి ఊరూ పేరూ తెలియకపోవటం 

థల థల లాడే తెలుపు.....మరింత తెల్లని తెలుపు.....

తెల్ల చొక్కా వేసిన ప్రతీ రాజకీయ నాయకుడు శాంతి కపోతం అయిపోడు. అసలు అతని నటన తెల్ల చొక్కా వేసుకోవటం నుండే ప్రారంభం అవుతుంది. లోపల ఉన్న కుట్ర, కుతంత్రం, అవినీతి, దోపిడీ, అసూయ, ద్వేషం వీటన్నిటినీ తెల్ల చొక్కా తో కప్పేస్తాడు.

రెండూ ఫ్లాపే

చాల చిత్రమైన విషయం చెప్పనా? 'మృగరాజూ, 'డాడీ సినిమాల కధలు రెండూ ఒకటే. 'మృగరాజు ' లో సింహం చనిపోయి దాని ప్లేస్ లో ఇంకో సింహం వస్తుంది సెకండ్ హాఫ్ లో. 'డాడీ లో సింహం బదులు పాప చనిపోతుంది. దాని ప్లేస్ లో ఇంకో పాప వస్తుంది సెకండ్ హాఫ్ లో.  

ఓ ప్లేసుంది

ఎవడి సుత్తీ వినకుండా, మన సుత్తిని ఇంకొకడికి కొట్టకుండా, ఎవడి గొప్పలకి ఆహా ఒహో అనకుండా, మన గొప్పలని ఇంకొకడికి చెప్పుకోకుండా, మన బాధలు, కష్టాలు, ఇబ్బందులూ, టెన్షన్లూ, దారిద్యాలు ఇలాంటివన్నీ మర్చిపోయి కూర్చునే ఓ ప్లేసుంది. అదే 'సినిమా హాల్ '.

తినగ తినగ..

కాస్త ఏవరేజ్ గా ఉండే అమ్మాయిని  కూడా రోజూ చూస్తుంటే కొన్ని రోజుల తర్వాత  అందంగా కనిపిస్తుంది.         

దేనికైనా టైము రావాలి

టైము లేనప్పుడు 'టైం' చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. అదే టైమున్నప్పుడు 'పది నిమిషాలు ' గడవటానికి 'పది గంటలు ' పడుతుంది (పట్టినట్లనిపిస్తుంది). అస్సలు అర్ధం కాలేదు కదూ. ఇంకో పది నిమిషాల్లో రైల్వే స్టేషన్ కి వెళ్ళి ట్రైన్ ని పట్టుకోవాలనుకోండి, ఆ పది నిమిషాలు చాలా స్పీడ్ గా గడిచిపోతుండి. అదే మీరు రైల్వే స్టేషన్ కి వెళ్ళాక ట్రైన్ అర గంట ఆలస్యం అని తెలిసాక ఆ అరగంట గడవటానికి ఆరు గంటలు పడుతుంది (పట్టినట్లనిపిస్తుంది)

Monday, 16 September 2013

ఈ పెద్దోళ్ళున్నారే....

జీవితం లో ఏమీ సాధించలేని వాడు (లేదా ఏమీ సాధించలేను అనుకునేవాడు)  ఎప్పుడూ "age"(వయసు) తక్కువ చెప్పుకుంటాడు (చాలామంది). అమ్మయిలకి మాత్రం ఈ విషయంలో exemption. ఏమీ సాధించినా సాధించకపోయినా తక్కువే చెపుతారు "age"  

ఫస్ట్ హాఫ్-సెకండ్ హాఫ్

జీవితం కూడా సినిమా లాంటిదే. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని రెండు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా హేప్పీ గా, ఫన్నీ గా , జాలీ గా, ఉల్లసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. సినిమాలో 'ఇంటెర్వెల్ బ్యాంగ్' ఉనంట్లే లైఫ్ లో కూడా 'ఇంటర్వెల్ బ్యాంగ్' ఉంటుంది. అదే "మ్యారేజ్".  ఇక ఆ తర్వాత సెకండ్ హాఫ్ అంతా ట్విస్ట్ లతో, సీరియస్ నెస్ తో, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఆవేశాలు, ఆక్రొశాలు, అన్నీ ఉంటాయి.  ఫస్ట్ హాఫ్ లో అప్పుడప్పుడు కష్టాలు, కన్నీళ్ళు ఉన్నట్టే సెకండ్ హాఫ్ లో కూడా అప్పుడప్పుడు నవ్వులు, ఆనందాలు ఉంటాయి. 

చెప్పలేం !

నవ్వుతూ మాట్లాడే వాళ్ళంతా "నమ్మకస్తులు" కాకపోవచ్చు. సీరియస్ గా ఉండే వాళ్ళంతా "సిన్సియర్లు" కాకపోవచ్చు. 

లవ్-రొమాన్స్

చుట్టూ వెయ్యి మంది ఉన్నా వాళ్ళెవరూ కనబడక పోతే అది "లవ్". చుట్టూ వెయ్యి మంది ఉన్నా ఏకాంతం కోరుకుంటే అది "రొమాన్స్". 

కూసింత జాగ్రత్త మరి !

సృష్టి లో మనకి నచ్చినవన్ని మనకు హాని చేసేవే. మందు, మాంసాహారం, స్వీటూ, హాటూ, జంక్ ఫుడ్డు, సిగరెట్టు, జర్దా కిళ్ళీ................."అమ్మాయిలు"

(సరదాగా నవ్వుకోవడానికే వ్రాసాను సుమా!) 

షాలా బాగా షెప్పావ్ బాషూ

తాగుబోతులందరికీ ఒక కామన్ సైకాలజీ ఉంది. అదేంటంటే తోటి తాగుబోతు ఎవడైనా మందు మానేస్తానంటే వాడిని తెగ డిస్కరేజ్ చేస్తారు " నువ్వు తాగే చాలా తక్కువ, "నా తాగుడితో పోలిస్తే నీదే పాటి?" అని. అదే తాగుబోతు కొత్తగా మందు తాగటం నేరుచుకున్నవాడికి లేదా మందు అలవాటు అస్సలు లేని వాడిని తాగమని తెగ ప్రోత్సహిస్తుంటారు "బీరు తాగితే ఏం కాదు", ఒక క్వార్టరు మందు వరకు తాగినా ఫర్లేదు", "రోజుకి రెండు పెగ్గులు తాగితే మంచిదని డాక్టర్లు చెపుతారు తెలుసా?" అంటూ . పైగా వాళ్ళకి మందు పోయించటానికి ఖర్చు కి కూడా వెనకాడరు, మామూలుగా విషయాల్లో అర్ధ రూపాయి కూడా ఖర్చు పెట్టని వారు కూడా.   

పురుష్....పురుష్...

ఈ ప్రపంచం లో మంచివాడూ, చెడ్డవాడూ అంటూ ఎవ్వడూ ఉండడు. ఉండేది కేవలం మనిషి మాత్రమే. కాకపోతే వాడిలో కోపం, కామం, క్రోధం, జాలి, భయం, దానగుణం, నిజాయితీ, కౄరత్వం ఇలాంటివి అన్నీ మిక్సైపోయి ఉంటాయి. ఎప్పుడు ఏది బయటకి తీయాలనేది వాడి విచక్షణ మీద, బేలెన్సింగ్ పవర్ మీద  ఆధారపడి ఉంటుది. కొన్నిసార్లు కేవలం "అవకాశం" లేక వాటిలో కొన్ని బయటకి తీయలేకపోతుంటాడు. దాన్ని బట్టే అతన్ని మంచివాడో, చెడ్డవాడో అని నిర్ధారించలేము. అర్ధమయ్యిందనుకుంటా.  

నా తిండి నా ఇష్టం


మొన్న మా ఫ్రెండొకడు పొద్దున్నే ఫోన్ చేసి "గ్రీన్ టీ తాగొచ్చు కదా?" అని అడిగాడు. "భేషుగ్గా" అని జవాబిచ్చాను. "ష్యూర్ కదా" అని రెట్టించాడు. అవును అని అనబోయి అలోచనలో పడ్డాను. గ్రీన్ టీ తాగోచ్చా లేదా అని. మామూలు వాళ్ళు తాగొచ్చు కానీ "షుగర్" ఉన్న వాళ్ళు తాగొచ్చా లేదా అని. డయాబెటిక్ పేషెంట్లు గ్రీన్ టీ తాగితే మంచిదని మధ్య ఒక పత్రిక లో చదివినట్టు గుర్తు. కానీ మళ్ళీ అనుమానమొచ్చింది. ఏదైతేనేంలే అని "గ్రీన్ టీ తాగొచ్చు అని దైర్యంగా చెప్పేసా వాడికి. మధ్య ఇలాంటి అనుమానాలు తీర్చుకోవటానికి తరచుగా ఫొన్లు చేస్తున్నాడు మావాడు "అవి తాగొచ్చా" "ఇవి తినొచ్చా" అని. ఎందుకంటే వాడు "షుగర్" మెంబర్ల క్లబ్బులో మధ్యే సభ్యత్వం తీసుకున్నాడు మరి. వాడు ఫోన్ చేసినప్పుడల్లా నాకు భయమేస్తూ ఉంటుంది ఎక్కడ వాడి క్లబ్ లో చేరాల్సివస్తుందో అని. అదే కాదు షుగర్ మీద వచ్చే వార్తల్ని చదవటానికి కూడా. అది రాకుండా ఉండటానికి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో అని మధ్య పత్రికల్లో టీవీల్లో, తెగ రాసేస్తున్నారు చూపించేస్తున్నారు. ఒక పేపెర్ లో బొప్పాయి కాయలు తినమని, ఇంకో పేపెర్ లో మెంతులు తినమని ఇలాంటివి బోలెడన్ని వ్రాస్తున్నారు. దానికి తోడు మంతెన సత్యనారయణ రాజు గారి టీవీ ప్రోగ్రాం గానీ చూసామంటే చచ్చినట్టే. తిండంటేనే విరక్తి పుడుతుంది. ఉప్పు, నూనె, పంచదార, మసాల మొత్తానికే మానేయమని చెపుతాడాయన. పోనీ ప్రకారం ముందుకి పోదామంటే ఇంకో పేపెర్ లో ఉప్పు మానేయకూడదని , నూనె మానితే వంటికి కావలసిన మంచి కొలెస్ట్రాలు చేరదని, ఇలా ఆయన చెప్పిందానికి విరుగుడుగా ఉంది. ఎలా చచ్చేదీ?!. షుగర్ రాకుండా ఉండాలంటే వ్యాయాయము చేయాలని చదివాను. మరి మా కొలీగు ఒకాయన 120 కిలోల బరువుంటాడు. అస్సలు వ్యాయాయము చేయడంట కానీ షుగరు లేదట. అదేంటో మరి?
సరే ఎందుకైనా మంచిదని మా ఆర్ట్స్ కాలేజి లో వాకింగ్ కని వెళ్తే అక్కడ ఒకాయన చేతిలో అట్ట, పెన్ తో నిలబడి అందరినీ ఆపుతున్నాడు. ఏంటో చూద్దామని నేను కూడా ఆగాను. అతని దగ్గర హైటూ, వెయిటు, బీపీ లు గట్రా కొలిచే స్టాండ్ లాంటిది ఉంది. అందరినీ వరసపెట్టి దాని మీద నిలబెట్టి కొలిచేస్తున్నాడు. నేను కూడా కొలుచుకుందామనుకున్నాను గానీ డౌటొచ్చింది డబ్బులేమైనా కట్టాలేమోనని. ఎందుకంటే డబ్బులేమీ వేసుకెళ్ళలేదు మరి. అనుమానంగానే అడిగాను అతన్ని "ఫీజెంత" అని. ఒక్క సారి నన్ను ఎగాదిగా చూసి భళ్ళున నవ్వి "ఫీజేమీ లేదు సార్ ఫ్రీ" అన్నడు. నేను కూడా వెర్రి నవ్వు నవ్వి స్టాండ్ మీద నుంచున్నాను. నా హైటూ, వెయిటూ గట్రా కొలిచి అవన్నీ పేపెర్ లో రాసాడు. తర్వాత నాకు చెప్పటం (భయపెట్టటం) మొదలెట్టాడు. మీరు ఉండాల్సిన దాని కంటే యింత బరువెక్కువున్నారు. మీ BMI యిదీ, మీ కొలెస్ట్రాలు యిదీ అని ఏవేవో చెప్పుకుంటూ పోయాడు. పొద్దున్నే హర్రర్ సినిమా చూసింట్లనిపించింది నాకు. అతన్నే అడిగాను "మరేం చేయాలి" అని. మీరు ఆఫీసు అడ్రెస్ కి రేపొద్దున్న 7.30 కి రండి. అక్కడ మీకు కౌన్సిలింగ్ చేస్తారు అని చెప్పాడు. ఎందుకైనా మంచిదని "మరి ఫీజు" అని నసిగాను. మళ్ళీ భళ్ళున నవ్వి "అక్కడ కూడా ఎటువంటి ఫీజు లేదు సార్" అన్నాడు. అంతే. తెగ ఉత్సాహమొచ్చేసింది నాకు. పైగా అతనంటే ఒక మంచి అభిప్రాయము ఏర్పడింది నాకు ఉచితంగా సమాజ సేవ చేస్తున్నదుకు.   

*                       *                     *          
మర్నాడు పొద్దున్నే ఠంచనుగా 7.15 కి ఫోన్ వచ్చింది అతను చెప్పిన అడ్రెస్ నించి "సార్ మీకు 7.30 కి అప్పాయింట్ మెంట్" ఉంది అని. పైగా ఏమీ తినకుండా రమ్మన్నాడు. వెంటనే రెడీ అయిపోయి జెండా పంజా రోడులో అతనిచ్చిన అడ్రెస్ కి వెళ్ళిపోయాను. దొరికింది. పై అంతస్తులో ఉంది హెల్త్ సెంటరు. సరే అని అక్కడకెళ్ళేసరికి ఇద్దరు ముగ్గురు నించొనున్నారు. వాళ్ళు నా పేరూ ఊరూ అన్ని రాసుకొని మళ్ళీ స్టాండ్ దగ్గరకి తీసుకెళ్ళారు. మళ్ళీ ఎందుకు నిన్న తీసుకున్న రిపోర్ట్ ఉంది కదా అని చూపించపోయాను. అబ్బే మళ్ళీ తీసుకోవాలి సార్ అని స్టాండ్ ఎక్కించారు నన్ను. సర్లే మనకి పోయేదేముందీ అని మళ్ళీ నుంచున్నాను. వివరాలు అవీ రాసుకొని ఇక్కడ కూర్చోండి. డాక్టర్ గారికి రిపోర్ట్ చూపిందురు గాని అన్నారు. సరే అని అక్కడ కూర్చున్నాను. నా వంతొచ్చింది. లోపలికి వెళ్ళబోయి గతుక్కుమన్నాను డాక్టర్ ని చూసి.

*                           *                             *
  
అతను మరెవరో కాదు. నిన్న గ్రౌండ్ లో నా వివరాలు రాసుకున్న అతనే. నన్ను చూసి మాంచి చిద్విలాపంగా నవ్వి కూర్చోండి సార్ అన్నాడు. కూర్చున్నాను. మళ్ళీ మొదలెట్టాడు మీరు యింత వెయిటు ఉన్నారు మీ BMI యిదీ.... మళ్ళీ అదే సుత్తి. సరే ఇంతకీనేనేం  చేయాలి” అని అడిగాను అతన్ని. వెంటనే చార్ట్ తీసి చూపించాడు నాకు. అదేదో న్యూట్రిషియను ఫుడ్డంట. పొద్దున్న గ్లాసు మధ్యానమో గ్లాసూ, రాత్రి రెండు గ్లాసులూ తాగాలి అని చెప్పాడు. అంటే మరి తిండి ఏమీ తినక్కర్లేదా అని అడిగాను. అబ్బే అన్నీ ఇందులో కవరైపోతాయి అని చెప్పాడు. సరే ఎంత పేకెట్టు అని అడిగాను. అప్పుడు మొదలెట్టాదు కోర్సుల గురించి. వారానికింత, నెలకింత, రోజుకింత అని చెప్పుకుంటూ పోతున్నాడు. మొత్తానికి తేలిందేంటంటే పాతిక నించి యాభై వేల వరకు వుతుందన్నమాట. అమ్మనీ....... అదా సంగతి! అనుకొని, ఏదో ఒకటి చెప్పి బయటపడదామని వెళ్ళబోతుండగా నన్ను వెళ్ళనివ్వలేదు అతను. సెల్ ఫోనె తీసిదున్నపోతు’లా ఉండే ఒకతని ఫోటో చూపించాడు. ఎవరు అని అడిగాను. భయంకరంగా నవ్వి "అది నేనే సార్" , కోర్స్ మొదలు పెట్టాక ఇలా అయిపోయాను అన్నాడు. మొత్తానికి అతన్ని వదిలించుకొని వచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చిందంటే నమ్మండి. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసి వార్త చెప్పాడు. అది ఎంత వరకు నిజమో తెలేదు కానీ నేను మాత్రం షాక్ కి గురయ్యాను వార్త విని. ఇంతకీ వార్తేంటంటే "మంతెన గారికి హార్ట్ ఎటాక్ వచ్చింది"